“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

27, మే 2021, గురువారం

శాన్ జోస్ కాల్పులు - ఆచ్చాదనాయోగం

26-5-2021 బుధవారం నాడు ఉదయం 6-24 గంటల ప్రాంతంలో అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో, శాన్ జోస్ లోని ఒక రైల్వే యార్డులో ఒక వ్యక్తి జరిపిన కాల్పులలో ఎనిమిది మంది చనిపోయారు. చివరకు నేరస్తుడు కూడా తనను తాను కాల్చుకుని చనిపోయాడు.  పదిహేను సంవత్సరాలు అతనితో కాపురం చేసి విడాకులు తీసుకున్న అతని మాజీ భార్య చెప్పిన ప్రకారం అతనికి చాలా కోపం ఉండేది. సాటి ఉద్యోగులతో గొడవలు పడుతూ ఉండేవాడు. చివరకు ఇలా చేశాడు, అది కూడా పౌర్ణమి ఘడియలలో, చంద్రగ్రహణం సమయంలో.

నిన్న చంద్రగ్రహణం మరియు పౌర్ణమి ఘడియలు నడిచాయి. ఇంతకు ముందు ఎన్నో పోస్టులలో నేను చెప్పినట్లుగా, పౌర్ణమి అమావాస్యల ప్రభావాలు, వాటికి ముందు రెండు రోజులు వెనుక రెండు రోజులు ఉంటాయి. వాటిని షాడోస్ లేదా ఛాయలు అనవచ్చు. ప్రస్తుత సంఘటన సరిగ్గా అలాంటి ఛాయాసమయంలోనే జరిగింది.

ఆ సమయానికి శాన్ జోస్ లో వృషభలగ్నం 21 వ డిగ్రీ ఉదయిస్తున్నది. అదే వృషభ లగ్నంలో సూర్యుడు 11, రాహువు 17 డిగ్రీలలో లగ్నానికి వెనుకగాను, శుక్రుడు 27 డిగ్రీలలో ముందుగాను ఉంటూ లగ్నడిగ్రీకి అర్గలదోషం పట్టించారు. పైగా లగ్నంలో ఉన్న సూర్యుడు, సప్పమంలో ఉన్న చంద్రులవల్ల పౌర్ణమిప్రభావం లగ్నంమీద చాలా బలంగా పడింది. పైగా రాహుకేతువులు ఇదే ఇరుసులో ఉచ్చస్థితిలో ఉన్నారు. పైగా మనఃకారకుడైన చంద్రుడు ఉఛ్చకేతువు (కుజుని) తో కలసి విపరీతమైన హింసాత్మక ప్రవృత్తులు రేకెత్తడాన్ని సూచిస్తున్నాడు. అన్నిటినీ మించి, బుద్ధికారకుడైన బుధుడు సున్నా డిగ్రీలలో ఉంటూ ఈ సమయంలో మనుషులలో రేకెత్తే బుద్ధిలేనితనాన్ని సూచిస్తున్నాడు.

పౌర్ణమి ఘడియలలో మామూలుగానే మనుషుల మనసులు గాడితప్పుతాయి. అవి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా జరుగుతాయి. సహజంగానే కోపతాపాలు ఉన్నవారిని ఈ సమయం చాలా రెచ్చగొడుతుంది. కనుక వాళ్ళు స్థిమితాన్ని కోల్పోయి విచక్షణారహితంగా ప్రవర్తిస్తారు. వాళ్ళ లోలోపల దాగిఉన్న ఉద్రేకాలు ఈ సమయంలో బయటపడతాయి. ప్రస్తుత సంఘటనలో అదే జరిగింది.

సామ్యూల్ జేమ్స్ కాసిడి అనే ఈ నేరస్తుడు ఆ రైల్ కంపెనీ ఉద్యోగే. యాజమాన్యం మీదా, సహోద్యోగులమీదా అతనిలో ఎప్పటినుంచో ఉన్న కోపం ఈ సమయంలో ఇలా బయటపడింది. తనతో సహా తొమ్మిదిమందిని పొట్టన పెట్టుకుంది. మరొకరు ఆస్పత్రిలో చావుబ్రతుకులలో ఉన్నాడని అంటున్నారు.

నా పోస్టులు శ్రద్ధగా చదివేవారికి ఇక్కడొక అనుమానం రావాలి.

మీరెప్పుడూ చెప్పే విధంగా మిధునరాశి అమెరికాను సూచిస్తుంది కదా? మరి ప్రస్తుత కుండలిలో మిధునరాశికి  సంబంధం లేదుకదా? మరి ఇది అమెరికాలో ఎందుకు జరిగింది? అని. ఈ  పాయింట్ అర్ధం కావాలంటే, మేదినీ జ్యోతిష్యం లోని మరొక్క సూత్రం మీకు అర్ధం కావాలి. ఇది సాంప్రదాయ జ్యోతిష్య గ్రంధాలలో మీకు దొరకదు. నా రీసెర్చిలో దీనిని నేను కనుక్కున్నాను. దాని పేరే 'ఆచ్చాదనాయోగం'.

ఈ ఆచ్చాదనా యోగం ప్రకారం ఒక రాశిలో ఉన్న ప్రతిగ్రహమూ తన ముందూ వెనుక రాశులను ఆచ్చాదిస్తుంది, అంటే తన ప్రభావంతో కప్పేస్తుంది. ఆ గ్రహం యొక్క రాశిలో రాహుకేతువులు గనుక ఉంటే, వాటి విపరీతపు నడక యొక్క ప్రభావం వల్ల వెనుక రాశిమీద ఈ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇదీ ఆ సూత్రం. దీనిని నేను  కొన్ని వందల జాతకాలలో గమనించిన మీదట స్థిరీకరించాను. ప్రామాణిక గ్రంధాలలో ఇది చూచాయగా అక్కడక్కడా చెప్పబడి ఉన్నప్పటికీ, ఆచరణలో ఎవ్వరూ దీనిని ఉపయోగించడం లేదు. ఇదొక మరుగునపడిపోయిన ప్రాచీన జ్యోతిష్య సూత్రం. దీనిని నేను వెలికితీశాను.

ఇప్పుడు దీనిని వివరిస్తాను చూడండి.

కుజుని రాశి అయిన వృశ్చికంలో కేతువున్నాడు. కనుక కుజునికి వెనుక దృష్టి బలంగా ఉంటుంది.  కనుక, తన వెనుక రాశి అయిన వృషభాన్ని బలంగా చూస్తాడు లేదా ఆఛ్చాదిస్తాడు. ప్రస్తుతం వృషభంలోనే పౌర్ణమి జరుగుతోంది. పైగా లగ్నం కూడా అదే అయింది. అన్నింటినీ మించి కుజశుక్రుల డిగ్రీలను గమనించండి. కుజుడు 26 డిగ్రీలలోను, శుక్రుడు 27 డిగ్రీలలోను ఉన్నారు. అంటే ఖచ్చితమైన ఆచ్చాదనా యోగం వీరిద్దరి మధ్యనా ఉన్నది. కానీ ఇలాంటి హింసాత్మక ఘటన జరగడానికి కుజశుక్రులమధ్యన ఉన్న సంబంధం సరిపోదు. శని కుజుల మధ్యన ఉండాలి. అదెలా జరిగిందో వినండి మరి.

వక్రశని ధనుస్సులోకి వస్తాడు. అక్కడనుంచి కుజుని సప్తమదృష్టి ఆయనపైన బలంగా పడుతుంది.  అంతేగాక,  కాల్పులను, పేలుళ్లను, దుందుడుకు చర్యలను కలిగించే యురేనస్ దృష్టి మేషం మీదనుంచి శనిమీద ఉన్నది. అదే విధంగా కుజునిమీద పడుతూ, అక్కడనుంచి మళ్ళీ శనికి సరఫరా అవుతున్నది. మరి కాల్పులవంటి హింసాత్మక చర్యలకు దోహదమయ్యే యోగం ఏర్పడిందా లేదా? మీరే చెప్పండి.

ఈ విధంగా అమెరికాకు సూచికైన మిధునరాశి పాత్ర ఈ కుండలిలో స్పష్టంగా ఉన్నది. 

జరుగుతున్న దశను చూద్దాం - అది శని - చంద్ర - సూర్యదశ అయింది. శని బాధకుడు, నాశనాన్ని సూచించే అష్టమంలో ఉన్నాడు. సూర్యచంద్రులు పౌర్ణమిని సూచిస్తున్నారు. ఇంకేం కావాలి?

ఇవన్నీ కలవబట్టే ఈ సంఘటన జరిగింది. అమావాస్య పౌర్ణమి ప్రభావాలకు కొన్ని వందల రుజువులను కొన్ని ఏళ్లుగా చూపిస్తూ వస్తున్నాను,. అలాంటి పౌర్ణమి ప్రభావానికి ఇది మరో సరికొత్త ఉదాహరణ !