నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

11, ఏప్రిల్ 2012, బుధవారం

ఆంధ్రాలో విద్యావంతుల కంటే కేరళలో తాగుబోతులు మేలు

మొన్నీ మధ్య మా స్నేహితులు కేరళ వెళ్ళి వచ్చారు. ఆ సందర్భంగా వారు చూచిన విషయం ఒకటి చెప్పారు. అక్కడ ఉన్న శుభ్రతా, ఏ వస్తువైనా దానిమీద ఉన్నధరకే అమ్మడమూ,మోసం లేకపోవడమూ, దేవాలయాలలో నియమనిష్టలు చక్కగా పాటించడమూ,రోడ్డుపక్కన మూత్రవిసర్జన చేసేవాళ్ళు వెతికి చూచినా లేకపోవటమూ, రైల్వే ట్రాక్ శుభ్రంగా ఉండటమూ, అడుక్కుండేవాళ్ళు కనపడకపోవటమూ,నదీతీరాలలో మలవిసర్జన  చేసేవారు లేకపోవడమూ  చూచి వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు. 

మన తెలుగువాళ్ళు కేరళని చూచి చాలా నేర్చుకోవలసిన అవసరం ఉందని వాళ్ళు వెంటనే గ్రహించారు. ఇవన్నీ ఇలా ఉంచితే,వాళ్ళను సంభ్రమానికి గురిచేసిన అసలైన  విషయం ఇంకోకటుంది. తిరువనంతపురంలో ఒకచోట పెద్ద క్యూ కనిపిస్తే, ఎవరా ఇంత క్రమశిక్షణతో క్యూలో నిలబడి ఉన్నారు?ఎక్కడికి పోతున్నారు? అని చూస్తె అదొక బార్.వాళ్ళంతా దానిముందు క్యూలో ఉన్న జనం.అంటే తాగుబోతులలో కూడా ఎంత క్రమశిక్షణ ఉందో అని మావాళ్లకు మతిపోయిందిట.

దీనికి వ్యతిరేకంగా మన ఆంధ్రాలో కొన్ని సంఘటనలు చూద్దాం.బాగా చదువుకున్న వాళ్ళు కూడా ఆంధ్రాలో ఎక్కడా క్యూలో నిలబడరు.ఏదో ఒకరకంగా అడ్డదారిలో దూరేద్దాం అనేచూస్తారు.గుడిదగ్గరైనా,బడి దగ్గరైనా,సినిమా హాలైనా,రైల్వేస్టేషనైనా,కారుపార్కింగ్ దగ్గరైనా,రోడ్డు మీదైనా ఎక్కడైనా ఇదే తంతు. సందు దొరికితే దూరిపోదాం అనే ప్రతివాడూ చూస్తాడు కాని క్రమశిక్షణతో క్యూలోవద్దాం అని ఎవడూ ఆలోచించడు.పోలీసు లేకపోతే, సిగ్నల్ దగ్గర స్వీయ క్రమశిక్షణ పాటించేవారు ఎంతమంది మన ఆంధ్రాలో ఉంటారు? అని ప్రశ్నించుకుంటే ఒక్కడంటే ఒక్కరు కూడా ఉండరు అని ఘంటాపధంగా చెప్పవచ్చు.

మొన్న ఏవో పరీక్షలు అయిపోయాయి.రోడ్డుమీద ఒక స్కూల్ బస్సు పోతున్నది. దాంట్లోంచి కాయితాలూ నోట్సులూ చించి విద్యార్ధులందరూ రోడ్డు మీదకు విసురుతున్నారు. ఆ కాయితం ముక్కలు ఆ బస్సు వెనుక వస్తున్న ఒక స్కూటరిష్టు ముఖాన పడ్డాయి.అతనా కంగారులో, నడిచివస్తున్న ఒకతన్ని గుద్దేసి  ఇద్దరూ కింద పడిపోయారు. ఈమధ్య ఇదొక పాడు అలవాటు మొదలైంది. పరీక్షలు అయిపోతే ఆ నోట్సులు అన్నీ చించి స్కూల్ బస్సులోనుంచి రోడ్డు మీదకి విసురుతున్నారు. ఆ కాగితాలు ఎవరు ఎత్తి పోస్తారు? అలా చెయ్యడం తప్పు అని ఆ విద్యార్ధులకు ఎవరూ చెప్పడం లేదు. కార్పోరేట్ స్కూళ్ళలో ఏమి క్రమశిక్షణ నేర్పుతున్నారో అర్ధం కావడం లేదు. మా చిన్నప్పుడు కాగితాన్ని పొరపాటున తొక్కితే, కాగితం సరస్వతీ స్వరూపం, తీసి కళ్ళకద్దుకోమని పెద్దవాళ్ళు బుద్ధి చెప్పేవారు.   

నేను మనదేశంలో చాలారాష్ట్రాలు చూచాను.మన ఆంధ్రాలో ఉన్నన్ని దరిద్రపు అలవాట్లు ఇతరరాష్ట్రాలలో ఎక్కడాలేవు (బీహార్ లాంటి కొన్ని రాష్ట్రాలు మినహాయించి)అని చెప్పగలను. ఇప్పుడు బీహార్ కూడా  బాగుపడుతున్నది.దానిస్థానాన్నిత్వరలో మన ఆంధ్రా ఆక్రమించబోతున్నది. దక్షిణాదినున్న నాలుగురాష్ట్రాలలో కేరళ కర్నాటకలు బాగుంటాయి. తమిళనాడు ఆంధ్రాలు వాటిముందు దిగదుడుపే.ఈ రెంటిలో మళ్ళీ మనఆంధ్రా పరమదరిద్రం. మనకు శుచీశుభ్రతా, క్రమశిక్షణా ఏకోశానా లేవు. మిగతారాష్ట్రాలవాళ్ళు మన  ఆంధ్రాకు వచ్చి ఈస్తితి మీద  చండాలంగా కామెంట్ చెయ్యడం చాలాసార్లు చూశాను. అందులో నిజం లేకపోలేదు.

ఆంధ్రాలో చదువుకున్నవాళ్ళ కంటే, కేరళలో తాగుబోతులు నయం అనేది నిజమే అనిపిస్తోంది.