“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

18, మే 2012, శుక్రవారం

సాధన

ఈ మధ్య ఒక పెద్దాయన కలిశాడు. మంచి పండితుడు. సంస్కృతం బాగా చదువుకున్నాడు.మంత్ర శాస్త్రం మీద పరిశోధన చేస్తున్నాను అని చెప్పుకుంటాడు.

"ఏం నాయనా. ఏమిటి విషయం? ఏదో సాధన అంటూ మాట్లాడుతున్నావుట ఈ మధ్యన?" అన్నాడు.

ఆయన నాకు స్వల్ప పరిచయస్తుడే కాని సరాసరి నాతో బాగా పరిచయం ఉన్నవాడు కాదు. వారి ద్వారా వీరిద్వారా నా గురించి ఏదో విన్నాడు. 

"నేను నా చిన్నప్పటి నుంచీ ఇదే మాట్లాడుతున్నాను. మీరు ఈ మధ్యనే విన్నట్లు ఉన్నారు" అన్నాను.

"ఇంతకీ నీవు చేసేది ఏ సాధన? ఏ మహామంత్రాన్ని నీవు ఉపాసించావు? తెలుసుకోవచ్చా?" అడిగాడు. సాధన అంటే ఏదో ఒక మంత్రాన్ని ఉపాసించడమే అనుకునే  బాపతు మనుషులు కొందరు ఉంటారు. ఈయనా ఆ కోవకు చెందినవాడే.

"తెలుసుకోకూడదు" చెప్పాను.

"పోనీ  అసలు సాధన అంటే నీ అభిప్రాయం ఏమిటి? అదైనా చెప్పు" 

"మొదట్లో పోగుచేసుకోవటం, తర్వాత ఊడ్చి పారేయ్యటం, ఈ సారి ఇంకా  ఎక్కువగా పోగు చేసుకోవటం, ఇదే నాకు తెలిసిన సాధన" చెప్పాను.

నాకు కొంచం పిచ్చేమో అన్న భావం ఆయన ముఖంలో కదలాడింది. కాని సంస్కారం అడ్డొచ్చి  మాట బయటికి రాలేదు.

"కొంచేమేమీ కాదు. బాగానే ఉంది" మళ్ళీ నేనే అన్నా. 

"ఏమిటి?" అన్నాడు ఆయన అయోమయంగా. 

"అదే. పిచ్చి." అన్నాను.

"నీవు సాధన గురించి చెప్పినది నాకు అర్ధం కాలేదు. కొంచం వివరిస్తావా?" అడిగాడు.

"వివరించే సాధన నాకు తెలీదు" అన్నాను.

మా సంభాషణ అంతటితో ముగిసింది.