“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

18, జనవరి 2019, శుక్రవారం

ఛీ ! లోకం పాడైపోయింది !

మొన్నొక ప్రెండ్ నాతో మాట్లాడుతూ 'ఛీఛీ ! లోకం బొత్తిగా పాడైపోయింది' అన్నాడు.

నవ్వాను.

'లోకం పాడైపోయిందా? ఎక్కడా?' అన్నాను ఆశ్చర్యాన్ని నటిస్తూ.

'అదేంటి? కనిపించడం లేదా? ఎక్కడ చూచినా మోసం, అవినీతి, దగా, దౌర్జన్యం, నకిలీ వ్యక్తిత్వాలు, వ్యసనాలు, ముసుగులు, అబద్దాలు, ఇవేగా ! దీన్ని ఏమంటారు?' అన్నాడు.

'అవన్నీ సరేలే ! ఇందులో లోకం పాత్ర ఏముంది? మనం పాడై పోతూ లోకాన్ని నిందిస్తే ఉపయోగం ఏముంది? దానికేమన్నా ప్రాణం ఉందా మనలాగా?' అడిగాను.

'అంటే, లోకమంటే మనుషులూ సమాజమూ అనే అర్ధంలో అన్నాలే !' అన్నాడు.

'నీకు తోచిన అర్ధాలలో అనడం కాదు, ఉన్నది ఉన్నట్టు అను. మనం పాడైపోతున్నాం. లోకాన్ని పాడుచేస్తున్నాం అను' - అన్నాను.

'అదేలే, మరీ ఇంత ఘోరమా? టీచర్లు సరిగ్గా లేరు. విద్యార్ధులూ సరిగ్గా లేరు. తల్లిదండ్రులూ, పిల్లలూ సరిగ్గా లేరు. వైద్యులూ రోగులూ సరిగ్గా లేరు. అధికారులూ, ఉద్యోగులూ సరిగ్గా లేరు. భార్యాభర్తలూ సరిగ్గా లేరు. ఛీ ఛీ' అన్నాడు వాడు.

'మళ్ళీ అదే కూత కూస్తున్నావ్ ! సరిగ్గా లేరు, అంటే నీ అర్ధం ఏంటి? How can you expect absolute perfection in this relative world?' అడిగాను.

ఖంగు తిన్నాడు ఫ్రెండ్.

'సమాజం అంతా సరిగ్గానే ఉందంటావా? నేను చెప్పేది అబద్దాలా?' అడిగాడు కోపంగా.

'లేదు లేదు. నువ్వు చెప్పేవి నిజాలే. నీ ఆత్మఘోష నాకు బాగానే అర్ధమైంది' అన్నాను నవ్వుతూ.

'మరి ఇదంతా ఇలా ఎందుకుందో చెప్పు? కలిప్రభావం అని మాత్రం అనకు. ఈ మాటను వినీ వినీ విసుగొచ్చింది' అన్నాడు.

ఇలా చెప్పాను.

'చూడు. కలిప్రభావం అనేది సరే. అది నిజమే. కానీ మన ప్రమేయం లేకుండా కలి ఏం చెయ్యగలదో చెప్పు? ఏమీ చెయ్యలేదు. నువ్వు చెప్పిన దాంట్లో ఇద్దరున్నారు. మొదటి వర్గం డాక్టరు, టీచరు, అధికారి, నాయకుడు. భర్త, తండ్రి ఇలా ఉన్నారుకదా. రెండో వర్గమేమో రోగి, విద్యార్ధి, ఉద్యోగి, పౌరుడు, భార్య ఇలా ఉన్నారు. మొదటి వర్గం సరిగ్గా ఉంటె రెండో వర్గమూ సరిగ్గానే ఉంటుంది. లేదా రెండో వర్గం సరిగ్గా ఉంటె మొదటి వర్గమూ సరిగ్గానే దొరుకుతుంది.

కర్మసూత్రం ప్రకారం మన ఖర్మకు తగినవాళ్లే మనకు దొరుకుతారు. అది భర్తైనా, భార్యైనా, గురువైనా, టీచరైనా, ఉద్యోగమైనా, వ్యాపారమైనా ఏదైనా ఇంతే. ఇదొక కర్మనియమం. దీన్ని ఎవరూ దాటలేరు. మనం సరిగ్గా ఉంటే, మనకు దొరికేవాళ్ళూ సరిగ్గానే ఉంటారు. మనం దారితప్పితే మనకు దొరికేవాళ్ళు కూడా అలాంటివాళ్ళే దొరుకుతారు.

ఒక ఉదాహరణ చెప్తా చూడు. ఒకప్పుడు నాయకులు నిజాయితీగా ఉండేవారు. ప్రజలూ అలాగే ఉండేవారు. క్రమంగా నాయకులు దారి తప్పడం మొదలైంది. ప్రజలూ దారితప్పడం మొదలు పెట్టారు. ఇప్పుడు నాయకులూ దొంగలే, ప్రజలూ దొంగలే. ఎవడికి చిక్కినది వాడు దోచుకుంటున్నాడు. ప్రాచీన కాలం నుంచీ ఈ దేశాన్ని ఎన్నో విదేశీజాతులు దోచుకున్నాయి. ఇప్పుడు స్వదేశీ ప్రజలూ, స్వదేశీ నాయకులే దోచుకుంటున్నారు. ప్రజలే పక్కా అవినీతిపరులుగా తయారయ్యారు. కనుక వారికి నీతిమంతులైన నాయకులు దొరకరు. నాయకులు అవినీతి పరులై, ప్రజలకు అలవాటు చేస్తున్నారు గనుక ప్రజలూ దారి తప్పుతున్నారు. ఇదొక విషవలయం.

అలాగే, అది విద్యార్దులైనా, రోగులైనా, ఉద్యోగులైనా ఎవరైనా సరే. వాళ్ళు సరిగ్గా ఉన్నప్పుడే వారికి సరైన కౌంటర్ పార్ట్ దొరుకుతుంది.' అన్నాను.

'అందరికీ అలా జరుగుతుందా?' అడిగాడు.

'జరగదు. ఈరోజు మనం పత్తిత్తులుగా మారినంత మాత్రాన రేపే మనం కోరుకునే ఆదర్శమూర్తులు దొరకరు. ప్రకృతికి కూడా మనమంటే నమ్మకం కలగాలి. అంతకాలం మనం మన నిజాయితీని నిరూపించుకోవాలి. ఆగాలి. అప్పుడే మనం అనుకునేవి జరుగుతాయి. మనకు ఓపిక ఉండాలి. మనం చేసే వెధవపనులన్నీ చేసేసి, సడెన్ గా 'ఈరోజే నేను మారుమనసు పొందాను, ప్రభువా కనిపించు' అంటే, ఎవడూ నీ ముందు ప్రత్యక్షం కాడు.

అసలు పాయింట్ అది కాదు. నువ్వు కోరుకునేవాళ్ళు నీకు దొరికినా దొరక్కపోయినా నీ ప్రిన్సిపుల్స్ మీద నువ్వు నిలబడాలి. అలా కొంతకాలం నువ్వు నీ జీవితాన్ని త్యాగం చెయ్యగలిగితే అప్పుడు ప్రకృతి కూడా నీ నిజాయితీని గుర్తించి, నీకు తగిన పరిస్థితులను కల్పించడం మొదలుపెడుతుంది. అంతవరకూ నువ్వు నీతికీ నిజాయితీకీ నిలబడాలి.

కానీ నేటి సమాజంలో అలాంటి మనుషులు ఏరి? అందరికీ తొందరే. అందరికీ ఆత్రమే. ఏదో జారిపోతుంది. ఏదో కోల్పోతాం. అన్న భయంలో భ్రమలో ఒకడిని మించి ఇంకొకడు పరుగులు తీస్తున్నాడు. చివరికి అందరూ సర్వనాశనం అవుతారు. అది ఎవడికీ అర్ధం కావడంలేదు. నువ్వు చెప్పినది నిజమే. సమాజం అంతా కుళ్లిపోయింది. దీనిని బాగు చెయ్యడం ఎవడికీ సాధ్యం కాదు. బహుశా భగవంతుడే దిగి రావాలేమో !

ఒక చిన్న విషయం విను. ఎక్కడైనా demand ని బట్టే supply అనేది ఉంటుంది. కానీ demand చేసేవాడిలో నిజాయితీ ఉండాలి. త్రికరణశుద్ధి ఉండాలి. అప్పుడు supply అనేది ప్రకృతి నుంచి వస్తుంది. ప్రస్తుతం మన సమాజంలో నిజమైన విలువల కోసం డిమాండూ లేదు, అలా అడగడానికి కావలసిన అర్హతా ఎవడికీ లేదు. కనుక ప్రకృతినుంచి సరియైన సప్లై కూడా ఉండటం లేదు.

నీది గొంతెమ్మ కోరిక. సమాజమూ లోకమూ బాగుపడాలని ఎప్పుడూ ఆశించకు. అది జరగని పని. ఇవి ఇంకా ఇంకా సర్వనాశనం అవుతూనే ఉంటాయి. సామూహిక కర్మను అర్ధం చేసుకునే శక్తి నీకు లేదు. నీ జీవితమే నీకర్ధం కాదు. ఇక ప్రపంచకర్మను నువ్వేం అర్ధం చేసుకోగలవు? అసలలాంటి ప్రయత్నమే నువ్వు చెయ్యకూడదు.

బంతి, మెట్లమీదనుంచి క్రింద పడింది. అది దొర్లుతూ దొర్లుతూ పాతాళానికి పోవలసిందే గాని మధ్యలో ఆగి, వెనక్కు వెళ్ళదు. అదంతే !' అన్నాను.

'మరి దీనికి పరిష్కారం?' అడిగాడు.

'నాకేం తెలుసు? లోకాన్ని సృష్టించినవాడొకడున్నాడు. చేతనైతే వాడినడుగు' అన్నాను.

'చేతకాకపోతే?' అన్నాడు.

'నోర్మూసుకుని ఇంటికెళ్ళి తిని తొంగో' అన్నాను నవ్వుతూ.

ఫ్రెండ్ గాడు నీరసంగా లేచి ఇంటి ముఖం పట్టాడు.

కధ కంచికి మనం ఇంటికి !