“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

16, జూన్ 2011, గురువారం

జిడ్డు కృష్ణమూర్తి జీవితం తత్త్వం - 7

ఆరుభాగాలూ చదివినమీదట కొందరికి కొన్ని సందేహాలు రావచ్చు. ఇంతకీ ఈయన చెప్పాలనుకున్నదేమిటి? జిడ్డు ఒక గొప్ప మహాత్ముడనా? ఒక భ్రష్ట యోగి అనా? ఒక పరాజిత తాత్వికుడనా? ఒక విఫల జగద్గురువనా? ఒకటి చెబుతూ ఒకటి చేసిన మోసగాడనా ? లేక లోకాన్ని ఉద్దరించాలని తలచిన బోధిసత్వుడనా? గ్రూపులతో, సంస్థలతో విసిగిపోయిన చింతనాపరుడనా? అని రకరకాల సందేహాలు చదివినవారికి ముంచేత్తవచ్చు.  నేను ఏమి చెప్పాలని ప్రయత్నం చేసానో చదువరులకు వెంటనే అర్ధం కాక పోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్క భాగమూ ఆయన జీవితంలోని ఒక్కొక్క కోణాన్ని, ఒక్కోసారి అనేక కోణాలను స్పృశించింది. ఆయాకోణాలు ఒకదానికొకటి  భిన్నంగా ఉండవచ్చు. అందుకే గజిబిజి గందరగోళం  తలెత్తవచ్చు. పైగా ఒక "మనీషి" జీవితం అంత తొందరగా అర్ధం కాదు. దానికి చాలా లోతైన పరిశీలన కావాలి. కనుక  ఈ భాగంలో నేను చెప్పాలని అనుకున్నదాన్ని క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేస్తాను.

జిడ్డు పైన చెప్పిన అన్నీనూ. అంతే గాక వాటికి అతీతుడైన ఒక సత్యప్రేమికుడూ, తాత్వికుడూ, యోగీనూ. ఆయన తియోసఫీ ప్రభావానికి లోనై, దాని సాధనలు చేస్తున్నంత వరకూ మాయలో బ్రతికినవాడే. అనీబెసంట్ మొదలైనవారు తాము నమ్మినదే నిజమని, తమకు తెలిసినదే అంతిమం అనీ భ్రమించారు. ఆ దారిలో ఆయన్ను నడిపించారు. అక్కల్ట్ లోకం అంతా మాయ అనే విషయం ఆయనకు నిత్యానంద మరణం వరకూ తెలియలేదు. చిన్న పిల్లవానిగా ఉన్నప్పుడు తియోసఫీ గురువులు ఏది చెబితే అది చేసాడు. వారు నడవమన్న దారిలో నడిచాడు. వారు చెప్పిన సాధనలు చేశాడు. అది మంచో కాదో తనకు నప్పుతుందో నప్పదో ఆయనకు తెలీలేదు.  ఆ మాయ అనేది నిత్యానంద మరణంతో విడిపోయింది. అప్పటినుంచీ ఆయన తనంతట తాను తనదైన సాధనా మార్గంలో నడవటం మొదలు పెట్టాడు. ఏ మనిషైనా ఎప్పటికైనా చెయ్యవలసింది ఇదే.

బుద్దుడు కూడా ఇదే చేసాడు. సత్యాన్వేషణలో ఆయన కొందరు గురువుల వద్ద శిష్యరికం చేసాడు. కాని వారి బోధనలు ఈయన దాహాన్ని తీర్చలేకపోయాయి. అందుకే వారిని మర్యాద పూర్వకంగా వదిలి తన దారిలో పయనించాడు. తనదైన సాధనతో గమ్యం చేరాడు. అలాగే జిడ్డు కూడా చేసాడు. జిడ్డు బుద్ధుని మార్గమే అనుసరించాడు. జిడ్డు బుద్ధుని శిష్యుడే. అతను బౌద్ధ భిక్షువు కానక్కరలేదు. కాని బుద్ధ మార్గంలో నడిచినవాడే.   మైత్రేయ ఒక బోధిసత్వుడే. మైత్రేయను తనలోకి ఆహ్వానించి జిడ్డు కూడా ఒక బోధిసత్వుడయ్యాడు. ఆయన బుద్ధుని మీద రోజుల తరబడి ధ్యానం చేసేవాడని ఆయనే చాలా చోట్ల చెప్పాడు. 

నిత్యానంద మరణం తర్వాత దియసఫీ సాధన ఒదిలిపెట్టి,  తన సొంత సాధనలో తాను పురోగమించాడు. ఏమిటా సాధన అని చూస్తె, అది "జెన్" అని అర్ధమౌతుంది. జెన్ అంటే బౌద్ధ ధ్యానసాధన. దానికీ అద్వైత వేదాంత సాధనకూ పెద్ద తేడా లేదు. అద్వైతం (వేదాంత ధ్యానం) పాజిటివ్. జెన్(బౌద్ధ ధ్యానం) నెగటివ్. అంతే తేడా.  

అంతర్ముఖుడై తనను తాను  పరిశీలించుకుంటూ, తన లోలోపలికి తానే మునిగి సత్యాన్ని ముఖాముఖి అనుభూతి చెందటమే జెన్. ఇందులో పూజలు జపాలు ధ్యానాలు గుళ్ళూ గోపురాలూ గ్రంధాలూ ఏవీ ఉండవు. ఇది శుద్దమైన జ్ఞానమార్గ సాధన. అందరూ దీనిని చెయ్యలేరు. దీనికి కొన్ని అర్హతలు ఉండాలి. అటువంటివానికే ఇది సాధ్యమౌతుంది. తనకు తెలిసో తెలియకో జిడ్డు ఆ మార్గంలోకి ఆకర్షింప బడ్డాడు. ఆ మార్గంలో నడిచాడు. అదికూడా సహజంగా నడిచాడు. కనుకనే అద్భుతమైన అంతరిక కోణాలు లోకానికి ఇవ్వగలిగాడు. సహజంగా నడవటం అంటే ఏమిటి?

దెబ్బ తిన్నవానికి మందు పూస్తే గాయం నయమౌతుంది. కాని దెబ్బ తగలకుండా, తగిలినట్లు భావించుకుని మందు పూసుకుంటే అది ఉపయోగపడదు. ఆకలి వేసినవానికి తిండి పెడితే అతని ఆకలి తీరుతుంది. కాని ఆకలి వెయ్యకుండానే టైం అయిందనో, ఇంకోటనో అనుకుని తినడం మొదలు పెడితే అది కృత్రిమంగా ఉంటుంది. రోగానికి దారితీస్తుంది. లోకుల పరిస్తితి కూడా అలాగే ఉంది. 

నిజమైన తపన ఉన్నవాడు సాధన చేస్తే, అతనికి దారి కనిపిస్తుంది. ప్రకృతే అతన్ని నడిపిస్తుంది. కాని తపన లేకుండా, పక్కవాడు చేస్తున్నాడని ఫాన్సీ గా తానూ చెయ్యడం మొదలుపెడితే అది కృత్రిమ సాధన అవుతుంది. నేడు లోకంలో నూటికి తొంభై తొమ్మిది మంది కృత్రిమ సాధనలు చేస్తున్నవారే. ఎవరికీ నిజమైన దాహం లేదు, నిజమైన ఆకలి లేదు, నిజమైన తపన లేదు. అందుకే వాళ్ళ సాధనలూ, పూజలూ, ధ్యానాలూ ఏడిసినట్లే ఉంటున్నాయి. 

తనకు ఆకలివేస్తే తాను తినాలి గాని, ఎదుటివాడు తింటున్నాడని మనం తినరాదు. రోడ్డుమీద మనం డ్రైవ్ చేస్తున్నపుడు, ఎవడో మనల్ని దాటిపోతే, వాడి అవసరానికి వాడు పోతున్నాడని  మన స్పీడులో మనం పోవాలి గాని, వాణ్ని చూచి మనమూ అంతకంటే స్పీడుగా పోవాలని ప్రయత్నించరాదు. ఇదీ అలాటిదే. 

ఈ కారణంవల్లనే నేడు జనాలందరూ వేలంవెర్రిగా తీసుకుంటున్న యోగ దీక్షలూ, శక్తిపాతాలూ, గ్రూపు కోర్సులూ ఎందుకూ పనికిరావడం లేదు. కారణమేమంటే, ఇచ్చే గురువులకు శక్తీ లేదు, తీసుకునే శిష్యులకు తపనా లేదు. ఇద్దరి ఉద్దేశాలలోనూ స్వచ్చతలేదు.  యోగం అనేది ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కాదు. ఏదో ఒకటి ఆర్డరిచ్చి గబగబా తిని బయటపడటానికి. అది ఒక రహస్యలోకం. ఆ లోకంలో ప్రవేశించాలంటే కావాల్సింది డబ్బుచెల్లించడం కాదు. దానికి నిజమైన తపన ఉండాలి. గురువు నిజాయితీపరుడై తాను చెబుతున్నదాన్ని ముందుగా అనుభూతి పొందినవాడై ఉండాలి. అది లేకుండా ఎన్నెన్ని కోర్సులు చేసినా ఏమీ ఉపయోగం ఉండదు.

జిడ్డు మొదటినుంచీ కృత్రిమ సాధన చేసాడు. ఆ సాధన వెనుక తపన లేదు. తపనను పుట్టించే సంఘటనలు అప్పటికి ఏవీ జరుగలేదు. కాని నిత్యానంద మరణం తర్వాత అది సహజ సాధనగా మారింది. బాధ నుంచి పుట్టినదే అసలైన సాధన అవుతుంది. అందుకే జీవితం సుఖంగా గడుస్తున్నవాళ్ళు ఆధ్యాత్మికత వైపు ఆకర్షింపబడరు. ఒకవేళ ఆకర్షింపబడినా ముందుకు వెళ్ళలేరు. అందుకనే బాబాల భక్తులూ స్వామీజీల శిష్యులూ జీవితాంతం అలాగే ఎదుగూ బొదుగూ లేక ఉంటుంటారు. వాళ్ళలో జ్ఞానులైన వాళ్ళు ఎక్కడా కనిపించరు. జీవితంలో ఒక బాధాకరమైన సంఘటన జరిగినప్పుడు దాన్ని ఆధ్యాత్మికంగా మలుచుకున్నవాడే నిజమైన మానవుడు. జిడ్డు జీవితంలో అది జరిగింది. కనుక అప్పటినుంచీ వేగంగా పురోగమించాడు. తర్వాత కూడా ఆయన కొన్ని తప్పులు చేసి ఉండవచ్చు. అంత మాత్రాన ఆయన జీవితం విలువలేనిది అయిపోదు. ఆయన చెప్పినది పనికిరానిది అవదు. 

ఈయనలో జెన్ కు తోడుగా కుండలినీ సాధన కూడా కలిసింది. అయితే అది ఆయన కావాలని చేసినది కాదు. జ్ఞాన మార్గ సాధనలో కుండలిని దానంతట అదే జాగృతమైంది. అది ఆయన బ్రెయిన్ స్ట్రక్చర్ లోనూ, నాడీమండలం లోనూ  మార్పులు తెచ్చింది. అందుకే ఆయన తలలోనూ వెన్నులోనూ అమితమైన నొప్పి కలుగుతూ ఉండేది. అదే సమయంలో అద్భుతమైన అనుభవాలూ కలిగేవి.

అయితే జిడ్డు చేసిన పొరపాటు ఒకటి ఉంది. తాను పొందిన జ్ఞానాన్ని అందరికీ చెప్పాలని ప్రయత్నం చేసాడు. అందరూ దీన్ని ఆచరించ గలరని అనుకున్నాడు. అది అసాధ్యం. అందుకే ఆయన బోధన ఎవరికీ ఎక్కలేదు. శంకరుల బోధన కూడా అంతే. విన్నంత సేపూ వేదాంతమూ జెన్ రెండూ చాలా బాగుంటాయి. కాని ఆచరణలోకి తేవాలంటే తాతలు దిగి వస్తారు. ఎక్కడో నూటికి కోటికి ఒకరో ఇద్దరో మాత్రమె వీటిని  సాధించగలరు. 

తన జీవితం చివరలో ఎవరో ఆయన్ను ఇదే అడిగారు. " మీరు చెప్పినది ఎవరికైనా అర్ధం అయ్యిందని మీరు భావిస్తున్నారా? అన్న ప్రశ్నకు ఆయనిలా సమాధానం చెప్పాడు. "అలాటివాళ్ళు ఉన్నారని నేననుకోను. చాలా కొద్ది మంది ఉండొచ్చు. లేదా అసలు లేరేమో" అన్నాడు.

కాని ఆయన చేసినదాన్ని పొరపాటు అనవచ్చా? అనలేమేమో. ఎందుకంటే గమ్యాన్ని చేరిన ప్రతి మహానీయుడూ అదే చేస్తాడు. కొందరు అతిజాగ్రత్తగా పరిశీలించి శిష్యుల్ని ఎంచుకొని వారికి తన అనుభవాన్ని గుప్తంగా వినిపిస్తారు. కొందరు వారూ వీరనక అందరికీ వెదజల్లుతారు. అర్ధం అయినవాడికి అర్ధం అవుతుంది. లేనివాడికి లేదు. ఇద్దరూ కరెక్టే. ఈ దృష్టితో చూస్తె జిడ్డు చేసినదాన్ని పొరపాటు అనలేము అనిపిస్తుంది. బుద్ధుడు కూడా ఇదే చేసాడు. తాను పొందిన జ్ఞానాన్ని లోకానికి బోధిస్తూ ఆయన దాదాపు నలభై ఏళ్ళు దేశమంతా తిరిగి ప్రసంగాలు ఇస్తూనే గడిపాడు. ఎంతమందికి అర్ధమైంది అంటే ఏం చెప్పగలం? అర్ధమైనవాడికి అర్ధమౌతుంది. లేనివాడికి లేదు.

జిడ్డు మీద చేసే ముఖ్య ఆరోపణ, రోసలిన్ మొదలైన వారితో రహస్య సంబంధం కలిగి ఉన్నాడు అని. అది నిజమో కాదో ఎవరికీ తెలియదు. ఆరోపణలు మాత్రం ఉన్నాయి. ఒకవేళ అది నిజమే  అనుకున్నప్పటికీ, దాన్ని పెద్ద విషయంగా పరిగణించవలసిన పని లేదు. ఆధ్యాత్మిక జీవితం హైవే కాదు. ఒకే స్పీడులో మొదట్నుంచీ చివరిదాకా రయ్యిమంటూ దూసుకుపోవడానికి అది అమెరికా రోడ్డు కాదు. ఎగుడు దిగుడు బాట. ముళ్ళ బాట.  ఇండియా పల్లెటూరి బాట. దానిలో నడిచిన వాళ్లకు దాని లోతులు, గతుకులూ, ఎత్తుపల్లాలూ తెలుస్తాయి. దారిలో ఒకసారి కింద పడినంత మాత్రాన ప్రయాణం ఆగిపోదు. పడినవాడు మళ్ళీ లేచి నడుస్తాడు. ముందుకు వెళతాడు. గమ్యాన్ని చేరతాడు. Every saint has a past, every sinner a future అని ఊరకే అనలేదు. 

ఇంకొక కోణం చెప్తాను. దీన్ని అర్ధం చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. త్వరగా మింగుడు పడదు. ఇటువంటి ఉన్నత మైన సత్యాలు సామాన్య జనానికి ఎక్కవు.  ప్రపంచాన్ని, జీవితాన్ని ఒక్క జ్ఞాని మాత్రమె నిజంగా ఎంజాయ్ చెయ్యగలడు. ఎంజాయ్ చేసే అర్హత అతనికే ఉంటుంది. మామూలు మనిషికి లోకాన్ని ఎంజాయ్ చెయ్యటం తెలీదు. ఎంజాయ్ చేస్తున్నానని భ్రమ పడుతూ, జీవితం తన చేతిలోనుంచి జారి పోతున్నదని అనుక్షణం భయపడుతూ బతుకుతూ  ఉంటాడు అంతే. ఆ మాటకొస్తే ఒకరితో కాదు, వందలాదిమందిలో సంబంధాలు కలిగి ఉండే అర్హత ఒక్క జ్ఞానికే ఉంటుంది. వేలమందితో సంబంధం కలిగి ఉన్నాకూడా చలించని మనసు కలిగినవాడే అసలైన జ్ఞాని. ఈ కాన్సెప్ట్ అర్ధం చేసుకోవడం అతి కష్టం.  శ్రీకృష్ణుడే దీనికి ఉదాహరణ. ఆయన్ను మించిన విజ్ఞాని ఎవ్వరూ లేరు. కాని లోకానికి ఆయన సరిగా అర్ధం కాడు. కృష్ణ తత్త్వం లోకానికి ఎప్పటికీ అర్థం కాదు. ఎందుకంటే దాన్ని అర్ధం చేసుకునే స్థాయి లోకానికి లేదు. బహుశా ఇంకొక వెయ్యి సంవత్సరాలకైనా ఆ స్థాయి వస్తుందో లేదో అనుమానమే. 

అంత మాత్రాన విచ్చల విడి తనాన్ని నేను సమర్ధిస్తున్నానని అనుకుంటే పప్పులో కాలేసినట్లే. లోకంలో ఒక విచిత్ర నియమం ఉంది. ఒకదాన్ని మనం పొందటానికి నిజమైన అర్హత వచ్చిన వెంటనే దానిమీద మనకు ఆసక్తి లేకుండా పోతుంది. లోకంలో ఏదైనా సరే, అది మనకు లభించనంతవరకే దానిమీద మోజు ఉంటుంది. మనం వెతుకుతున్నది దొరికిన తర్వాత ఏమీ ఉండదు. ఓస్ ఇంతేనా అనిపిస్తుంది.  కాని అప్పుడే మనకు దానిమీద అధికారమూ అర్హతా కలుగుతాయి. ఆసక్తి లేనివాడికే అన్నీ ప్రాప్తిస్తాయి. బంగారం మీద ఏమాత్రం ఆసక్తి లేనివాడికే పరుసవేది విద్య లభిస్తుంది. ఈ రహస్య నియమాన్నే నేను చెబుతున్నాను. జ్ఞానికి దేనిపైనా ఆసక్తి ఉండదు కనుక అతనికి అన్నీ అందుబాటులోకి వస్తాయి. వాటివెనక మనం పరిగెత్తితే మాత్రం అవి దూరంగా పారిపోతుంటాయి. ఇదొక విచిత్ర నియమం. ఎవరి జీవితంలో వారు దీన్ని పరిశీలించి చూసుకోవచ్చు.

జిడ్డు జీవితంలో తప్పులు చేసి ఉండవచ్చు. రజనీష్ కొన్ని తప్పులు చేసి ఉండవచ్చు. కాని ఆ తప్పులతోనే వారు ఆగిపోలేదు. అవే తప్పులు జీవితమంతా చేస్తూ ఉండిపోలేదు. వాటిని దాటి ఎంతో ముందుకు ఎదిగారు. ఆ ఎదుగుదల మనకు కనిపించదు. వారు చేసిన తప్పులే ( ఒకవేళ అవి నిజాలు అయితే) కనిపిస్తాయి. అందుకే వాళ్ళను మనం ఎప్పుడూ తప్పుగానే అర్ధం చేసుకుంటాం. అదే మనం చేసే పొరపాటని నేనంటాను. 

ఆధ్యాత్మిక లోకంలో వేసిన ఏ అడుగూ వృధా కాదు. అది ఇంకొక అడుగుకు పునాది అవుతుంది. మున్ముందుకు మనిషిని తీసుకెళుతుంది. జిడ్డు దియసఫీలో ఉన్నంతవరకూ చేసిన సాధన అంతా వృదాగానే గడిచింది.  కాని దాన్ని పునాదిగా చేసుకొని చేసిన తన సొంత సాధన మాత్రం ఆయనకు అంతరిక లోతులు చూపించింది. కనుకనే ఆయన జీవితాన్ని సాధనా పరంగా చూస్తె రెండు భాగాలుగా కనిపిస్తుంది. మొదటి భాగం పెద్ద గొప్పగా ఏమీ ఉండదు. రెండో భాగంలోకూడా కొన్ని ఎత్తు పల్లాలు కనిపిస్తాయి. అంత మాత్రాన ఆయన ఒక మోసగాడని చెప్పటానికి వీల్లేదు. ఆయన ఉన్నతుడే. అందులో అనుమానం లేదు.  

తన జీవితం చివరి చివరికి, ఒక జెన్ మాస్టర్ కు ఎటువంటి అనుభూతి కలుగుతుందో అదే అనుభూతి ఆయనకూ కలిగిందని నా భావన. ఎందుకంటే ఆయన చివరికి చెప్పిన మాటలు ఆ భావననే కలిగిస్తాయి. There is nothing beyond this, this is the beginning and ending. This seems to be the ultimate state. అని ఆయన అన్నాడు. All the creation is most holy. అన్న అద్భుతమైన మాట కూడా ఆయన చెప్పాడు. ఆయన బోధన అంతా జెన్ తో నిండి ఉంది.  Truth is a pathless land అన్నప్పుడూ Meditation is choiceless awareness అన్న ప్పుడూ అదే జెన్ ఫ్లేవర్ అందులో కనిపిస్తుంది. 

మనిషి తన ఆలోచనలనూ, ఆకాంక్షలనూ, భయాలనూ, కోరికలనూ, ఊహలనూ, అనుభూతులనూ నిశితంగా, ఏ మాత్రం తొట్రు పడకుండా, రాజీ పడకుండా పరిశీలిస్తే మూలానికి దారి అదే కనిపిస్తుంది. ఆ మూలానికి చేరిన తరువాత సత్యం తానె స్వయంగా సాక్షాత్కరిస్తుంది. ఇదే అత్యుత్తమ సాధన. బుద్ధుని నుండి నేటి వరకూ అందరు జెన్ గురువులూ పాటించినదీ సాధించినదీ ఇదే. సమస్త సమస్యలకూ పరిష్కారం ఇందులోనే ఉంది. జిడ్డు కూడా బోధించినది ఇదే.   

కాని దానికి మంచి గట్టిదైన సత్యాన్వేషణ ఉండాలి. ఈ అన్వేషణలో ఏ ప్రలోభాలకూ లొంగని పట్టుదల ఉండాలి. లోకాన్ని కాకుండా తనను తానె అనుక్షణం విమర్శించుకోవాలి. తన అంతరంగాన్ని తానె పరిశీలించుకోవాలి. గమ్యం చేరేవరకూ నిరంతరం ఈ అన్వేషణ కొనసాగించాలి. ఈ అన్వేషణ తోనే మనిషి బుద్ధుడు కాగలుగుతాడు. అప్పుడే అతని జీవితం ధన్యత్వాన్ని సంతరించుకుంటుంది. అతడు తన ప్రయాణాన్ని ముగించగలుగుతాడు. మానవ జన్మ ఎత్తినందుకు చెయ్యవలసిన పనిని అతడు చెయ్యగలుగుతాడు.  

అటువంటి వారిలో ఒకడు జిడ్డు కృష్ణమూర్తి అని నా అభిప్రాయం. ఆయన గమ్యాన్ని చేరాడా లేదా అనేది ప్రశ్న కాదు. కాని లక్షల మందికంటే ఆయన ముందున్నాడు. పాత సారానే కొత్త సీసాలో పోసి చూపించాడు. ఎవరైనా కూడా చెయ్యగలిగేది ఇంతే. పాత వాటినే తన జీవితంలో అనుసరించి, ఆచరించి చూపించాలి. తద్వారా వాటికి మళ్ళీ నూతనత్వాన్ని ఇవ్వాలి. ఆ క్రమంలో అంతరిక జీవితంలో చేతనైనంత ముందుకెళ్లాలి.  

ఈ కోణంలో జిడ్డు జీవితాన్ని చూస్తె మనకు సరియైన అవగాహన వస్తుంది. మనం ఆయన్ను ప్రేమించాల్సిన పనీ లేదు, ద్వేశించాల్సిన పనీ లేదు. ఆయన చెప్పింది సరిగ్గా అర్ధం చేసుకుని దాన్ని ఆచరణలో పెట్టగలిగితే చాలు. ఏ మహానీయుడైనా కోరుకునేది ఇదే. ఎందుకంటే ఆ ఆచరణ మాత్రమె, వారందుకున్న శిఖరాలకు మనల్ని కూడా చేర్చగలదు. మిగిలిన చర్చలన్నీ ఉత్త వృధా మాటలేనని మనం మర్చిపోరాదు.  

ఏది ఏమైనప్పటికీ, 1929 లో తానిచ్చిన డిసొల్యూషన్ స్పీచ్ లో ఆయన చెప్పిన ఆఖరి మాట ఆలోచనాపరులను ఎప్పటికీ ఉత్తెజపరుస్తూనే ఉంటుంది. జిడ్డు యొక్క తాత్విక చింతనా, బోధనా, అంతా కూడా ఈ ఒక్క వాక్యంలో ఇమిడి ఉంది.

"My only concern is to set men absolutely, unconditionally free."