నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

3, జనవరి 2010, ఆదివారం

గణిత మేధావి శ్రీనివాస రామానుజం జాతకం

అసాధారణ గణిత మేధావి శ్రీనివాస రామానుజం జాతకం గమనిద్దాం. ఆయన 22-12-1887 న తమిళ్నాడులోని ఈరోడ్ లో జన్మించారు. సమయం సాయంత్రం 6.20 అని దొరికింది. కాని సవరించగా 6.16 అని వచ్చింది. 


ఈయనది మిథునలగ్నం, మకర నవాంశ. మీనరాశి, తులానవాంశ. ఉత్తరాభాద్ర మూడోపాదం.ఆత్మకారకుడు బుధుడు.  ఈయన జనన సమయంలో శని/రవి/శనిదశ జరుగుతున్నది. శని రవులిద్దరూ మారకస్థానాలలో ఉండటం చూడవచ్చు. శని వక్రించిన స్థితిలో ఉన్నాడు.ఈయనదికూడా చాలామంది ప్రసిద్ధవ్యక్తులవలె అల్పాయుజాతకమే. ఈయన 32 ఏళ్ళకే తీవ్రఅనారోగ్యంతో క్షయవ్యాధితో కన్నుమూశాడు.


లగ్నాధిపతి బుధుడు రోగస్థానంలో గురువుతో కలిశి ఉన్నాడు. గురువు ఈలగ్నానికి ఉభయకేంద్రాదిపత్యదోషి. బుధుడు స్వనక్షత్రమైన జ్యేష్టలోఉన్నప్పటికీ, గురువు అష్టమాధిపతి వక్రి అయిన శనినక్షత్రంలో ఉన్నాడు. శని వక్రిగాఉండి లగ్నంలో ఉన్నట్లు తీసుకోవాలి. కనుక చిన్నప్పటినుంచి ఈయన రోగాలతో సహవాసం చేసాడు. వాక్స్తానంలో రాహుశనులయుతితో ఆరేళ్ళపాటు మాటలు రాక మూగవానిగా ఉన్నాడు.


ఈయన పుట్టినప్పటికీ ఎనిమిదిసంవత్సరాల ఆరునెలలు దాదాపుగా శనిమహాదశ మిగిలి ఉన్నది. తరువాత బుధ దశ పదిహేడు ఏళ్ళు గడిచింది. తరువాత ఏడేళ్ళు కేతుదశ జరిగింది. కేతుదశ చివరిలో కేతు/బుధ/శని లోచిన్న వయసులో క్షయవ్యాధితో మరణించాడు.

చతుర్ధ షష్ఠ అధిపతుల పరస్పర పరివర్తనాయోగంతో విద్యలో తీవ్రఆటంకాలు ఏర్పడ్డాయి. అష్టమం నుంచి కేతువువిద్యా స్థానాన్ని చూడటముతో దరిద్రంతో చదువు కోలేక నానాకష్టాలూ పడ్డాడు. కాని లగ్న చతుర్దాదిపతి బుధుడునవాంశలో మిత్రస్థానంలో ఉండటము, చంద్ర లగ్నాత్ చతుర్దాదిపతి బుధుడు తొమ్మిదింట గురువుతో కలిశి ఉండటంతో విదేశీయుల సహాయంతో ఉన్నతవిద్యను పొందగలిగాడు.

చాలామందికి తెలియని విషయం ఏమనగా, ఈయన సాంప్రదాయ తమిళ బ్రాహ్మణకుటుంబంలో జన్మించటం చేత ఈయనకు జ్యోతిష్యజ్ఞానం బాగా ఉండేది. అంతేగాక ఈయన భగవతి పరమేశ్వరీభక్తుడు.దీనికి రుజువులుగా పంచమస్థానంలో శుక్రుడు స్వస్థానములో ఉండటము, చంద్రలగ్నాత్ పంచమంలో రాహువుస్థితి చూడవచ్చు. ఈయనకు అనేక గణితసిద్ధాంతాలు వాటికి జవాబులు నిద్రలో స్వప్నమూలకంగా వచ్చేవి. దీనికి కారణం ఆయన ఉపాసనాబలం.కాని ఈసంగతి ఇంగ్లాండు రచయితలు పూర్తిగా కావాలని దాచిపెట్టారు. లోకంకూడా ఆయన జీవితంలో ఈకోణాన్నిదర్శించలేదు.

ఈయన ఇంగ్లాండులో ఉన్నపుడు మాంసాహారానికి పూర్తిగా దూరంగా ఉండటమే గాక, తెల్లవారుజామున లేచి చన్నీళ్ళస్నానంచేసి సంధ్యావందనం క్రమంతప్పక చేసేవాడు.అనారోగ్యంతో బాధపడుతున్నాకూడా తన ఉపాసన ఆపేవాడు కాదు. నవమాధిపతి శని మారకస్థానంలో వక్రించి ఉండటము, సాంప్రదాయకారకుడైన గురువు రోగస్థానంలో లగ్నాధిపతితో కలసి ఉండి తొమ్మిదో దృష్టితో శని రాహువులను చూడటము-వీటివల్ల అనారోగ్యం ఎదురైనాకూడా సాంప్రదాయ విధానాలనుంచి వైదొలగని మొండితనం కనిపిస్తుంది.

కేతువు అష్టమంలో ఉండటము, శని అష్టమాదిపతిగా మారకస్థానంలో ఉండటము, బుధుడు లగ్నాదిపతిగా రోగస్థానంలో ఉండటము చూస్తె కేతు/ బుధ/శని దశలో మరణం ఎందుకో అర్థం అవుతుంది. 1913 లో తన గణితసిద్ధాంతాలను తొమ్మిదిపేజీలలో వ్రాసి Prof.G.H.Hardy కి పంపటంతో ఈయన జీవితం మలుపు తిరిగింది. అప్పుడు ఈయనకు బుధ/శని దశ జరుగుతూ ఉండవచ్చు.

ఈయన జీవితంలో ముఖ్య ఘట్టాలు, దశలు, గ్రహప్రభావం గమనిద్దాం.


>1902-Cubic equations ఎలా సాధించాలో తెలుసుకున్నాడు. తరువాత తానె Quartic equations ను సొంతంగాసాధించాడు. అప్పుడు ఆయనకు బుధ/శుక్ర జరుగుతున్నది. లగ్న విద్యాస్థానాధిపతి గా బుధుడు/పంచమాదిపతిగా శుక్రుడు వీరిద్దరి మిత్రత్వం గమనార్హం. వీరిద్దరూ ఆత్మ అమాత్య కారకులుగా ఉండటం కూడా గమనించాలి.


>1904- లో లోతైన పరిశోధన చెయ్యటం మొదలు పెట్టాడు. అప్పుడు బుధ/కుజ దశ మొదలైంది. కుజుడు విద్యాస్థానంలో ఉండి చంద్రునితో చూడబడుతూ చంద్ర మంగళయోగంలో ఉండటం చూడవచ్చు.

>1904-06 డబ్బు లేక పేదరికంతో నానాకష్టాలు పడ్డాడు. చదువుకుందామని ఉండి, డబ్బులేక అవస్తలు పడ్డాడు. అప్పుడు బుధ/రాహు జరిగింది. రాహు అంతర్ దశలోనే చదువు మానేసి కొంతకాలం విశాఖపట్నంలో ఉన్నాడు.

>1906 లో మద్రాస్ పచ్చయప్ప కాలేజిలో FA లో చేరి గణితంలో తప్ప మిగిలిన అన్ని సబ్జెక్టులలో తప్పాడు. అప్పుడుబుధ/రాహు/గురు, బుధ/రాహు/శని జరిగింది. రాహు గురువుల కలయిక రాహుశనుల కలయిక ఏమి చెయ్యాలోఅదే చేసింది.

>1908 లో continued fractions and divergent series మీద పరిశోధన చేసాడు. కొత్త విషయాలు కనిపెట్టాడు కానీ తీవ్ర అనారోగ్యం పాలైనాడు. అప్పుడు బుధ/రాహు/రవి, బుధ/రాహు/చంద్ర దశలు జరిగాయి. వివరణ అవసరంలేదు.

>ఏప్రిల్ 1909 లో హైడ్రోసిల్ ఆపరేషన్ జరిగింది. అప్పుడు బుధ/గురు/బుధ దశ జరిగింది. బుధుడు, గురువు ఇద్దరూ సహజ అష్టమస్థానం అయిన వృశ్చికంలో ఉండటం చూడవచ్చు. ఇది రోగస్థానం మాత్రమె కాక, సహజరాశి చక్రంలోగుహ్యాంగాలకు సూచకం. గురువు పెరగటానికి, వ్యాకోచానికి కారకుడు. కనుక హైడ్రోసిల్ వ్యాధి వచ్చింది.

>జూలై 1909 లో వివాహం జరిగింది. గురువు సప్తమాధిపతి, కేతువు చంద్ర లగ్నాత్ లాభస్థానంలో ఉన్నాడు. కాని లగ్నాత్ అష్టమం అవటంతో వివాహంవల్ల ప్రయోజనం లేకుండా పోయింది.

>1912 లో మద్రాస్ పోర్ట్ ట్రస్ట్ లో గుమాస్తా గా ఉద్యోగం లో చేరాడు. అప్పుడు బుధ/శని జరిగింది. శని వక్ర స్థితి వల్లలగ్నంలో ఉండి దశమంలోని చంద్రున్ని చూడటం వల్ల చిన్న ఉద్యోగం వచ్చింది. కాని మానసిక వ్యధ కూడా ఇదే యోగంఇచ్చింది.

>జనవరి 1913 లో G.H.Hardy అనే ప్రొఫెసర్ కు తన పరిశోధనా కాగితాలను పంపటం వల్ల అతని జీవితంలో మార్పువచ్చింది. అప్పటికి బుధ/శని దశ జరుగుతూ బుధ మహా దశ చివరకు వచ్చింది. 1914 లో నవమాధిపతి అయిన శనిఅంతర్దశలో విదేశ యానం కలిగింది.

>16-3-1916 లో కేంబ్రిడ్జ్ యునివర్సిటి నుంచి గ్రాడ్యుయేట్ అయ్యాడు. అప్పుడు కేతు/కుజ దశ జరిగింది. చంద్ర లగ్నాత్కేతువు లాభ స్థానంలో ఉండటం, కేతువు విదేశాన్ని చూపించే సప్తమంలో ఉండటం తో ఆ సంఘటనా జరిగింది. కుజవత్కేతు అనే సూత్రం ఇక్కడ గుర్తుంచు కోవాలి. ఇంకా కేతువు శనిని సూచిస్తూ ఉండి శని/కుజుల కలయికగా మారి తీవ్రఅనారోగ్యంతో ఆస్పత్రి పాలు చేసాడు.

>మే 1918 లో Fellow of Royal Society of London కు ఎంపిక కాబడ్డాడు. అప్పుడు కేతువులో శని దశ జరిగింది. భాగ్య భావం వెలుగు లోకి వచ్చింది. కేతువు లాభ స్థానం లో ఉండటము శని నవమాధిపతి కావటము చూడాలి. ఈ దశలలో కేతువు, శనుల కారకత్వాలు మారుతూ వారి విచిత్రపాత్రపోషణ చాలా వింతగా కనిపిస్తుంది. అదే సంవత్సరం అక్టోబరులోFellow of TrinityCollege of Cambridgeగా ఎన్నుకోబడ్డాడు.

>13-3-1919 భారత దేశానికి తిరిగి వచ్చాడు. అప్పుడు కేతువు/శని/రాహువు జరుగుతున్నది. కేతువు అష్టమ స్థితి, శని రాహువుల మారక స్తితి జాగృతం అయ్యింది.

>26-4-1920 మన దేశంలో తీవ్ర అనారోగ్యంతో ముప్పై రెండూ ఏళ్లకే కన్ను మూశాడు. అప్పుడు ఆయనకుకేతు/బుధ/శని జరిగింది. వివరణ అవసరం లేదు.

విద్యకు రోగాలకు సహవాసం ఈయన జీవితంలో ఒక విచిత్ర మైన యోగం. దీనికి కారణం లగ్న, విద్యా స్థానాధిపతిఅయిన బుధుడు, మారక అధిపతి అయిన గురువు తో కలసి రోగ స్థానం లో ఉండటం అనే విచిత్ర యోగం.

తెలివి తేటలు కలిగిన ఆణిముత్యాలకు మన దేశంలో ఎటువంటి గతి పడుతుంది, అదే తెలివితేటలకు ఇతర దేశాలలో ఎంత గుర్తింపు, విలువ ఉన్నాయి అనటానికి ఈయనజీవితం ఒక ఉదాహరణ.మన బానిస మనస్తత్వంతో, డబ్బును అధికారాన్ని గౌరవించటమే మాత్రమె మనకు తెలుసు. అంతేకాని నిజమైన ధీశక్తిని ప్రోత్సహించటం గౌరవించటం బానిసజాతిగా మనకు చాతకాదు అన్న విషయం ఎన్నోసార్లు మనం రుజువు చేసాం.శ్రీనివాస రామానుజం జీవితంకూడా దీనికి ఒక మచ్చుతునకగా చెప్పుకోవచ్చు.

తెల్లవాడు నెత్తిన పెట్టుకుంటే అప్పుడు మనకు మనవాళ్ళ విలువ తెలుస్తుంది. అంతే కాని అదే మనుషులు మన మధ్యనే ఎన్నాళ్ళు తిరిగినా గుర్తించని, విలువ ఇవ్వని బానిసజాతి మనది. ఒక వివేకానందుడైనా, శ్రీరామకృష్ణు డైనా, శ్రీనివాస రామానుజం అయినా ఇదే కోవకు చెందిన రుజువులు అని ఘంటాపధంగా చెప్ప వచ్చు.

ఈయన జాతకంలో అల్పాయుర్యోగాలు మరోసారి చూద్దాం.