“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

11, జూన్ 2011, శనివారం

జిడ్డు కృష్ణమూర్తి జీవితం, తత్త్వం --5

జిడ్డు జాతకంలో ఆధ్యాత్మిక సాధనా పరంగా ముఖ్య పాత్ర వహించినది బుధుడని ముందే అనుకున్నాం. జ్యోతిష్య జ్ఞానం ఉన్న వారికి బుధుని యొక్క లక్షణాలు తెలుసు. బుధుడు తటస్థగ్రహం. మంచివారితో ఉంటె మంచివాడుగానూ, చెడ్డవారితో ఉంటె చెడ్డగానూ మారిపోతాడు. మనిషి లోని బుద్ధికి ఇతడే కారకుడు. కనుకనే మనిషి బుద్దికూడా అతని స్నేహితాన్ని బట్టి,  సహవాసాన్ని బట్టి మారిపోతూ ఉంటుంది. ఇక్కడ బుధుని యొక్క స్థితిని కొంచం అవగాహన చేసుకోవాలి. ఇతను ఒక గ్లాసులోని నీళ్ళ వంటివాడు. దానిలో ఏ రంగు చేరితే ఆ రంగులోనే నీరుకూడా కనిపిస్తుంది. అంటే తాను పక్కకు తప్పుకొని ఇంకొక వ్యక్తిత్వాన్ని తన స్థానంలోనికి బుధుడు ఆహ్వానించగలడు. ఇది ఒక ఆత్మను తనమీదకి ఆహ్వానించుకోవడం లాటిది. కృష్ణమూర్తి విషయంలో జరిగింది అదే. 

 "మైత్రేయ" ను తనలోకి ఆహ్వానించాలి. అన్న ఏకసూత్ర గమ్యం మీదే ఆయన సాధన అంతా మొదట్నుంచీ సాగింది. కాలక్రమేణా తనను తాను ఆ పనికి సిద్ధం చేసుకుంటూ ఆయన వేచి చూచాడు. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని గమనించాలి. సాంప్రదాయ ఆధ్యాత్మిక సాధనలో అయితే -- తాను మారుతూ తన ఆశయస్థాయికి ఎదగడం ద్వారా ఆ స్థాయిని అందుకునే ప్రయత్నం జరుగుతుంది. దానికి అవసరమైన ప్రక్షాళన అంతా ఈ లోపల జరిగిపోతుంది.ఈ క్రమంలో, తనను తాను మార్చుకోవటం జరుగుతుంది. అట్టి ప్రయత్నంలో సాధకుని వ్యక్తిత్వంలో ఎన్నో మార్పులు కలుగుతాయి. మురికీ, మకెలా అన్నీ వదిలిపోతాయి.

కాని కృష్ణమూర్తి విషయంలో అది జరుగలేదు. తన సీటును తాత్కాలికంగా ఖాళీ చేసి కాసేపు ఆ ప్రదేశంలో  ఇంకొకరిని కూర్చోబెట్టినట్లుగా, తన శరీరంలోనుంచి తాను బయటకి పోయి, ఆ స్థానంలోకి, మైత్రేయను ఆహ్వానించడం ఆయన అభ్యాసం చేసినట్లు కనిపిస్తుంది. అందుకనే ఆయన వ్యక్తిత్వంలో మౌలికమైన మార్పులు ఏమీ రాలేదు. చివరికి తాను తానుగానే ఉండిపోయాడు.

కాలిఫోర్నియాలోని "ఒజాయ్"  లో ఈయన శరీరంలో "ప్రాసెస్" అనబడే ప్రక్రియ జరిగినప్పుడు గమనించిన ఇతని స్నేహితురాలు రోసలిన్ కూడా ఎవరో ఇద్దరు ఆత్మలు వచ్చి ఈయన ఆత్మను బయటికి తీసుకుపోతున్నారని చెబుతుంది. ఆ తరువాత మైత్రేయ ఈయన్ను ఆవహించేవాడు. ఆ సమయంలో అక్కడి వాతావరణం అద్భుతంగా మారేది. పక్కన ఉన్నవాళ్ళ మనస్సులు బాగా ఎలివేట్ అయ్యేవి. 

అలాగే, ఉపన్యాసం ఇచ్చిన కొద్దిసేపు మాత్రం మైత్రేయ ఆయనలోకి వచ్చేవాడు. ఆ సమయంలో అంతా అద్భుతమైన ప్రసంగం నడిచేది. వినేవాళ్ళు మంత్ర ముగ్దులయ్యేవాళ్ళు. మిగతా సమయంలో "మైత్రేయ" వెళ్ళిపోయేవాడు. అప్పుడు తన శరీరంలో తనే ఉండేవాడు. తనలో మార్పుకోసం ఏ ప్రయత్నమూ, సాధనా లేదు కాబట్టి,  తనలోని కామమూ, కోపమూ, భయమూ, విసుగూ, చికాకూ, మొండి తనమూ, ఇతరులని ఎగతాళి చెయ్యటమూ అన్నీ తనలోనే ఉండేవి. అందుకే రోసలిన్ తో రాసలీల నడుపగలిగాడు. ఆమెకు రెండుమూడు అబార్షన్లు అయ్యాయి. ఆయనకు ఈమెకాక ఇంకా ఒకరిద్దరితో ప్రేమలూ, రహస్య సంబంధాలూ ఉన్నాయని అంటారు. సమయానుకూలంగా అబద్దాలు బాగానే చెప్పేవాడు. మామూలు మనుషుల్లాగే భయానికి లోనయ్యేవాడు. తన స్నేహితుడూ, సహాయకుడూ, రోసలిన్ భర్తా అయిన రాజగోపాల్ తో గొడవ పడ్డాడు. అతనితో కోర్టుకేసులు, ఆస్తి తగాదాలూ అన్నీ నడిచాయి. 

తన ఉపన్యాసాలలో మొదటి వరుసలో రజనీష్ శిష్యులు కూచుంటే ఆయనకు మహా చిరాకు కలిగేది. వాళ్ళను లేచి వెనుక వరసల్లోకి పొమ్మనేవాడు. మొండితనం కూడా ఈయనలో బాగానే ఉండేది. ఎదుటివాళ్ళను ఎగతాళి చేసేవాడు. నేనే ప్రపంచ గురువునన్న భావన ఆయనలో గట్టిగా ఉండేది. వెరసి ఒక మామూలు మనిషికుండే బలహీనతలు అన్నీ ఈయనకూ ఉండేవి. అంటే ఇదంతా ఒక పూనకం లాటి వ్యవహారం అని చివరకు అర్ధమౌతుంది. పూనకం వచ్చిన కాసేపు ఆ వ్యక్తిలో అంతా బాగుంటుంది. తర్వాత తనూ అందరిలాటి మామూలు మనిషే. 

పల్లెటూళ్ళలో పూనకం తెచ్చుకునే వారు ఉంటారు. వాళ్ళు ఒకరకమైన హిస్టీరికల్ స్తితిలో తమను తాము ప్రవేశపెట్టుకోగలరు. ఆ సమయంలో వారిలోని అంతచ్చేతన బయటకి వస్తుంది. అంతరాన్తరాలలోని ఆవేశాలూ,  ఆకాంక్షలూ, కోరికలూ విపరీత ప్రవర్తనలూ ఉబికి మనస్సు ఉపరితలానికి వస్తాయి. ఇంకొందరిలో నిజంగానే కొన్ని ఆత్మలు ప్రవేశిస్తాయి. కొన్ని సార్లు గ్రామదేవతలు ప్రవేశిస్తాయి. ఎవరు వారిలోకి వస్తారన్నది వారి వారి సాధన మీదా వారిచ్చే ఆహ్వానం మీదా, వారి శరీరపు పవిత్రతా స్థితి మీదా  ఆధారపడి ఉంటుంది. అందుకే ఆ సమయంలో వాళ్ళ ముఖకవళికలు మారిపోతాయి. వారి మాటతీరు మారిపోతుంది. ప్రవర్తన విపరీతంగా మారుతుంది. చూచే వారికి ఇదంతా నటనగా అనిపిస్తుంది. వాళ్ళలో కొందరు మోసగాళ్ళు ఉండవచ్చు. చాలా భాగం అది నటనే కావచ్చు కూడా. కాని నిజమైన పూనకం అనేది కూడా నిజమే.

ఆవాహన అనేది కూడా నిజమే. భూ వాతావరణంలో అఘోరిస్తూ తిరుగుతున్న  ఆత్మలను తన శరీరంలోకి ఆవాహన చేసుకోవడం, వాటిని మాట్లాడించి, వివరాలు రాబట్టడం అనే విద్య నిజమైనదే. ఈ విధమైన సెన్సిటివిటీ కొందరిలో సహజంగా ఉంటుంది. కొందరు దీన్ని సాధనద్వారా పెంచుకుంటారు.  పాతకాలంలో మంత్రగాళ్ళు ఈ పని చెయ్యగలిగేవాళ్ళు. పాశ్చాత్య దేశాలలో "షమానిజం" అనే తాంత్రిక అభ్యాసం కూడా ఇలాటిదే. 

కృష్ణమూర్తి సాధన కూడా ఆవాహన - విసర్జన అనే ఇటువంటి సూత్రాల మీదే నడిచింది.  దానికి కారణం--మొదట్నుంచీ దియసఫికల్ సొసైటీ లో ఇటువంటి మార్మికరహస్య సాధనల పట్ల మోజు ఉండటమే. ఊజా బోర్డు, స్పిరిట్ గేమ్, ఆత్మలను  శరీరం మీదకు ఆహ్వానించుకునే "మీడియం షిప్" మొదలైన నిమ్న స్థాయికి చెందిన మార్మిక విద్యలో ఇవన్నీ భాగాలు. బ్లావత్స్కీ వ్రాసిన "ద సీక్రెట్ డాక్ట్రిన్" అన్న పంచకూళ్ళ  కషాయం ఈ భావనలన్నింటికీ మూలంగా దియోసఫీలో ఉంటూ వచ్చింది. అది గొప్ప మాస్టర్ పీస్ అని దియోసఫీ అనుచరులు తలుస్తారు. కాని చాలా ఇతర గ్రంధాలనుంచి కాపీకొట్టిన గందరగోళం ఈ పుస్తకం అని, దానిలో ఒరిజినాలిటీ ఏమాత్రం లేదనీ తెలిసినవాళ్ళంటారు .   

నిజమైన ఆధ్యాత్మిక సాధన ఇలా ఉండదు. తన ఇల్లు ఖాళీ చేసి ఎక్కడికో పోయి, ఆ కాసేపు ఇంకెవరినో ఆహ్వానించడం, ఆ తర్వాత మళ్ళీ తను ప్రవేశించటం -- ఇలాటి పనులు అందులో ఉండవు.  తానూ ఉన్నచోటే ఉంటూ తననుతాను సంస్కరించుకోవడం అందులో ప్రధానమైన భాగం. అనుక్షణం తన్ను తాను గమనించుకుంటూ తన తప్పుల్ని దిద్దుకుంటూ, తనలోని రాక్షసత్వాన్ని నిర్మూలించుకుని, మానవత్వాన్ని అధిగమించి, దైవత్వాన్ని అందుకోవడం సాధనలో భాగంగా ఉంటుంది. తనలో మార్పు తెచ్చుకోవడం ఉంటుంది గాని తానేక్కడికో పారిపోవడం ఉండదు. 

అందుకే ఏడాదిలో కొద్ది రోజులు చేసే పార్ట్ టైం సాధనలూ పార్ట్ టైం దీక్షలూ ఎందుకూ పనికిరావు అని నేను ఎప్పుడూ చెబుతాను. వాటివల్ల మనిషి వ్యక్తిత్వంలో మార్పు రానేరాదు. దీనికి నిదర్శనంగా నేడు తామరతంపరగా పుట్టుకొస్తున్న అయ్యప్పదీక్షలూ, షిర్డీదీక్షలూ, ఇంకా ఇతర దేవుళ్ళ దీక్షలూ చెప్పుకోవచ్చు. ఎన్నో ఏళ్లనుంచీ వీటిని రెగ్యులర్ గా చేస్తున్న అనేక దగుల్బాజీలను మనం ఎక్కడైనా చూడవచ్చు. 

సద్గురువైన వాని పర్యవేక్షణ లేకుంటే ఇలాటి పరిస్తితులే తలెత్తుతాయి. నేనెన్నో సార్లు చెప్పినట్లుగా " గుడ్డి గురువు గుడ్డి శిష్యుడు ఇద్దరూ కలిసి నడవటం మొదలు పడితే ఇద్దరూ గుంటలో పడటమే జరిగేది". జిడ్డుకు కూడా సద్గురువుల సాంగత్యం దొరకలేదు, పైగా గుడ్డి గురువులతో చేరాడు గనుకనే ఆయన సాధన అంతా అలా తయారైంది. వ్యక్తిత్వంలో ఉన్నతమైన మార్పులు తీసుకురాని సాధన అంతా వ్యర్ధం అని గ్రహించాలి.

మనం ఎన్ని పూజలు చేసాము, ఎన్ని గంటలు జపమూ ద్యానమూ చేసాము, ఎన్ని ఉపవాసాలున్నాము, ఎన్ని సారులు పుణ్యక్షేత్రాలకు వెళ్ళి వచ్చాము, రోజుకెన్ని సారులు గుడికి వెళ్లివచ్చాము, హుండీలో ఎంత వేశాము, వినాయక చవితి చందా ఎంతిచ్చాము అనే విషయాలు ముఖ్యం కానేకాదు. దానివల్ల మనలోని కామమూ, కోపమూ, అహంకారమూ, అసూయా, అబద్ధాలు చెప్పే గుణమూ, భయమూ, చాడీలు చెప్పే అలవాటూ, ఇంకా ఇతర అనేక  దురలవాట్లూ ఎంతవరకూ తగ్గాయి అన్నదే ముఖ్యం. సాధనవల్ల మనలో ఎంత దివ్యత్వం వచ్చింది? అన్నదే ముఖ్యం. మన ప్రవర్తనలో ఎంత తేడా వచ్చింది అన్నదే ముఖ్యం. మన హృదయం ఎంత విశాలం అయింది? ఇతరులతో మనం ఎంత చక్కగా ప్రవర్తించగలుగుతున్నాం అన్నదే ముఖ్యం.  అటువంటి మార్పును తీసుకురాని సాధన పూర్తిగా వ్యర్ధం అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు.

మంచి వ్యక్తిత్వమూ, మంచి లక్షణాలూ ఉండి, ఈ సాధనలూ పూజలూ తెలియని ఒక మామూలుమనిషి కంటే, సద్గుణాలు లేకుండా పూజలూ గట్రాలూ చేసే  మనిషి చాలా తక్కువ స్తాయివాడే అని నేను నమ్ముతాను. లోపల మురికి పట్టి బయటికి శుభ్రం గా కనిపించే పాత్ర కంటే, బయట ఆడంబరం ఏమీ కనిపించకపోయినా లోపల శుభ్రంగా ఉన్న పాత్ర ఖచ్చితంగా విలువైనది. ఇదీ అలాటిదే.


దీపం గడపమీద ఉంచినప్పుడు దాని వెలుగు ఇంటి లోపలికీ బయటికీ ప్రసరించాలి కదా. అలా ప్రసరించడం లేదంటే, దీపంలోనో ఇంటిలోనో లోపం ఉన్నట్లే.