“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

10, ఏప్రిల్ 2012, మంగళవారం

ఈ రోజు డా. హన్నేమాన్ పుట్టినరోజు

వాన ముందు పుట్టే ఉసిళ్లలాగా ఈ ప్రపంచంలో ఎందఱో పుట్టి చనిపోతుంటారు. శిశ్నోదర పరాయణులై నిరర్ధకమైన జీవితాలు గడుపుతూ ఉంటారు.కాని జీవితాన్ని ఒక ఉన్నతమైన ఆశయం కోసం వెచ్చించి, చనిపోయేముందు గొప్ప ఆత్మతృప్తితో, "నేను నా జీవితాన్ని వ్యర్ధంగా గడపలేదు. నావల్ల మానవాళికి ఈమంచి జరిగింది.నేను భూమ్మీద పుట్టినందుకు ఇంతమందికి మేలు చెయ్యగలిగాను. మానవాళికి ఎప్పటికీ మిగిలిపోయే ఈ మంచి పనిని నేను చేశాను. ఈ తృప్తి నాకుచాలు." అన్న భావనతో చనిపోయేవారు ఎక్కడో అరుదుగా ఉంటారు. అలాంటి వాళ్ళే కారణజన్ములు. వాళ్లకు మన మెప్పులూ కిరీటాలూ అవసరం లేదు. వాళ్ళు వచ్చ్సిన పని చేసి నిష్క్రమిస్తారు.

ఇదంతా ఎందుకు వ్రాస్తున్నానంటే, ఈ రోజు ప్రపంచ మానవాళికి అద్భుతమైన మేలు చేసిన ఒక నిజమైన మహనీయుడు పుట్టినరోజు. రెండువందల ఏళ్ల క్రితం ఇదే తేదీన డా. హన్నేమాన్ జన్మించాడు. ఎనభై ఏళ్ల సార్ధక జీవితాన్ని గడిపి, దాదాపు నూరుకు పైగా మందులను కనిపెట్టి, హోమియో సూత్రాలను క్రోడీకరించి, దీర్ఘవ్యాధుల స్వరూపాన్ని అర్ధం చేసుకొని, వాటిని నయం చెయ్యాల్సిన తీరును వివరించి చెప్పి, కొన్ని కోట్ల మందికి ప్రాణదానం చేసిన మహనీయుడు డా. హన్నేమాన్. కాని ఇలాంటి వారిని ఎవరూ తలుచుకోరు. ఎక్కడో కొందరు తెలిసినవాళ్ళు మాత్రం వారిని స్మరిస్తారు. మిగతా గొర్రెలన్నీ, సినిమానటులనో రాజకీయ నాయకులనో చూస్తూ భజన  చేస్తూ ఉంటాయి.

ఒక్క ఔషదం కనిపెట్టినవాడికి నోబెల్ ప్రైజ్ ఇస్తే, నూరు మందులు కనిపెట్టినవాడికి ఏమివ్వాలి? ఒక శాస్త్రంలో ఒక సూత్రాన్ని కనుగొన్నవాడిని గొప్ప శాస్త్రవేత్తగా హారతి పడితే, ఒక శాస్త్రాన్ని ఆమూలాగ్రమూ తానొక్కడే నిర్మించి, దానిని సూత్రీకరించి,క్రోడీకరించిన వానికి ఎంత గౌరవం ఇవ్వాలి? కానీ లోకం ఇలాంటి విషయాలు పట్టించుకోదు. దానికెప్పుడూ చౌకబారు విషయాలూ, నాశిరకం కాలక్షేపాలూ మాత్రమే కావాలి. ఎందుకంటే లోకుల మేధోస్థాయి అలాంటిది.

వైద్యరంగంలో ట్రీట్మెంట్ అనేది మానవతతో కూడి ఉండాలని, సరళంగా ఉండాలనీ, అనవసర మందులు వాడకూడదనీ, నిజాయితీగా ఉండాలనీ చెప్పినవాడు డా.హన్నేమాన్. పిచ్చివాళ్ళకు కరెంట్ షాకులివ్వకూడదనీ, గొలుసులతో కట్టకూడదనీ, వాళ్ళను మానవత్వంతో ట్రీట్ చెయ్యాలనీ, హింసించకూడదనీ చెప్పడమే కాక ఆచరించి చూపిన గొప్ప డాక్టర్ శామ్యూల్ హన్నేమాన్. ప్రూవింగ్ అన్న విధానాన్నీ, పొటేన్టైజేషన్ అన్న ప్రక్రియనీ కనిపెట్టి, కనీసం నూరుమందుల స్వరూప స్వభావాలను రికార్డ్ చేసిపెట్టి,  మయాజంస్ అనే దీర్ఘరోగకారక దోషాలను గుర్తించి, వాటిని ఎలా ట్రీట్ చెయ్యాలో వ్రాసిపెట్టి లోకానికి మహోపకారం చేసిన కారణజన్ముడు డా. హన్నేమాన్. 

ఒక మనిషి,మానవాళి మేలుకోసం తపించి,ఒక శాస్త్రాన్ని పునాదులనుంచి నిర్మించుకుంటూ వచ్చి,ఒక మహాసౌధంగా దాన్ని తయారుచేసి,తన కష్టాన్ని లోకంకోసం ధారపోసి తృప్తిగా వెళ్ళిపోయిన ఇటువంటి జీవితాలు లోకంలో అతి కొన్నిమాత్రమే ఉంటాయి.కానీ ఇలాటివాళ్ళను లోకం అసలు గుర్తించదు. పనికిమాలిన సినిమానటులకూ రాజకీయనాయకులకూ మాత్రం  కుళ్ళులోకం బ్రహ్మరధం పడుతుంది.

డా. హన్నేమాన్ తన చివరిరోజులలో ఒక మాట అనేవాడు -- "My life has not been spent in vain." డబ్బు సంపాదించడమో, లేక భార్యా పిల్లలను పోషించడమో లేక పది ఇళ్ళు కట్టించడమో చేసి అదేదో గొప్ప ఘనకార్యం చేసినట్లు ఉబ్బిపోయే లోకులకు ఈ మాటలోని లోతు అర్ధం కావాలంటే వాళ్ళు ఒక పది జన్మలెత్తాలి. అప్పుడు గాని వాళ్లకు కావాల్సినంత  పరిణతి రాదు. ఈ మాటను నిజాయితీగా మనలో ఎందరం అనగలమో, డా. హన్నేమాన్ జన్మదినం రోజున ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకుందామా?