“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

5, మే 2021, బుధవారం

అసలు నిజం

అనగనగా ఒక భూమి  దాని జనాభా రోజురోజుకీ పెరిగిపోతున్నది. వనరులేమో రోజురోజుకీ తగ్గిపోతున్నాయి. వాతావరణంలో వేడి పెరిగిపోతోంది. జనాభా ఎక్కువైన దేశాలనుంచి జనం వలసలుపోయి ఇతర దేశాలను ఆక్రమిస్తున్నారు. అక్కడ వీళ్ళ జనాభా పెరిగిపోయి గొడవలు జరుగుతున్నాయి. ఏం చెయ్యాలో ఎవరికీ  పాలుపోవడం లేదు. మేధావులు గోలపెడుతున్నారు.

ఇలాంటి పరిస్థితిలో, ఉన్నట్టుండి ఇద్దరు ప్రపంచమేధావులకు భలే ఆలోచనొచ్చింది. వాళ్లిద్దరూ ప్రపంచంలోనే పెద్ద పెట్టుబడిదారులు. అయితే రెండు వేర్వేరు దేశాలకు, వర్గాలకు చెందినవాళ్లు. అయితేనేం? ఇలాంటప్పుడు బాగా కలుస్తారు.

'నువ్వు వైరస్ తయారు చెయ్యి. నేను వాక్సిన్ తయారు చేస్తాను. మనవరకూ జాగ్రత్తలు తీసుకుందాం. వైరస్ సృష్టించేది మనమే గనుక దానికి ఏమేం చెయ్యాలో మనకు తెలుసు. కనుక మీవాళ్ళకూ మా వాళ్లకూ ఢోకా లేదు. మిగతా వాళ్ళు పోతారు. పోతే పోనీ ! జనాభా తగ్గి భూమి బాగుపడుతుంది. ఒకపక్కన జనాభా తగ్గుతుంది. పోయినవాళ్లు పోగా ఉన్నవాళ్లు వాక్సిన్ కొంటారు కాబట్టి ఇంకోపక్కన డబ్బులొస్తాయి. ఎటు చూసినా మనకే లాభం'' అనుకున్నారిద్దరూ. 

ప్లాన్ని అమలుచేశారు. అనుకున్నట్లే అంతా జరుగుతోంది. కోట్లల్లో జనం చస్తున్నారు. కోట్లల్లో డబ్బులొస్తున్నాయి. కానీ వీళ్ళ ప్లాన్ కొంత బెడిసికొట్టింది. ఈ లోపల కొన్ని దేశాలు వాళ్లకు వాళ్ళే వాక్సిన్ తయారు చేసుకున్నాయి. వీళ్ళ బిజినెస్  కుంటుపడుతోంది. అందుకని కొత్త వ్యూహం మొదలుపెట్టారు.

'ఆ వాక్సిన్ మంచిది కాదు. అది వాడవద్దు. మా వాక్సిన్ ఒక్కటే మంచిది. ఇదొక్కటే వాడండి' అనేదే ఆ వాదన. ఈ వాదనకు తోడుగా ఆయా దేశాలలో ఉన్న మీడియాని కొనేసి, సాధ్యమైనంతగా దుష్ప్రచారం చెయ్యమని, భయభ్రాంతులు సృష్టించమని, పురమాయించారు.

ఇక మీడియా రంగంలోకి దిగింది. చూపినదె చూపిస్తూ, చెప్పినదే చెబుతూ జనాన్ని భయపెట్టడం మొదలుపెట్టింది. విసుగుపుట్టి చాలామంది టీవీలు చూడటం మానేశారు. వాళ్ళ ఆరోగ్యాలు మాత్రం బాగుంటున్నాయి.

వైరస్ సోకినప్పటికీ, ఇంట్లో ఉంటూ జాగ్రత్తలు తీసుకునేవాళ్ళు బానే ఉన్నారు. ఆస్పత్రిలో చేరినవాళ్లు పోతున్నారు. డాక్టర్లు తప్పుడు వైద్యం చేస్తున్నారని, మొదట్లోనే ఇవ్వాల్సిన మందులను  రోగం బాగా ముదిరిన తర్వాత ఇస్తున్నారని అప్పుడు ఉపయోగం ఉండదని మరికొందరు మేధావులు గగ్గోలు పెడుతున్నారు. ముదిరాకే మా దగ్గరకొస్తున్నారు మేమేం చెయ్యాలని డాక్టర్లు అంటున్నారు.

కానీ, మీడియా చేస్తున్న భయభ్రాంత ప్రచారం వల్ల మంచే జరిగింది. జనం భయపడి ఇంకా ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవడం మొదలుపెట్ట్టారు. వైరస్ అదుపులోకి వస్తున్నది.

ఈ లోపల డాక్టర్లు, మందుల షాపులు, ఆక్సిజన్ సిలండర్లు అమ్మేవాళ్ళ దందా మొదలైంది. రోజుకి నూరు రూపాయల వైద్యం సరిపోయేచోట లక్షలు వసూలు చెయ్యడం మొదలైంది. బెడ్లతో సహా అన్నింటినీ బ్లాకులో అమ్మడం మొదలైపోయింది. 'ఎవడెలాపోతే నాకెందుకు? అవకాశాన్ని సొమ్ము చేసుకుందాం' అనే ధోరణి మొదలైపోయింది. చచ్చేవాడు చస్తున్నాడు. బ్రతికేవాడు బ్రతుకుతున్నాడు. ఎవడి ఖర్మ వాడిది. ఎవడి ధైర్యం వాడిది. ఎవడి అవకాశం వాడిది. ఎవడి చావు వాడిది. ఎవడి బ్రతుకు వాడిది.

కోట్లుమూలుగుతున్నవాడు దిక్కులేకుండా చస్తున్నాడు. వాడి శవాన్ని అనాధశవంలాగా అంత్యక్రియలు చేస్తున్నారు. అమెరికాలో పిల్లలున్నా రాలేని పరిస్థితి. అక్కణ్ణించే వాళ్ళు 'టాటా మమ్మీ, టాటా డాడీ' అంటూ చేతులూపుతున్నారు. చేతులు దులుపుకుంటున్నారు. అప్పటిదాకా ఎంతో ఆప్యాయతలు కురిపించినవాళ్లు అవసరానికి ముఖం చాటేస్తున్నారు. ఎవరికీ వాళ్ళు బిక్కుబిక్కుమంటూ ఎప్పుడు పిలుపొస్తుందో అంటూ బ్రతుకుతున్నారు.

ఇదంతా చూస్తూ ప్రపంచమేధావులు నవ్వుకుంటున్నారు. ఈ వైరస్ నుంచి లోకం బయటపడుతుందా? ఒకవేళ పడితే పడనీయ్.  దీని బాబులాంటివి ఇంకా బోలెడన్ని వైరస్ లు వాళ్ళ దగ్గర రెడీగా ఉన్నాయి. కోట్ల డాలర్లు పెట్టి ల్యాబుల్లో రీసెర్చి చేయించి మరీ కొత్త కొత్త వైరస్ లను సృష్టించి ఆల్రెడీ దగ్గర పెట్టుకున్నారు. ఒకదాని తర్వాత మరొకటి లోకంమీదకి వదుల్తారు. ఎవడేమై పోతే వాళ్ళకెందుకు? వాళ్ళ దందా ప్రస్తుతం నడుస్తోంది. వాళ్ళాడే చదరంగంలో దేశాలు, మనుషులు పావులు. ఈ గ్లోబల్ వ్యాపారంలో మనుషులే వస్తువులు. ప్రాణాలే పెట్టుబడులు.

కానీ ఎలాంటి ఆటగాడి ఆట్టైనా కూడా కొన్నాళ్ళకి ముగుస్తుంది. పులిమీద స్వారీ చేసేవాడిని కూడా పులి ఒకరోజున మింగుతుంది. సాగినంత కాలం సాగుతుంది ఎవడిదైనా ఆట. ఆ తర్వాత ఆడేవాడూ ఉండడు, పావులూ ఉండవు. అనంత కాలగమనంలో ఇలాంటి ఆటగాళ్లు ఎంతమంది కనుమరుగైపోయారో? ఎన్ని పావులు మట్టిలో కలసిపోయాయో?

ఇంతకీ, ఈ మొత్తం ప్రహసనంలో అసలు నిజమేంటి?

అన్నీ తన చేతిలోనే ఉన్నాయని అనుకుంటున్నంతవరకూ మనిషి బ్రతుకింతే. ఇప్పటికి కనిపిస్తున్నదే నిజమని అనుకుంటూ ఉన్నంతకాలం మనిషి బ్రతుకింతే. ఏది శాశ్వతమో ఏది కాదో తెలీనంతవరకూ మనిషి బ్రతుకింతే. స్వార్ధమే పరమార్థమనుకుంటున్నంత వరకూ మనిషి బ్రతుకింతే.

ఎలా బ్రతకాలో తెలీనంతవరకూ ఏదో ఒకటి మనల్ని భయపెడుతూనే ఉంటుంది. ఎలా బ్రతకాలో తెలిస్తే, చావు కూడా మనల్ని భయపెట్టదు. కానీ, చావు ఎదురైనప్పుడు కాదు నేర్చుకోవలసింది ఎలా బ్రతకాలో. అది ఇంకా ఎంతో దూరంలో ఉన్నప్పుడే ఆ విద్యను నేర్చుకోవాలి. అలా బ్రతకాలి.

ఈ నిజాన్ని ఇంకా సమయం ఉన్నపుడే గ్రహించినవాడే అసలు మనిషి. వాడిదే అసలైన బ్రదుకు. వాడిదే అసలైన చావు. వాడికి ఉన్నా ఒకటే పోయినా ఒకటే. మిగతావాళ్ళు నిరర్ధకజీవులు. వాళ్ళు ఉన్నా ఒకటే పోయినా ఒకటే.

ఇదే అసలు నిజం.