“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

20, మే 2021, గురువారం

పానీ పూరీ - బూజు బ్రెడ్డు

కరోనాకు తోడు ఇప్పుడు బ్లాక్ ఫంగసంట !

అసలీ రోగాలు ఎలా పుడతాయో, వీటిని ఎవడు కనుక్కుంటున్నాడో అర్ధం కాక తెగ ఆలోచిస్తుంటే మాగన్నుగా నిద్రపట్టేసింది. నిద్రలో కల! కలలో యధావిధిగా తనే ప్రత్యక్షమైంది. తనంటే మళ్ళీ అపార్ధం చేసుకోకండి. కర్ణపిశాచే !

కుశలప్రశ్నలూ అవీ అయ్యాక, నా సందేహాన్ని తనదగ్గరే వెలిబుచ్చాను.

'అసలేంటీ గోల? ఈ కరోనా ఏంటి? బ్లాక్ ఫంగస్ ఏంటి? అసలివెప్పట్నుంచీ ఉన్నాయి? ఎందుకిప్పుడే విజృంభిస్తున్నాయి? సెలవివ్వుము' అనడిగా.

కర్ణపిశాచి అలిగింది.

'అంతేలే. పనున్నపుడేగా నేన్నీకు గుర్తొచ్చేది' అంది  నిష్టూరంగా. 

వార్నీ ! మనుషుల్నేగాక వీటిని కూడా భంగపోవాలా? సరే ఏం చేస్తాం? అనుకుంటూ,

'మా బుజ్జి కదూ ! నీకేం కావాలో చెప్పు. ఒక డజను రెండిసివర్ వయల్స్ బ్లాకులో కొనివ్వనా? తీసికెళ్తావా? మీలోకంలో ఫ్రిజ్ లో దాచుకుంటావా?' అడిగా బ్రతిమిలాడుతూ.

కర్ణపిశాచి పాపం అల్పసంతోషి. కరిగిపోయింది.

'సరే ! చెప్తా విను. ఇవన్నీ పురాణకాలంలోనే ఉన్నాయి' అంది సీరియస్ గా.

నాకు కళ్ళు గిర్రున తిరిగాయి.

'అవునా?' అన్నా తెగ హాచ్చర్యపోతూ.

'అవును. ఎక్కువ నటించకుండా విను. కరోనా పుట్టింది ద్రౌపదితో' అంది.

నిద్రలోనే కెవ్వున కేకేశాను.

'మరి బ్లాక్ ఫంగస్ పుట్టింది హిడింబి తోనా?' అడిగా సిన్సియర్ గా.

'కరెక్ట్. అందుకే నువ్వంటే నాకు తెగిష్టం. నిద్రలో కూడా నీ బ్రెయిన్ చాలా షార్ప్ గా పనిచేస్తోంది మరి' అంది మురిసిపోతూ.

నాకు మళ్ళీ భలే హాచ్చర్యమేసింది 'ఏంటి ఇంత కరెక్టుగా ఎలా గెస్ చేశానబ్బా' అని. 

అయినా సరే హాచ్చర్యాన్ని పక్కనపెట్టి 'ఇవి రెండునూ ఎట్లుద్భవించినవి? ఎట్లు మనవరకూ వచ్చినవి? ఎట్లు మనలను పీడించుచున్నవి? ఆ వృత్తాన్తమంతయూ పూసగుచ్చినట్లుగా వివరించుము' అంటిని.

'వినుము. వివరించెదను' అని పిశాచి చెప్పదొడంగినది.

'పాండవులు వనవాసం చేసే సమయంలో అడవిలో కుటీరాలు వేసుకుని వాటిల్లో ఉండేవారు. కానీ ఈ గెస్టులున్నారు చూశావూ, వాళ్ళను వెతుక్కుంటూ వస్తూనే ఉండేవాళ్ళు' అంటూ మొదలు పెట్టింది.

చెబుతున్నదాన్ని మధ్యలోనే ఆపి - 'ఏదీ ఇప్పుడు కూడా, మా ఇంటికి రావద్దురా బాబూ ఎవరింట్లో వాళ్ళుండండిరా బాబూ అని మొత్తుకుంటున్నా కూడా, తెగించినట్టి గెస్టులు, బంధువులు వస్తుంటారు చూడు అలాగన్నమాట' అన్నాను.

'ఆ అంతే అలాగే ! ఆ విధంగా, చాలామంది గెస్టులు వాళ్ళకోసం కూడా వస్తూ ఉండేవారు. పాపం ద్రౌపది ఆ విధంగా వచ్చిన గెస్టులందరికీ వండి పెడుతూ ఉండేది. పైగా ఒకరా ఇద్దరా? పాండవుల ఫాన్స్ అందరూ వస్తూ ఉండేవారు. ఆ మహాతల్లి అందరికీ వండి వడ్డిస్తూ ఉండేది.  ఇలా ఉండగా, ఒకరోజున అనుకోకుండా సాయంత్రం పూట చాలామంది గెస్టులు వచ్చిపడ్డారు. ఏం  తెలీని ద్రౌపది, అప్పటికే సిద్ధంగా ఉన్న పూరీపిండిని చిన్న చిన్న పూరీలు చేసి, నీళ్లలో మసాలా వేసి ఉడికించి, పానీపూరీలు చేసి వారందరికీ పెట్టింది. అందరూ తృప్తిగా తిని వెళ్లిపోయారు. ఆ విధంగా పానీపూరీ పుట్టింది' అంటూ ఆగింది కర్ణపిశాచి.

'ఇదంతా బానే ఉందిలేగాని, దీనికీ కరోనాకీ సంబంధం ఏమిటో చెప్పిచావుము' అన్నా.

'వస్తున్నా. నీకన్నీ తొందరే, కొంచం ఆగు. గెస్టులు అలా వెళ్ళిపోయాక ద్రౌపది ముందు ఒక రాక్షసి ప్రత్యక్షమైంది'

' ఎవరు నువ్వు? ఎందుకొచ్చావ్?' అనడిగింది ద్రౌపది.

'నేనీ అడివిలోనే ఆ చెట్టుమీదనే ఉంటాను. నా పేరు కరోనా. ఎందరో గెస్టులు  మీ ఇళ్లకు వచ్చిపోవడం  చూస్తూ ఉన్నాను. వారందరికీ నువ్వు చాలా శ్రద్ధగా భక్తిగా సేవ చెయ్యడం కూడా చూస్తున్నాను. కానీ ఈరోజున నీవు చేసిన క్రొత్త వంటకం నాకు చాలా నచ్చింది. నాక్కూడా అది చేసి పెట్టుము' అని రిక్వెస్ట్ చేసింది కరోనా రాక్షసి.

పోన్లేపాపం అనుకున్న ద్రౌపది రాక్షసి కోరినట్లే పానీపూరీలు చేసి పెట్టింది. తృప్తిగా తిన్న రాక్షసి మాయమయ్యేముందు ద్రౌపదికి ఒక వరం ఇచ్చింది.

'ముందుముందు కలియుగంలో అధర్మం పెరిగిపోయినప్పుడు నేను విజృంభించి సర్వనాశనం చేయబోతున్నాను. భూభారం తగ్గించబోతున్నాను. కలియుగంలో మనుషులు శుచీశుభ్రతా లేకుండా, ఎక్కడబడితే అక్కడ తింటూ తాగుతూ విచ్చలవిడిగా బ్రతుకుతూ ఉంటారు. అదే వాళ్లకు శాపమౌతుంది. అలాంటివాళ్లను నేను తినేస్తాను. ఆ సమయంలో ఎవరైతే పానీపూరీల బండ్లదగ్గర రోడ్లమీద నానాచెత్తా తింటూ ఉంటారో వాళ్ళను ఎక్కువగా ఎటాక్ చేస్తాను. కానీ నీ పేరు తలచుకుని పానీపూరీ తినేవాళ్ళజోలికి మాత్రం పోను. ఇదే నేనిస్తున్న వరం' అని చెప్పి మాయమైపోయింది కరోనా రాక్షసి.

వింటున్న నాకు మతిపోయింది. 'అమ్మా ఇదా రహస్యం ! ఈ విషయం తెలీక కదా, అమెరికోడు నానామందులూ తయారు చేస్తున్నాడు. లోకమంతా తల్లక్రిందులైపోతోంది. చచ్చేవాళ్ళు చస్తుంటే, బతికున్నవాళ్ళు వాక్సిన్లకోసం కొట్టుకుచస్తున్నారు. సింపుల్ గా పానీపూరీ తింటే కరోనా నయమౌతుందా? భలే సీక్రెట్ చెప్పావే? ఓకే, మరి బ్లాక్ ఫంగస్ కధ చెప్పు' అడిగా ఉత్సాహంగా.

'ఏంటి? ఉత్సాహం చాలా ఎక్కువగా ఉందే? సరే విను' అంటూ 'ఒసేయ్ ఇట్రావే' అని ఎవరినో పిలిచింది కర్ణపిశాచి.

వెంటనే నల్లగా తుమ్మమొద్దులాగా అందంగా ఉన్న ఒకమ్మాయి ప్రత్యక్షమైంది.

నేను కలలోనే ఝడుసుకుని 'అమ్మోయ్ ! ఈ అమ్మాయెవరు?' అంటూ అరిచా.

'భయపడినట్లు ఎక్కువగా నటించవద్దని ముందే చెప్పానీకు. ఈ అమ్మాయే బ్లాక్ ఫంగస్. మన సంస్కృతభాషలో 'నీలకిణ్వని' అంటార్లే. మీకు తెలీక బ్లాక్ ఫంగస్ అంటున్నారు. సంస్కృతం, ఆయుర్వేదం మరచిపోతే ఇలాగే ఉంటాయి మీ బ్రతుకులు' అంది పిశాచి.

'సరే ఒప్పుకున్నా తల్లీ, మేమన్నీ మరచిపోయాం. భ్రష్టులమైపోయాం. ఎక్కువగా తిట్టకు. విషయంలోకి రా' బ్రతిమిలాడా.

'నేనెందుకు? తనే చెప్తుంది. చెప్పవే కిన్నీ' అంది పిశాచి ముద్దుగా.

'కిన్నీ? అబ్బో , ముద్దుపేర్లు కూడానా మీకు' అనుకున్నా లోలోపల.

గుర్రుగా చూసిన కిన్నీ చెప్పడం మొదలుపెట్టింది.

'భీముడు ఆటవికరాజ్యానికి వెళ్లి, వాళ్ళను మల్లయుద్ధంలో జయించి, వాళ్ళమ్మాయిని పెళ్లిచేసుకున్నాడు. ఆ అమ్మాయి పేరే హిడింబి. పెళ్లయ్యాక ఆ అమ్మాయి కూడా వీళ్లతోబాటే ఉంటూ ఉండేది. ఆమెను నేటి రాజస్థాన్ ప్రాంతంలో ఉంచాడు భీముడు. అయితే అందరితో ఉండకుండా ఆమె తనదైన వేరే కుటీరంలో ఉండేది. ద్రౌపది పాండవులందరికీ కామన్ భార్య అయినప్పటికీ, అందరికీ మళ్ళీ వేరే భార్యలుండేవారు. అలాంటి వాళ్లలో, భీముడికి హిడింబి ఒక భార్య. ఆ హిడింబి రాక్షసమ్మాయని అందరూ అంటారుగాని రాక్షసులనేవాళ్ళు అసలు లేరు. అడివిమనుషులనే అలా పిలిచేవారు అప్పట్లో.  కనుక హిడింబి ఆటవిక అమ్మాయి. వాళ్ళ తిండి తిప్పలు తేడాగా ఉంటాయి. వాళ్లకు పులిసిన పదార్ధాలంటే భలే ఇష్టం. పులిసిన కల్లు త్రాగుతారు, పులిసిన పండ్లు తింటారు, ఆహారం కూడా పులవబెట్టి తింటేనే వాళ్లకు బాగుంటుంది. అందుకని ఆమె అలాంటి తిండి తయారుచేసుకుని తింటూ ఉండేది. ఇదిచూసి పాండవుల మిగతా భార్యలందరూ ఒకరోజున ఆమెను గేలిచేశారు.  ఎందుకంటే, వాళ్లంతా రాజస్థాన్ ప్రాంతం నుంచి వచ్చిన తెల్లటి అందగత్తెలు. ఆమె నల్లగా ఉంటుందని, పులిసిన తిండి తింటుందని,  అందరూ కలసి ఆమెను ఎగతాళి చేశారు.

ఆమెకు వాళ్ళమీద కోపమొచ్చి ఇలా శాపం పెట్టింది 'ముందు ముందు ఎవరైతే ఆహారాన్ని మూడు నాలుగురోజులు మురగబెట్టి పులవబెట్టి తింటారో, వాళ్లకు బ్లాక్ ఫంగస్  అనే రోగం వచ్చుగాక. ఎక్కువగా ఇది బ్రెడ్ మీదా, పులవబెట్టి, ఎండ తగలని చోట్లలో ఉండే ఆహారం మీదా, ఫ్రిజ్ లోనూ పుట్టుగాక. అది సోకినవారందరూ చచ్చుదురుగాక'. 

ఈ శాపాన్ని విని భయభ్రాంతులైపోయిన మిగతా సవతులందరూ ఆమె కాళ్ళమీద పడి ప్రార్ధించగా ఎట్టకేలకు కరుణించిన ఆమె శాపవిమోచనం ఇలా అనుగ్రహించింది.

'పులిసిన పదార్ధాలు తినేముందు నన్ను తలుచుకుని ఎవరైతే తింటారో వాళ్ళను మాత్రం ఈ బ్లాక్ ఫంగస్ ఏమీ చెయ్యదు'.

'ఓహో ఇదా కనెక్షన్? అందుకా ఈ నీలకిణ్వని ఇలా రాక్షసిలాగా ఉన్నప్పటికీ మహా అందంగా ఉంది? హిండిబి రాజస్థాన్లో ఉండేదా? అందుకేనా అక్కడే బ్లాక్ ఫంగస్ ఎక్కువగా ఉంది?' అనుకున్నా లోలోపల.

'సరే వాళ్లెవరో చేసిన నేరాలకి మనకు పడుతోందన్నమాట శిక్ష? బాగుంది. అయితే, ఇప్పుడేం చెయ్యమంటారో చెప్పండి, మీరిక వెళ్తే నెన్నిద్రపోవాలి' అన్నా పెద్దగా ఆవలించినట్టు నటిస్తూ. లేకపోతే, ఇలాగే కథలమీద కధలు చెబుతూ వదిలేటట్టు లేరు.

'అదే మరి మీ మనుషుల బుద్ధి? పనైపోయాక వెంటే వెళ్లిపొమ్మంటారు. అందుకే మేం మీకు కనిపించనిది. మీ దగ్గరకు రానిది' అన్నారిద్దరూ ముక్తకంఠాలతో.

'ఛీ ఛీ నేనలాంటోన్ని కాను. పనితో సంబంధం లేదుగాక లేదు. నేనెప్పుడూ మిమ్మల్ని తలుచుకుంటూనే ఉంటాను. మరచిపోయే ప్రసక్తే లేదు. మరి ఈ కరోనా, బ్లాక్ ఫంగస్ సమస్యలకు ఉపాయం చెప్పండి' అడిగా ఇద్దర్నీ ప్రాధేయపడుతూ.

'భారతమంతా విని, ఇంతకీ పాండవులకు ద్రౌపదేమౌతుంది? అన్నాట్ట నీలాంటోడు. అలా ఉంది నీ సంగతి. విన్నావుగా అంతా. అందులోనే సీక్రెట్ ఉంది. రోజూ రోడ్లమీద బండ్లదగ్గర, దుమ్మూధూళీ మధ్యలో, పానీపూరీలను నానాచెత్తా ఉన్న మసాలానీళ్ళ బకెట్లో ముంచుకొని తింటూ ఉన్నాసరే, ద్రౌపదీదేవిని భక్తిగా స్మరించి, ఆ తర్వాత అవన్నీ తింటే, కరోనా మీ జోలికి రాదుగాక రాదు. అదే విధంగా, వారంనాటి డేట్ ఎక్స్ ఫైర్ అయిన బ్రెడ్డూ, మురగబెట్టిన మైదాపిండీ, కుళ్ళిన మజ్జిగా, మురిగిపోయిన కూరలూ, ఫంగస్ పప్పూ, ఫ్రిజ్ లో పెట్టుకుని బాగా మెక్కుతున్నప్పటికీ, హిడింబిదేవిని భక్తిగా తలచుకుంటే, బ్లాక్ ఫంగస్ మీ దరిదాపులకే రాదు. ఎన్ని సార్లు చెప్పమంటావ్ నీ మొద్దు బుర్రా నువ్వూనూ' అంది కరోనా చాలా కోపంగా.

'ఆమ్మో కోపం వద్దు శాంతించండి. సరే రేపట్నించీ అలాగే చేస్తా. ప్రామిస్' అన్నా ఇద్దరికీ చేతులో చెయ్యేస్తూ.

చెయ్యి విదిలించుకుని, కోపంగా చూస్తూ మాయమైపోయారిద్దరూ.

అర్థమైందా నాయనలార ! పానీపూరి, బూజు బ్రెడ్డు, ప్రిజ్ లో మురగబెట్టిన కూరలు, బూజుపప్పు, కుళ్ళిన పెరుగు, మురిగిన మజ్జిగ, నెలనాటి సాంబారు, కుళ్ళిన మాంసం, పులిసిన చేపలు, కుళ్ళిపోయిన నానా జంతువులు, అన్నీ సుష్టుగా తినండి. ద్రౌపదీదేవినీ, హిడింబీదేవినీ మాత్రం తలుచుకోండి. ఈ ఒక్కటీ చెయ్యండి చాలు. అవన్నీ తినకుండా మీరెలాగూ ఉండలేరు. తినడం మానలేరు. కనుక ఈ ఒక్క ట్రిక్కు పాటించండి. వాతాపి జీర్ణం ! మీరు తిన్న నానా చెత్తంతా శుభ్రంగా అరిగిపోతాయి. ఏ మందూ అక్కర్లేదు. ఏ వాక్సినూ అక్కర్లేదు. మీకే రోగమూ రాదు.

ఏంటీ లోకం తగలబడుతుంటే నీ పరాచికాలు? నీరోకీ నీకూ పోలికలున్నాయే అంటారా? మనందరమూ నీరోలమే. ఎవడేం పాటిస్తున్నాడు గనుక? నేను చూస్తున్నంత వరకూ ఎవ్వడూ ఏదీ పాటించడం లేదు. హ్యాపీగా తిరుగుతున్నారు. వచ్చినపుడు ఎక్కడో చేరుతున్నారు. బ్రతికితే బ్రతుకుతున్నారు. పోతే పోతున్నారు. ఎవడికీ ఏ విధమైన లెక్కా లేదు. జమా లేదు. అంతా డ్రామా ! అంతే !

అర్థమైందా? ఉంటా మరి !

హ్యాపీ కరోనా ... హ్యాపీ బ్లాక్ ఫంగస్ !

ఎంజాయ్ యువర్ డేస్ !