“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

15, జనవరి 2019, మంగళవారం

మీరంటే ఇప్పటికి నమ్మకం కుదిరింది

మొన్నొక ఫోనొచ్చింది.

'నమస్కారమండి. నా పేరు ఫలానా' అన్నాడు ఒకాయన.

'నమస్తే. చెప్పండి' అన్నా.

'నేను మీ బ్లాగును మొదట్నించీ ఫాలో అవుతున్నాను' అన్నాడు.

''మొదట్నించీ అంటే?' అడిగాను అనుమానంగా.

'అంటే మీరు బ్లాగు వ్రాయడం మొదలు పెట్టినప్పట్నించీ. అంటే 2008 నుంచీ.' అన్నాడు.

'చాలా సంతోషమండి' అన్నాను.

'అవును. మీ పుస్తకాలు కూడా అన్నీ చదివాను. మీ లేటెస్ట్ బుక్ మహాసౌరం తో సహా' అన్నాడు.

'ఇంకా థాంక్స్' అన్నాను.

'ఇప్పటికి మీమీద నాకు నమ్మకం కుదిరింది' అన్నాడు.

నాకు గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టు అయింది.

'అదేంటి?' అడిగాను అయోమయంగా.

'అంటే, మీరు చెబుతున్నవి నిజమే అని ఇప్పటికి నమ్ముతున్నాను' అన్నాడు.

'ఉద్దరించావులే' అనుకుని ' పోన్లెండి బ్రతికించారు' అన్నా.

'ఒక్కసారి మీ దగ్గరికి వద్దామని అనుకుంటున్నాను.' అన్నాడు.

'ఎందుకు?' అడిగాను.

'అంటే, మీ శిష్యునిగా మీ దగ్గర దీక్ష తీసుకుని మీ మార్గంలో నడుద్దామని నా ఊహ' అన్నాడు.

'ఉత్త ఊహేనా?' అడిగాను.

'అవునండి' అన్నాడు వినయంగా.

'మీరొక పని చెయ్యండి. 2029 జనవరిలో ఒకసారి ఫోన్ చెయ్యండి. ఆలోచిస్తాను' అన్నాను.

నిశ్శబ్దం

'అదేంటి సార్. అంటే ఇంకో పదేళ్ళు ఆగాలా?' అన్నాడు కోపం ధ్వనిస్తున్న స్వరంతో.

'అవునండి. నన్ను నమ్మడానికి మీకు పదేళ్ళు పట్టింది. మిమ్మల్ని నమ్మడానికి నాకూ కనీసం పదేళ్ళు పడుతుంది మరి. నేనూ మిమ్మల్ని జాగ్రత్తగా పరిశీలించాలిగా?' అన్నాను.

'అంటే, మేం మామూలు మనుషులం కాబట్టి పదేళ్ళు పట్టింది. మీరు గురువు కదా? అంత టైం మీకెందుకు పడుతుంది?' అన్నాడు.

'పట్టదు. కానీ సరదాకి అలా చెబుతున్నాను. మీకు తెలుసుకదా నేను జీవితాన్ని ఒక ఆటగా తీసుకుంటాను. అది నా జీవితమైనా సరే, వేరేవాళ్ళ జీవితమైనా సరే ! ఎప్పుడైనా ఒక్కోసారి నా జీవితాన్ని సీరియస్ గా తీసుకుంటానేమో గాని, వేరేవాళ్ళ జీవితాలను మాత్రం ఎప్పుడూ ఆటగానే తీసుకుంటాను. వాటితో ఆడుకుంటాను. ఈ క్రమంలో సంసారాలు కూలుస్తుంటాను కూడా ! అది నా హాబీ. అందుకే అలా చెబుతున్నాను. మీరు మరోమాట మాట్లాడితే నన్ను కలవడానికి 2039 వరకూ ఆగాల్సి ఉంటుంది!' అన్నాను సీరియస్ గా.

అతను తెచ్చిపెట్టుకున్న అతివినయపు మాస్క్ జారిపోయింది.

'అబ్బా! అంతవరకూ మనం బ్రతికుంటామని గ్యారంటీ ఏముంది?' అన్నాడు వెటకారంగా.

'నేనుంటాను. ఎందుకంటే నేను ఆహారనియమం పాటిస్తాను. యోగాభ్యాసం చేస్తాను కాబట్టి. మీరుంటారో లేరో నేను చెప్పలేను' అన్నాను.

'అందరూ అనుకునేటట్టు మీకు అహంకారం అనేది నిజమేనన్నమాట' అన్నాడు ఇంకా వెటకారంగా.

ఈమాటను ఇప్పటికే వందలాది సార్లు వినీవినీ ఉండటంతో నాకు నవ్వొచ్చింది.

'అవును. నాకు అహంకారమే. ఏమీ తెలియని మీకే ఇంత అహంకారం ఉండగా లేనిది, ఇన్ని తెలిసిన నాకెంత ఉండాలి?' అన్నాను.

ఫోన్ కట్ అయిపోయింది.

చాలామంది ఇంతే! వాళ్ళేదో చాలా గొప్పవాళ్ళమని అతిగా ఊహించుకుంటూ ఉంటారు. వాళ్ళు గురువు దగ్గరకి రావడం ఆ గురువుగాడి అదృష్టం అని భ్రమల్లో తేలిపోతూ ఉంటారు. వాళ్లకు దీక్షనివ్వడం నా భాగ్యం అనుకుంటూ ఇలా అడుగుతూ ఉంటారు. ఇది అహంకారానికి పరాకాష్ట అని వాళ్ళకర్ధం కాదు. ఇలాంటివాళ్ళు ఈ జన్మంతా కొట్టుకున్నా ఆధ్యాత్మికంగా అంగుళం కూడా ఎదగలేరు. అసలిలాంటి వాళ్ళను నేను దగ్గరకు రానివ్వను కూడా రానివ్వను.

నన్ను నమ్మడానికి ఈయనకు పదేళ్ళు పట్టిందట ! నేనేమో ఈయన ఒక ఫోన్ కాల్ చేస్తే వెంటనే ఎగురుకుంటూ ఎదురెళ్ళి ఈయనను వాటేసుకుని యోగరహస్యాలన్నీ చెప్పేసి, దీక్షనిచ్చి, ఈయన బరువంతా మొయ్యాలట ! భలే బాగుంది కదూ ! 

లోకం ఎలాంటి మనుషులతో నిండి ఉందిరా దేవుడా !