“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

23, జనవరి 2018, మంగళవారం

జ్యోతిష్యం వాస్తు నిజమని నిరూపిస్తే 6 కోట్లు

అప్పుడప్పుడు నాకు చాలా ఈ మెయిల్స్ వస్తూ ఉంటాయి.

'ఎవరో హేతువాద సంఘం వాళ్ళు ప్రైజ్ మనీ ఎనౌన్స్ చేశారు. జ్యోతిష్యం వాస్తు నిజమని నిరూపిస్తే 6 కోట్లు ఇస్తామని అంటున్నారు. మీరు నిరూపించి ఆ డబ్బులు తీసుకోవచ్చు కదా?' అని.

నేను నవ్వుకుని ఊరుకుంటూ ఉంటాను.

మన తెలుగురాష్ట్రంలో ఈ ప్రైజ్ మనీ ఇప్పుడు వచ్చిందేమో? అర్ధశతాబ్దం క్రితమే ఇలాంటి చాలెంజ్ లు విదేశాలలో చాలా ఉన్నాయి. ఇంటర్నేషనల్ ఎతీస్ట్ సెంటర్స్ ఇలాంటి చాలెంజ్ లు ఎన్నో చేశాయి. ఇప్పటికీ ఆ చాలెంజ్ లను ఎవరూ స్వీకరించలేదు.

ఎందఱో పేరు మోసిన జ్యోతిష్కులు విదేశాలలో కూడా ఉన్నారు. వారు వెస్టర్న్ ఎస్ట్రాలజీ ని అనుసరిస్తారు. కానీ వాళ్ళు కూడా ఈ చాలెంజ్ ని స్వీకరించరు. ఎందుకంటే ఆ చాలెంజ్ చేసినవాళ్ళు పెట్టే కండిషన్స్ ఎలా ఉంటాయంటే, ఒకవేళ జ్యోతిష్కులు గెలిచినా, గెలవలేదని నిరూపించేలా అవి డిజైన్ చెయ్యబడి ఉంటాయి. మూర్ఖంగా వాదించి 'మీరు గెలవలేదు' అని వాళ్ళే నిరూపిస్తారు. కనుక అలా గెలవడం జరిగేపని కాదని వీరికి బాగా తెలుసు. అందుకే ఆ చాలెంజ్ ని నిజమైన జ్యోతిష్కులు ఎవ్వరూ స్వీకరించరు. ఇక కుహనా జ్యోతిష్కుల సంగతి చెప్పనే అక్కర్లేదు. వారెలాగూ ఓడిపోక తప్పదు. అందుకని వారూ ఈ చాలెంజ్ ని స్వీకరించరు.

మొన్నీ మధ్యనే ఒక కొలీగ్ కీ నాకూ మధ్య దీనిమీద సంభాషణ నడిచింది.

"ఆ చాలెంజ్ స్వీకరించి 6 కోట్లు కొట్టెయ్యొచ్చుగా?" అడిగాడు కొలీగ్.

'ఫస్ట్ నువ్వు వాడుతున్న పదమే తప్పు. కొట్టెయ్యడం అనే దానిమీద నాకు ఇంటరెస్ట్ లేదు. నేను దొంగను కాను ఆ పని చెయ్యడానికి." అన్నాను నవ్వుతూ.

'అదికాదు. ఏదో మాటవరసకి వాడాన్లే ఆ పదాన్ని. జ్యోతిష్యం నిజమే అని నువ్వు ప్రూవ్ చెయ్యొచ్చు కదా?' అన్నాడు.

'ఒకరికి ప్రూవ్ చెయ్యవలసిన పని నాకు లేదు. అది నిజమైన శాస్త్రమే అని నాకు తెలుసు. ఇంకొకరిని ఒప్పించాల్సిన పని నాకు లేదు. వారు ఒప్పుకుంటే నాకు ఒరిగేది కూడా లేదు' అన్నాను.

'ఎందుకు ఒరగదు? ఆరు కోట్లు అంటే మామూలు విషయం కాదుగా?' అన్నాడు.

'తేరగా వచ్చే సొమ్మంటే నాకు నమ్మకం లేదు. కష్టం లేకుండా అలా తేరగా వచ్చే సొమ్ము ఒక్క రూపాయికూడా నాకక్కర్లేదు. దానితో చాలా కర్మకూడా వస్తుంది. దాన్ని మోసే ఖర్మ నాకెందుకు? ఇప్పటికున్న కర్మ చాలు.' అన్నాను.

'పోనీ నీకు అవసరం లేకుంటే, తీసుకుని చారిటీకి ఇచ్చేయ్' అన్నాడు.

'ఎవరున్నారు మంచిగా చారిటీ చేసేవాళ్ళు? ఒక్కరిని చూపించు. అన్నీ రాజకీయాలే. అన్నీ స్వార్ధాలే. అన్నీ కుట్రలూ కుతంత్రాలే. అంత డబ్బు వాళ్లకిచ్చి ఆ కర్మను మోసే పని నాకెందుకు? నీకంత దురదగా ఉంటే నీ చేతనైనంతలో ఆ పని నువ్వే చెయ్యి' అన్నా.

'మరి ఇంత నేర్చుకుని, ఎవడికీ ఉపయోగం లేకపోతే, నీ టైం అంతా వేస్ట్ కాలేదా?' అన్నాడు తెలివిగా.

'ఇక్కడ ఎవడి టైం వేస్ట్ కావడం లేదో కాస్త చెప్పు? బిలియన్స్ సంపాదించిన వాడి టైం కూడా చివరికి వేస్టే. అది వాడికి అర్ధం కావడానికి 'టైం' పడుతుంది. అంతే. ఈ లోకంలో ప్రతివాడూ చేస్తున్నది ఒకటే పని - టైం వేస్ట్ - చెయ్యడమే. అది తప్ప ఎవరూ ఏమీ చెయ్యడం లేదు.' అన్నాను.

'కనీసం నీకైనా ఈ శాస్త్రం ఉపయోగపడుతోందా" అన్నాడు విసుగొచ్చి.

ఇక వీడితో ఇలా కాదని - 'ఉపయోగపడటం కోసం కాదు నేను దీనిని నేర్చుకుంది?' అన్నాను.

అది వాడికి అర్ధం కాలేదు.

'మరెందుకు?' అన్నాడు అయోమయంగా.

'టైం పాస్ కోసం నేర్చుకున్నాను. టైం వేస్ట్ చేస్తూ పోస్టులు వ్రాస్తున్నాను. సింపుల్ గా చెప్పాలంటే అంతే.' అన్నాను.

'అదేంటి?' అన్నాడు మళ్ళీ అయోమయంగా.

'అదంతే ! జ్యోతిష్యం ఒకరికి ప్రూవ్ చెయ్యాల్సిన సబ్జెక్ట్ కాదని తెలుసుకోవడం కోసమే దీనిని నేర్చుకున్నాను.నావరకూ నాకు బాగానే ఉపయోగపడుతోంది.' అన్నా నవ్వుతూ.

'ఓహో! చాలెంజ్ స్వీకరిస్తే ఓడిపోతానని భయంతో ఈ కబుర్లు చెబుతున్నావా?' అన్నాడు నవ్వుతూ.

'అవును. 'యుద్ధం చెయ్యనివాడు యుద్ధంలో గెలిచినట్లే' అన్నాడు లావోజు. ముందిది అర్ధం చేసుకో. ఆ తర్వాత తీరిగ్గా నాతో వాదిద్దువు గాని' అన్నా.

'ఏమో. నాకైతే కళ్ళు మూసినా తెరిచినా ఆరు కోట్లే కనిపిస్తున్నాయి' అన్నాడు శూన్యంలోకి చూస్తూ.

'సరే ఒకపని చెయ్యి. రేపట్నించీ నా దగ్గర జ్యోతిష్యశాస్త్రం నేర్చుకో. రెండు మూడేళ్ళలో ఆ చాలెంజ్ నువ్వే స్వీకరించే స్థాయికి ఎదుగుతావు. ఈ లోపల ప్రముఖ జ్యోతిష్కులు ఎవరూ ఆ పనిని చెయ్యరు గాక చెయ్యరు. అంతవరకూ నీకు గ్యారంటీ ఇస్తా.' అన్నా సీరియస్ గా.

'ఫీజు ఎంతేంటి?' అన్నాడు వాడూ నవ్వుతూ.

'వెరీ సింపుల్. నీ దగ్గర ఎక్కువ తీసుకోనులే. రోజుకు ఆరు కోట్లు. అంతే !' అన్నా నేనూ నవ్వుతూ.

'సర్లే పద ! నాకు చాలా పనుంది అవతల' అన్నాడు నీరసంగా.

' నాకూ పనుంది. వస్తా ! ఇంకో సంగతి ! జ్యోతిష్యం వాస్తు నిజాలు కావని నిరూపిస్తే నేను కూడా ఆరు కోట్లు ఇస్తానని ప్రెస్ మీట్ పెట్టబోతున్నా త్వరలో.' అన్నా.

'నీ దగ్గర ఆరు కోట్లు ఎక్కడివి?' అన్నాడు సీరియస్ గా.

'పాత జోకేలే. మళ్ళీ చెబుతున్నా. నేను లా చదివినప్పుడు కుట్టించుకున్న నల్లకోటు ఒకటుంది. రైల్వే టీసీలు వేసుకునే కోట్లు అయిదు దానికి కలిపి ఆరు కోట్లు చేస్తా. అవి ప్రైజుగా ఇస్తా.' అన్నా నవ్వుతూ.

'ఇది ప్రూవ్ చెయ్యడం చాలా తేలిక. నువ్వు ఓడిపోతావ్' అన్నాడు.

'అదీ జరిగే పని కాదు. ఎందుకంటే వాళ్ళు ఎన్నెన్ని చెప్పినా నేను కన్విన్స్ కాను కదా ! కన్విన్స్ కాకూడదు అని ముందే డిసైడ్ అయిపోతానన్నమాట - వాళ్ళలాగానే. కనుక వాళ్ళూ ఈ చాలెంజ్ లో గెలవలేరు. ఒకవేళ గెలిచినా మనకు పోయేదేముంది పాత కోట్లు తప్ప? దరిద్రం పోతుంది.' అన్నాను నవ్వుతూ.

వాడి దారిన వాడు చక్కా పోయాడు.

కధ కంచికి మనం ఇంటికి !