“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

2, మార్చి 2021, మంగళవారం

గెట్ లాస్ట్

జ్యోతిష్యపు జిమ్మిక్కులూ

పాండిత్యపు తైతక్కలూ 

నేర్పాలని కొందరడిగారు

గెట్ లాస్ట్ అంటూ

వాకిలిని చూపించాను


మంత్రాల మ్యాజిక్కులూ 

తంత్రాల టానిక్కులూ

కావాలని కొందరడిగారు

గెట్ లాస్ట్ అంటూ

వాకిలిని చూపించాను


కలిసొచ్చే కాలం కిటుకులు

వలవేసే గాలం ఒడుపులు

చెప్పమన్నారు కొందరు

గెట్ లాస్ట్ అంటూ

వాకిలిని చూపించాను


ఈగోల ట్రిప్పుల్లోకి 

పోగోల ట్రక్కుల్లోకి 

రమ్మంటూ కొందరడిగారు

గెట్ లాస్ట్ అంటూ

వాకిలిని చూపించాను


పారుతున్న నదులలోకి 

జారుతున్న బురదలోకి 

దిగమంటూ కొందరడిగారు

గెట్ లాస్ట్ అంటూ

వాకిలిని చూపించాను


నన్ను మోస్తామని కొందరు

వాళ్ళను మొయ్యమని కొందరు

వెంటపడుతూ వేధించారు

గెట్ లాస్ట్ అంటూ

వాకిలిని చూపించాను


అహంకారపు ఆర్భాటాలతో 

నానారకాల నాటకాలతో

దగ్గరవబోయారు ఇంకొందరు

గెట్ లాస్ట్ అంటూ

వాకిలిని చూపించాను


అసూయతో కొందరు

అసహనంతో కొందరు

దురాశతో కొందరు

దురుద్దేశంతో కొందరు

ఆడుకుందాం రమ్మన్నారు

గెట్ లాస్ట్ అంటూ

వాకిలిని చూపించాను


సోది వినిపిస్తూ కొందరు

సోడా త్రాగిస్తామని కొందరు

బూది పూయిస్తూ కొందరు

బూందీ తినిపిస్తూ కొందరు

బులుబూచికాలు చూపించారు

గెట్ లాస్ట్ అంటూ

వాకిలిని చూపించాను


కిరీటాలు మెప్పులకోసం

పరోటాలు పప్పుల కోసం

దగ్గరవబోయారు కొందరు 

గెట్ లాస్ట్ అంటూ

వాకిలిని చూపించాను


గురుత్వాల గద్దెలకోసం 

గుణింతాల సుద్దులకోసం 

నవ్వు పులుముకున్నారు కొందరు

గెట్ లాస్ట్ అంటూ

వాకిలిని చూపించాను


మా వాళ్లకు ఇష్టం లేదంటూ

మా కాళ్లకు కష్టంగా ఉందంటూ

ఉండలేమన్నారు కొందరు

గెట్ లాస్ట్ అంటూ

వాకిలిని చూపించాను



నీవేవీ మాకొద్దు, ఈ లోకం అసలొద్దు

నువ్వు తప్ప ఇంకేమీ వద్దంటూ

దగ్గరకొచ్చారు మరికొందరు

గెట్ లాస్ట్ అంటూ

నా గుండె వాకిలిని చూపించాను