“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

15, అక్టోబర్ 2014, బుధవారం

జిల్లెళ్ళమూడి స్మృతులు-7

ఆరోజున అక్కడేదో సదస్సు జరుగుతున్నది.చాలా కార్లు ఆగి ఉన్నాయి.కార్ పార్కింగ్ కోసం అక్కడా ఇక్కడా తిరిగి చివరకు ఒకచోట ఏదో పార్క్ చేశామనిపించి అమ్మ దేవాలయానికి బయల్దేరాము.అఖండనామం జరిగే చోట అమ్మ నివసించిన గుడిసె ఉన్నది.

చక్కగా పరికిణీ ఓణీలు వేసుకున్న అమ్మాయిలు అక్కడ అఖండపారాయణాన్ని ఎప్పుడూ చేస్తూ ఉంటారు.వాళ్ళను చూస్తే నాకు చాలా ముచ్చటేస్తుంది.ఆ ప్రాంతానికి వెళ్ళిన ప్రతిసారీ "నామపారాయణ ప్రీతా నందివిద్యా నటేశ్వరీ" అన్న నామం నాకు వెంటనే గుర్తొస్తుంది.వాళ్ళను చూస్తే అమ్మ చుట్టూ ఉండే పవిత్ర శక్తిగణంలాగా కనిపిస్తారు.వాళ్లకు మనస్సులోనే నమస్కారం చేస్తూ అక్కడే వాళ్ళను చూస్తూ కాసేపు నిలబడ్డాను.మన మనస్సులో భావం వాళ్లకు తెలియదుకదా.వాళ్ళను తదేకంగా చూస్తుంటే వాళ్ళు కొంచం కంగారుపడ్డారు.సరే వాళ్ళను ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పి అమ్మ దేవాలయానికి వచ్చాను.

అమ్మ దేవాలయానికి వచ్చి కొద్దిసేపు అక్కడా కొద్దిసేపు హైమక్కయ్య దేవాలయంలోనూ మౌనంగా కూర్చుని ఆ తర్వాత శివాలయానికి బయల్దేరాము.

శివాలయ ప్రాంగణంలో వేదం నేర్చుకునే చిన్నచిన్నపిల్లలు చక్కగా వేదం వల్లెవేస్తూ కనిపించారు.మరి కొందరేమో మధ్యాహ్న సంధ్యావందనం చేస్తూ కనిపించారు.వాళ్ళను చూస్తే ముచ్చటేసింది.

అక్కడనుంచి వెనక్కువచ్చి అమ్మగదికి వెళ్లి కొద్దిసేపు అక్కడ మౌనంగా కూర్చున్నాము.

అమ్మ గదికి వెళ్ళేదారిలో ఒక పెద్దాయన కనిపించారు.ఆయన నన్నుచూచి గుర్తుపట్టి కూడా గుర్తుపట్టనట్లుగా ముఖంపెట్టాడు.ఇవన్నీ మనకు మామూలే గనుక లోలోపల నవ్వుకుంటూ నేనే ముందుకు వెళ్లి పరిచయం చేసుకున్నాను.అప్పుడే హటాత్తుగా గుర్తొచ్చినట్లు నటిస్తూ -'అవునవును మీరు నాకు తెలుసు ఇంతకు ముందు కలిశాం కదా' అని అన్నాడు.కానీ ఆయన కళ్ళలో మెదిలిన ఒక విధమైన తిరస్కారభావాన్ని నేనూ నాతోబాటు చరణూ గమనించనే గమనించాము.

బహుశా ఈయన నా బ్లాగు చదివి ఉంటాడని నాకనిపించింది.ఎందుకంటే నిర్మొహమాటంగా ఉన్న సత్యాన్ని ఉన్నట్లు వ్రాసే ధోరణివల్ల నాకు ఆధ్యాత్మిక శత్రువర్గం చాలానే ఏర్పడింది.చాలామంది కల్ట్ గురువుల శిష్యులకు నేనంటే చాలా కోపమని కూడా నాకు తెలుసు.నాకు తెలిసినా సరే,వాళ్ళ స్థాయి ఏమిటో చూడటం కోసం వాళ్ళను కదిలించి మాట్లాడుతూ ఉంటాను.అప్పుడు వారిచ్చే రియాక్షన్ బట్టి వాళ్ళు చెబుతున్నది నిజంగా ఆచరిస్తున్నారా లేక ఊరకే మాటలు చెప్పడమేనా అనే విషయం నాకు వెంటనే తెలిసిపోతూ ఉంటుంది.అదీగాక వీరి మెప్పు కోసం నేను సత్యాన్ని త్యాగం చెయ్యలేను.

ఆయన్ని అక్కడే వదిలేసి,కొద్దిసేపు రెస్ట్ తీసుకుందామని గదికి బయలు దేరాము.

చరణ్ కు పాత జ్ఞాపకాలు గుర్తొచ్చాయి.ఏవేవో సంగతులు మాట్లాడటం మొదలు పెట్టాడు.

'అప్పట్లో ఎంతమంది పెద్దపెద్ద వాళ్ళు ఇక్కడకు వచ్చేవారన్నగారు?ఒకరోజు బీ.డీ.జెట్టి వచ్చారు.ఇదిగో ఈచెట్టు దగ్గరే ఫలానా ఆయన ఇసుకలో నేలమీద కూచున్నాడు.ఇక్కడే ఫలానావాళ్ళు రోజూ బ్యాట్మింటన్ ఆడేవాళ్ళు.'- అంటూ ఆరోజులలోకి వెళ్ళిపోయాడు.

అరవిందుల భక్తుడైన 'శ్రీనివాస అయ్యంగార్' ఒకరోజున అమ్మ దర్శనం కోసం వచ్చాడు.హాల్లో ఆయన ధ్యానానికి కూచున్నాడు.ఎంతసేపటికీ లేవడు కళ్ళు తెరవడు.ఆరోజు బూజులు దులపాలని పని పెట్టుకున్నారు.ఈయనేమో ఎంతకీ ధ్యానంలో నుంచి లేవడు.అందుకని ఏం చెయ్యాలంటూ అమ్మను అడిగితే అమ్మ ఒకపెద్ద దుప్పటిలాంటి తెల్లగుడ్డ తెప్పించి ఆయనమీద కప్పించి అప్పుడు బూజులు దులపమన్నది.ఆ దుప్పటి కప్పిన సంగతి కూడా ఆయనకు తెలియదు.అలాగే తదేకంగా ధ్యానంలో ఉన్నాడు.బూజులు దులిపి ఆ దుప్పటి తొలగించిన తర్వాతకూడా శరీరస్పృహ లేకుండా ధ్యానంలోనే ఉన్నాడు.

'మా నాన్నగారు ఇక్కడకు వచ్చిన మొట్టమొదటి భక్తులలో ఒకరన్నగారు. అది దాదాపు 1957 ప్రాంతాలని అనుకుంటాను.అప్పట్లో మా నాన్నగారూ ఇంకా ముగ్గురూ కలసి అమ్మ గురించి విని,నమ్మకం లేక,ఇలాంటి వాళ్ళవల్లే మన మతం పాడైపోతున్నదన్న ఆవేశంలో అమ్మతో వాదించాలని చీరాల నుంచి నడిచి ఇక్కడకు వచ్చారు.అప్పట్లో ఈ ఊరికి దారికూడా లేదు.పొలాల గట్లమీదనుంచి నడుచుకుంటూ రావాలి.మా నాన్నగారు కాళికాదేవి భక్తుడు. అప్పట్లోనే ఇంట్లో కాళికాదేవి పటం ఉంచి నిత్యం పూజ చేసేవాడు.' అన్నాడు చరణ్.

'మీది హరితస గోత్రమనీ మీ పూర్వీకులలో అక్కన్న మాదన్నలూ రామదాసూ ఉన్నారని ఒకసారి నీవే చెప్పినట్లు గుర్తు.మీరు రామభక్తులు కదా?మరి మీ నాన్నగారికి కాళికా ఉపాసన ఎలా వచ్చింది?' నేనడిగాను.

'ఏమో తెలియదన్నగారు? మధ్యలో ఎలా వచ్చిందో నాకూ తెలియదు.కానీ మా నాన్నగారు కాళికాపూజ చెయ్యడం నేను చూచాను.' అన్నాడు చరణ్.

'ఆ తర్వాతేం జరిగింది?'-అడిగాను.

"ఏముంది?ముగ్గురూ అమ్మతో వాదించి అమ్మ బండారం బయట పెట్టాలని వచ్చారు.మా నాన్నగారు అమ్మ పాదాలను తాకిన వెంటనే కరెంట్ షాక్ కొట్టినట్లు అయ్యి వెనక్కు పడిపోయారు.అలా చాలాసేపు పడి ఉన్నారు.లేచిన తర్వాత ఇంక వాదనా లేదు ఏమీ లేదు.టోటల్ సరెండర్ అయిపోయారు.

'చలంగారూ మా నాన్నగారూ మంచి స్నేహితులు.అమ్మగురించి అరుణాచలం లో ఉన్న చలంగారికి చెప్పింది మా నాన్నగారే.' అన్నాడు చరణ్.

'మీ నాన్నగారికి చలంగారు ఎలా పరిచయం?' అడిగాను.

'మా నాన్నగారు ఏలూరులో ఉండే రోజులలో చలంగారు అక్కడ పని చేసేవారు.అక్కడ లిటరరీ సర్కిల్స్ లో చలంగారూ చింతా దీక్షితులుగారూ మానాన్నగారికి పరిచయం.చలంగారికంటే మా నాన్నగారు చిన్న.అందుకని బాగా చనువుగా ఉండేవారు.అప్పట్లో ఏర్పడిన పరిచయం చలంగారు చనిపోయేవరకూ కొనసాగింది.అన్నగారు మీకోసంగతి తెలుసా?చలంగారు ఎంత రివల్యూషనరీ అంటే ఆయన ఏలూరులో ఉన్నపుడు చీర కట్టుకుని బజార్లో తిరిగేవాడు.' అన్నాడు చరణ్.

'అవునా? అదేంటి?'- అడిగాను ఆశ్చర్యంగా.

'చీరంటే ఆడవారిలా కట్టుకుని కాదు.చీరనే మడిచి లుంగీలాగా కట్టుకుని పైన బనీను ధరించి వీధుల్లోకి వచ్చి తిరిగేవాడు.' అన్నాడు చరణ్.

నవ్వాను.

'అవును.చలంగారిలో అనేక కోణాలున్నాయి.ఆయనలో ఒకవైపున గొప్ప ఆధ్యాత్మిక చింతన ఉండేది.ఇంకోవైపు మంచి రసికత్వం ఉండేది.ఇంకొక వైపు స్త్రీలంటే గొప్ప సానుభూతి ఉండేది.ఇంకోవైపు సమాజపు కుళ్ళంటే అసహ్యమూ తిరుగుబాటు ధోరణీ ఉండేవి.ఇవన్నీ ఆయన రచలనలో ప్రతిబింబిస్తాయి.'అన్నాను.

'మీరు చలంగారి రచనలు అన్నీ చదివారా?'అడిగాడు.

'చదివాను.పాతికేళ్ళ క్రితం బళ్లారిలో 'లా' చదివే సమయంలో అక్కడి లైబ్రరీలో కూచుని చదివాను.' అన్నాను.

'మైదానం చదివారా?' అడిగాడు.

'చదివాను.అప్పట్లో ఆ పుస్తకం చాలా సంచలనం రేపిందట.మనకూ తెలీదు.మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పటి విషయం అది.' అన్నాను.

'అవునన్నగారు.ఆరోజుల్లో అదొక సెక్స్ నవలగా భావించి దాన్ని తెగ విమర్శించారట.కానీ అలా విమర్శించిన వారే దిండ్ల క్రింద దాచుకుని మరీ దాన్ని చదివేవారట.అప్పట్లో అంతటి హిపోక్రసీ సమాజంలో ఉండేది.' అన్నాడు చరణ్ నవ్వుతూ.

"అవును మరి.మొగుడు నచ్చకపోతే ఎవడితోబడితే వాడితో లేచిపొమ్మని వ్రాస్తే ఎంత తప్పు? నూటికి నూరుపాళ్ళు నచ్చే మొగుళ్ళు ఎక్కడుంటారు అప్పుడైనా ఇప్పుడైనా?" అన్నాను నవ్వుతూ.

'మరి భర్తల సంగతేమిటి అన్నగారు?వాళ్లకు భార్యలు నచ్చకపోతే తన ఇష్టం వచ్చిన ఆడదానితో లేచిపోవచ్చా? ఆ సంగతి ఎవరూ మాట్లాడరేం?' ప్రశ్నించాడు చరణ్.

'మగవాడికి లేచిపోవలసిన అవసరం ఏముంది చరణ్?వాళ్ళ సెటప్ లు వాళ్లకుంటాయి కదా.అప్పటి సమాజంలో ఉన్న పరిస్థితులు వేరు.అది పురుషాధిక్య సమాజం. అప్పట్లోకూడా ఇప్పుడులాగే చాలామంది మగవాళ్ళకు పెళ్ళైన తర్వాత కూడా అక్రమ సంబంధాలుండేవి.కొంతమంది బాగా డబ్బున్న మహారాజులు ఏకంగా రెండుమూడు సంసారాలే ఒకేసారి నడిపేవారు.మగవాడి సరదాలు బాగానే తీరేవి.మళ్ళీ అందరూ కదిలిస్తే మహానీతి కబుర్లు చెప్పేవారు.ఏ రకంగా చూచినా ఆడవాళ్లే బాధితులు.వాళ్ళు వంటింటికీ పడకటింటికీ పరిమితమై మొగుడు తిట్టినా కొట్టినా,వాడికి అక్రమ సంబంధాలున్నాయని తెలిసినా పరువుకోసమో పిల్లలకోసమో ఏమీ చెయ్యలేక చచ్చినట్లు ఆత్మను చంపుకుని పడి ఉండేవాళ్ళు.ఇది చలానికి నచ్చేది కాదు.

మన సోసైటీలోని హిపోక్రసీని ఆయన తన రచనలలో తూర్పారబట్టి పారేశాడు. మగవాడు చేస్తే రైటూ ఆడది చేస్తే తప్పూనా?ఆడది తప్పుచేస్తే శీలం పోయింది అంటారు.మరి మగవాడికి శీలం ఉండదా?ఉండవలసిన అవసరం లేదా? అని ఆయన ప్రశ్నించాడు.అదే అప్పటి దొంగ సమాజానికి నచ్చలేదు.అందుకని ఆయనకు బూతు రచయిత అని ముద్రవేశారు.' అన్నాను.

'చలంగారిది విలక్షణమైన ఉన్నతమైన మనస్తత్వమే అన్నగారు.' అన్నాడు చరణ్.

"అవును చరణ్.లేకుంటే సౌరిస్ లాంటి మహనీయురాలు ఆయనకు ఎలా పుడుతుంది?చలంగారు పరమ స్వేచ్చావాది.ఆయనకు ఏ కట్టుబాట్లూ నచ్చేవి కావు.అది సామాజికం కావచ్చు.ఆధ్యాత్మికం కావచ్చు.రసికత్వం కావచ్చు.మనిషిని సంకెళ్ళలో బంధిస్తే ఆయనకు నచ్చదు.ఆయనకు ప్రతిదానిలోనూ ఫ్రీడం కావాలి.మనిషనేవాడు ఏ కట్టుబాట్లూ లేకుండా ఆకాశంలో పక్షిలాగా స్వేచ్చగా ఎగురుతూ ఉండాలని ఆయన భావించేవాడు. దానికి కారణమేమిటో తెలుసా?' అడిగాను.

'తెలియదు' అన్నట్లు చూచాడు చరణ్.

'ఆయనపైన చిన్నప్పుడు బ్రహ్మసమాజ భావాలుండేవి.రఘపతి వెంకటరత్నం నాయుడుగారి దగ్గర ఈయన చదువుకున్నాడు.కందుకూరి వీరేశలింగంపంతులూ,రఘుపతి వెంకటరత్నం నాయుడూ వీళ్ళిద్దరూ అప్పట్లో రాజా రామ్మోహన్రాయ్ భావాలకు ప్రభావితులై సంఘాన్ని సంస్కరించాలని చాలా ప్రయత్నించారు.చిన్నప్పుడు పడిన బీజాలు ఎప్పటికీ పోవంటారు కదా.అదే ఈయనకూ జరిగింది.అందుకే జీవితాంతమూ అలా సంఘసంస్కర్త గానే ఉండిపోయాడు.సమాజంతో నిత్యం ఘర్షణ పడేవాడు.అంతేకాదు. చలంగారు చిన్నప్పుడు సంధ్యావందనం అదీ శ్రద్ధగా నేర్చుకుని గాయత్రీజపం చేసేవాడు.ఈ సంగతి తెలుసా నీకు?' అడిగాను.

'తెలీదన్నగారు' అన్నాడు చరణ్.

మాటల్లోనే అందరం రూమ్ కి చేరుకున్నాము.ఆడవాళ్ళు ఒకగదిలో విశ్రాంతి తీసుకుంటుంటే ఇంకొక రూమ్ లో మేము ముగ్గురం కూచుని చర్చను కొనసాగించాం.

'మరి అవన్నీ మధ్యలోనే ఎందుకు వదిలేశాడన్నగారు చలంగారు?- అడిగాడు చరణ్.

'అసలు విషయం చెప్పనా?ఆయన ఒకానొక పూర్వజన్మలో ముస్లింగా ఉన్నాడు చరణ్.ఈ జన్మలో సాంప్రదాయ బ్రాహ్మణవంశంలో పుట్టాడు.అందుకే ఆ రెండురకాల విరుద్ధ భావాల మధ్యన నలిగిపోయాడు.' అన్నాను.

'నిజమా?' వింటున్న చరణూ మదనూ ఆశ్చర్యపోయారు.

'అవును.ఈ విషయం ఆయనకూ తెలుసు.తన చివరిదశలోని రచనలలో ఈ విషయాన్ని ఆయన ప్రస్తావించాడు కూడా.' అన్నాను.

'ఈ విషయం ఆయన ఎలా తెలుసుకున్నాడన్నగారు?అంటే సాధనా శక్తితోనా?' అడిగాడు చరణ్.

'లేదు తమ్ముడూ.ఆయనకంత సాధనాశక్తి లేదు.ఈ విషయాన్ని ఆయన సౌరిస్ గారి ద్వారా తెలుసుకున్నాడు.'

'పూర్వజన్మలలో ఆయనెవరో ఎక్కడైనా చెప్పాడా అన్నగారు?' అడిగాడు.

'స్పష్టంగా చెప్పలేదుగాని తన గతజన్మ ఒక ముస్లిం రాయల్ ఫేమిలీలో జరిగింది అని చూచాయగా ఒకచోట వ్రాశాడు.' అన్నాను.

"నిజమా" చరణ్ మళ్ళీ అన్నాడు.

'అవును.నా నమ్మకం చెప్పనా?షాజహాన్ కొడుకైన దారాషికోయే చలంగా పుట్టాడని నా నమ్మకం.నా ఈ నమ్మకానికి వ్యక్తిగత ఆధారాలు నాకున్నాయి. ఎందుకంటే దారాకు మన సాంప్రదాయమన్నా మన గ్రంధాలన్నా చాలా ఇష్టం ఉండేది.కొన్ని ఉపనిషత్తులను ఆయన అరబ్బీలోకీ పార్శీలోకీ అనువాదం కూడా చేశాడు.బలమైన అప్పటి సంస్కారాలు ఆయన్ను వదలలేదు.అందుకే సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినప్పటికీ ఆయనకు అన్నీ నవీన భావాలుండేవి.చాదస్తాన్ని ఆయన దూరంగా ఉంచేవాడు.విగ్రహారాధన చేసేవాడు కాదు.కానీ మౌలికమైన ఆధ్యాత్మికత అంటే ఆయనకు ఇష్టం ఉండేది.

దారాషికో అసలైన ఆధ్యాత్మికవాది.ఆయన సర్మదూ,మియాన్ మీర్ల శిష్యుడు. వీరిద్దరూ అప్పటి కాలపు సూఫీ సాధువులు.దారాషికో డిల్లీ సింహాసనాన్ని అధిష్టించకుండా ఔరంగజేబు దానికి అర్హుడు కావడం మన దేశచరిత్రలో ఒక పెద్ద అపశ్రుతి తమ్ముడూ.పటేల్ ప్రధాని కాకుండా నెహ్రూ అయినట్లన్నమాట.

అతని సోదరి జహానారాకు దారా అంటే చాలా ఇష్టం ఉండేది.కానీ ఆమె నిస్సహాయురాలు.రోషనారా కుట్రల ముందు ఆమె ఏమీ చెయ్యలేకపోయింది. చివరకు ఔరంగజేబ్ కుట్ర ఫలితంగా దారాషికోకు శిరచ్చేదం చెయ్యబడుతుంది. ఆరోజున డిల్లీ వీధులలో ఏడవని పౌరుడు లేడని చరిత్రకారులు వ్రాశారు. దారాషికో అంత మంచివాడు.

దారాషికో ముందు ఔరంగజేబు ఎందుకూ పనికిరాడు.దారాషికో ఎంతో విశాలభావాలు కల్గిన నిజమైన ఆధ్యాత్మికుడు.కానీ ఔరంగజేబ్ ఎలాంటి క్రూరుడో మత ఉగ్రవాదో నీకు తెలుసుకదా.దారా గనుక డిల్లీగద్దె పైన కూర్చుని ఉంటే మన దేశచరిత్ర ఇంకోవిధంగా ఉండి ఉండేది.కానీ ఏం చేస్తాం?ఔరంగజేబు అధికార దాహానికి దారా బలైపోయాడు.

జహనారాయే సౌరిస్ గా పుట్టిందని నా నమ్మకం.ఈ విషయాలన్నీ రమణమహర్షికి తెలుసు.ఆయన సౌరిస్ ను ఎప్పుడూ ప్రత్యేకంగానే చూచేవాడు.భారత రాష్ట్రపతి వచ్చినా తలతిప్పని ఆయన సౌరిస్ కనిపిస్తే మాత్రం చిరునవ్వు నవ్వేవాడు.చలం రమణాశ్రమానికి వెళ్ళడానికి కూడా సౌరిస్సే కారణం.పరిణామక్రమంలో సౌరిస్ ఒక ఉన్నత తరగతికి చెందిన ఆత్మ అన్న విషయం మహర్షికి తెలుసు.

"సౌరిస్ గారిని నీవు దర్శించావా?ఆమె ఎప్పుడూ ఒక ముస్లిం వేషంలో ఉండేది.అంటే బురఖా కాదు.ఒక వల్లెవాటు వేసుకుని అదొక విధమైన డ్రస్సులో చూడగానే ముస్లిం అనిపించేటట్లు ఉండేది.ఆమె చుట్టూ కూడా చాలా కుక్కలుండేవి." 

ఇక్కడ ఇంకో లింక్ చెప్పనా?ముస్లిం అయిన వజీర్ రెహ్మాన్ ను చలం తన అల్లుడిగా చేసుకున్నాడు.చలం వేషంకూడా ముస్లింలాగే ఉండేది.ఒక లుంగీ ఒక బనీనూ అంతే ఆయన డ్రెస్సు.గడ్డం పెంచుకొని ఉండేవాడు.ఆయన మనస్సు విగ్రహారాధన కంటే కూడా అద్వైత వేదాంతపు నిరాకారోపాసన వైపు ఆయన్ను లాగుతూ ఉండేది.వజీర్ పూర్వజన్మలో అక్బర్ పాదుషా కొడుకైన సలీం అని చలం నమ్మాడు.

ఆయన బ్రాహ్మడై ఉండికూడా మాంసం తినేవాడు.ఆయనకు చాలాకాలం బాధించిన తలనొప్పి (మైగ్రేన్) ఉండేది.బలం రావడం కోసం పావురం మాంసం కూడా తినేవాడు.తనకు వచ్చిన పక్షవాతం తగ్గడానికి పావురం రక్తం ఒంటికి పూసుకునేవాడు.ఒకసారి చింతాదీక్షితులు గారు ఆయన్ను చూడటానికి రమణస్తాన్ కు వెళతాడు.అప్పుడు ఈయన కూచుని మాంసం తింటూ కనిపిస్తాడు.పరమనిష్టాపరుడైన చింతా దీక్షితులుగారు అది చూచి కూడా ఏమీ అనకుండా ఉండేవాడు.'మరువలేని మిత్రుడు' అనే పుస్తకంలో ఆయన గురించి చలం ఎంతో ఇదిగా వ్రాస్తాడు.

ఆయనకు ప్రియురాళ్ళు కూడా అధికంగానే ఉండేవారు.తనకు కామం చాలా ఎక్కువన్న విషయాన్ని ఆయన పాపం దాచుకోవాలని ఎక్కడా చూడలేదు. ఓపెన్ గానే చాలా చోట్ల ఈ విషయాన్ని వ్రాశాడు.అదే ఆయనలోని నిజాయితీ.ఆయనలో హిపోక్రసీ అనేది ఎక్కడా లేదు.అది అత్యుత్తమ లక్షణం.మహనీయులు ఒక మనిషిలోని ఇలాంటి లక్షణాలనే గమనిస్తారు గాని డబ్బునీ హోదానీ చూడరు.

విజయవాడలో ఉన్న రోజులలో చలం పెనమలూరు రోడ్డులో ఉన్న మాలపిచ్చమ్మను చూడటానికి అప్పుడప్పుడూ వెళ్ళేవాడు.ఆమె ఒక అవధూత.నగ్నంగా రోడ్డుమీద దుమ్ములో కూచుని ఉండేది.చలాన్ని ఆమె దగ్గరగా తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకునేది.నాస్తికుడని లోకం అనుకునే చలం ఆమెలోని దైవత్వాన్ని అప్పట్లోనే గుర్తించాడు.ఇప్పుడంటే ఆమెకు గుడి ఉన్నది.అప్పట్లో ఒక పిచ్చిదాని లాగా ఆమె తిరుగుతూ ఉండేది.నీవు ఆమె ఫోటో చూచావా?' అడిగాను.

'లేదన్నగారు' చెప్పాడు చలం.

'నేను చూచాను.ఆమె పేరుకు మాలపిచ్చమ్మ అయినా ముఖంలో బ్రాహ్మణకళ ఉట్టిపడుతూ ఉంటుంది.ఒకరోజున ఆమె చలాన్ని నుదుటిమీద ముద్దుపెట్టి 'కనుబొమల మధ్యన నీకేమైనా వెలుగు కనిపించిందా?' అని అడిగింది.చలం లేదన్నాడు.ఆమె నిరాశగా చూస్తూ -'ఈ జన్మ ఇంతేరా నీకు. వచ్చే జన్మలోనే నీకు దొరుకుతుంది.ఈ జన్మకు కాదు.' అన్నది.

వింటున్న చరణ్ ఇలా అన్నాడు.

"చలంగారు అవసానదశలో ఉన్నప్పుడు మా నాన్నగారి ద్వారా జిల్లెళ్ళమూడి అమ్మగురించి విని అమ్మను చూడాలని ఉందని ఉత్తరం వ్రాశాడు.అప్పుడు మా నాన్నగారు చలం గురించి అమ్మకు చెప్పాడు. అమ్మకు కూడా ఆరోగ్యం బాగాలేదు.కదిలే పరిస్థితి కాదు.అయినా సరే అమ్మ బయల్దేరి అరుణాచలం వెళ్ళింది.అమ్మ వెంట అందరూ ఒక బస్సులో బయల్దేరారు.

అమ్మను చూచిన చలం కదిలిపోయి ఏడ్చాడు."ఇప్పటిదాకా ఎవరైనా, ఏడిరా నీ ఈశ్వరుడు? అనడిగితే నేనేమీ చెప్పలేకపోయేవాడిని.కానీ ఇప్పుడు చెప్పగలను ఇదుగో ఇన్నాళ్ళూ నేనారాధించిన ఈశ్వరుడు-" అని అమ్మను చూపిస్తూ అన్నాడు చలం.

అంతేకాదు."అమ్మా నేను ముసలివాడినై పోయి కదలలేని స్థితిలో ఇక్కడ పడి ఉన్నాను.నా మీద దయతో ఇంతదూరం నీవే వచ్చావా?" అని కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు.

"అవును తమ్ముడూ.చలం బైటకు ఒక విప్లవవాది లాగా కనిపించేవాడు కానీ లోపల ఒక పసిపిల్లవాడు.అంత నిర్మలమైన మనస్తత్వం అతనిది. అందుకే ఎంత గొప్పవారు తన దర్శనం కోసం వచ్చినా చలించని అమ్మ తనంత తానుగా అతన్ని వెదుక్కుంటూ వెళ్ళింది.మహనీయుల చర్యలు ఇలాగే ఉంటాయి.ఇంకో సంగతి తెలుసా?"

"ఏంటది అన్నగారు?"

"చలం మొదటిసారి రమణమహర్షిని చూచినప్పుడు ఏమైందో తెలుసా?చలం సిగిరెట్టు తాగుతూ స్కందాశ్రమానికి పోయే దారిలో నిలబడి ఉన్నాడు.మహర్షి కొండ దిగి వస్తున్నారు.'మహర్షి వస్తున్నారు.దారివ్వండి' అని అందరూ తప్పుకుంటున్నారు.చలం దారివ్వకపోగా 'ఆయనకు అవసరమైతే ఆయనే తప్పుకొని పోతాడులే.నేనెందుకు దారివ్వాలి?' అన్నట్లు దారిలో అడ్డంగా నిలబడి సిగిరెట్టు తాగుతున్నాడు.

మహర్షే చలాన్ని తప్పుకొని అవతలకు వెళ్లి ఒక్క క్షణం ఆగి వెనక్కు తిరిగి చలం వంక చూచారు.ఆ చూపులో ఏముందో గాని చలం చేతిలోని సిగిరెట్టు దానంతట అదే కింద పడిపోయింది.

మహర్షిలో ఏం గొప్పతనం ఉందో చలానికి మొదట్లో అర్ధమయ్యేది కాదు.' ఆ గోచీ ఏమిటి? ఆ అవతారం ఏమిటి? కేబరే డాన్సర్ లాగా? అందవికారంగా ఉన్న ఆయనలో ఏముందని మీరంతా అలా ఎగబడుతున్నారు?" అని అందరితోటీ అనేవాడు.

కానీ క్రమేణా చలంలో గొప్ప మార్పు వచ్చింది.అతని మనస్సులో నిరంతరం మహర్షే ఉండేవాడు.ఆయన గురించే మాట్లాడేవాడు.ఆయన్నే ధ్యానించేవాడు. మహర్షి పోయాక ఆశ్రమం ఖాళీ అయిపోయింది.ఎక్కడివారు అక్కడే వెళ్ళిపోయారు.మన జనాలవి ప్రాధమికంగా బానిస మనస్తత్వాలు.మనకు తెలిసింది వ్యక్తిగత ఆరాధన మాత్రమే,విలువల ఆరాధన కాదు.కానీ అందరూ వ్యసనపరుడు అనుకునే చలంమాత్రం ఎక్కడికీ పోలేదు.అక్కడే అంటి పెట్టుకుని ఉండిపోయాడు.చూచావా చలం కమిట్ మెంట్? అదీ అసలైన వ్యక్తిత్వం అంటే.

ఆశ్రమం అంతా ఖాళీ అయిపోతే చలం ఒక్కడే మహర్షి సమాధి దగ్గర దిగులుగా కూచుని ఉండేవాడు.అదీ అతని ప్రేమ.ఆ ప్రేమే అతని జీవితానికి ఔన్నత్యాన్ని ప్రసాదించింది. అతనిలో గొప్ప మార్పును తీసుకొచ్చింది. భగవద్గీతలో ఏముంది అని ఒకప్పుడు విమర్శించిన చలం 1964 లో భగవద్గీతకు వ్యాఖ్యానం వ్రాశాడు. నేను ఎందఱో వ్రాసిన గీతావ్యాఖ్యానాలు చదివాను.కాని అన్నిట్లోకీ చలం వ్యాఖ్యానం 'ది బెస్ట్' అని నేనంటాను.

ఊకదంపుడు సోదీ పిట్టకధలూ లేకుండా విషయాన్ని ఉన్నదున్నట్లు సూటిగా స్పష్టంగా సింపుల్ గా చలం వ్రాస్తాడు.అదీ ఆయన శైలిలోని ప్రత్యేకత.ఆయన రచనలు చదువుతుంటే ఆయన మనతో మాట్లాడుతున్నట్లే ఉంటుంది.ఆ మాటలు హృదయానికి హత్తుకుంటాయి.ఆత్మలోకి చొచ్చుకుని పోతాయి.చదివేవారిని కదిలిస్తాయి.

కానీ నేడు ఎవరూ చలం వ్రాసిన గీతావ్యాఖ్యానం చదవడం లేదు.అసలు చాలామందికి ఈ విషయమే తెలియదు.మన జనాలకు నకిలీవి నచ్చినట్లు అసలువి నచ్చవుకదా.ఈ నకిలీ లోకంలో ఇది మామూలే." అన్నాను.

(ఇంకా ఉన్నది)