“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

28, ఏప్రిల్ 2021, బుధవారం

స్వామి నిర్మలానంద - ఒక విస్మృత మహనీయుడు

ఏప్రియల్ 26 - చరిత్ర విస్మరించిన ఒక మహనీయుడు ఈ లోకాన్ని వదిలిపెట్టిన రోజు. ఒక నిజమైన వేదాంతి, యోగి, నవీనఋషి మరణించిన రోజు. దానిని మరణం అనకూడదేమో? నాకు తెలియదు. నిర్వాణం, మహాసమాధి మొదలైన మాటలను నేను ఇష్టపడను. మరణం మరణమే. అందుకే మామూలు మాటైనా సరే, మరణం అనే పదాన్నే నేను వాడటానికి ఇష్టపడతాను. ఏప్రియల్ 26 అలాంటి మహత్తరమైన రోజు.  ఇంతకీ ఎవరా మహనీయుడు. చరిత్ర ఆయన్ను ఎందుకు మరచిపోయింది?

ఆయనే - రామకృషుని ప్రత్యక్షశిష్యుడైన నిర్మలానందస్వామి. సన్యాసం తీసుకోడానికి ముందు ఈయన పేరు తులసీచరణ్ దత్తా. కలకత్తాలో ఒక క్షత్రియకుటుంబంలో 1863 లో జన్మించాడు. తన 75 వ ఏట కేరళలోని ఒట్టపాలెంలో 1938 లో చనిపోయాడు.

దక్షిణ భారతదేశంలో శ్రీ రామకృష్ణుని దివ్యబోధనలను ప్రచారం చేసినవారిలో స్వామి నిర్మలానంద అతి ముఖ్యుడు. దక్షిణభారతాన్ని శ్రీ రామకృష్ణుని శిష్యులైన వివేకానంద, బ్రహ్మానంద, రామకృష్ణానంద, నిర్మలానందస్వాములు దర్శించారు. వీరిలో రామకృష్ణానందగారు చెన్నై రామకృష్ణమఠాన్ని స్థాపించారు. కేరళకు నిర్మలానందస్వామిని పంపించారు. నిర్మలానందస్వామి పవిత్రపాదస్పర్శతో కర్ణాటకలోని బెంగుళూరులో, కేరళలోని దాదాపు 20 చోట్ల రామకృష్ణ ఆశ్రమాలు వెలిశాయి. వందలాది కుటుంబాలు ధన్యత్వాన్ని పొందాయి. నిర్మలానందస్వామి చాలా మహనీయుడు. ఉత్తమోత్తముడు. కారణజన్ముడు. దక్షిణభారతంలో శ్రీరామకృష్ణుని దివ్యబోధలు నిలదొక్కుకున్నాయంటే ఆయనే కారణం. అలాంటి మహనీయుడు చివరకు రామకృష్ణమఠం వారిచేత వెలివేయబడి, బహిష్కరింపబడి, తన 75  వ ఏట కేరళలోని ఒట్టపాలెం ఆశ్రమంలో కన్నుమూశాడు. ఇదంతా 1930 లలో జరిగింది. ఈ విషయాన్ని రామకృష్ణమఠం వారు కప్పిపెట్టి, చరిత్రను వక్రీకరించి, నిర్మలానందస్వామి రామకృష్ణుని ప్రత్యక్షశిష్యుడే కాదని నేడు ప్రచారం చేస్తున్నారు. నేటి తరపు శ్రీ రామకృష్ణ భక్తులకు ఈ విషయాలేవీ తెలియవు. కనుక వాస్తవాలను తెలుసుకోవలసిన అవసరం ఉన్నది. అందుకే ఈ సీరీస్ వ్రాస్తున్నాను.

1911 లో కేరళలో ఒక గొప్ప సంఘటన జరిగింది. ఆ రోజులలో కులవ్యవస్థ చాలా బలంగా ఉండేది. సహపంక్తి భోజనాలంటే ఊహించలేని సంఘటనలు. ఒకరిని ఒకరు తాకడానికి కూడా సంకోచించే ఆ రోజులలో, వేరే కులంవారితో కూర్చొని కలసి భోజనాలు చెయ్యడం ఊహకు కూడా అందని పని. కానీ రామకృష్ణుని బోధనలు వేరు. ఆయన కులమతాలను లెక్కించలేదు.  హృదయశుద్ధికే ఆయన ప్రాధాన్యతనిచ్చారు. ఆయన మొదటి తరం శిష్యులూ భక్తులూ కూడా అలాంటివారే. వారిలో బ్రాహ్మణులు, క్షత్రియులు ఎక్కువమంది. కానీ వారందరూ సమాజోద్ధరణకు ఎంతో కృషి చేశారు. కులవ్యవస్థను తొలగించడానికి ఎంతో పాటుపడ్డారు. ఈ సంవత్సరంలో నిర్మలానందస్వామి కేరళలో అడుగు మోపారు. కేరళలో హరిపాద్ అనే ఊరిలో ఉన్న శ్రీరామకృష్ణ భక్తులు, చెన్నైలో ఉంటూ రామకృష్ణుని బోధనలను ప్రచారం చేస్తున్న రామకృష్ణానందస్వామిని కేరళకు  ఆహ్వానించారు. కానీ, ఆయన, తన సహచరుడైన నిర్మలానందస్వామిని అక్కడకు పంపించారు. అదే ఆ గొప్ప సంఘటన !  

నిర్మలానందస్వామి బోధనల ప్రభావంతో 1913 లో కేరళలో మొట్టమొదటి రామకృష్ణాశ్రమం మొదలైంది. ఆ ఆశ్రమంలో కులమతాలు లేవు. ఎవరైనా ఆలయంలో పూజ చేయవచ్చు. అందరూ కలసి భోజనం చెయ్యాలి. కలసిమెలసి ఉండాలి. కానీ సమాజం ఈ మార్పులను తట్టుకోడానికి సిద్ధంగా లేదు. ఆశ్రమానికి ఎన్నో అడ్డంకులు సృష్టించారు స్థానికులు. వాటినన్నటినీ తట్టుకుని  నిలబడ్డారు నిర్మలానందస్వామి, ఆయన అనుచరులు. రామకృష్ణుని బోధనలకోసం, ఆయన చూపిన సిద్ధాంతాల కోసం ప్రాణాలు పెట్టారు.

మరుసటి సంవత్సరం 1914 లో ఆశ్రమం మొదటి వార్షికోత్సవం జరిగింది. కులమతాల ప్రసక్తి లేకుండా అందరూ కలసి భోజనాలు చేశారు. చేతులు కడుక్కున్నారు. విస్తళ్ళు ఎత్తాలి. ఎవరూ ముందుకురావడం లేదు. అందరూ నిలబడి చూస్తున్నారు. కనీసం పనివాళ్ళు కూడా ముందుకు రావడం లేదు. ఒక సస్పెన్స్ నెలకొన్నది. నిర్మలానందస్వామి ఈ పరిస్థితిని గమనించారు. ఆయనిలా అన్నారు.

'మీరందరూ భగవంతుడైన రామకృష్ణుని భక్తులు. నేనాయనకు సేవకుడిని. కనుక మీకూ నేను సేవకుడినే. నాకు కులం లేదు. మీకుందేమో? ఉంటే, మీ కులాన్ని మీరు కాపాడుకోండి, అలాగే చూస్తూ నిలబడి ఉండండి' - ఇలా అంటూ ఆ ఎంగిలి విస్తర్లను ఆయనే ఎత్తడం మొదలుపెట్టారు. ఆయనే ఎత్తుతుంటే ఎవరూరుకుంటారు? కుల కట్టుబాట్లన్నీ ఒక్కదెబ్బతో కూలిపోయాయి.  అందరూ పొలోమంటూ  విస్తర్లను ఎత్తడం మొదలుపెట్టారు. ఎవరు తిన్న విస్తరిని ఎవరు ఎత్తారో, ఎవరు ఆ చోటిని శుభ్రంచేశారో, ఎవరి కులం ఏమిటో ఎవరికీ గుర్తులేదు.  అందరం భగవంతుని పిల్లలమే అన్న భావం అందరి హృదయాలలో నిలిచిపోయింది. 

1914 లో జరిగిన ఈ మహత్తరమైన సంఘటనతో సాంప్రదాయరాష్ట్రమైన కేరళలో నవీనభావాలకు, ఆచరణాత్మకమైన వేదాంతభావాలకు పునాదులు పడ్డాయి. అవి ఈనాటికీ కొనసాగుతున్నాయి.

కానీ ఇంతటి మహనీయుడైన నిర్మలానందస్వామి తర్వాత్తర్వాత రామకృష్ణమఠం వారిచేత వెన్నుపోటు పొడవబడ్డాడు. లోకాన్ని ధైర్యంగా ఎదుర్కొన్న ఆయన, అమెరికాలోకూడా మూడేళ్లుండి, న్యూయార్క్ లో వేదాంతప్రచారం చేసివచ్చిన ఆయన చివరకు తన తరువాతితరం రామకృష్ణమఠపు సన్యాసుల చేతిలో హింసింపబడి, మానసికవేదనకు గురై,  కేరళలోని ఒట్టపాలెంలో తాను స్థాపించిన ఆశ్రమంలో 26-4-1938 న  చనిపోయాడు. ఆయన సమాధి అక్కడున్న శ్రీరామకృష్ణ నిరంజన ఆశ్రమంలో ఉన్నది. త్వరలో ఈ ఆశ్రమాన్ని  నేను సందర్శించబోతున్నాను. 

ఎందుకిలా జరిగింది? వచ్చే పోస్టులలో తెలుసుకుందాం.

(ఇంకా ఉంది)