“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

31, ఆగస్టు 2010, మంగళవారం

జ్యోతిశ్శాస్త్ర ప్రయోజనం -వేదాంత చర్చలు

రోజు సాయంత్రం తమ్ముడు చంద్రశేఖర్ ఢిల్లీనుంచి వచ్చాడు. రాత్రికి హైదరాబాద్ పోయి రేపు ఢిల్లీ వెళతాడు.కనుక మిత్రుడు గిరిజా శంకర్ గారి షాపులో అర్జంటు సమావేశమయ్యాం. మాటల మధ్యలో మంచి ఆధ్యాత్మిక సంభాషణలుజరిగాయి.వాటిలో నుంచి కొన్ని మాటలు.

గిరిజా శంక్రర్ గారు మంచి వేదాంతి. బయటకు కనపడడు కాని మాట్లాడితే ఆణిముత్యాలు దొర్లుతాయి. ఆయన నృశింహానంద భారతీ స్వామి శిష్యుడు. గుంటూరులో నృశింహానంద భారతీస్వాములవారని ఒక స్వామి ఉండేవారు. ఆయన కళ్యాణానంద బారతీస్వామి సాంప్రదాయానికి చెందిన వారు. అచ్చమైన వేదాంతి.అసలైన స్వామి.అంతేగాక మంచి జ్యోతిష్య పండితుడు కూడా.

ఆయన ఒకసారి ఇలా అన్నారట.

జ్యోతిశ్శాస్త్ర ఉపయోగం ఏమిటో తెలుసా? నీ జీవితంలో ముందు ముళ్లదారి ఉందని ఆ శాస్త్రం చెబుతుంది. చీకటిపడబోతున్నదని చెబుతుంది. ఎండ ఎక్కువగా ఉంటుందని చెబుతుంది. నీవు చెప్పులు వేసుకుంటావు.టార్చ్ లైట్దగ్గర పెట్టుకుంటావు. గొడుగు వేసుకుంటావు. అంతే దాని ఉపయోగం. కాని ముళ్ళూ తప్పవు, చీకటీ తప్పదు,ఎండాతప్పదు. ప్రారబ్దాన్ని జ్యోతిష్యం తీసివెయ్యలేదు. కాని జాగ్రత్తపడమని ముందుగా సూచిస్తుంది.

ఆయనను ఒకరు ఇలా అడిగారు.
ప్రశ్న: స్వామీ సన్యాసికి ప్రారబ్దం ఉండదు కదా?
స్వామి: ఎందుకలా అనుకుంటున్నావు?
ప్రశ్న: సన్యాసం అంటే రెండవ జన్మ కదా. అప్పుడు మొదటి జన్మ ప్రారబ్దం నశిస్తుంది కదా అందుకని అలా అడిగాను.
స్వామి: సన్యాసం తీసుకోవడం కూడా ప్రారబ్ద కర్మ ప్రకారమే జరుగుతుంది నాయనా. ఇక ప్రారబ్దం తప్పేదెక్కడ?

ఇంకొక సారి ఒకరు ఇలా అడిగారు:
ప్రశ్న: స్వామీ మీరు దండ కమండలాలు ధరించాలి కదా.వాటిని ఎందుకు వదిలేశారు?
స్వామి: అంటే నేనొక స్వామిని గురువును అని అందరికీ చాటింపు వేసుకోవాలా? ఖర్మ నాకెందుకు. అందుకే వాటినీవిసర్జించాను.

వింటున్న చంద్రశేఖర్ ఇలా అన్నాడు.
రమణమహర్షిని కూడా ఒకాయన ఇలాగే అడిగాడు."స్వామీ మీరు వివాహం ఎందుకు చేసుకోలేదు?" అని.
దానికాయన " అది నా ప్రారబ్దం కాదు కనుక చేసుకోలేదు" అని చెప్పాడు. ఇంకొకాయన అలాగే " స్వామీ మీరుసన్యాసం ఎందుకు తీసుకోలేదు" అని ఆయన్నె అడిగాడు. దానికాయన మళ్లీ అదే సమాధానం చెప్పాడు.

వింటున్న నేనిలా అన్నాను.

ఒకవేళ మహర్షి సన్యాసం తీసుకుని ఉంటె అదే ప్రశ్న అక్కడా ఎదురై ఉండేది. "స్వామీ మీరు ఆత్మ జ్ఞాని కదా మీరు సన్యాసం ఎందుకు తీసుకున్నారు. దాని ఆవశ్యకత ఏముంది?" అని. కనుక లోకుల మాటలు పట్టించుకోకుండా మన పని మనం చేయ్యటం ఉత్తమం.

సంభాషణ జప ధ్యానాల వైపు మళ్ళింది.మిత్రుడు గిరిజా శంకర్ చక్కని మాట ఒకటి చెప్పాడు.

కాయిక వాచిక మానసిక అని మూడు చెబుతారు కదా. మనసా వాచా కర్మణా అని కూడా అంటారు. మనిషికి మూడు స్థితులలోనూ ఏదో ఒక ఆధారం కావాలి.

బాహ్యంగా ఏదో ఒక విగ్రహం యొక్క ఆసరా కావాలి. వాక్కుకు స్తోత్రమో మంత్రమో ఏదో ఒకటి ఆసరాగా కావాలి. మనస్సుకు ఏదో ఒక ఆలంబన ధ్యానానికి కావాలి. మూడూ అధిగమిస్తే ఇక నిరాకారమే, నిరాధారమే.అటువంటి వానికి ఆసరా అక్కరలేదు. నిరాకార, నిశ్చల, నిరంజన స్థితి అంటే అదే.

త్యాగరాజు ఒక కీర్తనలో ఇలా అన్నారు. "మనసు స్వాధీనమైన మంత్ర తంత్రములేల?" ఆయన ఇంకా ఇలా అన్నారు."గ్రహబలమేమి రామానుగ్రహ బలముగాని".

ఇలా సంభాషణ చాలాసేపు జరిగింది.

చంద్రశేఖర్ ఇలా అన్నాడు.
అన్నగారూ నాకొకటి అనిపిస్తున్నది. ఆధ్యాత్మికంగా ఒక మనిషి ఎదిగాడా లేదా అని ఎలా చెప్పగలం అని చాలారోజులనుంచి నాకొక సందేహం ఉండేది. మధ్యనే నాకు జవాబు దొరికింది. మనిషికి ఎంతగా దేహస్పృహ (Body identification) తగ్గుతుందో అంతగా ఆధ్యాత్మికంగా ఎదిగినట్లు అని నా భావన. మీరేమంటారు?

నేను నిజమే అన్నట్లు తలాడించాను.

మనిషికి దేహవాసన,లోకవాసన, శాస్త్రవాసన అని మూడు ప్రతిబంధకాలుంటాయి. వీటిని ఎంతగా తగ్గించుకుంటే అంతగా అంతరిక జీవితంలో ముందుకు పోగలుగుతాడు. తన దేహాన్ని, తన చుట్టూ ఉన్న లోకాన్ని, తనదనుకునే జ్ఞానాన్ని మరచిపోగలిగినవాడు నిజంగా మహాత్ముడే. అట్టివాడే ఆత్మజ్ఞుడు.

మళ్లీ కలుద్దామని సమావేశం ముగించాము.