“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

14, జనవరి 2018, ఆదివారం

త్వరలో రాబోతున్న మా పుస్తకం "మహాసౌరమ్" నుంచి కొన్నిపద్యాలు

సూర్యోపాసన మన మతంలో ఒక విశిష్టమైన అంశం. సూర్యుడు ప్రత్యక్షదైవం. అంటే ప్రతిరోజూ మనకు కళ్ళెదురుగా కనిపించే దైవం. సూర్యుని సకల దేవతాస్వరూపునిగా స్తుతించింది వేదం.

భౌతికవాదులకూ నాస్తికులకూ సూర్యుడు ఒక మండుతున్న నిప్పుల ముద్ద కావచ్చు. కానీ అదే అగ్నిగోళం ఇచ్చే వేడితోనే వాళ్ళూ బ్రతుకుతున్నారన్న స్పృహ కొంచెం ఉంటే, దానినుంచి కృతజ్ఞత పుడుతుంది. ఆ కృతజ్ఞతకు మరో పేరే భక్తి. వారు నిత్యం పొందుతున్న సహాయం పట్ల కృతజ్ఞత లేకుండా నాస్తికులూ భౌతికవాదులూ ఉంటారని నేనైతే అనుకోను. అలా ఉండేవారు అసలు 'మనుషులు' అనే పదానికే అర్హులు కారు మరి.

దేవుడు సృష్టించిన సూర్యుడిని దేవుడిగా పూజించడం ఘోరమైన తప్పని క్రైస్తవమూ ఇస్లామూ వంటి కొన్ని మతాలంటాయి. ఈ మాట విన్నప్పుడు మనకు నవ్వొస్తుంది. దేవుని కంటే దేవుని సృష్టి వేరు కాదు. సృష్టిలో దైవపు వెలుగే ప్రకాశిస్తున్నది. కనుక తేజోవంతములైన వాటిల్లో దైవపు వెలుగును దర్శించి పూజించడం తప్పు కాదు. విషయం మీకు సరిగ్గా అర్ధం కావడం లేదని మనమంటాం.

మనకు కనిపించే వెలుగులలో అతిపెద్ద వెలుగు సూర్యుడే గనుక, "జ్యోతిషామపి తజ్జ్యోతి:" అంటూ ఆయన్ను దైవంగా భావించి పూజించడం చాలా సరియైన పని. ఈ విధమైన ఉపాసనను వేదం సమ్మతించింది. వేదంలో ఉన్న అరుణం, మహాసౌరం వంటి మంత్రభాగాలే దీనికి నిదర్శనాలు. సూర్యోపాసకులకు ఇవి చిరపరిచితములే. స్తోత్రాలలో అయితే రామాయణంలో మనకు లభిస్తున్న 'ఆదిత్య హృదయం' చాలా మంచి స్తోత్రం. లక్షలాది మంది చేత ఇది నిత్యమూ పారాయణం గావింపబడుతున్న స్తోత్రమే.

పంచవటి పబ్లికేషన్స్ నుంచి అతి త్వరలో రాబోతున్న మరో పుస్తకం 'మహాసౌరమ్' నుంచి నేను వ్రాసిన కొన్ని పద్యాలను మకర సంక్రాన్తి రోజున మీకోసం ఇక్కడ ముందుగానే ఇస్తున్నాను. ఇది ఋగ్వేదం లోని మహా ప్రభావవంతములైన మంత్ర సమాహారములలో ఒకటి.

చదవండి.
--------------------------------------------
ఓమ్ !
ఉదుత్యం జాతవేదసం దేవం వహంతి కేతవ:
దృశే విశ్వాయ సూర్యమ్

తే||కాంచు మల్లదె సూర్యుని గుర్రములను
విశ్వమెల్లను జూచెడి వెలుగురేని
సర్వవేత్తను శాసకు సర్వవిభుని
ఆకసంబున నిల్పవె; యవని కొరకు

సూర్యుడు భూమిపైన జరుగుతున్న సమస్తమునూ గ్రహిస్తున్నవాడు. సర్వమునూ శాసిస్తున్నవాడు. సర్వమానవాళికీ ఆయన ప్రభువు. ఎందుకంటే ఆయన ఇచ్చే వేడిమితోనే మనుషులు జంతువులు పక్షులు చెట్లు ఇతర జీవులు బ్రతుకుతున్నాయి. ఆ సూర్యునికి ఏడు గుర్రములున్నాయి. అవే ఆయన కాంతిలోని ఏడు రంగులు. ఆ గుర్రముల రధంపైన అధిరోహించి ఆయన ఆకాశంలో కనిపిస్తున్నాడు. మానవులారా చూడండి !

తే||ఏడు గుఱ్ఱము లెక్కుచు నెంతగాను
లోకమంతయు నింపెడు లాస్యమొదవ
ప్రభుత నేలగ విశ్వపు పారమంత
శూన్యమండల వీధుల సూర్యుడేగు

ఏడు గుర్రముల రధం మీద అధిరోహించి, లోకాన్నంతా విలాసంగా దర్శిస్తూ, దానిని పరిపాలిస్తూ, శూన్యమండలంలో సూర్యుడు విహరిస్తున్నాడు. మానవులారా ! ఆ వెలుగును దర్శించండి ! 

||విశ్వమెల్ల నేలు విఖ్యాత పురుషుండు
ఏడు హయములెక్కి ఏగు దెంచు
నియమమందు నిల్పి నిఖిల లోకతతుల
కాంతిపధము నందు గానవచ్చు

విశ్వం మొత్తాన్నీ పరిపాలిస్తున్న ప్రాచీన పురుషుడు ఏడు రంగుల గుర్రములు లాగే రధంలో వచ్చుచున్నాడు. ఈ భూమిపైన సమస్తమూ ఆయన అధీనంలోనిదే. అన్నింటినీ ఆయన నియమిస్తున్నాడు. కాంతిమార్గంలో ఆయన ప్రయాణిస్తున్నాడు. చూడండి !

తే||ఏడు రంగుల గుఱ్ఱములెక్కి నీవు
చేరబోవలె నాతని సర్వ విభుని
జ్ఞానరూపిని ప్రభువును చేతనమున
యోగమార్గము నందుచు వేగమొప్ప

ఈ ఏడు గుర్రములూ మనిషిలోని సప్తచక్రములకు సూచికలు. ఈ సప్తచక్రములనూ జాగృతం చెయ్యడం ద్వారా మీరు సమస్తానికీ ప్రభువైన సూర్యుని తేజస్సును అందుకోవాలి. ఓ మానవులారా ! ఈ యోగమార్గంలో ప్రయాణించడం నేర్చుకోండి.