Love the country you live in OR Live in the country you love

28, మార్చి 2021, ఆదివారం

వర్జీనియా బీచ్ కాల్పులు - జ్యోతిష్య విశ్లేషణ

జ్యోతిష్య దిక్సూచి ఈసారి అమెరికాలోని వర్జీనియా రాష్ట్రానికి మారింది. శుక్రవారం రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో అమెరికాలోని వర్జీనియా బీచ్ లో జరిగిన తొక్కిసలాటలో చెదురుమదురు కాల్పులలో ఇద్దరు చనిపోయారు. ఎనిమిదిమంది గాయపడ్డారు. ఈ బీచ్ కి చాలామంది సరదాగా గడపడానికి వస్తుంటారు. అలాగే ఈ వీకెండ్ లో కూడా వచ్చారు. ఒక గుంపులో మాటామాటా పెరిగి గొడవ జరిగి కాల్పుల వరకూ పోయింది. తర్వాత ఇంకోచోట, ఆ తర్వాత ఇంకోచోట అదే బీచ్ లో ఇలాగే కాల్పులు జరిగాయి. ప్రస్తుతం ఆ ప్రాంతమంతా పోలీస్ మోహరింపులో నిర్మానుష్యంగా ఉంది.

జ్యోతిష్యపరంగా కారణాలు చూద్దాం.

ఈ సమయంలో శుక్రుడు, రవి ఇద్దరూ  మీనరాశి 12 డిగ్రీలమీద ఉన్నారు. దీనిని జ్యోతిష్యపరిభాషలో యుతి లేదా కంజంక్షన్ అంటారు. దీనివల్ల శుక్రుడు పూర్తిగా అస్తంగతుడయ్యాడు. శుక్రుని కారకత్వాలేమిటి? అందగత్తెలైన యువతులు, విలాసప్రాంతాలు, పిక్నిక్ స్పాట్లు మొదలైనవి. జలతత్త్వరాశియైన మీనరాశి దేనిని సూచిస్తున్నది? చేపలు విరివిగా ఉండే  నదులు,సముద్రప్రాంతాలు, బీచ్ లను సూచిస్తున్నది. మీనమంటేనే చేప. అందుకే బీచ్ లో ఈ కాల్పులు జరిగాయి.

ఆ సమయంలో అక్కడ తులారాశి ఉదయిస్తుంది. సుఖస్థానమైన మకరం నీచగురువు శనుల యుతితో ధ్వంసమైపోయింది. జలతత్త్వరాశి అయిన మీనంలో జలకారకగ్రహమైన శుక్రుడు తీవ్ర అస్తంగతుడైనాడు. గందరగోళాన్ని విధ్వంసాన్ని సూచిస్తున్న అష్టమంలో గొడవలకు సూచకులైన రాహు కుజులున్నారు. ఇంకేం కావాలి?

అసలీ జ్యోతిష్య దిక్సూచి ఎలా మారుతుంది? దీని గమనం ఎలా ఉంటుంది?  ఒక దేశం నుంచి ఇంకో దేశానికి, ఒకే దేశంలో ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ఎలా ఇది మారుతుంది? అని మాత్రం అడక్కండి. అబ్బా ! ఆశకైనా అంతుండాలి. ఏళ్లకేళ్లు ఘోరమైన రీసెర్చి చేసి నేను కనుక్కున్న జ్యోతిష్య సూత్రాలను, లోతైన విషయాలను ఊరకే బ్లాగులో చెప్పేస్తాననుకున్నారా? ఊరకే ఊరిస్తాగాని అసలైన రహస్యాలను మాత్రం ఎప్పటికీ వెల్లడించను. అది నెక్ట్ టు ఇంపాజిబుల్ !