“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

10, ఫిబ్రవరి 2012, శుక్రవారం

'ఒకే ఒక్కడు'-Dr సుబ్రమణ్యస్వామి


రాజకీయాలన్నా,రాజకీయనాయకులన్నా,మహాఏవగింపు నాకు మొదటినుంచీ ఉంది.దానికి కారణాలు ఎన్నో.నీతిలేని నాయకులంతా కలిసి దేశాన్ని క్రమేణా భ్రష్టుపట్టిస్తున్నారన్న బాధ ఒకవైపు ఉంటే,నైతిక విలువలూ,సత్యసంధతా వారిలో ఏకోశానా ఉండవనీ,అందరూ నీతులు చెప్పేవారేగాని ఆచరించేవారు ఒక్కరూ వారిలోలేరన్న నగ్నసత్యం    ఇంకొకవైపు కనిపిస్తూ మొత్తానికి వారంటే నాకు సదభిప్రాయం ఏమాత్రం లేకుండా చేసాయి.వారిలో నీతిపరులూ,ధర్మాన్ని అనుసరించేవారూ అస్సలు ఉండరని ఇప్పటివరకూ అనుకునేవాణ్ణి.ఎంతో ఆశగా ఎదురుచూచిన ప్రతినాయకుడూ చివరికి స్వార్ధపరుడూ,అవినీతిపరుడూ,కులపిచ్చిగాడూ అని తేలినప్పుడు ఎంతో ఆశాభంగం చెందేవాడిని.మన దేశానికి ఇప్పట్లో బాగుపడేయోగం లేదని అనుకునేవాణ్ణి. రాజకీయాలలో ఆదర్శవంతులైన నాయకులు అస్సలు లేరని, మన దేశంలో ఇప్పట్లో రారని  ఇప్పటివరకూ అనుకునేవాణ్ణి. కాని నాఅభిప్రాయం తప్పని ఇప్పుడే  అర్ధమైంది. కొందరు కాకపోతే కొందరైనా అలాటివారు ఇంకా మిగిలిఉన్నారని న్యాయం ధర్మం ఇంకా మిగిలి ఉన్నాయనీ ఇప్పుడు నమ్ముతున్నాను. దానికి కారణం జనతాపార్టీ అధ్యక్షుడు Dr సుబ్రమణ్యస్వామి.

ఈయన్ని కొందరేమో సుబ్రమణ్యన్ స్వామి అనీ, కొందరు సుబ్రహ్మణ్యంస్వామి అనీ పిలుస్తున్నారు. మనం మాత్రం సరళత కోసం సుబ్రమణ్యస్వామి అని పిలుచుకుందాం. అలా పిలుచుకుంటే మన తెలుగుకు అనుకూలంగా ఉంటుంది. ఎవరు ఏ విధంగా పిలిచినా అందరూ అనేది మాత్రం ఒకటే -- ఈయనొక విలక్షణ రాజకీయనాయకుడు. He is a political leader with a difference. 

లోకనాయక్ జయప్రకాష్ నారాయణ 1977 లో స్థాపించిన జనతా పార్టీకి ఈయన ప్రస్తుతం జాతీయ అధ్యక్షుడు. ప్రస్తుతం మదురై నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అవినీతిమీదా, స్కాములమీదా 'one man army' లా అలుపు లేకుండా పోరాటం చేస్తున్న యోధుడు. ఈయన జాతకాన్ని పరిశీలిద్దాం.

ఈయన 16 -9 -1939 న  చెన్నై లో పుట్టాడు. ప్రస్తుతం ఈయనకు 72 ఏళ్ళు. ఈ వయసులోనూ చెదరని చిరునవ్వుతో ప్రభుత్వంలోని అవినీతిమీద ఒంటరిపోరాటం చేస్తున్నాడంటే, రాజకీయాలలో ఇంకా ఇలాటివాళ్లు ఉండటం ఈదేశపు అదృష్టం అని చెప్పాలి. ఈయన జాతకంలోని గ్రహస్తితులు కొన్ని గమనిద్దాం.లగ్నంలో ఉన్న బుధాదిత్యయోగం వల్ల ఈయనకు మంచి చదువూ, జ్ఞానమూ, విషయ పాండిత్యమూ కలిగాయి.1964 -65 లో హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఎకనామిక్స్ లో డాక్టరేట్ ను సాధించాడు. అక్కడే ప్రొఫెసర్ గా కొన్నేళ్ళు పనిచేశాడు. తర్వాత 1969  నుంచి 1991 వరకూ IIT డిల్లీలో ఎకనామిక్స్ ప్రొఫెసర్గా ఉన్నాడు.ఇదంతా లగ్నం లోని బుధాదిత్యయోగం వల్ల సాధ్యం అయింది.

దశమాధిపతి శుక్రుడు నీచలో ఉండటం వల్ల ఈయనకు పెద్ద పదవులు ఎక్కువకాలం దక్కలేదు. కాని లగ్నంలోని బుధునివల్ల శుక్రునికి నీచభంగం కలిగింది. కనుకనే వాణిజ్య న్యాయశాఖల మంత్రిగా 1990-91 మధ్యలో పనిచేసాడు.ఆ సమయంలో ఈయనకు విమ్శోత్తరీదశాక్రమంలో శనిలో/రాహు, గురు దశలు జరిగాయి. చంద్ర లగ్నాత్  శని యోగకారకుడు. కాని ఈయనకున్న నీచత్వం, కుజుని చతుర్ధకేంద్ర స్తితివల్ల భంగమైంది. రాహువు శుక్రుణ్ణి సూచిస్తున్నాడు. కనుక శని/రాహు దశలో కేంద్ర మంత్రి అయ్యాడు.


దశాంశకుండలిలో కూడా లాభాస్తానాదిపతి అయిన సూర్యుడు అష్టమ స్థానంలో ఉండటం వల్ల ఈయనకు ప్రతిభ ఉన్నప్పటికీ పదవీయోగం మాత్రం లేదు అని తెలుస్తుంది. లగ్నంలో కూడా శత్రువైన కుజుడు కూర్చుని ఉండటమూ శత్రుస్థానాధిపతి గురువు శత్రుస్థానంలో నీచబుదునితో కలిసి ఉండటమూ చూడవచ్చు. అందుకే ఈయనకు పదవీపరంగా ఎప్పుడూ ఉన్నతస్థానాలలో ఉన్నవారితో గొడవలుంటాయి.


ఇతర దశలను కూడా ఒక్కసారి పరిశీలిద్దాం. సూర్యుడు లగ్నంలో ఉండటంవల్ల ఈయన జాతకంలో షష్టిహాయినీదశ ఉపయోగిస్తుంది. రాహుదశ 1958 లో మొదలవ్వటం తోనే ఈయనకు  విదేశాలతో సంబంధం ఎర్పరచింది. 1964 -65 లో హార్వర్డ్ నుంచి ఎకనామిక్స్ లో డాక్టరేట్ ఇచ్చింది కూడా రాహువే. ఈ రాహువు శుక్రుణ్ణి సూచిస్తూ చంద్ర లగ్నంలో ఉండటం చూడవచ్చు. 1969 వరకూ అక్కడే ప్రొఫెసర్ గా పనిచేసిన తర్వాత ప్రతిష్టాత్మకమైన డిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో ఆహ్వానం మేరకు ఇండియా వచ్చాడు. కాని ఈయన న్యాయపోరాటపు తీరులు ఈయనకంటే ముందే మనదేశానికి చేరటంతో ఆపోస్ట్ ఇవ్వకుండా మొండిచెయ్యి చూపించారు. 


తర్వాత IIT డిల్లీలో ప్రొఫెసర్ గా చేరాడు. అక్కడకూడా ట్రేడ్ యూనియన్లను సపోర్ట్ చెయ్యడం, విద్యార్ధుల సమస్యలపైన వారి పక్షాన నిలబడి యాజమాన్యంతో పోరాటానికి దిగటంతో అక్కడా ఈయనకు చిక్కులే ఎదురయ్యాయి. ఆ సమయంలో గురు మహాదశ జరుగుతున్నది. లగ్న, చంద్ర లగ్నాత్ నష్ట, శత్రుస్థానాలలో ఉన్న గురువు వల్ల ఈయనకు ఆ సమయంలో అన్నీ గొడవలే సరిపోయాయి.1971 లో గురువులో నీచ శుక్రుని దశ జరుగుతున్న సమయంలో ఈయనకి IIT  నించి ఉద్వాసన పలికింది. అప్పుడు కూడా ఇందిరాగాంధీతో ఈయనకున్న అభిప్రాయ భేదాలే కారణాలయ్యాయి. 


జనసంఘ్ తోనూ,జయప్రకాష్ నారాయణతోనూ ఉన్న సంబంధాలు ఈయన్ని రాజకీయాలవైపు నడిపించాయి. 1974-84 వరకూ జరిగిన సూర్యదశలో  లగ్నంలో ఉన్న బుదాదిత్యయోగం ఈయన్ను పార్లమెంట్ సభ్యుణ్ణి చేసింది. తర్వాత 1994 వరకూ నడిచిన ఉచ్ఛకుజుని దశా, తర్వాత 2000 వరకూ నడిచిన చంద్రదశా,  కూడా అదే యోగాన్ని ఇచ్చాయి. అయితే 1976 లో ఎమర్జెన్సీ సమయంలో  ఆయనకు జరిగిన రవి/కుజ దశ మాత్రం బాగా ఇబ్బంది పెట్టింది. దానికి కారణం శత్రుస్థానంలో ఉన్న బలమైన కుజప్రభావం.
   
చైనాతో, ఇజ్రాయెల్ తో మన సంబంధాలు మెరుగు పడటంలో డా|| సుబ్రమణ్య స్వామి ప్రముఖ పాత్ర వహించాడు. డెంగ్ జియావో పింగ్ తో ఈయనకున్న స్నేహంవల్ల 1981 లో భారతీయుల కైలాసయాత్రకు చైనా ఒప్పుకుని యాత్రామార్గాన్ని సుగమం చేసింది.ఆసమయంలో ఈయనకు రవి/శని, రాహుదశలుజరిగాయి.రవిఉన్నతాధికారులకూ,శనిఆధ్యాత్మికతకూ,రాహువు ప్రయాణాలకూ సూచకులని మనకు తెలుసు.కైలాసమానససరోవరయాత్ర ఈనాడు మనం చెయ్యగలుగుతున్నామంటే అది ఈయన చలవే.విజన్ ఉన్న ఒక ఎకనామిస్ట్ గా 'న్యూ ఎకనామిక్ పాలసీ' ని 1991  లోనే ఈయన ఊహించాడు.ఆ సమయంలో ఆయన ప్లానింగ్ కమిషన్ మెంబర్ గా ఉన్నాడు.

శని నీచలో ఉండి వక్రించడం వల్లా , కుజుడు ఉచ్ఛలో ఉండటం వల్ల, వీరిద్దరికీ పరివర్తన వల్లా, వీరిద్దరి మధ్హ్యనా పరస్పరదృష్టివల్లా  ఈయన జాతకంలో ఒక విచిత్ర యోగం పట్టింది. అదేమంటే ఈయనెప్పుడూ ఏదో ఒక సమస్య కోసం పోరాడుతూనే ఉంటాడు. అందులో విజయం దక్కినా దక్కకపోయినా పట్టించుకోడు. సమస్య ఉన్నంతవరకూ సామాన్యుని పక్షాన నిలబడి పోరాటం చేస్తూనే ఉంటాడు.చిన్నాచితకావాళ్ళతో గొడవ పెట్టుకోడు. న్యాయపోరాటం ఆపడు. ఇదొక విచిత్ర యోగం.

శత్రుస్తానంలో ఉన్న ఉచ్ఛకుజునివల్ల ఈయనకెప్పుడూ బలవంతులైన శత్రువులుంటారు. ఇది తప్పదు. కాని లగ్నాధిపతి సూర్యుని స్వక్షేత్రస్తితివల్ల ఈయన కూడా ఏమాత్రం తగ్గడు. చంద్రలగ్నాత్ శని యోగకారకత్వం వల్ల న్యాయశాస్త్రాన్ని ఆసరాగా తీసుకొని నిరంతర పోరాటం సాగిస్తాడు. ఈయనే గనుక కక్కుర్తి పడి అధికారంలోని వారికి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడితే ఎన్నో గొప్ప పదవులు అధిరోహించి ఉండేవాడు. కాని సూర్యుని బలమైన స్తితివల్ల ఈయన ఎన్నటికీ ఆ పని చెయ్యలేడు.

ధర్మస్థానంలోని శనికేతువుల స్తితివల్ల ఈయన మంచి ఆధ్యాత్మికచింతన ఉన్న వ్యక్తి అని తెలుస్తుంది. అంతేగాక గురుస్థానంలోని ఈ గ్రహయోగం వల్ల నిజమైన ఆధ్యాత్మిక మహాపురుషుల అనుగ్రహం ఉన్న సత్పురుషుడనీ తెలుస్తుంది. అందుకనే కంచి పరమాచార్యులైన చంద్రశేఖరసరస్వతీస్వాముల అనుగ్రహానికి పాత్రుడయ్యాడు. కాని లగ్నాధిపతి అయిన సూర్యునికి శనికీ ఉన్న శత్రుత్వం వల్ల, ఈ జన్మలో సామాన్యుల సమస్యల పైన పోరాటమే గాని, ఆధ్యాత్మికసాధనా రంగంలో ఔన్నత్యం మాత్రం సమాజానికి కనిపించే విధంగా కలుగదు.


వచ్చేజన్మలోమాత్రం ఈయనొక మహాయోగిగా జన్మించి ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని పొందటం మాత్రమేగాక,జనులకోసం ఈజన్మలో చేసిన నిరంతర పోరాటంవల్ల వారినుంచి ఆరాధనని కూడా అందుకుంటాడు. పూర్వజన్మలో కూడా ఈయనొక యోగజీవితం గడిపినవాడే. సమాజంతో మిగిలిపోయిన కర్మశేషంవల్ల ఈ జన్మలో పూర్తిగా రాజకీయ జీవితం గడుపుతున్నాడు. కాని తన గతజన్మవాసనలు ఈయన్ని వెంటాడుతూనే ఉన్నాయి. అందుకే ఆధ్యాత్మిక చింతన ఈయనలో ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది.అది వచ్చే జన్మలో బలవత్తరంగా మారి ఆయన్ను సాధనామార్గంలో ముందుకు తీసుకెళుతుంది. దానికి తోడు సద్గురుకటాక్షంకూడా ఈయనకు పుష్కలంగా ఉంది . ఈయనకు విమ్శాంశ లగ్నం మేషం అయింది. పంచమంలో శనీ, లగ్నంలో నవమాదిపతి అయిన గురువూ ఉన్నందువల్ల ఈయన యొక్క ఆధ్యాత్మికచింతన విశదమౌతున్నది. 


1969 లో గురువులో చంద్రదశ జరుగుతున్న సమయంలో ఈయన మొదటి సారిగా కంచిపరమాచార్యులైన చంద్రశేఖరసరస్వతీస్వామి ఫోటోను హార్వర్డ్ యూనివర్సిటీ హాస్టల్లో ఒక స్టూడెంట్ రూములో చూడడం తటస్తించింది. తర్వాత ఆ ఫోటోను ఆయన మరచిపోయాడు. తిరిగి 1977 లో జనతా పార్టీ అధికారంలో ఉన్నపుడు ఆయన మొదటిసారిగా పరమాచార్యులను దర్శించాడు. అప్పటినుంచి 1994 లో పరమాచార్యులు మహాసమాధి అయ్యేవరకూ వీరిద్దరి మధ్యన వీడని అనుబంధం ఏర్పడింది. పరమాచార్యులు సుబ్రమణ్యస్వామిని బాగా అభిమానించారు. వారిద్దరి మధ్యన గురుశిష్య అనుబంధం ఏర్పడింది అని చెప్పవచ్చు."నాజీవితంలో ఏ ఆధ్యాత్మికగురువుకీ నేను పాదాభివందనం చెయ్యలేదు ఒక్క కంచి పరమాచార్యులకు తప్ప"--అంటారు సుబ్రమణ్యస్వామి. ఆయన మీద కంచిస్వామి ముద్ర అంత బలంగా ఏర్పడింది."నడిచేదేవుని"గా పరమాచార్యులను కొలిచేవాడు సుబ్రమణ్యస్వామి.  రాజకీయజీవితంలో ఏ విధమైన ఉన్నత విశాలభావాలతో ముందుకు సాగాలో పరమాచార్యులు ఈయనకు మార్గనిర్దేశనం చేసారు.


జైమినిమహర్షి ఉపదేశసూత్రాలలో ఇచ్చిన ఒక సూత్రం ఈయన జాతకంలో సరిపోతుంది.'సమే శుభ ద్రుగ్యోగాద్ధర్మ నిత్యఃసత్యవాదీ గురుభక్తశ్చ'(1-2 -48)
కారకాంశకు నవమమున శుభగ్రహస్తితి లేదా ద్రుష్టులున్నట్టి జాతకుడు ధర్మపరుడు నిత్యమూ సత్యమును పలుకువాడు గురుభక్తుడు అగును. అని ఈ సూత్రం చెబుతుంది.ఈసూత్రం సుబ్రమణ్యస్వామి జాతకంలో ఎలా సరిపోతుందో చూద్దాం. ఈయన ఆత్మకారకుడు సూర్యుడు.కారకాంశ ధనుస్సు.  అక్కడ నుంచి నవమమైన సింహంలోని బుధాదిత్యయోగం వల్ల ఈయనలో పై లక్షణాలున్నాయని  తెలుస్తుంది.
  
సుబ్రమణ్యస్వామి బంధువులలో పార్శీలు, యూదులు, ముస్లిములు, క్రైస్తవులూ ఉన్నారు. ఆయన ఒక పార్శీ వనితను వివాహం చేసుకున్నాడు. కులాలు మతాలు పార్టీల కతీతంగా ఆయనకు స్నేహితులున్నారు. ఆయన శత్రువులు కూడా ఆయనలోని నీతినీ నిజాయితీనీ విశాలభావాలనూ అభిమానిస్తారు. అటువంటి విలక్షణ వ్యక్తిత్వం ఆయన సొంతం.


రాజకీయాలలో ఉంటూ విలువలకోసం తపన, అత్యున్నత పదవిలో ఉన్నవారి అధికారంతో ఒంటరి న్యాయపోరాటం,ఆ పోరాటానికి ఆధ్యాత్మికనేపధ్యం, ఉన్నతమైన చదువు,మంచి విషయపరిజ్ఞానం-- వెరసి సుబ్రమణ్యస్వామి జాతకం చాలా విలక్షనమైనది.ఇలాటి నాయకులు ఇంకా ఎంతోమంది రావలసిన అవసరం మన దేశంలో ఉంది. 

ప్రస్తుతం ఈయనకు శని మహాదశ జనవరిలో మొదలైంది. ఈ దశలో లగ్నాత్ శనికేతువుల నవమస్తితివల్ల  ఈయనకు ఆధ్యాత్మికచింతన బాగా ఎక్కువ అవుతుంది. అంతేగాక చంద్రలగ్నాత్ సప్తమంలో నీచశనికేతువులవల్ల శత్రువులూ బాగా ఎక్కువ అవుతారు. ద్వాదశంలో ఉన్న నీచశుక్రునివల్ల  బలమైన స్త్రీలనుంచి రహస్యకుట్రలను ఎదుర్కోవలసి వస్తుంది. ప్రస్తుతం ఈయనకు ఏలినాటిశని మధ్య భాగం జరుగుతున్నది.కనుక ఈయన చాలా జాగ్రత్తగా ఉండాలి. అదీగాక ప్రస్తుతం 2G స్కాం మీద ఈయన ప్రభుత్వంతో ఒంటరిపోరాటం చేస్తున్నాడు. కనుక జాతకపరంగా చూస్తే ప్రస్తుతం నడుస్తున్న దశలో ఎంతో జాగ్రత్త తప్పనిసరి అనిపిస్తున్నది.


కుళ్ళిపోయిన నేటి రాజకీయాలలో ఇలాటి శుద్ధమైన విలక్షణమైన వ్యక్తిత్వం కలిగిన మేధావులు నాయకులుగా ఉండటం మన దేశపు మినిమం అదృష్టం అని చెప్పాలి. కాని వారిది అరణ్య రోదన అవడం మన దురదృష్టం. మన దేశంలోని నీచనికృష్ట పరిస్తితులకు ఇలాటివారి ఒంటరిపోరాటం మూగసాక్షిగా మిగిలిపోతున్నది. సమాజానికి సరైన నాయకులు కావాలి అని స్లోగన్స్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడేమంటారు?సరైన నాయకులు ఉండటమూ లేకపోవటమూ కాదు అసలుసమస్య. ప్రజలు పూర్తిగా స్వార్ధపరులూ నీతిలేనివాళ్ళూ చెప్పేదోకటీచేసేదొకటీ అన్న నీతిని అనుసరించేవాళ్ళూ  కావడమే ప్రస్తుతసమస్య. అన్ని రంగాలలో అవినీతి విశ్వరూపం దాల్చడమే నేటి అసలుసమస్య.పైగా నేటిప్రజలు దాన్నొక జీవనవిధానంగా  ఆమోదించటమే  అసలు సిసలైన సమస్య.


నేనుమాత్రం కొన్నేళ్ళుగా నాలో పాతుకుపోయిన అభిప్రాయాన్ని ఇప్పుడు  మార్చుకున్నాను. రాజకీయరంగంలో కూడా నీతి మిగిలిఉందని, ధర్మం ఇంకా జీవించి ఉందనీ ఇప్పుడు నమ్ముతున్నాను. కాని ఏం లాభం? కుండెడు విషంలో ఒక్క పాలచుక్క ఏమూలకు వస్తుంది? మనుషులమీద నాకెప్పుడో నమ్మకం పోయింది. దేవుడే ఈ దేశానికి దిక్కు. కనుక ఓ దేవుడా నాదొక కోరిక. ఎంతోమంది సుబ్రమణ్యస్వాములను ఈసమాజంలో సృష్టించవూ? కులంతో మతంతో కుట్రలతో అవినీతితో కుళ్లిపోతున్న నా దేశాన్ని అలాగైనా కాస్త రక్షించవూ ప్లీజ్ ?