“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

15, ఆగస్టు 2010, ఆదివారం

నిజమైన స్వాతంత్ర్యం

ఈ రోజుతో మనం స్వాతంత్ర్యాన్ని పొంది 63 ఏళ్ళు గడిచాయి. దేశానికి రాజకీయ స్వాతంత్ర్యం వచ్చింది. కాని ఎన్నోరకాలైన ఇతర స్వాతంత్ర్యాలు ఇంకా రాలేదు. ఇది లౌకికజీవిత నిజం.

అంతరిక జీవితంలో కూడా స్వాతంత్ర్యమే అత్యున్నత ఆదర్శం. దీన్నే ముక్తి లేదా మోక్షం అని మన ప్రాచీనులు చెప్పారు. ముక్తి గురించి తెలియాలంటే దేనిచేత బంధింపబడి ఉన్నామో ముందుగా తెలుసుకోవాలి. అప్పుడే ఆ బంధం నుంచి ముక్తి ఎలా సాధ్యమో తెలుసుకోవచ్చు. దానికి తగిన ప్రయత్నం చెయ్యవచ్చు.

బాహ్యంగా ప్రతివాడూ స్వతంత్రుడననే భావించవచ్చు గాక. కాని అంతరికముగా ప్రతివాడూ బానిసే. అతడు రాజు కావచ్చు. పేద కావచ్చు. విద్యావంతుడు కావచ్చు. నిరక్షరాస్యుడు కావచ్చు. ఉన్నత పదవులలో ఉండి భోగభాగ్యాల మధ్యన విలాస జీవితం గడిపేవాడు కావచ్చు. తిండికి లేక కటిక దరిద్రంలో బతుకు వెళ్ల దీస్తున్నవాడు కావచ్చు. వీరందరూ అంతరిక జీవితంలో కట్టు బానిసలే. గానుగెద్దులకూ వీరికీ ఏమీ భేదం లేదు.

ఏ విధంగా మనం బానిసలమో తెలుసుకుందామా?

మొదటి రకం: మనం ఎదుటివారి ఊహలకు బానిసలం. మన జీవితంలో ఎక్కువభాగం ఎదుటివారిని మెప్పించడానికే సరిపోతున్నది. మనం బట్టలు వేసుకొనేది మన కోసం కాదు. ఎదుటివారు ఏమైనా అనుకుంటారేమో అని మంచి బట్టలు ధరిస్తాం. ఎదుటివారి దృష్టిలో మంచిగా కనపడాలని లేని మంచిని నటిస్తాం. ఎదుటివాని హంగులు చూచి మనకు అవసరం లేకున్నా వాటిని అనుకరిస్తాం. వారివద్ద ఉన్న వస్తువులు మనమూ సంపాదించడానికి అమూల్య జీవితాన్ని, సమయాన్ని ఆహుతి చేసుకుంటాం. వారు అనే ఆహా ఓహో ల కోసం మన అమూల్యమైన జీవితాన్ని వృధా వ్యాపకాలలో వెచ్చిస్తున్నాం. ఎదుటివారికి గొప్ప ఉపన్యాసాలిచ్చి వారి మెచ్చుకోళ్ల కోసం అర్రులు చాస్తూ అదే గొప్ప పాండిత్యం అనుకుంటున్నాం. మనకేమి కావాలో మనకు తెలియదు. మన జీవితం ఎటుపోతున్నదో మనకు తెలియదు. ఎదుటివాని చేతిలో మనం కీలుబొమ్మలం. పరాయివారి మెప్పుకోసం బతికే జీతగాళ్లం. సమాజం చేతిలో మనం కీలుబొమ్మలం. ఇది స్వాతంత్ర్యం ఎలా అవుతుంది?

ఇక రెండవ రకం: మన ఇంద్రియాలకు మనం బానిసలం. పంచేద్రియాలు మన స్వాధీనం లో లేవు. వాటి ఆధీనంలో మనం ఉన్నాం. అవి చెప్పినట్లు మనం ఆడుతున్నాం. ఒక మంచి సుందరమైన దృశ్యమో, మనిషో కనిపిస్తె చూడకుండా ఉండలేం. మంచి మసాలా వాసన వస్తే నోటిలో నీళ్ళు మనకు తెలీకుండానే ఊరుతుంటాయి. ఒక వస్తువు కనిపిస్తే కొనకుండా ఉండలేము. ఆకలిని ఆపుకోలేము, దాహాన్ని ఆపుకోలేము. నిద్రను ఆపుకోలేము, కోరికలను ఆపుకోలేము. ఆవేశాలను ఆపుకోలేము. వెరసి మన ఇంద్రియాలకు మనం బానిసలం. అవి నడిపినట్లు మనం నడుస్తున్నాం. అవి ఈడ్చుకుపోయిన చోటికి మనం పోతున్నాం. ఇది స్వాతంత్ర్యం ఎలా అవుతుంది?

ఇక మూడవ రకం: మన మనస్సుకు మనం బానిసలం. మనస్సు మనం చెప్పినట్లుగా వినదు. అది చెప్పినట్లు మనం ఆడుతున్నాం. ఒక్క క్షణం కదలకుండా ఉండు అంటే ఆ క్షణంలోనే ఎక్కడలేని అనవసర విషయాలన్నీ నాకే కావాలి అంటుంది మనసు. ఆలోచన మనలను లాక్కుపోతున్నది కాని మనం ఆలోచనను నడిపించడం లేదు. మన ఆలోచనలు మన స్వాధీనంలో లేవు. మనసు మన స్వాధీనంలో లేదు. ఇది స్వాతంత్యం ఎలా అవుతుంది?

ఇక నాలుగవ రకం: మన అహానికి మనం బానిసలం. నేను ప్రతివానికన్నా భిన్నంగా కనపడాలి. నేను అందరికంటే అధికుణ్ణి. నేను అందరికంటే ముందుండాలి. నేను చెప్పినట్లు ఇతరులు వినాలి. నా ప్రత్యేకతను నేను కాపాడుకోవాలి. నేను సుఖంగా ఉండాలి. దానికోసం ఎందరు ఏమై పోయినా పరవాలేదు. నా పని నాకు ముఖ్యం. ఇలా నా, నా, నా అనుకుంటూ నా అహానికి నేను బానిసగా మిగులుతున్నాను. నా అహం తృప్తి పడటం కోసం నేను ఏపనైనా చేస్తున్నాను. జీవితమంతా దాస్యం చేయించుకున్న ఈ అహం మరణంలో ఏమౌతుంది. ఎక్కడికి పోతుంది. అన్న ఆలోచన మనకు రాదు. ఒక్కసారిగా పేలిపోయి అదృశ్యమై పోయే ఒక నీటి బుడగకోసం నా జీవితమంతా దానికి దాసోహం అంటూ ఊడిగం చేస్తున్నానా? నన్ను నేను తెలుసుకునే అవకాశం ఇచ్చిన ఈ జన్మను వృధాగా గడిపి పరీక్షలో ఓడిపోయినవానిగా నిష్క్రమిస్తున్నానా? ఏమిటీ విచిత్రం? ఏమిటీ బానిసత్వం? అన్న ఆలోచన మనకు రాదు.

మనకు స్వాతంత్ర్యం వచ్చిందా? ఎక్కడొచ్చింది? రాజకీయ స్వాతంత్ర్యం దేశానికి వచ్చి ఉండవచ్చు. సమాజాన్ని దోచుకునే వారికి వచ్చి ఉండవచ్చు. రాజకీయ స్వాతంత్ర్యం మన ఆశయం కాదు. మన జీవిత గమ్యం ఇది కాదు.

ఎదుటివారికీ, వారి ఆలోచనలకూ, నేను చేస్తున్న ఊడిగం నుంచి బయట పడినప్పుడే అది నిజమైన స్వాతంత్ర్యం.

నా ఆలోచనలకూ, నా అహానికీ కట్టుబడి ఉన్న నా బానిసత్వం నుండి నేను బయటపడి నప్పుడే నిజమైన స్వాతంత్ర్యం.

ఇంద్రియాలకూ, ప్రకృతికీ నేను చేస్తున్న ఊడిగం నుంచి నేను బయటపడినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం.

ఇటువంటి స్వాతంత్ర్యాన్ని పొందటమే ముక్తి, అదే మోక్షం. ఈ ముక్తి అనేది ఎవరినుంచో నాకు వచ్చేది కాదు. నన్నెవరూ బంధించలేదు. ఇది నేను నా చుట్టూ నిర్మించుకున్న బోను. దీనినుంచి నేనే బయట పడాలి. ఇది నానుంచి నాకు మోక్షం. ప్రకృతినుంచి నాకు మోక్షం. జన్మ జన్మల నుంచీ నన్ను వెంటాడుతున్న సంస్కారాలనుంచి, కర్మ బంధాలనుంచి, జనన మరణాలనుంచి నాకు కలిగే మోక్షం.

ఇటువంటి స్వాతంత్ర్యమే యోగులకు అభిమతం. దీనికి తక్కువ దైన ఏ స్వాతంత్ర్యమైనా వారికి అవసరం లేదు. దానిని వారు ఉత్తమమైన స్వాతంత్ర్యంగా పరిగణించరు.

దీనిని పొందాలంటే అచంచలమైన, అకుంఠితమైన దీక్ష కావాలి. సాధన కావాలి. నాయమాత్మా బలహీనేన లభ్య: ఆత్మానుభవం బలహీనులకు లభించదు అన్న ఉపనిషద్వాణి మనలను తట్టి లేపటం లేదా? మన పూర్వీకులైన మహర్షుల ఉత్తేజపూరిత సందేశాన్ని మనం వినలేక పోతున్నామా? చేతకాని వాళ్లలా జీవితాన్ని ముగించడం అభిలషణీయమేనా?

మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 63 ఏళ్ళు అయింది అంటున్నాం. ఎన్ని వేల జన్మల నుంచి మన ప్రయాణం సాగుతున్నదో మనకు తెలుసా? ఎన్ని కాలాలలో, ఎన్ని దేశాలలో, ఎన్ని ప్రాంతాలలో, ఎన్ని వేషాలు ఇప్ప’టికి ఈ జీవుడు వేశాడో మనకు తెలుసా? స్వాతంత్ర్యం రాకుండా ఎన్ని వేల సంవత్సరాలు గడిచాయో మనకు జ్ఞాపకం ఉన్నదా?

ఆలోచించండి. మన పూర్వీకులైన మహర్షులు మనలను చూచి ఇటువంటివారా మా వారసులు" అని సిగ్గుపడుతున్నారు గమనించండి. సాధనా పరులు కండి. మహత్తరమైన యోగాన్ని అనుష్టించండి. జన్మ జన్మల కర్మ బందాల నుంచి విముక్తి కలిగించే భరతదేశపు దివ్యసంపద అయిన యోగాన్ని ఈ రోజునుంచే ప్రారంభించండి.

అప్పుడే స్వాతంత్ర్య దినోత్సవం నిజంగా జరుపుకున్నట్లు లెక్క. లేకపోతే అన్ని పార్టీల లాగే ఇదీ ఒక పార్టీ. ఒక గెట్ టుగెదర్. అంతే.