“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

12, మే 2012, శనివారం

చీకటి -- వెలుతురు


ప్రాచీనకాలంలో ఇద్దరు స్నేహితులుండేవారు. 
చర్చలు చెయ్యడం అంటే వారికి భలే ఇష్టంగా ఉండేది.
అందులోనూ తత్వశాస్త్రాన్ని గురించి వాళ్ళు తరచుగా చర్చిస్తూ ఉండేవారు.
"చీకటి అంటే ఏమిటి" అన్న విషయాన్ని గురించి ఒకరోజు చర్చ మొదలు పెట్టారు.

అసలు చీకటి ఎలా వస్తుంది? 
దానివల్ల నష్టాలేమిటి? 
వెలుగుకీ చీకటికీ ఉన్న సంబంధం ఏమిటి? 
వెలుగు లేకపోవడమే చీకటా? 
లేక దానికి ఒక ప్రత్యెక ఉనికి ఉందా? 
చీకటి లేకపోవడం వెలుగా?
చీకటి మనుషుల్ని ఎంత బాధ పెడుతుంది? 
ఎలా బాధ పెడుతుంది?
ఇత్యాది విషయాలపైన ఉదయం మొదలైన చర్చ సాయంత్రం అయినా అలాగే సాగుతోంది. ఎటూ తేలడం లేదు. 
ఇంతలో చీకటి పడింది.
వీళ్ళు దానిని పట్టించుకోకుండా అలాగే చీకట్లోనే కూచుని వాదించుకుంటూ ఉన్నారు.

ఇదంతా ఇంకొక వ్యక్తి మౌనంగా వింటున్నాడు.
చాలాసేపు వినీవినీ ఆ వ్యక్తి ఒక పని చేశాడు.
ఒక కొవ్వొత్తిని వెలిగించి వారివద్ద పెట్టి, మౌనంగా అక్కడనుంచి నిష్క్రమించాడు.
--------------------------------------------------
లోకం అంతా చీకటితో నిండి ఉందన్న విషయం సత్యం. ఇది భౌతికమైన చీకటి కాదు. భౌతికంగా చూస్తె రాత్రిని పగలుగా మార్చే పరిజ్ఞానం మనకు తెలుసు. కాని మనిషి లోపల ఉన్న చీకటిని వెలుతురుగా మార్చే పరిజ్ఞానం మనకు తెలియదు.

మనుషులందరూ చీకటిలో కూచుని చీకటి గురించి చర్చిస్తూ ఉన్నారు. దానిని ఎలా పోగొట్టాలి అని వాదప్రతివాదాలు చేస్తున్నారు.కాని ఒక్కరు
కూడా లేచి దీపం వెలిగిద్దామని ప్రయత్నం చెయ్యటం లేదు. వాదాలతో చీకటి పోదు. దీపం వెలిగిస్తేనే అది మాయం  అవుతుంది. దీపం వెలిగించడం అంటే సాధన  చెయ్యడం. జ్ఞానజ్యోతిని వెలిగించడం.

మనిషికి కావలసింది వాదన కాదు. ఆచరణ కావాలి. 
మనిషి చెయ్యవలసింది విషయసేకరణా, బోధనా కాదు. 
స్వీయసాధన  చేయాలి.
చీకటిని గురించిన చర్చ ముఖ్యం కాదు.
దీపాన్ని వెలిగించడమే ముఖ్యం. 
అది చెయ్యనంతవరకూ చీకటి పోదు.

చర్చలు జోరుగా సాగవచ్చు. ఆనందాన్ని ఇవ్వవచ్చు.
కాని చర్చలు చేసేవారు చీకటిలోనే ఉంటారు.
తత్వచింతన ముఖ్యం కాదు.
నిత్యశోధన  ఉండాలి. 
సత్యసాధన  కావాలి.
అప్పుడే  చీకటి మాయం అవుతుంది. 
అప్పుడే మనిషి జీవితం ధన్యం అవుతుంది.