“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

21, జూన్ 2010, సోమవారం

పూర్వ జన్మ పాపాలు- నేటి ఖర్మలు

మనిషి నేడు అనుభవిస్తున్న బాధలకు, ఖర్మకు పూర్వకర్మ కారణం. ఎందుకంటే ఈ లోకంలో ఏదీ కారణం లేనిదే జరుగదు. ప్రతిదానికీ ఒక కారణం ఉంటుంది. ప్రతి మనిషి పడుతున్న బాధలకు ఉన్న కారణాలేమిటి? ఇప్పుడు వాటిని ఎలా సరిదిద్దుకోవాలి అనే విషయాన్ని వివరించగలగడం జ్యోతిర్విజ్ఞానంలోని అద్భుతాలలో ఒకటి.

శౌనకమహాముని ధ్యానంలో ఉండి తన మాటకు సమాధానం చెప్పలేదని కోపించి ఒక చచ్చిన పామును ఆయన మెడలోవేసి పోతాడు
పరీక్షిత్తు మహారాజు. ఈ పాపంవల్ల అతను తక్షకుని కాటుకు గురై మరణిస్తాడు. ఇది మహాభారతంలో మనకు తెలిసిన గాధ. పూర్వజన్మ పాపాలు వాటి ప్రభావాలను గురించి అంపశయ్యమీద ఉన్న భీష్ముడు ధర్మరాజుకు అనేక ఉదాహరణలతో వివరిస్తాడు.ఈ వివరాలు భారతంలో మనం చూడవచ్చు.కనుక కర్మ ఉన్నది.దాని ఫలితం అనుభవించడమూ ఉన్నది.ఇవి వాస్తవాలు.


సాధారణ జ్యోతిష్యంవల్ల కూడా ఈ వివరాలు తెలుసుకోవచ్చు.నాడీగ్రంధాలనుంచి కూడా చక్కగా తెలుసుకోవచ్చు.కాని నాడీగ్రంధాలు ఈవిషయాలలో స్పెషలైజుడ్ రీసెర్చి చేసినవి గనుక వాటినుంచి ఈవివరాలు బాగా తెలుస్తాయి.గతజన్మలో మనుషులు చేసే పాపాలు,ప్రస్తుతజన్మలో వాటి ఫలితాలు కొన్నింటిని ఇక్కడ చూద్దాం.


>>పూర్వజన్మలో ఒక అమ్మాయి అసూయతో తన తోటి అమ్మాయిల పెళ్ళి సంబంధాలు చెడగొట్టేది. ఈ విషయం ఆ అమ్మాయి జాతకంలో క్లియర్ గా కనిపిస్తున్నది. ఈ జన్మలో ఆ అమ్మాయికి ఎన్ని పెళ్ళిసంబంధాలు వచ్చినా ఒక్కటీ కుదరటం లేదు. గట్టిరెమెడీలు చేస్తే గాని ఈ దోషం పోదు.


>>ఒక వ్యక్తి గతజన్మలో తల్లిదండ్రులను పట్టించుకోకుండా గాలికొదిలేశాడు. ఈ జన్మలో ఇతను కొడుకులచేత ఒల్డ్ఏజ్ హోమ్ లో చేర్చబడి, పూర్వజన్మలో తన తల్లిదండ్రులను తాను పెట్టిన బాధను ఇప్పుడు అనుభవిస్తున్నాడు.


>>పూర్వజన్మలో ఇతను ఒక కన్యను గర్భవతిని చేసి ముఖం చాటేశాడు. ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయింది.ఈ జన్మలో ఇతనికి సంతానం లేదు. ఇప్పటికి రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు.ఇద్దరు భార్యలూ విషాద పరిస్తితుల్లో మరణించారు.వయసు అయిపోతున్నది, చేతిలో డబ్బులేదు. ముసలి వయసులో ఫుట్ పాత్ మీద అడుక్కుంటూ దిక్కులేని చావు గతి అయ్యేటట్లు ఉంది.

>> ఒక వ్యక్తి పూర్వజన్మలో తన భార్యను తన స్నేహితుడైన ఒక జమీందారుతో గడపమని బలవంతం చేసి ఆమె కాళ్ళావేళ్ళా పడ్డా వినక ఒప్పించాడు. ఈ జన్మలో భార్య తన స్నేహితునితో సంబంధం కలిగి ఉన్నది.ఆ సంగతి ఇతనికి తెలుసు.కాని ఏమీ చెయ్యలేడు.కారణం- ఇతనికి హఠాత్తుగా మగతనం పోయింది.ఇతను ఒక చిన్నరైతు. స్నేహితుడు అదే ఊళ్ళొ మోతుబరిరైతు.ఇతను మానసికక్షోభతో పిచ్చివాడయ్యే పరిస్థితిలో ఉన్నాడు.భార్య ఇతన్ని పురుగులా చూస్తుంది.ఆమె ఆస్తి ఆమెకు ఉన్నది.


>>పూర్వజన్మలో ఇతను చాలామంది స్త్రీలను ఒకరికి తెలియకుండా ఒకరిని పెళ్ళి చేసుకుని వదిలేసేవాడు. ఈ జన్మలో ఇతను ఒక స్త్రీగా పుట్టాడు.మొదటి భర్త ఏక్సిడేంట్లో మరణించాడు.రెండవభర్త కొన్నాళ్ళు కాపురం చేసి ఒదిలేశాడు.ప్రస్తుతం ఈమె వయస్సు ముప్పై లోపే.పడుపువృత్తిలో కాలం గడుపుతున్నది.


>> ఒకామె పూర్వజన్మలో చీటికిమాటికి చెట్లను గిల్లడం,ఆకులు తెంపడం, చీమల్ని కాళ్ళతో చంపడం చేసేది.ఈజన్మలో మళ్ళీ స్త్రీగా పుట్టింది.ఈమెకు చీటికి మాటికి దెబ్బలు తగులుతూ ఉంటాయి.చిన్నచిన్న ఏక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి.ఊరకే రోడ్డుపక్కగా పోతున్నాకూడా ఏదోవచ్చి ఈమెమీద పడి దెబ్బలు తగులుతూ ఉంటాయి. లేదా నడుస్తూ పోతూ గుమ్మాన్ని కొట్టుకుని తలకు దెబ్బలు తగులుతాయి.ఇలా ఉంటుంది పరిస్థితి.


ఇలాటి కేసులు చాలా గమనించాను. వీరందరూ సరియైన రెమెడీలు పాటిస్తే ఈ సంఘటనలు జరగటం ఆగిపోతాయి.కాని సరియైన సమయంలో ఆ రెమెడీలు పాటించాలి.ఇందులోని ఇంకొక వింత ఏమిటంటే, చాలామంది రెమెడీలు చెప్పినా చెయ్యలేరు.పూర్వకర్మ గట్టిగా ఉన్నప్పుడు రెమెడీలు పాటించాలని బుద్ధి పుట్టదు.లేదా అనేక అవాంతరాలు వచ్చి మధ్యలోనే రెమెడీలు మానుకుంటారు.ఇలా జరగడం చాలా సార్లు గమనించాను.


వీటన్నిటిని బట్టి జ్యోతిష్యశాస్త్రం మామూలు సైన్సు కాదు ఇది సూపర్ సైన్సు అని నేను గట్టిగా చెప్పగలను.ఈశాస్త్రాన్ని సరిగ్గా అర్ధం చేసుకోడానికి ప్రస్తుత సైన్సుకు ఇంకా వెయ్యి సంవత్సరాలు పట్టవచ్చు అంటే అతిశయోక్తి కానేరదు.