“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

6, మార్చి 2014, గురువారం

నరేంద్ర మోడీ జాతకం -3 (జననకాల నిర్ధారణ-భవిష్యత్తు)

నరేంద్రమోడీ జాతకం మొదటిభాగంలో మూడు జనన సమయాలు మనకు లభించాయి. అవి ఉదయం 10.11,ఉదయం 11.00,మధ్యాహ్నం 12.21. వీటిలో ఏది సరియైన జననసమయమో మనం ఇప్పుడు లెక్కించాలి.ఒకవేళ మూడూ కాక అసలైన సమయం ఇంకొకటి కూడా ఉండవచ్చు.దాన్నీ త్రోసి పుచ్చలేము. కాని ప్రస్తుతం మనకు లభిస్తున్న వివరాలు మూడేగనుక వీటిలో ఏదైనా ఆయన జీవితవివరాలతో సరిగ్గా సరిపోతుందా అన్న విషయం మాత్రమే ప్రస్తుతానికి చూద్దాం.

మొదటిభాగంలో చేసిన విశ్లేషణతో ఉదయం 10.11 అనే సమయం సరియైనది కాకపోవచ్చన్న అనుమానం మనకు కలిగింది.ఎందుకంటే ఎదురుగా కనిపిస్తున్న విషయాలతో అది సరిపోవడం లేదుగనుక.అయినా సరే దానినికూడా వదలకుండా శోధించి చూద్దాం.ఒకవేళ మనం ఏదైనా పొరపాటు చేసి ఉండవచ్చు కనుక ఎప్పుడూ డబల్ చెకప్ చెయ్యడం అనేది జ్యోతిష్యంలో చాలా మంచిది.ఒకే విషయాన్ని మూడునాలుగు కోణాలలో నిర్ధారణ చేసుకున్న తర్వాతనే ఫలితాలను చెప్పడం వల్ల సత్యానికి బాగా దగ్గరగా రాగలుగుతాము.

మోడీ జీవితంలోని కొన్ని ముఖ్యఘట్టాలతో సమయాలను పోల్చిచూచి వీటిలో ఏది సరియైన జననసమయమో లెక్కించాలి.ఆయన జీవితంలోని కొన్ని ప్రధానఘట్టాలతో విశ్లేషణ మొదలుపెడదాం.

జననకాలనిర్ధారణ అనేది జ్యోతిష్యశాస్త్రంలో చాలా ఆసక్తికరమైన అంశం. ఎందుకంటే దీనిలో ఇండక్టివ్ మరియు డిడక్టివ్ లాజిక్ చాలా షార్ప్ గా ఉపయోగించాలి.ఒకే అంశాన్ని ఎన్నో కోణాలనుంచి పరిశీలించాలి.ఎన్నో విషయాలను ఒకచోటికి కేంద్రీకరించాలి.పనికిరానివాటిని తొలగిస్తూ జల్లెడ పడుతూ పోవాలి.ఈ క్రమంలో మన ఈగోనూ మన ఇష్టాఇష్టాలనూ పక్కన పెట్టి పరిశీలించాలి.అప్పుడే ఇది సాధ్యం అవుతుంది.అప్పుడే దాగిఉన్న సత్యం దర్శనమిస్తుంది.

ఇది ఒక క్రాస్ వర్డ్ పజిల్ పూర్తిచెయ్యడమో లేక ఒక రూబిక్స్ క్యూబ్ ను సెట్ చెయ్యడమో లాంటిది.కాకపోతే జరిగిన సంఘటనలు మన కళ్ళ ఎదురుగా ఉన్నాయి గనుక వాటి ఆధారంతో ఈపనిని చెయ్యడం జరుగుతుంది.ఇదొక మంచి మేధాపరమైన వ్యాయామం అని చెప్పవచ్చు.

గణితాన్నీ,తర్కాన్నీ,జ్యోతిష్యసూత్రాలనూ,సైకాలజీనీ,పేరాసైకాలజీనీ,శకునశాస్త్రాన్నీ,జరిగిన సంఘటనలనూ కలగలుపుకుంటూ సమగ్రదృష్టితో ఈ పనిని చెయ్యవలసి ఉంటుంది.  

మొదటి సంఘటన

1987 శుక్రదశ మొదలు కావడంతోనే రాజకీయరంగంలో అడుగుపెట్టాడు.

10.11--శుక్ర/శుక్రదశ జరిగింది.శుక్రునికి అమాత్య కారకత్వం ఉన్నది. ఈసమయానికి తులాలగ్నం వస్తుంది గనుక లాభంలో ఉన్నాడు.సరిపోతుంది.

11.00--అప్పుడు శుక్ర/శుక్ర మరియు శుక్ర/రవిదశలు జరిగాయి.శుక్రునికి అమాత్యకారకత్వం ఉన్నది. సమయం వృశ్చిక లగ్నాన్ని ఇస్తుంది గనుక దశమంలో ఉన్నాడు.రవి దశమాదిపతి.బాగా సరిపోతుంది.

12.21-శుక్ర/రవి,శుక్ర/చంద్ర దశలు జరిగాయి.ఇవీ బాగానే సరిపోతున్నాయి.

రెండవ సంఘటన

1998 లో బీజేపీ పార్టీకి జెనరల్ సెక్రటరీ అయ్యాడు.

10.11--శుక్ర/శుక్రదశ జరిగింది.శుక్రునికి అమాత్య కారకత్వం ఉన్నది. లాభంలో ఉన్నాడు.సరిపోతుంది.

11.00--అప్పుడు శుక్ర/గురు, శుక్ర/శనిదశలు జరిగాయి.సరిపోతాయి.

12.21--శుక్ర/శనిదశ జరిగింది.సరిపోతుంది.

సంవత్సరాల సాయంతో పరిశీలిస్తే సరిగ్గా నిర్ధారణ చెయ్యలేము.ఎందుకంటే అప్పుడు మూడు సమయాలూ దాదాపుగా సరిపోతున్నాయి.కనుక కొన్ని ప్రత్యెకతేదీలు తీసుకుని పరిశీలిద్దాం.అప్పుడు మన వెదుకులాట ఒక్కచోటికి కేంద్రీకరింప బడుతుంది.విషయంలో క్లారిటీ వస్తుంది.

మూడవ సంఘటన

7-10-2001 ఆయన మొదటిసారిగా గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యాడు

10.11 సమయానికి లగ్నం తుల అవుతుంది.అప్పుడు శుక్ర/శని/కుజదశ జరుగుతున్నది.శుక్ర శనులు లగ్నానికి యోగకారకులే.లాభస్తానంలో ఉన్నారు.కాని కుజుడు మంచివాడు కాడు.దశమాధిపతి అయిన చంద్రుని పాత్ర ఇందులో ఏమీ లేదు.కుజ శుక్ర శనులదశ లగ్నానికి అధికార యోగాన్నివ్వదు.కనుక సమయం సరియైనది కాదు.

11.00 సమయం వృశ్చికలగ్నాన్నిస్తుంది.శుక్ర/శని/గురుదశ జరిగింది. శుక్రశనులు దశమంలో ఉన్నారు.గురువు చతుర్దంలో ఉండి దశమాన్ని చూస్తున్నాడు.ఈయనకు శని ఆత్మకారకుడనీ శుక్రుడు అమాత్యకారకుడనీ మనకు తెలుసు.ఆత్మ,అమాత్యకారకులు దశమంలో కలవడం రాజయోగాన్ని ఇస్తుంది.సుఖస్థానంలోని గురుదృష్టి శుభాన్ని కలుగజేస్తుంది. కనుక సమయం సరియైనది కావచ్చు.

12.21 ఇదీ వృశ్చికలగ్నాన్నే ఇస్తుంది.శుక్ర/బుధ/శుక్ర దశ సమయంలో జరిగింది.శుక్రుడు దశమంలో ఉన్నప్పటికీ బుధుడు లగ్నసంధిలో పడి ఉన్నాడు.పైగా అష్టమాధిపతిగా లగ్నానికి మంచివాడు కాడు.పైగా వక్రించి ఉన్నాడు.కనుక ఎలా చూచినా సమయం ఉన్నత పదవినీ రాజయోగాన్నీ ఇచ్చే సమయం కాదు.

నాలుగవ సంఘటన

27-2-2002 గోద్రా సంఘటన జరిగింది. సమయంలో ఏఏ దశలు జరిగాయో చూద్దాం.

10.11-- తులాలగ్నం.శుక్ర/శని/గురుదశ జరిగింది. రకంగా చూచినా అటువంటి భయంకరమైన సంఘటన జరిగే సూచనలు లేవు.

11.00--వృశ్చికలగ్నం.శుక్ర/బుధ/బుధదశ జరిగింది.శుక్రుని దశమస్థితి వల్లా, పైన వివరించిన బుధుని కారకత్వాలవల్లా ఒక ఘోరసంఘటన జరగడమూ దానివల్ల వృత్తిలో చెడ్డపేరు వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి.

12.21--వృశ్చికలగ్నం--శుక్ర/బుధ/కుజదశ జరిగింది.పైదశ కంటే ఇది తేలిపోయింది.దీనిప్రకారం ఆయనకే ఏదైనా వ్యక్తిగతప్రమాదం జరగాలి.లేదా పదవికి గండం రావాలి.పదవికి గండం వచ్చినప్పటికీ ఆయనకేమీ వ్యక్తిగత ప్రమాదం జరగలేదు.కనుక సమయం కాకపోవచ్చు.

పై విశ్హ్లేషణ వల్ల ఉదయం 11.00 సమయమే సరియైన సమయం అని అనిపిస్తున్నది.ఇక మిగిలిన రెండు సమయాలనూ పక్కన పెట్టి సమయానికే మిగిలిన సంఘటనలు సరిపోతాయో లేదో చూద్దాం.

అయిదవ సంఘటన

ముఖ్యమంత్రిగా రెండవసారి 2002–2007 మధ్యలో మళ్ళీ ఎన్నికయ్యాడు.

జూలై 2002  గుజరాత్ అసెంబ్లీ రద్దయ్యింది.అప్పుడు శుక్ర/బుధ/శుక్ర జరిగింది.శుక్రుడు అమాత్యకారకుడు. బుదునికి పైన చెప్పిన దోషాలు ఉన్నాయి.కనుక పదవి పోయింది.తన రెండవ టర్మ్ లో గుజరాత్ ను ఆర్ధికంగా బలోపేతం చెయ్యడానికి ప్రయత్నించాడు.అప్పుడు శుక్రదశ అయిపోయి రవిదశ మొదలైంది.రవి దశమాదిపతి అయినప్పటికీ బలహీనుడు కావడం చేత అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు.కాని రవి అడ్మినిస్ట్రేషన్ కు కారకుడు గనుక రాష్ట్రంమీద పట్టు సంపాదించి తనదైన ముద్ర వెయ్యగలిగాడు.

ఆరవ సంఘటన

10-6-2012 ఎలక్షన్ ప్రచార కమిటీకి చైర్మన్ అయ్యాడు.అప్పుడు చంద్ర/రాహు/శనిదశ జరిగింది.భాగ్యాదిపతి అయిన చంద్రుని వల్ల పార్టీపరంగా ఎదుగుదల కలిగింది.దేశం అంతా తిరిగి ప్రచారం చేసేపని రాహువు వల్ల వచ్చింది.కష్టపడి పనిచేసే పాత్రను శని ఇచ్చాడు.బాగా సరిపోయింది.

ఏడవ సంఘటన

మార్చి 2013 లో BJP  పార్లమెంటరీ పార్టీకి ఎన్నికయ్యాడు. సంఘటన చంద్ర/రాహు/చంద్రదశలో జరిగింది.సామాన్యంగా రాహువులో చంద్రుడు చంద్రునిలో రాహువు మంచిదశలు కావు.కానీ మోడీ జాతకంలో రాహువు గురువును సూచిస్తున్నాడు.కనుక ఇది గజకేసరీ యోగం అవుతుంది.కనుకనే దశలు మోడీకి యోగిస్తున్నాయి.

ఎనిమిదవ సంఘటన

23-6-2013 జరిగిన ఉత్తరాఖండ్ వరదలలో దాదాపు 15000 మంది గుజరాతీ పౌరులను రక్షించాడు.అప్పుడు చంద్ర/రాహు/రాహుదశ జరిగింది.రాహువు గురువును సూచిస్తున్నందువల్ల గజకేసరీయోగదృష్ట్యా ప్రజలకు మంచి చెయ్యడం,మంచిపేరు తెచ్చుకోవడం సరిగ్గా సరిపోయింది. సకాలంలో స్పందించలేదన్న చెడ్డపేరును కేంద్ర ప్రభుత్వం మూటకట్టుకుంటే, 'రాంబో యాక్ట్' ద్వారా తన రాష్ట్ర పౌరులను కాపాడటంలో మంచి చొరవ చూపినందుకు మోడీ మార్కులు కొట్టేశాడు. తర్వాత మోడీని చూచి మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులూ ప్రతిపక్ష నాయకులూ కూడా అదే తరహాలో స్పందించారు.నిజానికి అటువంటి విపత్కరపరిస్థితిలో యుద్ధప్రాతిపదికన సహాయ కార్యక్రమాలు చెయ్యాలి. ఆపనిని ఒక్క మోడీ మాత్రమే చెయ్యగలిగాడు. 

తొమ్మిదవ సంఘటన

సెప్టెంబర్ 2013 లో BJP తరఫున ప్రధానమంత్రి అభ్యర్ధిగా ఎంపికయ్యాడు.చంద్ర/గురు/శనిదశ జరిగింది. ముగ్గురూ ఈయనకు యోగకారకులే అన్న విషయం గుర్తుంచుకుంటే విషయం తేలికగా అర్ధమౌతుంది.చంద్రగురు సంయోగం గజకేసరీయోగం.శని ఆత్మకారకుడు. కనుక దేశంలోని అత్యున్నత పదవికి అభ్యర్ధిగా నామినేట్ కాబడ్డాడు.

ఇదే క్రమంలో,ఈయనకు వచ్చిన కొన్ని అవార్డులూ సమయాలూ పరిశీలిద్దాం.

2006 లో జరిపిన ఇండియాటుడే సర్వే ప్రకారం ఉత్తమ ముఖ్యమంత్రిగా ఎక్కువ మార్కులు లభించినది నరేంద్రమోదీకే. ఆసమయంలో ఆయనకు సూర్య/రాహు లేదా సూర్య/గురుదశలు జరిగాయి.సూర్యుడు దశమాధిపతి. రాహువు గురువుకు సూచకుడు.గురువు ఈయనకు యోగకారకుడు. కనుక సరిపోయింది.

FDI పత్రిక 2009 లో పర్సనాలిటీ ఆఫ్ ఇయర్ అవార్డు ఇచ్చింది.అప్పుడు సూర్య/కేతు లేదా సూర్య/శుక్రదశలు జరిగాయి.కేతువు లాభస్థానంలో ఉన్నదనీ శుక్రుడు అమాత్య కారకుడనీ మనకు తెలుసు.ఇదీ సరిపోయింది.

మార్చి 2012 లో టైం పత్రిక కవర్ పేజీ మీద కనిపించాడు.అప్పుడు చంద్ర/రాహు/గురుదశ జరిగింది.చంద్రుడు భాగ్యాదిపతి కనుక విదేశీ పత్రిక మెచ్చుకుంది.రాహువు కూడా విదేశీ సంబందియే.ఇక గురువు ఈయనకు మంచి చేస్తూనే ఉన్నాడు.కనుక ఇది కూడా సరిపోయింది.

పై విశ్లేషణను బట్టి ఈయన జీవితంలో అన్ని సంఘటనలూ ఉదయం 11.00 అనే సమయానికే సరిపోతున్నాయి.కనుక ఇదే మోడీ జననసమయం అని నా ఉద్దేశ్యం. సమయానికి శనిహోర నడుస్త్తున్నది.శని ఆత్మకారకునిగా దశమకేంద్రంలో నెలకొని ఉంటూ నా విశ్లేషణకు బలాన్ని చేకూరుస్తున్నాడు.

ఈ సమయానికి ఇంకొక్క యాసిడ్ టెస్ట్ చేసి చూద్దాం.జననకాల దశ ఏమి జరుగుతున్నదో చూద్దాం.చాలావరకూ దీనిని బట్టి మనిషి జీవనగమనం నిర్దారితం అవుతుంది.ఈ సమయానికి జననకాలంలో శని/శుక్ర/కుజదశ జరుగుతున్నది.అద్భుతం!!దశమకేంద్రంలో ఆత్మ అమాత్యకారకులతో కూడిన లగ్నాధిపతి రాజయోగకారక దశలో మోడీ జన్మించాడని ఉదయం 11.00 గంటల సమయం సూచిస్తున్నది.కనుక ఆయన అంచెలంచెలుగా ఎదగడంలో ఆశ్చర్యం ఏముంది?ఈ సమయం కరెక్ట్ అనడానికి ఇంతకంటే వేరు రుజువు ఇంకేమీ అవసరం లేదు.

కనుక ఇంక అనుమానం లేదు.ఇదే మోడీ యొక్క అసలైన జననసమయం అన్న విషయం నిర్దారణ అయింది.

ఈయన జాతకంలో సింహరాశికి చాలా ప్రాముఖ్యత ఉన్నది.ఎందుకంటే అక్కడే ఈయనకు మంచి రాజయోగం ఉన్నది.అందుకేనేమో ఈయన ఎప్పుడూ గడ్డం పెంచుకుని సింహంలాగా కనిపిస్తూ ఉంటాడు.మన జాతకంలో బలంగా ఉన్న రాశిని బట్టి మన వేషభాషలూ హావభావాలూ ఉంటాయన్నది జగమెరిగిన జ్యోతిష్య సత్యం.

అయితే,ఈయన జాతకంలో ఇంత గందరగోళం ఎందుకు వస్తున్నది?ఒక్కొక్క జ్యోతిష్కుడు ఒక్కొక్క రకంగా ఎందుకు చెబుతున్నాడు?దీనికి సమాధానం ఏమిటంటే, జాతకంలో సూర్యుడు,బుధుడు,కుజుడు ముగ్గురూ బాగా బలహీనులుగా ఉన్నారు.పైగా బుధుడు వక్రించి ఉన్నాడు. జాతకం వరకూ మూడుగ్రహాలే జ్యోతిష్కులను తప్పుత్రోవ పట్టిస్తాయి.ఈ గ్రహాలవల్లనే జీవితంలో కూడా ఈయన అనుక్షణం యుద్ధంచేసి పైకి రావలసిందే గాని నల్లేరుమీద నడకలా ఈయన జీవితం ఎప్పుడూ ఉండదు.

అదీగాక లగ్నం 1 డిగ్రీలో ఉండటంవల్ల తులావృశ్చికలగ్నాల లక్షణాలు కలగలిసి ఈయనలో కనిపిస్తాయి.ఇదికూడా జ్యోతిష్కులను తప్పుత్రోవ పట్టిస్తుంది.

మనం నిర్ధారించిన 11.00 గంటల సమయాన్ని వర్గచక్రాలద్వారా మరికొంత సరిచూద్దాం.

D-10 లగ్నం కర్కాటకం అయింది.యోగకారకుడు కుజుడు నీచలో లగ్నంలో ఉన్నాడు.కాని గురువు దశమకేంద్రంలో ఉండటం వల్ల నీచభంగమైంది.కనుక సామాన్యకుటుంబం నుంచి వచ్చినా దైవబలం వల్ల క్రమంగా జీవితంలో వృత్తిపరంగా బాగా ఎదుగుతాడని సూచన ఉన్నది.అలాగే జరిగింది.

D-10 లో సూర్యుడు శని బుదుడూ కలసి లాభంలో ఉన్నారు.కనుక కష్టపడి అడుగడుగునా అడ్డంకులను ఎదుర్కొంటూ అధికారాన్ని సంపాదిస్తాడని సూచన ఉన్నది.అలాగే జరుగుతూ ఉండటం చూస్తున్నాం.

జనన సమయం నిర్ధారణ అయింది గనుక ఎలక్షన్ సమయానికి ఆయనకు దశ జరుగుతున్నదో చూద్దాం.

11-4-2014 నుంచి 13-7-2014 వరకూ ఈయన జాతకంలో చంద్ర/రాహు/శుక్రదశ జరుగుతుంది.ఈ మూడు గ్రహాలకూ పైన వివరించిన కారకత్వాలనూ అవి ఇచ్చిన ఫలితాలనూ బట్టి ఇది మోడీకి మంచిదశే గనుక వచ్చె ఎన్నికల్లో నరేంద్రమోడీ ఘనవిజయం సాధించడమూ అత్యున్నత పదవిని పొందటమూ ఖచ్చితంగా జరుగుతాయి అని నేను బలంగా నమ్ముతున్నాను.

చంద్రదశ తరువాత ముందుముందు ఆయనకు కుజ,రాహు,గురుదశలు జరుగుతాయి.ఇవన్నీ ఆయనకు మంచిదశలే.కనుక మోడీ ప్రధానమంత్రి కావడం తధ్యం అనీ దేశాన్ని ప్రగతిపధంలో నడిపించడం తధ్యం అనీ నాకు అనిపిస్తున్నది.

ఇప్పుడొక కొసమెరుపు

మోడీ జాతకంలో కన్యారాశిలో సర్వాష్టకవర్గంలో ఎక్కువ బిందువులు (36) ఉన్నాయి.కన్యారాశి ఆయనకు మంచి యోగకారకం అవుతుంది.దక్షిణదిక్కు ఆయనకు బాగా సహాయపడుతుంది.అంటే ఈయన ప్రధానమంత్రి అయ్యే క్రమంలో ఆంధ్రా తమిళనాడు రాష్ట్రాల పాత్ర ఖచ్చితంగా ఉంటుందని,దక్షిణాదిరాష్ట్రాల సహాయంతోనే ఈయన ప్రధానమంత్రి అవుతాడనీ పై విశ్లేషణనుబట్టి నేను ఊహిస్తున్నాను.

దక్షిణాదికి చెందిన అవివాహిత నాయకురాలు అయిన జయలలితనుంచి ఈయనకు రాబోతున్న రాజకీయసపోర్ట్ ను కన్యారాశిలోని ఎక్కువ బిందువులు సూచిస్తున్నాయని నా అంచనా.కనుక మోడీ ప్రధానమంత్రి అయ్యే క్రమంలో ఆంధ్రానుంచి చంద్రబాబు పాత్రా,తమిళనాడు నుంచి జయలలిత పాత్రా ఉండబోతున్నది అని నేను విశ్వసిస్తున్నాను.

మన దేశానికి ప్రస్తుతం అర్జెంటుగా కావలసింది ఒక మంచి నాయకుడు. మాయమాటలు చెప్పకుండా,జనాన్ని మోసం చెయ్యకుండా,నీతీ నిబద్దతా కలిగి,నిజంగా పనిచెయ్యగలిగి,దేశాన్ని ప్రగతిపధంలో నడిపే ఒక నిస్వార్ధ నాయకత్వమే మనకు అర్జంటుగా కావాలి.అలాంటి సమర్ధులైన మంచి నాయకులను మనం ఈసారైనా ఎన్నుకోకుంటే మనదేశం ఇంకో పదేళ్లలో మిగతా దేశాలకంటే వందేళ్ళు వెనుకపడిపోయే ప్రమాదం ఉన్నది.

కానీ, నోటుకీ సారాకీ కులానికీ మతానికీ ఇంకా అనేక అల్పమైన విషయాలకూ ప్రలోభాలకూ తేలికగా లొంగిపోయి అనాలోచితంగా బుర్రలేని నిర్ణయాలు తీసుకుని ఓట్లేసే మన ప్రజాగొర్రెలు స్వార్ధాన్ని పక్కనబెట్టి దేశం గురించి విశాలదృక్పధంతో ఆలోచించి తెలివిగా పరిపక్వతగా ఓటు వెయ్యగలవా అన్నదే అసలైన ప్రశ్న.

చూద్దాం సామూహికకర్మ దేశాన్ని ఎటు నడిపించ బోతున్నదో?