“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

8, ఏప్రిల్ 2012, ఆదివారం

ఓషో రజనీష్ జాతకం,భావజాలం -5

రజనీష్ గురించి ఒకరెవరో చెబుతూ ఇలా అన్నారు. He is best of the best and worst of the worst. బహుశా ఆయన కోరుకున్న ఇమేజి కూడా అదేనని అనిపిస్తుంది. తనగురించి ఒక ప్రసంగంలో చెబుతూ ఆయన  ఇలా అన్నాడు-- 

'కొంతకాలం తర్వాత నా గురించి ఎవరైనా రీసెర్చ్ చేస్తే, వారు నా గురించి ఏమీ చెప్పలేని అయోమయంలో పడతారు. ఎందుకంటే నేనేమీ కొత్త  సిద్ధాంతాన్ని నిర్మించలేదు. ఉన్న సిద్ధాంతాలను ధ్వంసం చెయ్యడమే నేను చేశాను. నేను ఒకచోటచెప్పిన దానిని ఇంకొకచోట ఖండించాను. కనుక చివరికి ఏమీ మిగలదు.' ఇది నిజమే. రజనీష్ సిద్ధాంతాలను సరిగ్గా అధ్యయనం చేసినవారు చివరికి ఏమీ చెప్పలేని మౌనంలో మునిగిపోతారు.

ఇప్పటివరకూ వచ్చిన గురువులలో రజనీష్ లాగా ప్రపంచంలోని అన్ని టాపిక్స్ మీదా ఓపెన్ గా మాట్లాడిన వాళ్ళు ఎవరూ లేరు. చాలామంది గురువులు మాట్లాడటానికి ఇష్టపడని విషయాల గురించి కూడా ఆయన మామూలుగా చర్చించాడు. రజనీష్ ఉపయోగించే తర్కం సూటిగా ఉంటుంది. అది హృదయాన్ని హత్తుకుంటుంది. చాలా తార్కికంగా కాదనడానికి వీల్లేకుండా ఉంటుంది.

సైన్సునూ సైకాలజీనీ చరిత్రనూ సామాజికశాస్త్రాన్నీ యోగాన్నీ మతాన్నీ వివిధ ప్రవక్తలనూ ఉటంకిస్తూ ఆయన చేసిన ప్రసంగాలు విషయపరిజ్ఞానంలోనూ లోతులోనూ తర్కపటిమలోనూ చెప్పేతీరులోనూ అద్భుతంగా ఉంటాయి.ఆయన ఉపన్యాసం విని ఒక విధమైన  'హిప్నాటిక్ స్పెల్' కు లోనవని మనుషులు చాలా అరుదు. 

సామాజికసమస్యల గురించి ఆయన చర్చించిన తీరూ వాటికి ఆయన సూచించిన పరిష్కారాలూ ఒక మార్మికవాది సూచించినట్లే ఉంటాయి.అవి అత్యుత్తమ వేదాంతాదర్శాలను ప్రతిబింబిస్తూ ఉంటాయి. కనుక ఆచరణలో అందరికీ సాధ్యపడవు. కాని అంతమాత్రాన మార్మికవాదులు తమ భావనలను పలుచన చేసుకొని రాజీపడరు. ఉదాహరణకి,దేశాల మధ్య సరిహద్దులనేవి ఒక బూటకం అని ఆయన అన్నాడు. భూమి అంతా ఒకటే, మనమే గీతలు తీసుకొని సరిహద్దులు ఏర్పరచుకున్నాం. ఇదొక అనవసర చర్య అని ఆయన అంటాడు. అలాగే, సైన్యాన్ని మేపడం అనేది సుద్ధ దండగమారిపని అని ఆయన అంటాడు.ప్రపంచ దేశాలు సైన్యం మీదా ఆయుధాల మీదా ఖర్చు పెడుతున్న డబ్బుతో ప్రపంచంలో ఎవరికీ ఏ బాధా లేనన్ని సౌకర్యాలు కల్పించవచ్చు అంటాడు.పోలీస్ వ్యవస్థ కూడా అనవసరం అని ఆయన ఉద్దేశ్యం. ఆదర్శరాజ్యంలో పోలీసులు అవసరం లేదని ప్లేటో కూడా చెప్పాడు. 

కొన్ని విషయాలలో ఆయనలో ఒక ప్లేటో కనిపిస్తాడు. ఒక సోక్రటీస్ కనిపిస్తాడు. ఒక అష్టావక్రుడూ,ఒక పతంజలీ దర్శనం ఇస్తారు. ఆయన భావాలు సోషలిస్టుభావాలకూ కమ్యూనిస్టుభావాలకూ దగ్గరగా ఉన్నట్లు కనిపిస్తాయి. నిజమైన ఆధ్యాత్మికవాదుల భావాలు అలాగే ఉంటాయి. అయితే వాటిలో భౌతికవాదం కంటే ఆధ్యాత్మిక కోణాలు ఎక్కువగా ఉంటాయి. అంతే తప్ప ఆధ్యాత్మికానికీ సోషలిజానికీ పెద్ద భేదాలు లేవు.

ఉన్నతమైన ఆధ్యాత్మిక విషయాలను రజనీష్ చెప్పినంత సులభమైన భాషలో,వివరణాత్మకమైన శైలిలో ఇంతవరకూ ఏ గురువూ కూడా చెప్పలేదు అంటే అతిశయోక్తి కాదు. రజనీష్ ఉపన్యాసశైలి విలక్షణంగా ఉంటుంది. ఏదో ఒక అతీతమైన టాపిక్ ను ఎంచుకొని ఆయన ఎప్పుడూ ఒక గహనమైన ఉపన్యాసం ఇవ్వలేదు. ఈ విషయంలో ఆయన బుద్దున్ని అనుకరించాడు. బుద్దుడు కూడా ఎప్పుడూ ఒక వ్యక్తిని ఉద్దేశించి అతను అడిగిన ప్రశ్నకు మాత్రమే  సమాధానం చెప్పేవాడు. నేటి గురువులవలె ఒక గహనమైన  టాపిక్ మీద ఆయన ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వలేదు.అదే శైలిని రజనీష్ కూడా అనుకరించాడు. అది చాలా మంచి పద్ధతి. 

బుద్ధునికి వ్యక్తి ముఖ్యం. అంతేగాని సమాజం కాదు. వ్యక్తులనుంచి సమాజం వస్తుంది కాబట్టి వ్యక్తులను చక్కదిద్దితే సమాజం చక్కదిద్దబడుతుంది. అంతేగాని ఊరకే నీతిసూత్రాలు గాలిలో వల్లించినంత మాత్రాన సమాజం మారదు. గురువులూ ప్రవక్తలూ సమాజాన్ని ఎప్పుడూ లెక్కచెయ్యరు. సమాజం వారిని అనుసరించాల్సిందే. లేకుంటే అఘోరించాల్సిందే. అంతేగాని వారు సమాజాన్ని ఎన్నటికీ అనుసరించరు. సమాజం ఉన్న స్తితిలో కంటే ఉన్నత స్థాయిలో వారు ఉండటమే దానికి కారణం. 

రజనీష్ ఉపన్యాసాలలో వేదాలు,ఉపనిషత్తులూ,యోగమూ,తంత్రమూ అన్నీ తొంగి చూస్తుంటాయి. ప్రపంచప్రవక్తలు అందరూ సమయానుసారంగా స్టేజిమీదకి వచ్చి వారివారి భావాలను చెప్పి వెళ్లిపోతుంటారు. చివరికి అంతా ఒక చక్కని ముగింపుకు వస్తుంది. ఈ కోణం రజనీష్ ఉపన్యాసాలలో చాలాసార్లు మనం చూడవచ్చు. అందుకే ఆయన ఒక అద్భుతవక్త అనడంలో ఎటువంటి సందేహమూ లేదు.విషయపరిజ్ఞానంలో ఆయన ఏ ఇతరగురువుకూ తీసిపోడు.చాలాసార్లు చాలామంది గురువులు ఆయన ముందు వెలవెలా పోతారు అనడంలోనూ సందేహం లేదు. అన్ని వేలమంది జిజ్ఞాసువులు ఆయన బోధలకు ఎందుకు ఆకర్షింపబడ్డారంటే ఇవే కారణాలు. 

రజనీష్ వ్యక్తిగతంగా ఒక ఉన్నతమైన ఆధ్యాత్మికస్థాయిని అందుకున్నవాడే. అందులో అనుమానం లేదు.కాని తనబోధలతో ప్రజలను అందరినీ సామూహికంగా స్వర్గానికి చేర్చాలని ఆయన తలపోశాడు. మానవసమాజాన్ని ఒక్కసారిగా కొన్నివేల సంవత్సరాలు ముందుకి తీసికెళ్లాలని అనుకున్నాడు. ఆయన బోధలు కూడా అలాటివే. కాని అది సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే ప్రపంచం చీకటిలో ఉంది. ఇక్కడ మాటలు చెప్పేవారు ఎక్కువ,చేతలలో చూపేవారు తక్కువ. ఎందరు ఎన్నినీతులు చెప్పినా చివరికి అందరికీ భోగమే కావాలి. ఆధ్యాత్మికత ఎవరికీ అవసరం లేదు.నేలబారు బతుకులకు అలవాటుపడిన మనుషులను ఒక్కసారిగా మేఘాలలోకి తీసికెళ్ళాలంటే అది సాధ్యంకాదు.ఇక్కడే అందరు ప్రవక్తలూ గురువులూ ఓడిపోయారు. ఆశాభంగానికి గురయ్యారు.

ఏ కాలంలోనైనా సరే,ఉన్నతజీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకునేవారు చాలా తక్కువమందే ఉంటారు.మిగతా అందరూ విషయాన్ని తెలుసుకోవడానికి ఇష్టపడతారు,కాని ఆచరణకు ఎవ్వరూ ముందుకు రారు. ఇది సృష్టి మొదటినుంచీ వస్తున్న మానవచరిత్ర.అందుకే మహాగురువులందరూ కొద్దిమంది అర్హులైన శిష్యులను మాత్రమే ఎంచుకొని వారికి మాత్రమే రహస్యమైన స్వర్గద్వారాలమెట్లను చూపించారు.అవి ఎలా ఎక్కాలనే రహస్యాలనుకూడా అర్హత ఉన్న అతి కొద్దిమందికే వారు నేర్పించారు.ఎందుకంటే ఆధ్యాత్మిక రహస్యాలు బజారులో అందరితో చర్చించదగ్గవి కావు.అవి అర్హులైన కొందరికే అందుతాయి.అర్హత అనేది భౌతిక సమాజంలో కూడా అవసరమే కదా.లోకంలో ఒక మంచిఉద్యోగాన్ని మనం సాధించాలంటే కూడా మనకు కొన్ని అర్హతలు ఉండాలి. దానికి తగిన పరీక్షలు పాసవ్వాలి. ఎవరుబడితే వారు అన్నీ సాధించలేరు.మరి దివ్యజీవనాన్ని పొందాలంటే ఏ అర్హతలూ అవసరం లేదు,అది అందరికీ అందుతుంది,అందాలి అనుకుంటే ఎలా? అదెన్నటికీ సాధ్యం కాదు.

స్వర్గద్వారాలను అందరికీ తెరుద్దామని రజనీష్ అనుకున్నాడు. అది జరిగే పనికాదు అని ఆయనకు తన జీవితం చివరిలో అర్ధమయింది. అందుకే తన చివరి మాటగా - I leave you my dream. అని చెప్పి కన్నుమూశాడు. ఎంచుకున్న కొందరు ప్రత్యేకశిష్యులతో ఒక మార్గంలో ప్రయాణించడం తేలిక. కాని,మందినందర్నీ తనతో తోలుకొనిపోవాలంటే బాధలెక్కువ.వారు కదలరు.వీళ్ళని అడుగు ముందుకు పడనివ్వరు.బహుశా రజనీష్ అందుకే విఫలమయ్యాడు.అంతేకాదు,ప్రతి ప్రవక్తా గురువూ ఇదేవిధంగా చివరికి విఫలం అవక తప్పదు.పరిమిత లక్ష్యాలు పెట్టుకున్న గురువులకు సుఖంగా ఉంటుంది.వారు అనుకున్నపని అయిపోతుంది,వారు వెళ్ళిపోతారు.కాని ప్రపంచమానవస్థాయిని ఒకేసారి ఉద్దరించాలన్న పెద్దపెద్ద ఆశయాలు పెట్టుకున్న వారికి చివరికి ఆశాభంగం తప్పదు.ఎందుకంటే ప్రకృతిఊహ ఒకవిధంగా ఉంటే,దానికి విరుద్ధంగా లక్షలసంవత్సరాల పరిణామాన్ని ఒకేతరంలో తేవాలని వారు ప్రయత్నిస్తారు.ఇది సృష్టిప్రణాళికకు విరుద్ధం కనుక వారు ఓడిపోక తప్పదు.ఎవరైనా సరే ప్రకృతిని ధిక్కరించి సాధించేది అంతిమంగా  ఏమీ ఉండదు.

బుద్ధుని మధ్యేమార్గాన్ని రజనీష్ ఆదర్శంగా స్వీకరించాడు.శరీరాన్ని హింసపెట్ట్టే ఉపవాసాలు మొదలైన పిచ్చిపనులు సాధనకు అనవసరం అని ఆయన తలచాడు.ఇది  సరియైన భావనే. యోగం కూడా ఇదే చెబుతుంది. నిజమైన యోగులకు ఈ విషయం తెలుసు.అంతేకాదు సీరియస్ గా ముఖం పెట్టుకుని అసలు నవ్వకుండా ఉండటం ఆధ్యాత్మికలక్షణం కాదు అది రోగలక్షణం అనికూడా ఆయన చెప్పాడు.ఇదీ నిజమే.బలవంతాన నియమనిష్టలు పాటించడం పరమదండగ. లోపల కోరికలుంచుకుని బయటకి ప్రవరాఖ్యులవలె నటిస్తే ప్రయోజనం లేదు.అలా అణిచిపెట్టుకోడంవల్ల ఉపయోగం లేకపోగా న్యూరోటిక్ రోగాలు వస్తాయి అనికూడా ఆయన చెప్పాడు. చాలామంది దీనిని తప్పుగా అర్ధం చేసుకుని రజనీష్ విచ్చలవిడి సెక్స్ ని బోధించాడు అని భావించారు. ఇది పూర్తిగా తప్పుభావన. తన ఉపన్యాసాలలో ఇదే విషయాన్ని ఆయన చాలాసార్లు చెప్పాడు.మితిలేని భోగమూ తప్పే,అణచివేతా తప్పే,ఎరుకతో కూడిన నియమాన్ని అనుసరించమని రజనీష్ చెప్పాడు. ఇది అక్షరసత్యం.ఏ నియమమైనా తన అవగాహన నుంచి ఎరుక నుంచి ఏర్పడాలి అని ఆయన అన్నాడు. ఇదీ సత్యమే.

అందుకే నేడు యోగాలూ దీక్షలూ చేస్తున్న అనేకమంది జీవితాలలో ఏమీ మార్పులు కనపడవు. దానికి కారణం ఏమంటే, ఉండాల్సిన చండాలం అంతా లోపల ఉంచుకుని బయటకు నల్లగుడ్డలూ ఎర్రగుడ్డలూ డ్రస్సులు మార్చి దీక్షలంటూ నాటకాలాడినంత మాత్రాన ఏమీ జరగదు. మనం కొట్టే కొబ్బరికాయలకు దాసోహం అనడానికి దేవుడు కోతికాదు.మనం మొక్కుకునే అనైతికమొక్కులలో ఆయన ఎన్నటికీ భాగస్వామీ కాబోడు.నిజమైన ఆధ్యాత్మికతను పిచ్చిజనం ఎన్నటికీ గ్రహించలేరు.ఒకవేళ గ్రహించినా ఆచరించలేరు.వీళ్ళకు మిగిలేవన్నీ ప్రాణంలేని తంతులూ, పిక్నిక్ పూజలూ, వారికే అర్ధంకాని వ్రతాలూ, నామతం గొప్పంటే నామతం గొప్ప అంటూ,మతంపేరుతో కొట్టుకుచావటాలూ మాత్రమే.

ఇది గురువులకు తెలియదా మరి? అంటే తెలుసనే చెప్పాలి. మరి తెలిసినాకూడా లోకంతో వారికెందుకీ బాధ? అంటే ఒకటే సమాధానం వస్తుంది.లోకంపట్ల వారికున్న కరుణవల్ల వారు లోకులకు దారిచూపాలని భావిస్తారు. వారు మేఘాలలోకి వెళ్లారు. అక్కడ చాలా హాయిగా ఉంది. ఈ భూమ్మీది బాధలేవీ అక్కడ లేవు.ఆ విషయాన్ని అందరికీ చెప్పాలనీ,అక్కడికి చేరే దారి అందరికీ చూపాలనీ వారి తాపత్రయం.మనం పడే బాధలు అజ్ఞానజనితాలనీ, మన జీవితాలను మనం వృధా చేసుకుంటున్నామనీ  వారికి తెలుసు.ఇంత  జీవనపోరాటం అనవసరం అనీ, ఇలా కాకుండా కూడా మనిషి హాయిగా బ్రతకొచ్చు అనీ, స్వర్గానికి చేరేదారి ఒకటుందనికూడా వారికి అనుభవపూర్వకంగా తెలుసు. ఆ దారిని లోకులకు చూపాలని వారు తపిస్తారు. ప్రవక్తలందరూ ఇలాగే తపించారు. కాని వారందరూ చివరికి తీవ్ర ఆశాభంగం చెందారు. 

ఎందుకంటే మానవులు స్వాభావికంగా చీకటిలో ఉండటానికే ఇష్టపడతారు. కాని అదే సమయంలో వెలుగును ప్రేమిస్తున్నట్లు నటిస్తారు. అలా నటించకపోతే తమను అనాగరికులుగా ఇతరులు భావిస్తారేమో అన్న భయమే ఈప్రవర్తనకు కారణం.అసలు మనిషి జీవితమే నాటకాలమయం.స్వచ్చమైన ప్రవర్తన కలిగినవారు ఒక్కరంటే ఒక్కరు కూడా ఈలోకంలో లేరు అనేది నగ్న సత్యం.

లోకంలో భక్తులు పెరిగిపోతున్నారు అని బాధపడుతున్న తన అనుచరుడితో సైతాన్ ఇలా అన్నాట్ట. "నువ్వేమీ బాధపడకు. ఈ లోకంలో అందరూ నా అనుచరులే,నా భక్తులే. దైవభక్తులుగా నటిస్తున్నవారు కూడా నిజానికి నా భక్తులే.ఈ మతమూ,దేవుడూ,పూజలూ తెలియని మామూలు మనుషులతో పోలిస్తే భక్తులే నిజమైన దొంగలు. వాళ్ళు బయటికి దేవుని భక్తులు, కాని లోపల మాత్రం అందరూ నా భక్తులూ అనుచరులూనూ." క్రైస్తవులూ, ముస్లిములూ చెప్పే సైతాన్ అనేవాడు అసలు లేనేలేడు. అది వేరే విషయం. కాని ఈ కధ మాత్రం సత్యం.

మనిషి యొక్క ఈ నాటకాన్ని అంతం చెయ్యాలనే ప్రతి ప్రవక్తా తపిస్తాడు. రజనీష్ కూడా అలాగే తపించాడు. కాని ఏ ప్రవక్తనూ సమాజం సరిగ్గా అర్ధం చేసుకోదు,  అనుసరించదు.అనుసరించినట్లు నటిస్తుంది. రజనీష్ కూ అదే గతి పట్టింది.

(మిగతాది ఆరో భాగంలో)