“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

9, జూన్ 2012, శనివారం

మనిషి జీవితంలో మౌలిక ప్రశ్నలు

ప్రతి మనిషీ జీవితంలో తనను తాను ఏదో ఒకరోజు ప్రశ్నించుకోవలసిన మౌలికమైన ప్రశ్నలు కొన్నున్నాయి. కాని ప్రతి వాడూ వీటిని వాయిదా వేస్తూ పోతుంటాడు.ఈ వాయిదా వెయ్యడానికి కారణాలు ఎన్నున్నా అన్నింటి వెనకా ఒకటే మూలకారణం కనిపిస్తుంది. దానిని తృష్ణ అనవచ్చు, లేదా ఇంద్రియాకర్షణ అనవచ్చు లేదా మాయ అనవచ్చు. దీనికి లోబడే లోకంలో ప్రతి మనిషీ జీవిస్తున్నాడు.

ప్రతి మనిషీ తన జీవితంలో, తానెంత సంపాదిస్తున్నాడు, ఎంత ఆస్తి ఇప్పటి దాకా  కూడబెట్టాడు, ముందు ఇంకా ఎంత కూడబెట్టాలి, దానితో ఎన్ని సుఖాలు అనుభవించాలి అన్న ఆలోచనలే చేస్తుంటాడు. కాని అతను ఆలోచించని విషయం ఒకటుంది. ఈ తాపత్రయంలో పడి విలువైన జీవితాన్ని అతను కోల్పోతున్నాడు. ఆయుస్సు అనుక్షణం తగ్గుతూ వస్తున్నది. మరణం అనుక్షణం దగ్గర అవుతున్నది. ఈ జీవన పోరాటంలో శాంతి అనేది కనుచూపు మేరలో ఎక్కడా కనిపించదు. మనిషి తాపత్రయానికి అంతం కూడా ఎప్పటికీ ఉండదు. కానీ, ఎంతకాలం ఈ అర్ధం లేని పరుగు? అన్న విషయం మాత్రం ఎవరూ ఆలోచించరు. అదే మాయ.

తాను సంపాదించిన దానికంటే తాను ఖచ్చితంగా  ముఖ్యమైనవాడు. సంపాదన తనకోసమే గాని తాను సంపాదన కోసం పుట్టలేదు. సంపాదన కోసం ఎవడూ సంపాదించడం లేదు. సంపాదించిన దానితో తను తన కుటుంబమూ సుఖంగా ఉండాలనే ప్రతివారూ ఆశిస్తారు. అంతేగాని అవసరం ఉన్నా లేకున్నా లక్షల కోట్లూ, కోట్ల కోట్లూ పోగేయ్యాలని ఎవరైనా ఆశించి ఆ కోణంలో ప్రయత్నం చేస్తుంటే వారి వ్యక్తిత్వంలో మౌలికంగా ఏదో దారుణమైన లోపం ఉన్నదని భావించాలి. సుఖం కోరుకోవడం తప్పు కాదు. కాని దానికి అంతెక్కడ అన్న విషయం గ్రహించలేకపోవడమే తప్పు. ఇక చాలు అని ఒక గిరి గీసుకోలేక పోవడమే తప్పు. దీని తరువాత ఏమిటి? అన్న విషయం ఆలోచించలేకపోవడమే తప్పు.

ప్రతివాడూ సుఖాభిలాషతోనే జీవితాన్ని వెళ్ళబుచ్చుతున్నాడు.మనిషి మాత్రమె కాదు. లోకంలో ప్రతిప్రాణీ సుఖాన్ని కోరుతూ దు:ఖాన్ని వద్దనుకుంటుంది. కాని ఇక్కడే ఒక మెలికను ప్రకృతి ఉంచింది. ఏ సుఖమూ శాశ్వతంగా ఎల్లకాలమూ నిలిచి ఉండదు. తిన్న కాసేపు ఆకలి తీరినట్లు అనిపిస్తుంది. కాసేపటికి మళ్ళీ తలెత్తుతుంది. అలాగే, ఏ ఆనందమూ స్తిరంగా  ఉండదు. నిజానికి ఆనందాన్ని అనుభవిస్తున్న క్షణంలోనే అది ఆవిరైపోతూ ఉంటుంది. ఇది ప్రకృతిలోని అత్యంత కీలకమైన అమరిక. జారిపోతున్న సుఖాన్ని నిలిపి ఉంచడం కోసం మనిషి నిరంతరం పరుగులు తీస్తూ ఉంటాడు. ప్రయత్నిస్తూ ఉంటాడు. అయితే బాహ్యప్రపంచంలో మనకు దొరికే ఏ సుఖమూ శాశ్వతం కాదు. అది క్షణికం మాత్రమె.అందుకే క్షణికాన్ని శాశ్వతం చేసుకుందామన్న భ్రమలోనే మనిషి జీవితం వెళ్ళిపోతున్నది. మళ్ళీ మళ్ళీ అదే ఆనందాన్ని పొందుదాం అన్న భ్రమలోనే మనిషి జీవితం ఆవిరై పోతున్నది. అతని ఆయుస్సు తరిగి పోతున్నది. కాని అదేన్నటికీ జరిగే పని కాదు. బాహ్య విషయాలు ఇచ్చే ఆనందం ఎన్నటికీ శాశ్వతంగా ఉండదు. ఈ విషయం మనిషికి జీవిత చరమాంకంలోనే అర్ధమౌతుంది. చాలామందికి అప్పుడు కూడా విషయం అర్ధంకాదు. అప్పటికే మరణం వచ్చి తలుపు తడుతూ ఉంటుంది. ఇక అప్పుడు చెయ్యగలిగింది ఏమీ ఉండదు. కానీ, చాలా కొద్ది మందికి మాత్రం ఈ మెలిక చిన్నతనంలోనే అర్ధమౌతుంది.

ప్రపంచంలో ఏ వస్తువైనా తనకంటే ఎక్కువ కాదు. వస్తువులు తనకోసం ఉన్నాయి గాని, తాను వాటికోసం లేడు. ఈ సత్యాన్ని మరచి మనిషి వస్తువులకోసం, వాటిని కొనగలిగే ధనంకోసం, విలువైన తన జీవితాన్ని వృధాగా వెచ్చిస్తున్నాడు. కాని అన్నింటికంటే విలువైన తనకోసం మనిషి ఏమీ చెయ్యడం లేదు. తనను తాను తెలుసుకుందామని ప్రయత్నం చెయ్యడం లేదు. 

మనలో ప్రతివారికీ భౌతికమైన తన అడ్రస్ తెలుసు. కాని తానెవరో తెలియదు. ప్రతివారికీ డ్రస్ ఎలా వేసుకోవాలో తెలుసు. కాని ఇప్పటికే మనల్ని ఆవరించి ఎన్ని డ్రస్సులు ఉన్నాయో వాటిని ఎలా వదిలించుకోవాలో ఎవరికీ తెలియదు.  ప్రస్తుతం తాను ఎక్కడ ఉన్నాడో ప్రతివానికీ తెలుసు. కాని ఎక్కడినుంచి ఈ లోకంలోకి వచ్చాడో తెలియదు. ఎలా వచ్చాడో తెలియదు. ఎందుకు వచ్చాడో తెలియదు. ఎన్నాళ్ళు ఉండాలో తెలియదు.ఎప్పుడు పోతాడో తెలియదు. ఎక్కడికి పోతాడో తెలియదు. ఆ తర్వాత ఏమౌతుందో తెలియదు. మళ్ళీ పుట్టుక ఉందొ లేదో తెలియదు. ఈ చక్రభ్రమణం ఎన్నాళ్ళో అసలే తెలియదు. ఇవీ అసలైన మౌలికప్రశ్నలు. మనిషి తనను తాను ప్రశ్నించుకోవలసిన ప్రశ్నలూ, జవాబులు వెదకవలసిన ప్రశ్నలూ ఇవే. కానీ జీవితంలో ఇవి ముఖ్యం కాదులే అనుకుంటూ  ప్రతిసారీ వాయిదా వేస్తూ పోయే ప్రశ్నలు  కూడా ఇవే. 

ఈ ప్రశ్నలు మనిషి వేసుకున్నప్పుడు, అతనిలో ఒక జిజ్ఞాస మొదలౌతుంది. నిరంతరమైన ఆ జిజ్ఞాస క్రమేణా ఒక తపనగా మారుతుంది. ఆ తపన అతనికి ఒక దారిని చూపిస్తుంది. అదే అతన్ని ఒక వివేకానందునిగా మారుస్తుంది. ఒక రమణమహర్షిగా మారుస్తుంది. అప్పుడే అతనికి జీవితంలో ఏది ముఖ్యమో ఏది కాదో తెలుస్తుంది. ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో తెలుస్తుంది. జీవితంలో దేనివిలువ ఏమిటో అప్పుడే తెలుస్తుంది. ఇప్పటి వరకూ నిరర్ధకంగా గడుపుతున్న జీవితాన్ని ఎలా సార్ధకం చేసుకోవాలో తెలుస్తుంది. ఆ రోజునుంచే అతను నిజంగా జీవించడం మొదలు పెడతాడు. ఎప్పటికీ జారిపోని, శాశ్వతమైన సుఖం కోసం,ఆనందం కోసం ప్రయత్నం చేస్తాడు. చివరికి దానిని అందుకుంటాడు. ఆ క్రమంలో వ్యామోహాన్నీ తృష్ణనూ మాయనూ అధిగమిస్తాడు.

ప్రతి మనిషీ తన జీవితంలో ఏదోనాడు వేసుకోవలసిన మౌలికమైన ప్రశ్నలు ఇవే. వీటికి సమాధానాలను పుస్తకాలనుంచి కాకుండా, అనుభవపూర్వకంగా తెలుసుకున్నప్పుడే మనిషి పరుగు ఆగుతుంది.అప్పుడే అతని జన్మజన్మల దాహం తీరుతుంది. అప్పుడే అతని అన్వేషణ అంతమౌతుంది. అప్పుడు మాత్రమె అతనికి అత్యన్తికమైన శాంతి దొరుకుతుంది. కాని ఆ పనిని ఎందరు చెయ్యగలరు? కోటికి ఒక్కరైనా ఉంటారా? మనిషిని నిరంతరం వెంటాడే కర్మఫలం ఆ పనిని సజావుగా చేయ్యనిస్తుందా? ఆ అనుభవాన్ని పొందటం  అంత సులభం అయితే సందుకొక రమణమహర్షీ, గొందికొక వివేకానందుడూ, ఊరికొక అరవిందుడూ ఉండకపోయారా?

కానీ ఒక్క విషయం చెప్తాను. ఎంత కష్టమైనా సరే ఏదోనాడు ప్రతివారూ ఈ ప్రశ్నలకు జవాబులు వెదుకక తప్పదు. కొందరు ముందూ కొందరు వెనుకా అంతే తేడా. ఎందుకంటే పరిణామక్రమం ప్రకృతిలోని అంతస్సూత్రం. ప్రతివారూ ఏదోనాటికి ఎదిగి పరమ గమ్యాన్ని చెరక తప్పదు. కనుక ఈ ప్రశ్నలు ఎవరికీ వారు వేసుకుని, వాటికి జవాబులు తమ స్వానుభవంనుంచి గ్రహించే ప్రయత్నం ఎంత త్వరగాచేస్తే అంతమంచిది. ఎక్కువ సమయం వృధా అవకుండా ప్రకృతి నిర్దేశించిన గమ్యాన్ని చేరుకోవడం అప్పుడు సులభం అవుతుంది. అప్పుడే మనిషి జీవితం ధన్యం అవుతుంది. లేకుంటే జన్మ తరువాత ఇంకొక జన్మ ఇలా ప్రతిజన్మా వృధా అవుతూనే ఉంటుంది. మనిషి జీవితం నిరర్ధకంగా ఈషణాత్రయంలో గడుస్తూనే ఉంటుంది.


మౌలికమైన ఈ ప్రశ్నలకు ఏదో ఒకనాడు ప్రతి మనిషీ సమాధానాలు వెదకక తప్పదు.