“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

13, జూన్ 2011, సోమవారం

జిడ్డు కృష్ణమూర్తి జీవితం-తత్త్వం-6

జిడ్డు జాతకంలో ఒక విచిత్రం ఉంది. రాహువు గురునక్షత్రంలో ఉన్నాడు. గురువు రాహు నక్షత్రంలో ఉన్నాడు. అంటే రాహు గురువులకు నక్షత్ర స్థాయిలో పరివర్తన ఏర్పడింది. ఇది ఒకరకమైన గురుచండాలయోగం. పైగా ఈయనకు నవాంశలో గురువు నీచస్తితిలో ఉన్నాడు. అందుకే ఈయనకు విదేశీ గురువులతోనూ, కలగూర గంప లాటి దియోసఫీ తోనూ పరిచయం ఏర్పడింది. ఆ గురువుల పర్యవేక్షణలో జరిగిన సాధనలో తీవ్ర ఆశా భంగం కలిగింది. తమ్ముడు నిత్యానంద మరణమే ఆ ఆశాభంగం.  

చిన్నప్పటి నుంచీ కృష్ణమూర్తీ, నిత్యానందా ఒకే ప్రాణంలా బతికేవారు. తన అన్నదమ్ములలో అందరిలోకీ తమ్ముడంటే కృష్ణమూర్తికి చాలా ప్రేమగా ఉండేది.  అనీబెసంట్ వీళ్ళిద్దరినీ దగ్గరకు తీసింది. యూరప్ లో చదివించింది. తనతో దేశదేశాలు తిప్పింది. అన్నాతమ్ముల మధ్యన చాలా గాఢమైన అనుబంధం ఉండేది. వరల్డ్ టీచర్ గా తన భవిష్యత్ జీవితంలో నిత్యానంద కూడా ముఖ్య భూమిక పోషిస్తాడని కృష్ణమూర్తి అనుకునేవాడు. అనీబెసంట్ మొదలైన తియసఫీ గురువులు కూడా అదే నమ్మబలికారు. అందుకే కృష్ణమూర్తికి నిత్యానంద మరణం మింగుడు పడలేదు.

1925 నవంబర్ లో నిత్యానంద టీబీ తో మరణించాడు. ఆ సమయంలో ఈయనకు గురు/గురు/రాహు దశ నడిచింది. గురువు త్రుతీయాదిపతిగా తమ్ముణ్ణి సూచిస్తూ రోగస్తానమూ, ఊపిరితిత్తులకు సూచికా అయిన మిధునం లో ఉన్నాడు. రాహువు ద్వితీయ మారక స్థానంలో ఉన్నాడు. ద్రేక్కాణచక్రంలో గురువూ రాహువూ కలిసి సోదర కారకుడైన కుజునితో లగ్నాత్ ద్వితీయ మారక స్థానమైన తులలో ఉన్నారు. మాస్టర్స్ కాపాడతారనీ, అతనికి ఏమీ కాదనీ అందరూ కృష్ణమూర్తిని నమ్మించారు. కాని నిత్యానంద మరణించాడని వీళ్ళకు టెలిగ్రాం ద్వారా తెలుస్తుంది. 

ఆ సమయంలో వీళ్ళంతా ఓడలో భారత దేశానికి వస్తుంటారు. నిత్యానంద మాత్రం అనారోగ్య కారణాల వల్ల "ఒజాయ్"  లో ఉంటాడు. అదే కృష్ణమూర్తి జీవితంలో పెద్ద మలుపు. ఓడ ప్రయాణం సాగిన దాదాపు పదిరోజులపాటు ఆయన తన కేబిన్ లో ఏడుస్తూ, తనలో తాను మధనపడుతూ, కలవరిస్తూ, ఆ షాక్ నుంచి తేరుకోడానికి ప్రయత్నిస్తూ గడిపాడు. ఆ సమయంలో ఏ గురువులూ ఆయనకు సహాయం రాలేదు. ఏ మాస్టర్ లూ ఆయన్ను ఓదార్చలేదు. ఎందుకిలా జరిగిందంటే ఎవరూ ఆయనకు సమాధానం ఇవ్వలేదు. 


అది ఒక మామూలు సంఘటన కాదు. చిన్న తనం నుంచి తాను నమ్ముతున్న నమ్మకాలకు గొడ్డలి పెట్టు. గురువులమీదా, మాస్టర్ ల మీదా ఆయన చిన్నతనంనుంచీ  పెంచుకున్న విశ్వాసానికి చావుదెబ్బ. ఆ దెబ్బతో ఆయన కళ్ళు తెరుచుకున్నాయి. గురువులూ, మహాత్ములూ, సాధనలూ, ధ్యానాలూ, దర్శనాలూ, అన్నీ భ్రమలే అన్న జ్ఞానోదయం కలిగింది.  ఇవన్నీ మనసు చేసే మాయలనీ, ఈ మాయలను దాటి ఆవలికి చూడగలిగితే సత్యం తేటతెల్లంగా కనిపిస్తుందన్న సంగతి ఆయనకు బోధపడింది. 

అప్పటి నుంచి ఆయన సాధన కొత్త పుంతలు తొక్కింది. స్వచ్చమైన అంతర్ద్రుష్టితో తన అంతరంగాన్ని తానే  పరిశీలించుకోవడం మొదలుపెట్టాడు. కృతకమైన  సాధనలూ ధ్యానాలూ చెయ్యడం ఆపేశాడు. తద్వారా ఆయన గొప్ప అంతరిక స్తితులను అందుకున్నాడని చెప్పక తప్పదు. దియసఫీ గురువులు బోధించిన సాధన ఆయనకు ఏమీ దారి చూపలేదు. తనలో సహజంగా ఉన్న అంతర్ద్రుష్టీ, ఇప్పుడు తనలో కలిగిన విరక్తీ, అసలేం జరిగిందన్న ఆలోచనా, లోతైన పరిశీలనా శక్తీ ఇవన్నీ కలిసి ఆయనకు ఒక కొత్త సాధనా మార్గాన్ని చూపించాయి. ఆ మార్గమే ఆయనకు అద్భుత అనుభవాలను అందించింది. ఈమాటను ఆయన ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆయన జీవితచరమాంకంలో "బ్రహ్మానుభూతి" ఆయనకు కలిగిందని మనకు  అర్ధమౌతుంది.   

3-8 -1929 న హాలెండ్ లోని ఆమెన్ లో జరిగిన దియోసఫీ మహాసభలో మాట్లాడుతూ కృష్ణమూర్తి సంచలన ప్రకటన చేసాడు. "ఆర్డర్ ఆఫ్ ది స్టార్"   సంస్థను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాడు. అప్పుడాయన జాతకంలో రాహు/శుక్ర/బుధ/రాహు/శుక్ర దశ జరిగింది. బుధుడు పంచమంలో ఉన్నాడు. శుక్రుడు పంచమాధిపతి గా శత్రుత్వానికి చిహ్నమైన ఆరో ఇంటిలో ఉన్నాడు. రాహువు శనిని (లగ్నాధిపతి) సూచిస్తున్నాడు. ఈ నిర్ణయం వెనుక కొంత విరక్తి కూడా ఉన్నట్లు కనిపిస్తుంది. 

అప్పటికే ఎన్నో లుకలుకలతో నిండి ఉన్న థియోసాఫికల్ సొసైటీ కి ఇదే సరియైన మందు అని ఆయన తలచి ఉండవచ్చు. ఈ అక్కల్ట్ నాటకానికి ఇక తెర దించాలని ఆయన భావించి ఉండవచ్చు. కాని ఈ విషయం ఆయన చెబితే వినడానికి సంస్థలో  ఎవరూ సిద్ధంగా లేరు. ఎవరి అహంకారాలు వాళ్ళకున్నాయి. కనుక తానే తప్పుకుంటే మంచిదని ఆయన భావించి ఉండవచ్చు. 

పైగా, ఆధ్యాత్మిక సాధన అనేది గ్రూపుతో చేసేది కానే కాదు. అది ఎప్పటికీ వ్యక్తిగతమైనదే. ఒక గ్రూపులో మనం ఉండవచ్చు. కాని ఎవరి అంతరిక సాధన వారిదే. ఈ సృష్టిలో ప్రతి మనిషీ విభిన్నుడే. ఒకరికి ఇంకొకరితో పోలికే ఉండదు. కనుక సాధనా మార్గంలో కూడా ఎవరి దారి వారిదే. అంతరిక లోకంలో గుంపుగా నడవడం అనేది ఉండనే ఉండదు. కనుక తన దారి తాను పట్టక తప్పదని ఆయన అనుకుని ఉండవచ్చు. 

అప్పటికే సొసైటీ నాలుగైదు గ్రూపులుగా తయారై ఒక్కొక్కరు ఒక్కొక్క హిమాలయన్ మాస్టర్ తో అనుబంధం కలిగి ఉన్నామని చెప్పుకుంటూ, ఆధ్యాత్మిక గురువులుగా గుర్తింప బడాలని ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇంకొందరైతే, కృష్ణమూర్తి ఫేయిలయ్యాడనీ, కనుక  మైత్రేయను తమలోకి రప్పించే ప్రయత్నాలు తామే చేస్తున్నామనీ చెప్పటం సాగించారు.   ఈ గ్రూపులను చూచి ఆయనకు చికాకు కలిగి ఉండవచ్చు. తాము అప్పటిదాకా నమ్ముతున్న అక్కల్ట్ విషయాలన్నీ భ్రమలని ఆయన నిత్యానంద మరణంతో ఒక నిర్ణయానికి వచ్చి ఉండవచ్చు. 

కానీ "ఆర్డర్ ఆఫ్ ద స్టార్" రద్దు అనే తన హటాత్ నిర్ణయంతో ఎందరితోనో శత్రుత్వాన్ని తెచ్చుకున్నాడు. తన గురువులకు తీవ్ర ఆశాభంగాన్ని కలిగించాడు. ఒక రకంగా చూస్తె ఇది దియోసఫికల్ సొసైటీకి తీవ్రమైన దెబ్బ. దాదాపు ముప్ఫై ఏళ్ల నుంచి, మైత్రేయను ఈ లోకానికి చెందిన ఒకనిలోకి రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయనీ, త్వరలో అవి సఫలం కాబోతున్నాయనీ అనీబెసంటూ లెడ్ బీటరూ ప్రపంచవ్యాప్తం గా ఉన్న తియోసఫీ సభ్యలకు చెబుతూ వచ్చారు. 

చివరికి, ముప్పై ఏళ్ల ఎదురుచూపు తర్వాత,  అన్నీ సక్రమంగా జరిగాయని, జగద్గురువు అవతార ప్రకటన చెయ్యబోతున్నాడనీ చెప్పి దేశ దేశాలనుండి సభ్యులని రప్పించి హాలెండ్ లోని "ఆమెన్" లో మహాసభ ఏర్పాటు చేసారు. కాని కృష్ణమూర్తి ఆ సభలో ప్రసంగిస్తూ ఇదంతా అబద్దమనీ, పగటికల అనీ కుండ బద్దలు కొట్టడమే కాక, తన సంస్థనే రద్దు చేస్తున్నట్లు ప్రకటించాడు. దీన్నే "డిసోల్యూషణ్ స్పీచ్"  అంటారు. ఇది తప్పక చదవ వలసిన ఉపన్యాసం.దాన్ని ఇక్కడ చదవ వచ్చు. 


ధియోసఫీ గురువులకూ సభ్యులకూ ఇది ఒక శరాఘాతంలా తగిలింది. వారిలో చాలామంది సైకలాజికల్ షాక్ కు గురయ్యారు. ఎందుకంటే ముప్పై ఏళ్ల నుంచీ అనీబెసంట్ మాటలు నమ్మి, ఎందఱో పాశ్చాత్యులు తమ ఆస్తుల్ని ఈ కార్యక్రమానికి వెచ్చించారు. అవతార పురుషుడు ఈ భూమ్మీదకు వస్తున్నపుడు దానికి తోడ్పడటానికి మించిన పని ఏముంది? అని భావించి ఎంతో మంది సంఘంలో ఉన్నత స్థితిలో నున్న కులీనులు తమ తమ స్తిరాస్తులను ధనాన్నీ సొసైటీకి అప్పగించారు. వారిలో చాలామంది ఈ షాక్ నుంచి కొన్నేళ్ళ పాటు తేరుకోలేకపోయారు. స్వయానా అనీబెసంట్ తీవ్రమైన షాక్ కు గురైంది. 

అప్పటినుంచీ ధియోసఫీ సభ్యులు ఈయన్ను వెలి వేశారు. అంతేగాక ఈయన్ను తీవ్రంగా ద్వేషించడం మొదలుపెట్టారు.  కాని ఎవరేమనుకున్నా సరే,  తాను నమ్మిన విషయాన్ని ధైర్యంగా చెప్పాడు. అబద్దాలు చెప్పి అవతారపురుషునిగా చెలామణీ కావడం కంటే సత్యాన్ని చెప్పి మామూలు జీవితం గడపడం మంచిది అనుకున్నాడు. ఆకోణంలో చూస్తె నేటి అబద్దపు గురువులకంటే జిడ్డు చాలాచాలా మంచివాడే, ఉన్నతుడే  అనిపిస్తుంది. ఒక అవతారంగా లోకం పూజించడానికి సిద్ధంగా ఉంటే, దాన్ని కాదని సామాన్యమానవునిగా బ్రతకడానికి, తనకున్న పేరునూ ఇమేజినీ ఒక్క ఉపన్యాసంతో తృణీకరించాడంటే   అది నిజంగా గొప్ప సత్యసంధత అని ఒప్పుకోవాలి. ఆ తర్వాత దాదాపు నలభై ఏళ్లవరకూ ఆయన తిరిగి అడయార్ లో అడుగు పెట్టలేదు.  

ఈనాడు టీవీలలో కనిపిస్తూ, తమకు అనుభవం లేని విషయాలను ఉపన్యాసాలుగా దంచుతూ, ఏడాదికోసారి అమెరికా వెళ్లి, ఉన్నవీ లేనివీ అబద్దాలు అక్కడివాళ్ళకు చెప్పి,  డాలర్లు పోగేసుకుంటున్న  కార్పోరేట్ నకిలీగురువులతో పోలిస్తే, ఉన్న విషయాన్ని ఉన్నట్లు తేటతెల్లంగా చెప్పిన జిడ్డు మహోన్నతుడే అని చెప్పక తప్పదు. 

1928 లో ఈయనకు రాహుదశ మొదలైంది. ఇక అక్కణ్ణించి 1940 వరకూ దేశదేశాలు తిరుగుతూ ఉపన్యాసాలు ఇస్తూ గడిపాడు. 1933 లో అనీబెసంట్ చనిపోయిన తర్వాత దాదాపు పదేళ్ళపాటు ఈయన ప్రపంచమంతా తిరిగాడు. 1939 -1944 రెండో ప్రపంచ యుద్ధం కారణంగా ఉపన్యాసాలు ఆపి ప్రశాంత జీవితం గడిపాడు. ఆయనకు 1932 లో రోసలిన్ తో మొదలైన ప్రేమాయణం 1950 దాకా నడిచిందని అంటారు. ఆ సమయంలో ఆయనకు రాహు/చంద్ర నుంచి శుక్ర/శని వరకూ దశలు జరిగాయి. రాహు చంద్రులిద్దరూ లగ్నాన్ని ఆవహించి ఉండడం చూడవచ్చు. ఇది ఒక గ్రహణం. కనుక ఆ సమయంలో ఆయనక్కూడా రోసలిన్ అనే గ్రహణం పట్టి ఉండవచ్చు.  అలాగే నవాంశలో శుక్రుడు పంచమంలో కుజ క్షేత్రంలో ఉండటమూ శని సప్తమంలో స్వక్షేత్రంలో ఉండటమూ చూడవచ్చు. కనుక ఈ గ్రహ స్థితులను బట్టి చూస్తె, ఈ ఎఫైర్ అనేది నిజమే కావచ్చు అనిపిస్తున్నది.

1961 - 67 మధ్య నడిచిన సూర్య దశ ఆయనకు కొన్ని గొప్ప అనుభవాలను అందించి ఉండవచ్చు. ఎందుకంటే సూర్యుని ఉచ్చస్థితి ఆయనకు ఆధ్యాత్మికంగా ఉన్నత అనుభవాలను ఇచ్చి ఉంటుంది. ఆ సమయంలో తన ఆలోచనలనూ అనుభవాలనూ ఎప్పటి కప్పుడు వ్రాసిపెట్టుకునేవాడు. అలా ఆయన వ్రాసిన "నోట్ బుక్" అనే పుస్తకం ఇప్పటికీ చదివిన వారిని గొప్పగా  ఉత్తేజితుల్ని చేస్తుంది. అందులో ఆయన తన అంతరిక అనుభవాలను కొన్నింటిని వ్రాసుకున్నాడు. అలా వ్రాయమని తన మిత్రుడైన ఆల్డస్ హక్స్లె ఆయనకు చెప్పాడు.

1980 లో చంద్ర/సూర్య దశ ఆయన జాతకంలో జరిగింది. ద్వాదశ చంద్రుడు, అక్కణ్ణించి పంచమంలో ఉచ్ఛసూర్యుని వల్ల, సహజం గానే ఈ దశ ఆయనకు ఒక ఉన్నత అంతరిక అనుభవాన్ని ఇచ్చి ఉండాలి. అలాగే జరిగింది కూడా. ఆ సమయంలో ఆయన భారత దేశంలోనే రిషి వాలీ లో ఉన్నాడు. అప్పుడు తనకు కలిగిన అనుభవాన్ని గురించి ఆయన ఇలా వ్రాసాడు. ఇందులో తనను తాను "కే" అని సంబోధించుకున్నాడు. 

"K went from Brockwood to India on November 1, 1979 (actually October 31). He went after a few days in Madras staright to Rishi Valley. For a long time he has been awakening in the middle of the night with that peculiar meditation which as been pursuing him for very many years. This has been a normal thing in his life. It is not a conscious, deliberate pursuit of mediation or an unconscious desire to achieve something. It is very clearly uninvited and unsought. He has been adroitly watchful of though making a memory of these meditations. And so each meditation has a quality of something new and fresh in it. There is a sense of accumulating drive, unsought and uninvited. Sometimes it is so intense that there is pain in the head, sometimes a sense of vast emptiness with fathomless energy. Sometimes he wakes up with laughter and measureless joy. These peculiar mediations, which naturally were unpremediated, grew with intensity. Only on the days he travelled or arrived late of an evening would they stop; or when he had to wake early and travel. 

With the arrival in Rishi Valley in the middle of November 1979 the momentum increased and one night in the strange stillness of that part of the world, with the silence undisturbed by the hoot of owls, he woke up to find something totally different and new. The movement had reached the source of all energy. This must in no way be confused with, or even thought of, as god or the highest principle, the Brahman, which are projections of the human mind out of fear and longing, the unyielding desire for total security. It is none of those things. Desire cannot possibly reach it, words cannot fathom it nor can the string of thought wind itself around it. One may ask with what assurance do you state that it is the source of all energy? One can only reply with complete humility that it is so.

All the time that K was in India until the end of January 1980 every night he would wake up with this sense of the absolute. It is not a state, a thing that is static, fixed, immovable. The whole universe is in it, measureless to man. When he returned to Ojai in February 1980, after the body had somewhat rested, there was the perception that there was nothing beyond this. This is the ultimate, the beginning and the ending and the absolute. There is only a sense of incredible vastness and immense beauty."     


1981 , 1982 లలో  శరీరాన్ని ఒదిలి వెళ్లిపోవాలనే  ఆకాంక్ష ఈయనలో బలంగా ఉండేది. ఒక అనారోగ్య సమయంలో ట్రాన్స్ లో ఉన్నప్పుడు మరణం అనే డోర్ కనిపిస్తున్నదనీ, ఏ క్షణమైనా తాను దానిలోకి వెళ్లిపోవచ్చనీ  చెప్పేవాడు. కాని తాను చెయ్యవలసిన పని ఇంకా ఉందని కొన్నాళ్ళు ఆగుతాననీ అన్నాడు.     

చివరికి 1986 లో ఈయనకు పాంక్రియాస్ కాన్సర్ అని తేల్చారు. అప్పుడు ఆయనకు కుజ/గురు/గురు/గురు దశ జరిగింది. కుజ గురువులిద్దరూ రోగస్తానంలో ఉండటం చూడవచ్చు. శుక్రుడు పొత్తికడుపును సూచిస్తాడు. కాన్సర్ ను సూచించే అనేక కాంబినేషన్స్ లో ఇదీ ఒకటి.  చివరికి ఫిబ్రవరి 17 , 1986   న కుజ/రాహు/శుక్ర/గురు/రాహు దశలో నిద్రలో ప్రశాంతంగా కన్నుమూశాడు.   

కుజ శుక్ర గురులు రోగ స్థానంలో ఉండటమూ, రాహువు మారక స్థానంలో ఉండటమూ క్లియర్ గా కనిపిస్తుంది. అందుకే ఆ సమయంలో ఆయన్ను మరణం వరించింది. మహనీయులు కూడా గ్రహ ప్రభావానికి అతీతులు ఏమీ కారనే విషయానికి ఇదొక రుజువు.

అయితే, జిడ్డు మరణవార్తను పత్రికలు పెద్దగా పట్టించుకోలేదు.  ఒక మూలకు ఆ వార్తను ప్రచురించాయి. లోకానికి అద్భుతమైన బోధను అందించిన అటువంటి విలువైన  వ్యక్తి మరణిస్తే లోకం ఆయనకు ఇచ్చే విలువ ఇదా ?  అంటూ  ఒక్క రజనీష్ మాత్రం తన ఆవేదనను వ్యక్తం చేసాడు.  

జిడ్డు తత్వాన్ని వచ్చే పోస్ట్ లో చూద్దాం.