“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

28, జులై 2012, శనివారం

జిల్లెళ్ళమూడి స్మృతులు - 2

మల్లుగారు నవ్వుతూ పలకరించాడు.

"పోయినసారి మీ ఇంటికి వచ్చినపుడే మిమ్మల్ని కలవడం. మళ్ళీ ఇప్పుడే" అన్నా నేను.

"అవును." అంటూ, మా చేతిలోని  సామగ్రి చూచి,  "ముందు ఆలయానికి వెళ్లి రండి. తర్వాత మాట్లాడుకుందాం" అన్నాడాయన.

అమ్మ ఆలయాలకు వెళ్లి ప్రణమిల్లి కొంచంసేపు మౌనప్రార్ధనలో ఉండి, వెనక్కు వచ్చి మేడమీద అమ్మగదికి వెళ్లి కాసేపు కూచుందామని వచ్చాము. గది తాళం వేసిఉంది. అనసూయాదాస్ గారి రూంకి వెళ్లి తాళాలు తీసుకుని మేమే తలుపులు తీసి అమ్మ గదిలో కాసేపు మౌనధ్యానంలో ఉండి కిందకు వచ్చాము.

ఆఫీస్ రూంలో దినకర్ గారు ఇంకెవరో ఒకాయనా కూచుని ఉన్నారు. ఆయన పేరు  నాకు తెలియలేదు. చరణ్ కు ఆ వాతావరణం అంతా చూస్తె మైమరపు కలుగుతుంది. తను చిన్నప్పుడు ఒక ఏడాదో ఏమో అక్కడ ఉండి చదువుకున్నాడు  అతని ఉపనయనం కూడా అమ్మ చేతులమీదే జరిగింది  అందుకని ఆ అనుభవాలు అన్నీ గుర్తొచ్చి మైమరచి పోతుంటాడు

"ఇప్పుడేముంది అన్నగారు? ఇలా అనుకుంటే అలా రాగలుగుతున్నాం, అప్పట్లో అయితే దారీ తెన్నూ లేదు.పొలాల గట్లమీద నుంచి నడుచుకుంటూ రావాలి.అలాగే వచ్చేవాళ్ళం.మా నాన్నగారు ఉద్యోగరీత్యా రాయచోటిలో ఉండేవారు. అక్కణ్ణించి బస్సులో కడపకు వచ్చి, అక్కడ బస్సుమారి కడపనుంచి నెల్లూరుకు వచ్చి, అక్కడ రైలెక్కి బాపట్ల వచ్చి, అక్కణ్ణించి మళ్లీ  బస్సెక్కి ఏడోమైలు దగ్గర దిగి, అక్కణ్ణించి మోకాలి లోతు బురదలో నడుస్తూ వచ్చేవాళ్ళం. అమ్మను చూడగానే ఆ కష్టం అంతా ఎగిరిపోయేది అప్పట్లో ఇన్ని సౌకర్యాలు ఇక్కడ లేవు.ఎక్కడ చోటు దొరికితే అక్కడ పడుకునే వాళ్ళం.ఒక్కోసారి చెట్లకిందే రాత్రంతా పడుకునేవాళ్ళం. దోమలూ చీమలూ ఏవీ పట్టేవి కావు, కుట్టేవి కావు, తెలిసేవి కావు. అలా ఎంతమందో? ఒక్కసారి వచ్చినవాడు మళ్ళీ వెనక్కి పోలేదు. ఏమిటో మన సొంత ఇంటికి వచ్చినట్లు అనిపించేది. ఎవరికివారు అలాగే అనుకునేవారు.

కమ్యూనిస్టులు నక్సలైట్లు నాస్తికులు ఒకరేమిటి అమ్మతో వాదించాలని వచ్చిన ప్రతి ఒక్కరూ అమ్మను చూచి కాసేపు మాట్లాడగానే ఆమెకు పాదాక్రాంతులై  పోవడమేగాని వేరుమాట లేదు.అమ్మ ప్రభావం అలా ఉండేది.అవ్యాజమైన ఆ ప్రేమతత్వం ముందు వెక్కిళ్ళు పెట్టి ఏడవనివారు లేరు. వీరమాచనేని ప్రసాదరావుగారని ఒక కమ్యూనిష్టు  ఎంపీ ఉండేవారు. అమ్మతో వాదించాలని అమ్మను పరీక్షించాలని వచ్చి అమ్మకు సరెండర్ అయిపోయాడు. యార్లగడ్డ బాస్కరన్నయ్య, యార్లగడ్డ లక్ష్మయ్య మొదలైన అనేకులు అమ్మకు పూర్తిగా సరెండర్ అయినవారే. అమ్మ ఉన్నరోజుల్లో ఇక్కడ నిత్యం ఉత్సవంలా ఉండేది. ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారో ఎవరికీ తెలిసేది కాదు ఎన్నాళ్ళున్నా ఎవరూ అడగరు వచ్చినవారికి వచ్చినట్లు భోజనాలు నడుస్తూ ఉండేవి. ఆ సమయానికి సరుకులు అలా వస్తూ ఉండేవి. చూచిపోదామని వచ్చి జీవితాంతం ఇక్కడే ఉండిపోయినవాళ్ళు ఉన్నారు.

ఈ రూం జేమ్స్ ది. కాని ఇందులో ఆయనకే చోటుండేది కాదు. రూము నిండా ఎవరెవరో లగేజీలు సంచులు పెట్టి పోయేవారు  ఎవరెవరో వచ్చి పడుకునేవారు, తన రూం లో తనకే చోటులేక  పాపం జేమ్స్ ఒక్కోసారి ఆ కుర్చీలో ముడుక్కుని అలాగే నిద్రపోయేవాడు.                      

1977 వరదల్లో ఇక్కడంతా నీళ్ళు వచ్చాయి వాటితో పాటు తేళ్ళు పాములు జెర్రులు అనేకం కొట్టుకు వచ్చాయి. ఇక్కడ పిల్లా జెల్లా ఎందఱో ఉన్నారు. వాళ్ళలో ఎవరినైనా అవి కరుస్తాయేమో ఇక్కడ వైద్య సదుపాయం కూడా లేదు. ఎలారా దేవుడా అని అమ్మను అడిగాం  అమ్మ ఒకటే మాట చెప్పింది  "ఏ ప్రాణినీ చంపవద్దు. మీలాగే అవికూడా ప్రాణభయంతో కొట్టుకు వచ్చాయి. ఎవరినీ అవి కాటెయ్యవు మీరు వాటిని ఏమీ చెయ్యవద్దు" అని చెప్పింది. అమ్మ చెప్పినట్లే ఒక్క పాముకాటు కేసుకూడా మేము వినలేదు రెండు రోజులలో మళ్ళీ అవన్నీ ఎటు పోయాయో వెళ్ళిపోయాయి ఎంతో మంది పిల్లలు అలా వాటిమధ్యే తిరుగుతున్నారు కాని ఒక్కరిని కూడా అవి కాటెయ్యలేదు.ఇలాంటి అద్భుతాలు ఎన్నో ఎన్నెన్నో ప్రతిరోజూ జరిగేవి. కాని ఇవి అద్భుతాలు అని అప్పుడు తెలిసేది కాదు. సహజంగా జరిగినట్లు ఉండేది.

ఇలా మాట్లాడుకుంటూ మల్లుగారి ఇంటికి చేరాము. దారిలో తాగుదామని గుంటూరునుంచి ప్లాస్క్ లో టీ కలిపి తెచ్చాము కాని దారిలో ఎక్కడ తాగాలని అనిపించక ఇక్కడికొచ్చాక మల్లు అన్నయ్య గారింట్లో కూచుని వారికి కాస్త ఇచ్చి మేమూ తాగాము.

1970 ప్రాంతాల్లో గుంటూరులో ఒక భక్తుడు ఉండేవాడు. ఒకరోజు ఆయనకు నిద్ర పట్టలేదు. అమ్మ పొద్దున్నే కాఫీ తాగుతుందని ఆయనకు తెలుసు. అందుకని ఇంట్లో కాపీ పెట్టించి ప్లాస్క్ లో పోసుకుని సైకిలు మీద రాత్రికి రాత్రి  బయలుదేరి గుంటూరునుంచి బాపట్ల మీదుగా జిల్లెళ్ళమూడి వచ్చి తెల్లవారుజాము మూడుకల్లా ఆ చిమ్మచీకట్లో అమ్మ లేవడంతోనే ఆ కాఫే అమ్మకు అందించాడొకసారి. ఆరోజుల్లో అంత భక్తి కలిగినవాళ్ళు ఉండేవారు.

ఒకరోజున ఎవరో ఈయన్ని ఆక్షేపించారు. "అమ్మ అమ్మ అంటావు. ఏమిటి మీ అమ్మగారి మహత్యం?" అని. చూపిస్తా ఉండమని వెంటనే కరెంటు ప్లగ్గులో వైర్లు పెట్టి అవి పట్టుకున్నాడు. అతనికి ఏమీ కాలేదు. కరెంటు లేదేమోనని అనుమానంతో ఫాన్ వేసి చూస్తే తిరిగింది. "కావాలంటే నన్ను పట్టుకో ఇప్పుడు" అంటూ ఆ చాలెంజ్ చేసిన వ్యక్తిని పిలిచాడు. అతనికి ధైర్యం చాలలేదు. ఆ సమయానికి ఆ షాక్ జిల్లెల్లమూడిలో ఉన్న అమ్మకు కొట్టింది. అమ్మకు ఒళ్ళు జలదరించి "వాడు నన్ను పరీక్షిస్తున్నాడురా" అంది. ఎవరో ఏం పరీక్షిస్తున్నారో మాకు తెలియలేదు. తనూ చెప్పలేదు. తర్వాత జరిగిన సంఘటనలు తెలిసి ఆశ్చర్యపోయాం.

సామాన్య రైతుకుటుంబం నుంచి వచ్చిన యార్లగడ్డ భాస్కరరావు గారు అమ్మ జీవితచరిత్ర రాశాడు అమ్మ చెబుతుంటే తను రాశేవాడు కాని తనకు ఏమీ తలియదు. పాండిత్యం లేదు భాషాజ్ఞానం లేదు. ఎలా రాశాడో తనకే తెలియదు. అమ్మ ఒకపక్క చెబుతూ ఉంటె, ఆ పాత్రలు కళ్ళముందు కనిపిస్తూ వాటి మాటల్లో అవి మాట్లాడేవి. ఆమాటలనే యధాతధంగా వ్రాశాడు. ఇప్పుడు ఆయనకీ ఏమీ గుర్తు కూడా లేదు. ఆద్యాత్మికజీవితంలో సరళమైన మంచిహృదయం ఒక్కటి ఉంటే చాలు ఇంకేమీ అర్హతలు అవసరంలేదు అని భాస్కరరావుగారి ద్వారా అమ్మ రుజువు చేసింది. "అమ్మ జీవిత మహోదధి" అన్న పుస్తకం అలా వచ్చింది 

మల్లు గారు, ఆయన భార్య, చరణూ తమ తమ జ్ఞాపకాలను కలబోసుకోవడం మొదలుపెట్టారు.

"నదీరా అన్నయ్య అమ్మ గురించి అనేక పాటలు వ్రాశాడు. చాలా ఉన్నై. ఉదాహరణకి ఒక మంచి వాక్యం ఎలా వ్రాశాడో వినండి. 

"ఆకలేసి కేకలేసినారెందరో తల్లీ 
ఆకులేసి కేకలేసె ఈ అందరి తల్లి" 

ఆకలేసి కేకలేశానన్నాడు శ్రీశ్రీ. వారి ఆకలి హింసనూ దౌర్జన్యాన్నీ ద్వేషాన్నీ వర్గపోరాటాన్నీ ప్రేరేపించింది. వాటివల్ల ప్రపంచ సమస్యలు పరిష్కారం కావు. కాని అమ్మ మార్గం విభిన్నం. వచ్చినవారందరికీ ముందు ప్రేమతో అన్నం పెట్టేది. ఆకులేసి అన్నం తినమని కేకలేసేది. లోకమంతా నాది, అందరూ నా బిడ్డలే అనుకునే ఈ ప్రేమతత్త్వం వల్లనే ఏ సమస్య అయినా పరిష్కారం అవుతుంది. ఎప్పటికైనా లోకానికి ప్రేమే శరణ్యం. అదే జీవితాలను గట్టేక్కిస్తుంది. అందుకే లోకంలో సంస్కర్తలు సాధించలేనిది అమ్మ సమక్షంలో సులభంగా సహజంగా జరిగేది.సాంప్రదాయ బ్రాహ్మణకుటుంబంలో పుట్టిన అమ్మ కులమతాలను ఎన్నడూ పాటించేది కాదు. "గుణభేదమే చూడని నాకు కులభేదమేమిటి నాన్నా?" అనేది. మనుషులలో తప్పులను అమ్మ ఎన్నడూ చూచేది కాదు. "తప్పులు చూచేది తల్లి కాదు"  అని అమ్మ ఎన్నో సార్లు అనేది. "నేనే గనుక తప్పులు ఎంచటం మొదలుపెడితే ఏడో మైలు దాటి ఒక్కరూ రాలేరు" అనేది అమ్మ. 

మంచివాడినీ చెడ్డవాడినీ సమంగా చూచిన అమ్మకు, కులంతో అసలు పనేముంది? అమ్మ అటువంటి ప్రేమమూర్తి గనుకనే,అమ్మతో వాదించాలనీ, ఇక్కడేదో బూటకం ఉందనీ,దాన్ని బయటపెట్టాలనీ వచ్చిన అనేకులు కాసేపు అమ్మతో మాట్లాడితే చాలు సరెండర్ అయిపోయేవారు. చాలామంది ఊరకే అమ్మ సమక్షంలో కూచుని అమ్మ వైపు అలా చూస్తూ వలవలా ఏడుస్తూ ఉండేవారు. ఆ దృశ్యం సర్వసాధారణంగా ఇక్కడ కనిపించేది. అమ్మ మాత్రం మౌనంగా ఉండేది. "వాళ్ళెందుకమ్మా అలా ఏడుస్తున్నారు?" అంటే "వాళ్ళు ఏడవడానికే వచ్చార్రా ఏడవనివ్వు" అనేది గాని వివరించి చెప్పేదికాదు. వారికీ తనకూ మధ్య ఏమి జరిగేదో వారికీ తనకే తెలిసేది. మూడో వ్యక్తికి అర్ధమయ్యేది కాదు.

"జయహో మాతా శ్రీఅనసూయా రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి" అన్న మహా మంత్రాన్ని మొదటగా పలికింది "మౌలాలి" అనే ఒక ముస్లిం. ఒక ముస్లిం భక్తుని నోటి వెంట ఆశువుగా పలికిన ఈ మహామంత్రం ఈరోజున లక్షలమంది నోళ్ళలో నానుతోంది. నిత్యం ఇక్కడ నామస్మరణలో వినిపిస్తోంది. 

అప్పట్లో ఇక్కడ అయిదుగురు గుడ్డివాళ్ళు ఉండేవారు. వారిలో కాసు రాధాకృష్ణారెడ్డి, కాసు వెంకటేశ్వరరెడ్డి అన్నదమ్ములు. ఇద్దరూ పుట్టు గుడ్డివాళ్ళే. ఇద్దరూ విజయనగరం సంగీత కళాశాలలో సంగీతం చదువుకున్నారు. చక్కగా పాడేవాళ్ళు. ఒకరోజున కాసు వెంకటేశ్వరరెడ్డి అమ్మ దగ్గరకు వచ్చి " దేవుడికేం హాయిగ ఉన్నాడు. ఈ మానవుడే బాధలు పడుతున్నాడు" అన్న సినిమా పాట పాడాడు. ఘంటసాలను మరిపించేలా అద్భుతంగా పాడాడు. అమ్మ అంతా విని " దేవుడికి బాధలు లేవా? ఎవరన్నార్రా? ఆయనకున్న బాధ నీకు తెలుసా? అది గ్రహిస్తే నీవు తట్టుకోగలవా? మీరందరూ ఇలా ఉన్నారనేరా ఆయన బాధ. ఆయన బాధలో కోటో వంతు కూడా మానవులకు లేదురా. అన్నీ అమర్చి పెడుతుంటే ఈ మాత్రానికే మీరేదో తెగబాధలు పడుతున్నట్లు అనుకుంటున్నారా?" అన్నది.

కాసు రాధాకృష్ణారెడ్డిగారు అద్భుతమైన గాయకుడు. కీర్తనలు అద్భుతంగా పాడేవాడు. ఈ ఊరిలోకి రాబోయే ముందు కనిపించే వినాయకవిగ్రహం కిందే ఆయన సమాధి ఉంది. మంచి ఆజానుబాహుడు. విపరీతమైన తిండి పుష్టి కలవాడు. ఒకరోజున ఏభై ఇడ్లీ ఒక్కడే తిని ఆరుగ్లాసుల మజ్జిగ తాగాడు."ఇంకొంచం తిను అన్నయ్యా" అంటే "ఒద్దులేరా మళ్ళీ మధ్యాన్నం భోంచెయ్యాలిగా ఒద్దులే" అనేవాడు.అప్పటికి ఉదయం పదయ్యేది. అంత తిండిపుష్టి కలవాడు. మొదట్లో సత్యసాయి ప్రశాంతి నిలయంలో ఉండేవాడు. అక్కడ ఆయనకు నచ్చక ఇక్కడకు వచ్చి చేరాడు. కళ్ళు లేకపోయినా ఒక్కడే ఎక్కడెక్కడో దేశమంతా తిరిగేవాడు. జేబులో చిల్లిగవ్వ ఉండేది కాదు. ఎలా తిరిగేవాడో ఏమో తెలియదు. పాటలు అద్భుతంగా పాడేవాడు. ఆలయంలో కూచుని గొంతెత్తి నామం చేస్తుంటే అమ్మ తట్టుకోలేక కిందికి దిగి వచ్చేది. అంత ఆర్తితో హృదయపూర్వకంగా గొంతెత్తి అమ్మను కీర్తించేవాడు. "ఒరే వాడు పాడుతున్నాడురా. నన్ను పిలుస్తున్నాడు. నేను వెళ్ళాలి" అంటూ అమ్మ కిందికి దిగి వచ్చేది.

ఆయనకు ఎంతటి గ్రహణ శక్తి ఉండేదో !! వంటింట్లో గిన్నెల చప్పుడు బట్టి, ఎంత ఆహారం వండారో గ్రహించి  తానెంత తినాలో నిర్ణయించుకుని ఆకలి ఉన్నాకూడా "ఇంక చాలమ్మా" అని లేచిపోయేవాడు. ఒకసారి హైదరాబాద్లో బస్సులో నేనూ ఆయనా పోతున్నాం. పక్కన ఎవరో ఒకాయన చెయ్యి ఆయనకు తగిలింది. వెంటనే ఆయన్ను గుర్తుబట్టి " ఏం మోహన్రావు గారు బాగున్నారా?" అని పలకరించాడు. ఈయన మీకేక్కడ పరిచయం అనడిగితే " ఎప్పుడో అయిదేళ్ళ క్రితం ఇలాగే రైల్లో పరిచయం" అని చెప్పాడు. అప్పటి ఆయన స్పర్శను గుర్తుంచుకుని ఇన్నేళ్ళ తర్వాత బస్సులో చెయ్యి తగిలిన మనిషిని పేరుతో పిలిచి గుర్తుపట్టాడు. కళ్ళు ఇవ్వకపోయినా అంత అద్భుతమైన గ్రహణ శక్తిని ఆయనకు ఇచ్చాడు దేవుడు.

ఆల్ ఇండియా మ్యూజిక్ ఫెస్టివల్ కి ఆయన్ను రమ్మని ప్రభుత్వం నుంచి ఆహ్వానం వస్తూ ఉండేది. అప్పుడు డిల్లీ వెళ్లి వేదిక మీద కచ్చేరీ చేసి వచ్చేవాడు. ఎక్కడెక్కడ తిరిగినా మళ్ళీ జిల్లెళ్ళమూడి వచ్చి చేరుకునేవాడు. చివరికి ఇక్కడే అమ్మ చరణసన్నిధిలో గతించాడు.ఆయన సమాధి మీదనే వినాయకుడి విగ్రహం పెట్టారు. అది మనం వచ్చేదారిలోనే ఊరి మొదట్లోనే కనిపిస్తుంది.

అప్పట్లో నీళ్ళు ఉండేవి కావు. ఊళ్లోని చేరువునుంచి బిందెలు మోసుకుని ఇక్కడిదాకా తెచ్చేవాళ్ళం. తాను కూడా ఒక పెద్ద గంగాళాన్ని భుజాన పెట్టుకుని దానితో నీళ్ళు మోసుకుంటూ ముందు వెళుతున్న ఎద్దుబండి చప్పుడు ఆధారంగా ఇక్కడికి నీళ్ళు మోసుకోచ్చేవాడు.

అందరం హాల్లో కూచుని ఉండగా " ఈ రోజు అమ్మ పచ్చరంగు చీర కట్టుకుని వస్తుంది" అనేవాడు. ఏదో మాట్లాడుతున్నాడులే అని అందరం అనుకునేవాళ్ళం. కాని అమ్మ అలాగే పచ్చ చీరే కట్టుకుని ఆరోజు దర్శనం  ఇచ్చేది. కళ్ళులేనివాడు కళ్ళున్న మా అందరికంటే ఎక్కువగా ఎలా చూడగలిగేవాడో జరగబోయేది ఎలా చెప్పేవాడో తెలిసేది కాదు.

ఒకరోజున "అమ్మా. దేవుడు నాకిలాంటి కళ్ళులేని జన్మ ఇచ్చాడు. నీ రూపాన్ని చూడాలని ఉందమ్మా" అంటూ ఏడిచాడు. "చూడు నాయనా" అంటూ అమ్మ అతనికి కళ్ళను ఇచ్చింది. అతనికి పుట్టుకతోనే కనుగుడ్లు లేవు. కళ్ళ స్థానంలో గుంటలు ఉండేవి. కాని అలాంటివాడికి చూపు వచ్చింది. అమ్మను చూచాడు. "నిన్ను చూచిన కళ్ళతో ఈ లోకాన్ని చూడలేనమ్మా. ఈ చూపు నాకొద్దు. తీసేసుకో" అని వేడుకున్నాడు. మళ్ళీ చూపు పోయింది. ఇది మా కళ్ళ ఎదురుగా జరిగింది. ఇదీ రాధన్నయ్య కధ.

"ఇక నాకధ కొంచం వినండి" అంటూ మల్లు గారు ఈ సంఘటన చెప్పాడు.

1960 ప్రాంతాలలో మేము హైదరాబాద్లో ఉండేవాళ్ళం. మా అన్నయ్యకూ నాకూ కూడా అప్పటికి పెళ్ళిళ్ళు కాలేదు. మా అన్నయ్యకు సంబంధం సెటిల్ చేసి పెళ్లి నిశ్చయం చేసారు. ఆయనకు సంసారం ఇష్టం లేదు. అందుకని ఒకరోజున చెప్పాపెట్టకుండా ఉన్నట్టుండి అన్నీ వదిలేసి గోచీ పెట్ట్టుకుని శ్రీశైలం అడవులలోకి వెళ్ళిపోయాడు. సంసారం వద్దు అని తీవ్ర వైరాగ్యం ఆయనలో ఉండేది. ఆయన్ను చూచి నేనూ ఇంటిలోనుంచి వచ్చేసి బాంబే వెళ్ళిపోయాను. ఇక మా తల్లిదండ్రులు గోల, మా నాన్నగారు, జిల్లెళ్ళమూడి వచ్చి అమ్మతో జరిగింది అంతా చెప్పారు. అమ్మ నవ్వి, "పెళ్లి ఏర్పాట్లు చేసుకోరా. వాడేక్కడికి పోతాడు. వస్తాడులే." అన్నదిట. అమ్మ మీద నమ్మకంతో పెళ్లి ఏర్పాట్లు చేసుకున్నారు. ఇంతలో శ్రీశైలం అడవుల్లో ఉన్న మా అన్నయ్యకు అమ్మ కనిపించి " అక్కడ మీనాన్న వాళ్ళు అలా ఏడుస్తుంటే నువ్విక్కడ ఏం చేస్తున్నావురా? వెంటనే బయలుదేరి జిల్లెళ్ళమూడి రా." అని చెప్పి మాయమైంది. ఇక ఆగలేక వెంటనే బయలుదేరి వచ్చాడు. వివాహప్రాముఖ్యతను వివరించిన  అమ్మ, అన్నయ్య పెళ్లిని దగ్గరుండి చేసింది. ఇక పోతే బాంబేలో ఉన్న నాకు ఎందుకో ఒకరోజున జిల్లెళ్ళమూడి వెళ్లాలని బలంగా అనిపించింది. ఎవరో తాడుకట్టి లాగుతున్నట్లు అనిపించి నిలవలేక వెంటనే బయలుదేరి నేనూ నాలుగురోజుల్లో ఇక్కడకు వచ్చేశాను. అంతా సుఖాంతం అయింది. ఇలాంటి మహిమలు ఎన్నో చేసింది అమ్మ. అయితే అప్పుడు అవి మహిమలు అని తెలిసేవి కాదు. అమ్మ ఏది చేసినా సహజంగా ఉండేది. ఏమీ చెప్పేది కాదు. సంకల్పంతోనే పనులు చక్కబెట్టేది.

ఇలాంటి భక్తులు ఎందఱో ఎందరెందరో. వీరిని భక్తులు అనకూడదేమో. ఎందుకంటే అమ్మే స్వయంగా చెప్పింది. "నాకు శిష్యులు లేరు నాన్నా అందరూ శిశువులే" అనేది. ఆ రకంగా ఒక్కొక్కరిది ఒక్కొక్క కధ. ఒక్కొక్క చరిత్ర. కదిలిస్తే ఇక్కడ చెట్లూ పుట్టలూ కూడా గాధలు వినిపిస్తాయి.

(సశేషం)