21, నవంబర్ 2022, సోమవారం

మూడవ అమెరికా యాత్ర - 59 (సంతోషం)

తల్లి ఒడిలో కళ్ళు తెరచిన

క్షణం నుండి

నీ పయనం మొదలైంది

ఆపడం నీ చేతిలో లేదు

సంతోషంగా పయనించు


ఊపిరి పీల్చుకోవడం

మొదలుపెట్టిన క్షణం నుండి

నీ నడక మొదలైంది

ఆపడం నీ చేతిలో లేదు

సంతోషంగా నడువు


గడపదాటి బయటకు

అడుగేసిన క్షణం నుండి

అందరితో నీ స్నేహం మొదలైంది

ఆపడం నీ చేతిలో లేదు

సంతోషంగా సాటివారిని ఆదరించు


తిండనేది తినడం

మొదలుపెట్టిన క్షణం నుండి

నీ బ్రతుకు మొదలైంది

ఆపడం నీ చేతిలో లేదు

సంతోషంగా బ్రతుకు


నవ్వూ ఏడుపుల మధ్యన

నీ జీవితంలోకి 

దేనిని తీసుకోవాలనేది మాత్రం

నీ చేతిలోనే ఉంది

నవ్వునే స్వీకరించు


ఏ పరిస్ధితిలో ఉన్నప్పటికీ

సంతోషంగా ఉండాలా

ఏడుస్తూ ఉండాలా

అనేది మాత్రం నీ చేతిలోనే ఉంది

సంతోషంగా ఉండు


సంతోషమనేది బయట లేదు

నీ చుట్టూ ఉన్న పరిస్థితులలో లేదు

నీకు కలిగే లాభాలలో లేదు

జీవితమంటే నీ అవగాహనలో ఉంది

దానిని నీలో కళ్ళు తెరవనీ


అన్నీ ఉన్నా ఏడుస్తూ ఉండచ్చు

ఏమీ లేకున్నా సంతోషంగా ఉండచ్చు

ఉండటం లేకపోవడాల మీద

సంతోషం ఆధారపడి లేదు

ఈ అవగాహనను నీలో వెలగనీ


సంతోషపు రహస్యమేమిటో చెప్పనా?

కృతజ్ఞత నీలో ఉంటే 

సంతోషం నీలో ఉంటుంది

నీలో ఏ అర్హతలూ లేకున్నా

నీకు దక్కిన వరాలు గుర్తుంటే

సంతోషం నీలో ఉంటుంది


బ్రతకడానికి నీకేం అర్హతుంది?

కానీ సృష్టి నిన్ను బ్రతకనిస్తున్నది 

ఈ కృతజ్ఞత అనుక్షణం నీలో ఉండాలి

అప్పుడే సంతోషరహస్యం నీకర్థమౌతుంది

అప్పుడే నీ జీవితం ఆనందమయమౌతుంది

read more " మూడవ అమెరికా యాత్ర - 59 (సంతోషం) "

20, నవంబర్ 2022, ఆదివారం

మూడవ అమెరికా యాత్ర - 58 ('శ్రీరామగీత' అమెరికానుండి విడుదల)

నా కలం నుండి వెలువడుతున్న 55 వ పుస్తకంగా ఆధ్యాత్మ రామాయణాంతర్గతమైన 'శ్రీరామగీత' నేడు విడుదల అవుతున్నది. దీనిని అమెరికాలోని ఇల్లినాయ్ రాష్ట్రం లోని షాంపేన్ సిటీ నుండి శ్రీనివాస్ దంపతుల చేతుల మీదుగా విడుదల చేయిస్తున్నాను.

మన హిందూమతంలో ఉన్న గ్రంధములలో నూరుకు పైగా 'గీత' లున్నాయి. అయితే, వాటిలో బహుళ ప్రచారమును పొందినది భగవద్గీత ఒక్కటే. కానీ, ఇతరములైన, దేవీగీత, హంసగీత, ఉద్ధవగీత, వశిష్టగీత, బ్రాహ్మణగీత మొదలైన ఎన్నో గీతలున్నాయి. బౌద్ధంలోని ధమ్మపదమును కూడా 'బుద్ధగీత' అంటారు. సంస్కృతంలో గీతమంటే 'చెప్పబడినది, గానం చేయబడినది' అని అర్ధము. ఆయా మహనీయుల బోధలన్నీ వారివారి 'గీతము' లనిన పేర్లతో మనకు లభిస్తున్నాయి. 


అత్యున్నతమైన వేదాంతతత్త్వమును ప్రతిపాదించే గ్రంధములే వీటిలో ఎక్కువగా ఉంటాయి. వేదప్రతిపాదితమైన పరబ్రహ్మతత్వమును, దానిని చేరుకునేటటువంటి జ్ఞానమార్గ సాధనను వివరించినది ఈ 'శ్రీరామగీత'. అంతేగాక, కర్మ, భక్తి, జ్ఞానమార్గములను, సాకార సగుణోపాసనను, నిరాకార నిర్గుణోపాసనను సమన్వయపరుస్తూ చెప్పబడిన అద్భుతమైన తాత్వికచింతన దీనిలో ఉంటుంది. శ్రీరాముని యొక్క అవతారతత్వమును, పరబ్రహ్మతత్వమును వివరిస్తూ ఈ గ్రంధం ఉంటుంది.


శ్లో || రామో విగ్రహవాన్ ధర్మః సాధుసత్య పరాక్రమః

రాజా సర్వస్య లోకస్య దేవానామివ వాసవః ||


రూపు దాల్చిన ధర్మమే రాముడు. ఆయన సౌమ్యుడు, సత్యమైన పరాక్రమవంతుడు. సర్వలోకములకు ఆయనే రాజు. దేవతలలో ఇంద్రునివంటివాడు.


శ్లో || జీవితం చ సుఖం చైవ రాజ్యం చైవ సుదుర్లభం

యదిచ్ఛసి చిరం భోక్తుమ్ మా కృథా రామ విప్రియమ్ ||


నీ జీవితమునుగాని, సుఖమును గాని, దుర్లభమైన రాజ్యమును గాని, ఎక్కువకాలం కొనసాగించాలనుకుంటే రాముడిని నీ శత్రువుగా చేసుకోకు.


అని మారీచుడు, రావణునకు బోధించినట్లుగా రామాయణం అరణ్యకాండలో మనం చూడవచ్చు. అటువంటిది శ్రీరాముని మహోన్నతమైన వ్యక్తిత్వము, అవతారతత్వము.


ప్రాచీనకాలంనుంచీ, శ్రీరామచంద్రుని ఆరాధనకు ఆంధ్రదేశం పెటింది పేరు. 50 ఏళ్ల క్రితం నా చిన్నతనంలో, గ్రామగ్రామంలోనూ రామాలయాలు ఉండేవి. రామభజనలు, సంకీర్తనలు, శ్రీరామనవమి, హనుమజ్జయంతి ఉత్సవములు జరుగుతూ ఉండేవి. ఎంతవరకైతే సమాజంలో రామభక్తి ఉన్నదో అంతవరకూ ఆంధ్రదేశం అన్నింటిలోనూ పురోగమిస్తూ ఉండేది. సమాజంలో నీతినియమములు, పద్ధతులు కూడా చక్కగా ఉండేవి. ప్రజలు ధర్మాన్ని తప్పకుండా ఉండేవారు. రానురాను రామభక్తి తగ్గిపోతూ వచ్చింది. రావణాసురుడిని హీరోగా చూపిస్తూ సినిమాలు తియ్యడం మొదలైంది. రామాయణవిషవృక్షం వంటి విషపు పుస్తకాలు వచ్చాయి. అప్పటినుంచీ ఆంధ్రదేశ పతనం మొదలైంది.


శ్రీరాముడి వేషాలు సినిమాలలో వేసి పేరు తెచ్చుకున్నవారు కూడా నిజజీవితంలో ధర్మాన్ని తప్పారు. పతనమయ్యారు. 'యథారాజా తథాప్రజా' అన్నట్లు క్రమేణా ప్రజలలో కూడా రామభక్తి లోపిస్తూ వచ్చింది, దానికి తగినట్లే, సమాజంలో నీతినియమాలు మాయమౌతూ వచ్చాయి. ప్రస్తుతం ధర్మంతో కూడిన జీవితాలు ఎక్కడా కనపడటం లేదు. ధర్మానికి ప్రాధాన్యం మాయమై, ధనానికి, అవినీతికి ప్రాధాన్యం పెరిగింది. హిందూవ్యతిరేక మతాలు చాపక్రింద నీరులాగా సమాజంలోకి పాకడం మొదలు పెట్టాయి. సమాజం క్రమేణా బీటలువారుతూ వచ్చింది. ఇదంతా రావణభక్తి ఫలితమే.

ధర్మస్వరూపుడైన శ్రీరాముని భక్తి సమాజంలో తగ్గిపోవడమే ఆంధ్రదేశపు నేటి దురవస్థకు గల ప్రధానమైన కారణం. మళ్ళీ రామభక్తి పుంజుకున్ననాడే ఆంధ్రదేశం అన్నిటా బాగుపడుతుంది. లేదంటే ఆంధ్రదేశం ముందుముందు ఏమౌతుందో చెప్పడం కష్టం. రాముని వ్యతిరేకించేవారు రాక్షసులే కాబట్టి, రాక్షసులతో నిండిపోయినా ఆశ్చర్యపోనక్కరలేదు.


అదంతా అలా ఉంచితే, ఒక్క వారం రోజులలో ఈ పుస్తకమును వ్రాయగలగడానికి తగిన వాతావరణమును సమకూర్చి సహకరించిన నా శ్రీమతి సరళాదేవి, నా శిష్యురాళ్ళు అఖిల, లలితలు, శిష్యులు ప్రవీణ్, చావలి శ్రీనివాస్ లు, షాంపేన్ లో మమ్మల్ని ఎంతో ఆప్యాయతతో ఆదరిస్తున్న శ్రీనివాస్ నూకల దంపతులకు నా కృతజ్ఞతలు, ఆశీస్సులను అందిస్తున్నాను. వారి చేతులమీదుగా అమెరికానుండి ఈ మహత్తరమైన గ్రంధం విడుదల అవుతున్నది.


అమెరికా వచ్చాక ఇప్పటికి అయిదు పుస్తకాలను వ్రాశాను. ఇండియా వచ్చేలోపల ఇంకొక అయిదు పుస్తకాలను వ్రాయాలని సంకల్పం. ఏమౌతుందో చూడాలి.


యధావిధిగా ఈ గ్రంధం కూడా Google Play Books నుండి ఇక్కడ లభిస్తుంది. చదవండి. హిందూమతాన్ని సక్రమంగా అర్ధం చేసుకోండి. మీ జీవితాలకు ధన్యత్వాన్ని అద్దుకోండి.

read more " మూడవ అమెరికా యాత్ర - 58 ('శ్రీరామగీత' అమెరికానుండి విడుదల) "

16, నవంబర్ 2022, బుధవారం

మూడవ అమెరికా యాత్ర - 57 (గంగిగోవు పాలు)

మొన్నొకాయన కనబడి, 'మా అబ్బాయిని తీసుకుని ఆదివారం సాయంత్రం మీ దగ్గరికి వస్తాను, మీ ఆశీస్సులు వాడికి కావాలి' అన్నాడు. 2017 లో నా స్పీచి ఆయన విన్నాట్ట. ఇప్పుడు మళ్ళీ షాంపేన్ కు వచ్చానని తెలిసి, వాళ్ళబ్బాయిని తీస్కుని వస్తానంటాడు. 

'ఆశీస్సులు కావలసింది నీకు. మీ అబ్బాయికి కాదు. రావద్దు' అని చెప్పాను.

ఆశీస్సులివ్వడానికి నేనేమైనా స్వామీజీనా? పైగా, వారికి కావలసిన ఆశీస్సులేమిటి? అన్నిట్లో కలసి రావడం, డబ్బులు బాగా సంపాదించడం, ఇవేగా? నాకు నచ్చనిదే ఇలాంటి ఆశీస్సులివ్వడం. నేనేం చెబుతున్నానో అర్ధం చేసుకోకుండా, వాళ్ళేదో ఊహించుకుని, నన్నలా చెయ్యమంటే, నాకెలా కుదురుతుంది? నేనున్నది అందరి ట్యూన్స్ కు డాన్స్ చెయ్యడానికి కాదు. నా ట్యూనంటూ ఒకటేడిసింది. దాన్ని నేర్చుకునేవారు నాక్కావాలి.

ఆయన మళ్ళీ అడిగితే, ఇలా చెప్పమన్నాను.

'పాదపూజకైతే పదివేల డాలర్లు అవుతాయి. పోనీ మీరు తెలిసిన వాళ్ళు కాబట్టి తొమ్మిది వేలివ్వండి. గురూజీ ఏదోరకంగా సర్దుకుంటారు'  

మళ్ళీ ఆయన మాట్లాడితే ఒట్టు !

ఇంకొకాయన ఊరకే ఒకసారి సరదాగా వచ్చి కలుస్తానన్నాడు.

'రావద్దు' అని చెప్పమన్నాను.

సరదాగా కలవడానికి నేనేమైనా ఈయన గర్ల్ ఫ్రెండ్ నా? ఈరోజుల్లో అదికూడా ఊరకే ఏమీ కలవదు.  దానికి బోలెడు గిఫ్టులివ్వాల్సి ఉంటుంది. పైగా ఊరకే వచ్చి కాలక్షేపం కబుర్లు, ఇండియా రాజకీయాలు మాట్లాడటానికి నేనేమీ పనీపాటా లేనివాడిని కాను. అలాంటివాళ్ళు చాలామందుంటారు. పోయి వాళ్ళతో ముచ్చట్లేసుకోమని చెప్పాను. వాళ్ళ విజ్ఞానప్రదర్శనకు నేనొక్కడినే దొరికానా? నాకున్న విజ్ఞానమే ఎక్కువై నేను చస్తుంటే పైగా వీళ్ళ విజ్ఞానాన్ని నేనెక్కడ మోసేది?

ఇంకొకామె, 'నేను పాతికేళ్లుగా అమెరికాలో క్రియాయోగా టీచర్ని. నా అనుభవాలు మీతో పంచుకుందామని అనుకుంటున్నాను. ఎప్పుడు రమ్మంటారు?' అని మెయిల్ చేసింది.

'ఈ పంచుకోవడం, ఉంచుకోవడం, చించుకోవడాల మీద నాకు మంచి అభిప్రాయం లేదు. మీరు రావద్దు. మీతో ఏది పంచుకోవడానికైనా నేను సిద్ధంగా లేను. సారీ' అని చెప్పాను.

ఈమెకు ఒక శ్రోత కావాలి. ఆమె సోకాల్డ్ అనుభవాలు విని, 'అబ్బా మీరెంత గ్రేటో? మీరు కాబట్టి ఇంత చిన్నవయసులోనే ఇంతమందితో ఇన్ని అనుభవాలు సంపాదించారు. వేరెవరి వల్లా ఇలాంటిది సాధ్యం కాదు' అని ఆమెకు డప్పు కొట్టాలి. ఇది నేనెక్కడ చెయ్యగలను?

నాకు భజన చేసేవాళ్ళకోసం నేను చూస్తుంటే, ఈమెకు నేను భజన చేయాలట. భలే ఉంది. 

'పోపోవమ్మా, వేరే బకరాని వెతుక్కో' అని మెయిలిచ్చాను.

ఇంకొకాయన, 'ఏమండి? నేను ఆధ్యాత్మికానికి పనికొస్తానా? లేక లౌకికంలో ఉండమంటారా? నా జనానా వివరాలు పంపిస్తున్నాను. చూసి చెప్పండి' అని మెయిలిచ్చాడు.

'జనన వివరాలు' అని వ్రాయవలసింది 'జనానా వివరాలు' అని వ్రాశాడు మెయిల్లో.

అతనికిలా రిప్లై ఇచ్చాను.

'చూడు బాబు. నీ జనానా చాలా పెద్దదిగా ఉంది. అసలే ఇండియాలో జనాభా ఎక్కువైపోయింది. నీవంతు కృషితో దాన్నింకా పెంచకు. ఆ జనానాని వదిలేసి ఒక్కదానితో ఉండు. అప్పుడు బాగుపడతావు. ఇంత చిన్నప్రశ్నకు నీ జాతకం చూడక్కరలేదు. నీవు మెయిల్ చేసిన విధానాన్ని బట్టి నీ మొత్తం జాతకం చెప్పగలను. నువ్వు ఆధ్యాత్మికానికీ పనికిరావు, లౌకికానికీ పనికిరావు. వెంటనే బాంబే వెళ్లే రైలెక్కు. అక్కడ  చప్పట్లు కొట్టుకుంటూ షాపుల వెంట తిరిగే బ్యాచ్ ఒకటుంటుంది. అందులో చేరు. నీకదే సరైనది'

'నాకు ఆకలైనప్పుడు నాకు గుర్తు చెయ్యి' అన్నాట్ట వెనకటికి ఒకాయన ! అలా ఉంది. కలెప్పుడౌతుందో జ్యోతిష్యం చూచి తెలుసుకోనక్కరలేదు. ఒక కప్పు ఆముదం త్రాగితే చాలు. మర్నాటికి బ్రహ్మాండంగా ఆకలౌతుంది.

ఆధ్యాత్మికానికి పనికొస్తాడో లేదో నేను చెప్పాలట ! ఎంత కామెడీగా ఉందో ! ఇంకా నయం. 'నేను పెళ్ళికి పనికొస్తానా?' అని అడగలేదు. బ్రతికిపోయాను.

లోకమంతా ఇలాంటి మనుషులతో నిండి ఉంది. ఇలాంటి త్రికరణశుద్ధి లేని మనుషులతో నాకెందుకు? సరియైన దృక్పధం ఉన్నవాడు ఒక్కడు చాలు. గంగిగోవు పాలు గరిటెడైనను చాలు, కడివెడైననేమి ఖరము పాలు?

ఒకవేళ గంగిగోవు పాలు దొరకలేదనుకో. అప్పుడేం చెయ్యాలి? దొరక్కపోతే పోనీ, నా టైం నాకు మిగుల్తుంది. సోది మనుషులతో సోది కాలక్షేపం తప్పుతుంది కదా? అదే చాలు.

గంగాజలం దొరకలేదని బురదనీళ్ళు త్రాగలేము కదా? ఆవుపాలు దొరకలేదని ఆముదం త్రాగలేము కదా ! నావరకూ నాకంత దాహమైతే లేదు.

ఏం లోకమో? ఏమి మనుషులో?

read more " మూడవ అమెరికా యాత్ర - 57 (గంగిగోవు పాలు) "

15, నవంబర్ 2022, మంగళవారం

మూడవ అమెరికా యాత్ర - 56 (మంచుపూలు)



మంచుపూలు రాలుతున్నాయి
చలి కుంపట్లు రాజుకుంటున్నాయి
మౌనం ముసుగులో ఊరు
మంచు దుప్పటిలో ఇళ్ళు

శరీరం అమెరికాలో
నసు హిమాలయాలలో
అన్నీ అందుబాటులో 
మనసు మరోలోకంలో

భోగభూమిలో యోగం !
read more " మూడవ అమెరికా యాత్ర - 56 (మంచుపూలు) "

మూడవ అమెరికా యాత్ర - 55 (షాంపేన్ రిట్రీట్ ముగిసింది)

11, 12, 13 తేదీలలో జరిగిన షాంపేన్ రిట్రీట్ విజయవంతంగా ముగిసింది.

సాత్వికమైన మితాహారం, యోగాభ్యాసం, ధ్యానం, సందేహాలకు సమాధానాలు, చర్చలతో కూడిన ప్రేమపూరిత వాతావరణంలో ఈ మూడు రోజుల రిట్రీట్ జరిగింది. దైవాన్వేషణ, ధ్యానం, తమను తాము దిద్దుకోవడం, జీవితాలకు ఔన్నత్యాన్ని అద్దుకోవడం - ఇవి తప్ప వేరే మాటలు, ఆలోచనలు ఎవరికీ లేవు.  

అమెరికాలో ఎక్కడెక్కడినుంచో వచ్చిన, ఎవరికెవరో తెలియని క్రొత్తమనుషులు, అందరూ ఒకే కుటుంబంలాగా స్వచ్ఛమైన ప్రేమాభిమానాలతో మూడు రోజులపాటు కలసి మెలసి ఉంటూ, పంచవటి సాధనావిధానాన్ని నేర్చుకున్నారు. స్వచ్ఛమైన ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూచారు.

ఉన్నతమైన ధ్యానవిధానాలను వీరికి వివరించి, కొన్నింటిని అభ్యాసం చేయించాను. యోగాభ్యాసంలో ఉన్నత స్థాయి అభ్యాసాలు ఎలా ఉంటాయో వీరికి వివరించి, ప్రదర్శించి చూపించాను. నేర్పించాను.

మూడురోజులూ ఒకే కుటుంబంలాగా కలసి ఉండి, జీవితాలకు ధన్యత్వాన్ని కలిగించే ఎన్నో విషయాలను నేర్చుకుని, సంతృప్తిగా అందరూ వారివారి ఊర్లకు వెళ్లిపోయారు. ఉండటానికి వీలైన కొందరు మాత్రం 14, 15 తేదీలలో కూడా మాతో ఇక్కడే ఉండి, ఈరోజున బయలుదేరి వెళ్లారు. 'మళ్ళీ మీరెప్పుడు కనిపిస్తారో తెలియదు. అందుకే ఇంకొన్ని రోజులు మీతో కలసి ఉంటాం' అన్నది వారి ఉద్దేశ్యం.

వారివారి ఊర్లకు రమ్మని అందరూ నన్ను ఆహ్వానించారు. వీలైనప్పుడు వస్తానని వారికి మాటిచ్చాను.

ఇండియాలో నాతో కలసి ఉన్నవారు, నాకు పరిచయస్తులు ఎవరూ నా దగ్గరనుండి వీటిని నేర్చుకోలేకపోయారు. ఇన్ని వేలమైళ్ల దూరంలోని అమెరికాలో ఉంటున్న వీరు నేర్చుకున్నారు.

ఆకలిని బట్టి ఆహారం లభించడం ఆధ్యాత్మిక జీవితపు రహస్యాలలో ఒకటి ! అది ఈ విధంగా మళ్ళీ ఋజువైంది.

వ్యక్తిగత కారణాలరీత్యా ఫోటోలు పెట్టడం లేదు.

read more " మూడవ అమెరికా యాత్ర - 55 (షాంపేన్ రిట్రీట్ ముగిసింది) "

13, నవంబర్ 2022, ఆదివారం

మూడవ అమెరికా యాత్ర - 54 (చికాగో సందర్శన)

ఉదయం తొమ్మిదికి ట్రాయ్ లో రైలెక్కి, మధ్యాన్నం రెండు గంటలకు చికాగో యూనియన్ రైల్వే స్టేషన్లో దిగాము. షాంపేన్ ట్రెయిన్ కోసం అక్కడ రెండు గంటలపాటు వేచి ఉండాలి. ట్రాక్ రిపేర్లు జరుగుతున్నాయని ఈ రైలు డిపార్చర్ ఒక గంట లేటైంది. కనుక మూడు గంటల వెయిటింగ్  టైం ఉంది. అందుకని లగేజి దగ్గర కొంతమంది కాపలాగా ఉంటే, కొంతమందిమి స్టేషన్ బయటకొచ్చి చికాగో డౌన్ టౌన్ లో షికార్లు చేశాము. రెండు వీధుల అవతలనే సియర్స్ టవర్ ఉన్నది. ఇది ప్రపంచంలోనే ఎత్తైన టవర్లలో ఒకటి. దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా టవర్ కట్టకముందు ఇదే ప్రపంచంలోని అతి ఎత్తైన టవర్. ఈ బిల్డింగ్ లో 110 అంతస్తులున్నాయి.  దీనిని 1975 లో కట్టారు.


చికాగో డౌన్ టౌన్, సియర్స్ టవర్ దగ్గర


 చికాగో యూనియన్ రైల్వే స్టేషన్ లాంజ్ లో

చికాగో రైల్వే స్టేషన్, మన హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ కంటే బాగుంది, నీట్ గా ఉంది. సిటీ మధ్యలో ఉండటంతో దీనికి చాలా ఎంట్రన్స్ లున్నాయి. ఎక్కడా బెగ్గర్స్, హాకర్స్, కనపడలేదు. ప్లాట్ ఫామ్ మీద పడుకుని నిద్రపోయేవాళ్లు, అల్లరిచిల్లరగా తిరిగేవాళ్లు ఎక్కడా లేరు. ఎనౌన్స్ మెంట్ లేదు. వ్యాపారప్రకటనలు లేవు. అంత పెద్ద స్టేషన్ కూడా నిశ్శబ్దంగా, డీసెంట్ గా ఉంది.

ఇది, చెన్నై సెంట్రల్ స్టేషన్ మోడల్లో ఉంది. రైళ్లన్నీ వచ్చి ఒక డెడ్ ఎండ్ లో ఆగుతాయి. అక్కడనుంచి బయటకి దారులుంటాయి. ప్లాట్ ఫామ్స్ మీద మనుషులెవరూ ఉండరు. అవన్నీ అండర్ గ్రౌండ్లో ఉన్నట్టుగా ఉంటాయి. మనుషులందరూ ఒక పెద్ద వెయిటింగ్ లాంజ్ లో ఉంటారు. రైలు టైమైనప్పుడు, ఒకతను వచ్చి ఆ రైలు పాసింజర్స్ ముందుకు రమ్మంటాడు. మనం వెళ్లి క్యూలో నిలబడితే, అతను దారిచూపిస్తూ తీసుకెళ్లి ఆ ప్లాట్ ఫామ్ కు దారి చూపుతాడు. చాలా డీసెంట్ గా ఉంది. 




చికాగో యూనియన్ రైల్వే స్టేషన్. డౌన్ టౌన్ కు వెళ్లే ఎగ్జిట్ దగ్గరనుంచి



ఇది ఈ స్టేషన్ కున్న అనేక ఎంట్రన్స్ లలో ఒకటి. దీనిలోనుంచి బయటకొస్తే సియర్స్ టవర్ దగ్గరకు వస్తాము.



సియర్స్ టవర్ దగ్గరలోని బిల్డింగ్స్ ఇలా ఉంటాయి


చికాగో రివర్ దగ్గర


చికాగో నది, సియర్స్ టవర్ దగ్గర
చికాగో ని 'విండీ టౌన్' అంటారు. లేక్ మిషిగన్ పక్కనే ఉండటంతో ఎప్పుడూ హోరుమని గాలివీస్తూ ఉంటుంది. ఈ రోజున కూడా బాగా చలిగాలి ఉంది.



చికాగో రివర్



స్టీమర్లో ఎక్కి, చికాగో నది గుండా తిరుగుతూ సిటీ టూర్ చేసే సౌకర్యం ఇక్కడుంది. నేను ఆ బ్రిడ్జి మీద  నిలబడి చూస్తూ ఉండగా  ఒక స్టీమర్ వచ్చింది. దాని వీడియో ఇది.



చికాగో యూనియన్ స్టేషన్ ప్లాట్ ఫామ్స్ 


సాయంత్రం అయిందింటికి చికాగో యూనియన్ స్టేషన్ ప్లాట్ ఫామ్స్ ఇలా ఉన్నాయి. ఇక్కడ ఐదుకే చీకటి పడిపోతోంది.


చికాగో డౌన్ టౌన్


షాంపేన్ అర్బానా స్టేషన్లో రిసెప్షన్

చికాగోలో సాయంత్రం అయిందింటికి డబల్ డెక్కర్ రైలెక్కి రాత్రి ఏడింటికి షాంపేన్ చేరుకున్నాం. అప్పటికే రాత్రి పదో, పదకొండో అయినట్లు చీకటిగా ఉంది. ఈ ట్రెయిన్ నిండా యూనివర్సిటీ స్టూడెంట్స్ ఉన్నారు. ఇక్కడ యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయ్ ఉండటంతో చికాగో నుంచి ఇక్కడకు స్టూడెంట్స్ వస్తూపోతూ ఉంటారు.

శ్రీనివాస్, జ్యోతి, గీత స్టేషనుకొచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు.



షాంపేన్ లో శ్రీనివాస్ గారి ఇంటినుండి 'సనత్సుజాతీయము' తెలుగు పుస్తకం విడుదల



షాంపేన్ సరస్వతీ మాత ఆలయ సందర్శన. ఇక్కడ చలి మైనస్ ఒక డిగ్రీ ఉంది.


షాంపేన్ లో
read more " మూడవ అమెరికా యాత్ర - 54 (చికాగో సందర్శన) "

12, నవంబర్ 2022, శనివారం

మూడవ అమెరికా యాత్ర - 53 (అమెరికాలో రైలు ప్రయాణం)

అమెరికాలో విమానాలెక్కడం మామూలే. ఇప్పటికి చాలాసార్లు ఎక్కడం జరిగింది. ఒకసారి రైలుప్రయాణం చేద్దామని అనుకున్నాను. ఇల్లినాయ్ రాష్ట్రంలో చికాగో దగ్గరలో షాంపేన్ సిటీ ఉంది. దీనిని షాంపేన్ అర్బానా అంటారు. షాంపేన్, అర్బానా అనే రెండు సిటీలు కలసి ఉంటాయి. ఇక్కడ 'యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినోయ్' ఉంది. ఇది చాలా పేరున్న యూనివర్సిటీ. అందుకని షాంపేన్ అనేది విద్యాకేంద్రమన్నమాట. అక్కడ మూడు రోజుల స్పిరిట్యువల్ రిట్రీట్ నిర్వహించే ప్లానుంది.

గతంలో 2016 లో ఇక్కడకొచ్చినపుడు ఇక్కడి సరస్వతీ ఆలయంలో ఉపన్యాసమిచ్చాను. ఇప్పుడు మళ్ళీ షాంపేన్ వెళ్తున్నాను. మిషిగన్ రాష్ట్రంలో నేనున్న ట్రాయ్ సిటీ నుండి ఇల్లినాయ్ రాష్ట్రంలోని షాంపేన్ కు రైల్లో పోదామని ప్లాన్ చేసాం. డ్రైవింగ్ అయితే ఆరేడు గంటలు పడుతుంది. రైల్లో పోతే రిలాక్స్ అవుతూ ప్రయాణం చేయవచ్చు.

ట్రాయ్ నుండి ముందు చికాగోకి వెళ్ళాలి. ఇది ఆరు గంటల ప్రయాణం. అక్కడ రెండు గంటలు ఆగి, మళ్ళీ ఇంకొక రైలెక్కి ఇంకొక రెండు గంటల ప్రయాణంతో షాంపేన్ చేరుకోవాలి. AMTRACK అనే రైల్వేకంపెనీ రైళ్లు ఈ రూట్లో నడుస్తుంటాయి.

మన రైల్వే సిస్టం కంటే ఇది భిన్నంగా ఉంది. ఈ రూట్లో విద్యుద్దీకరణ ఇంకా జరగలేదు. డీజిల్ ఇంజన్లే నడుస్తున్నాయి. కాకపోతే మేగ్జిమం స్పీడ్ 110 మైళ్ళుంది. అంటే దాదాపు 160 కి. మీ స్పీడులో పోతుంది. దీనిని మనం ఇంకా అందుకోలేకపోతున్నాం.

కొన్ని చోట్ల సింగిల్ లైనుగా, కొన్నిచోట్ల డబల్ లైనుగా ఉంది. ఎక్కువ ట్రెయిన్స్ తిరగడం లేదు గనుక, క్రాసింగులు లేవు. రైలు కూడా కిటకిటలాడుతూ లేదు. స్టాండింగ్ పాసింజర్స్ లేరు. ఈ రైలుకు అయిదు బోగీలు మాత్రమే ఉన్నాయి. ఎక్కడా హాకర్లు, బెగ్గర్లు కనపడలేదు. అంతా క్లాస్ గా ఉంది.

రైల్వే స్టేషన్లు ఎయిర్ పోర్ట్ ల్లాగా చాలా శుభ్రంగా ఉన్నాయి. స్టాఫ్ తక్కువ. ఎక్కువగా ఆటోమేషన్, మెకనైజేషన్ కనిపిస్తోంది.  రైలుకు గార్డు బోగీ లేదు. ఒక టీటీఈ ఉన్నాడు. ఒక సూపర్ వైజర్ ఉన్నాడు. పాంట్రీ కార్ ఉంది. మనుషులందరూ ఎక్కాక టీటీఈ, ఇంజన్ డ్రైవర్ తో వాకీటాకీలో మాట్లాడుతున్నాడు.  అప్పుడు ట్రెయిన్ స్టార్ట్ అవుతోంది. స్టేషన్లలో ఎనౌన్ మెంటు మొదలైనవి లేవు. ట్రెయిన్లో మాత్రం, రాబోయే స్టేషన్ ఏమిటి అనేది టీటీఈ ఎనౌన్స్ చేస్తున్నాడు.

పాంట్రీ కార్ చిన్న సైజు హోటల్ లాగా ఉంది. అక్కడ ఫుడ్ కొనుక్కుని అక్కడే కూర్చుని తినవచ్చు. పాంట్రీలో రెడ్ వైన్, వైట్ వైన్ కూడా దొరుకుతున్నాయి. టాయిలెట్స్, విమానాలలో ఉన్నట్లు చాలా శుభ్రంగా ఉన్నాయి. ఇది రైలు అని కాసేపు మర్చిపోతే, విమానంలో ఉన్నట్లే యాంబియెన్స్ అంతా నీట్ గా ఉంది.

లెవల్ క్రాసింగ్ గేట్ల దగ్గర మనుషులు లేరు. రెడ్ సిగ్నల్ పడితే కార్లు ఆగిపోతున్నాయి. గేట్ దగ్గర బూమ్ కూడా రైట్ హాఫ్ లోనే సగమే ఉంది. లెఫ్ట్ కి లేదు. మనుషుల్లో డిసిప్లిన్ ఉంది గనుక, అందరూ సిగ్నల్ పాటిస్తారు గనుక సాగిపోతున్నది. మన ఇండియాలో అయితే, వేసున్న గేటు క్రిందనించి దూరి స్కూటర్లు, మోటార్ సైకిళ్ళు తీసుకుపోతుంటారు.  కొంతమందైతే, గేటు తియ్యమని గేట్ మ్యాన్ పైన దౌర్జన్యం కూడా చేస్తారు 

గతంలో జరిగిన ఒక సంఘటన గుర్తొచ్చింది.

నేను గుంటూరులో పనిచేస్తున్నప్పుడు ఒకరోజున నాకొక ఫోనొచ్చింది. ఆయనొక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్.  రిటైరయ్యాక రాజకీయాలలో దిగాడు. ఏమిటా ఈయన ఫోన్ చేశాడు అనుకుంటూ ఫోనెత్తా. 

'DOM గారు, మా కారు లెవల్ క్రాసింగ్ గేటు దగ్గర ఆగిపోయి ఉన్నది. మేము అర్జంటుగా విజయవాడ వెళ్ళాలి. నాతోబాటు కార్లో ఫలానా MP గారున్నారు. ఈయన గతంలో మినిష్టర్ కూడా చేశారు. గేటు వెంటనే తియ్యమని మీ స్టాఫ్ కి చెప్పండి' అని కొంచం డిమాండ్ గా అడిగాడు.

ఆయనతో ఇలా చెప్పాను.

'చూడండి. మీ కోసం గేటు తీస్తే, గేట్ మ్యాన్ ఇంటికి పోతాడు. మీరేమో పైకి పోతారు. ఎందుకంటే సూపర్ ఫాస్ట్ ట్రెయిన్ వస్తోంది. అది గుద్దితే మీతోబాటు మీ కారులోని అందరూ పోతారు. అందుకని మీ కోసం వేసిన గేటును తియ్యడం కుదరదు. కొంచం సేపు వెయిట్ చెయ్యండి.  సారీ' అని ఫోన్ పెట్టేశాను.

మన ఇండియాలో అలా ఉంటుంది ప్రతిదానిలో అందరి జోక్యం ! ఇక్కడ ఆ విధంగా చీప్ గా ప్రవర్తించేవాళ్లు ఎవరూ ఉండరు.

ఇండియా గూడ్సు రైళ్లలో ఎక్కువలో ఎక్కువ 60 వాగనులుంటాయి. ఇక్కడ నూరు పైగా ఉన్నాయి. సైజు కూడా మన వేగన్లకంటే డబలున్నాయి. గూడ్సు రైళ్లలో ఎక్కువగా కంటెయినర్ ట్రాఫిక్ పోతోంది.

చికాగో దగ్గరలో మాత్రమే సైడింగ్లు కనిపించాయి. పాయింట్లు కూడా పెద్ద స్టేషన్లలోనే ఉన్నాయి. చిన్న స్టేషన్లలో సైడింగ్లు, పాయింట్లు లేవు. సిగ్నలింగ్ వ్యవస్థ మనలాగే ఉంది. కంట్రోల్ రూమ్ ఎక్కడుంటుంది? ఆపరేటింగ్ సిస్టమ్ ఏమిటి? ఎలా పనిచేస్తుంది? మొదలైన లోతుపాతులు అడుగుదామంటే ఎవరూ అందుబాటులో లేరు.

విమానంలో ప్రయాణిస్తే, అమెరికా లోతుపాతులు చూడలేము. పైనుంచి అంతా ఒకేలాగా ఉంటుంది. అదే ట్రెయిన్ లో ప్రయాణిస్తే, ఊర్ల మధ్యలోనుంచి రైలు పోతుంది గనుక అంతా చూడచ్చు.

ట్రాయ్ లో రైలెక్కి ఆరు గంటల రైలు ప్రయాణం తర్వాత చికాగోలో దిగాము.  ట్రాయ్ స్టేషన్లో టీసీ లేడు. స్టేషన్ మాస్టర్ ఉన్నాడేమో, ఎక్కడున్నాడో కనిపించలేదు. అసలా స్టేషన్లో ఎవరూ కన్పించలేదు. అంతా ఆటోమేటిక్ డోర్లు, లిఫ్ట్ మొదలైనవి ఉన్నాయి. ప్లాట్ ఫామ్ మీద కూడా ఎవరూ లేరు. ట్రెయిన్ రాబోయేముందు ఒక పదిమంది అమెరికన్స్ వచ్చి రైలెక్కారు. అంతే. రైలు వచ్చింది. మేము ఎక్కాక బయల్దేరింది. స్టాఫ్ ఎవరూ కనిపించలేదు.

కొన్ని ఫోటోలు ఇక్కడ చూడండి.

 



















స్టేషన్ మాస్టర్. ఇతను ఈ స్టేషన్ వరకూ టీటీఈ గా పనిచేసి ఇక్కడ దిగిపోయాడు.


మధ్యలో బ్యాటిల్ క్రీక్ అనే స్టేషన్లో ట్రెయిన్ కాసేపాగింది. అక్కడ దిగి స్మోకింగ్ చేసుకోవచ్చని టీటీఈ ఎనౌన్స్ చేశాడు. అందుకని అందరూ దిగారు. 






ట్రాయ్ స్టేషన్



ఇంకా సిమెంట్ స్లీపర్లు రాలేదిక్కడ. చెక్కవే వాడుతున్నారు. చెట్లు ఎక్కువ. వుడ్ బాగా దొరుకుతుంది. అందుకేనేమో.

read more " మూడవ అమెరికా యాత్ర - 53 (అమెరికాలో రైలు ప్రయాణం) "

11, నవంబర్ 2022, శుక్రవారం

మూడవ అమెరికా యాత్ర - 52 (మా 54 వ పుస్తకం 'సనత్సుజాతీయము' విడుదల)




నేటినుంచి ఇల్లినాయ్ రాష్ట్రంలోని షాంపేన్ సిటీలో మూడురోజుల పాటు 'స్పిరిటిట్యువల్ రిట్రీట్' నిర్వహిస్తున్నాను. దానిలో భాగంగా నా కలం నుంచి వెలువడుతున్న 54 వ పుస్తకం 'సనత్సుజాతీయము' ను విడుదల చేస్తున్నాను.

వ్యాసమహర్షి చేత రచింపబడిన ‘మహాభారతము’ ప్రపంచసాహిత్యం లోనే ఒక అద్భుతమైన గ్రంథము. ‘యన్నభారతే తన్నభారతే’ (మహాభారతములో లేనిది భారతదేశంలో లేదు) అనే సూక్తి చాలా సత్యము, సమంజసము అయినది. ఇక్కడ భారతదేశమంటే ‘ప్రపంచము’ అనిన అర్థమును తీసుకోవాలి.


సంస్కృత మహాభారతంలోని ఈ ప్రసిద్ధ శ్లోకమును గమనించండి.


శ్లో|| ధర్మేచార్థేచ కామేచ మోక్షేచ భరతర్షభ

యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి న తత్క్వచిత్ ||


ఓ భరతశ్రేష్ఠా! ధర్మపరమైన విషయంలో గాని, అర్థపరమైన విషయంలో గాని, కామపరమైన విషయంలో గాని, మోక్షపరమైన విషయంలోగాని, ఇక్కడున్నది ఎక్కడైనా ఉంటుంది. ఇక్కడ లేనిది ఇంకెక్కడా లేదు’. 


మానవునకు గల జీవితగమ్యములు ధర్మార్థ కామమోక్షములే. వీటికంటే ఎవరికైనా ఇంకేమీ గమ్యములు ఉండటానికి సాధ్యం కాదు. వీటిని చతుర్విధ పురుషార్థములంటారు. ఈ నాలుగు విషయములలోను, మహాభారతంలో చెప్పబడినది మిగతా గ్రంథములలో చెప్పబడి ఉండవచ్చునేమో గాని, దీనిలో చెప్పబడనిది మాత్రం, ఏ ఇతర గ్రంథంలోనూ ఉండదని ఈ శ్లోకం అంటుంది. అందుకనే, మహాభారతమునకు పంచమవేదమని కూడా పేరున్నది.


ఈ మాట సత్యమే. మహాభారతంలో లేని ధర్మం ఏ దేశంలోనూ, ఏ మతంలోనూ, ఏ దైవగ్రంధంలోనూ లేదు. మానవజాతి చరిత్రలోనే మహాభారతం వంటి గ్రంధం ఇప్పటివరకూ వ్రాయబడలేదు. ఇకముందు కూడా వ్రాయబడదు. ఆధ్యాత్మికప్రపంచంలో చివరిమాటగా చెప్పబడే 'భగవద్గీత', మహాభారతంలోని 18 అధ్యాయములలో ఒక అధ్యాయం లోని ఒక చిన్నభాగమని గుర్తుంటే, మహాభారతం యొక్క గొప్పదనం ఏమిటో అర్ధమౌతుంది.


మహాభారతము ఉద్యోగపర్వములో గల, 41 నుండి 45 వరకు ఉన్న అధ్యాయములలో సనత్సుజాతీయమనే ఈ వృత్తాంతము మనకు గోచరిస్తున్నది. ధృతరాష్ట్రమహారాజుకు కలిగిన వేదాంతపరమైన సందేహములకు, బ్రహ్మమానసపుత్రులలో ఒకడైన సనత్సుజాతుడు చేసిన బోధయే ఈ గ్రంథములో చెప్పబడిన విషయము. సనత్సుజాతుని బోధ గనుక దీనికి సనత్సుజాతీయమని పేరు వచ్చినది.


ఇది ‘పంచవటి స్పిరిట్యువల్ ఫౌండేషన్’ నుండి వెలువడుతున్న 54 వ గ్రంథము. అద్వైతవేదాంతనిధియైన ఆదిశంకరాచార్యుల వారు దీనికి వ్యాఖ్యానమును రచించినారంటే ఇది ఎంతటి మహత్తరమైన వృత్తాంతమో గ్రహించవచ్చు. అటులనే, నీలకంఠపండితుని వ్యాఖ్యానము, సర్వజ్ఞనారాయణుని వ్యాఖ్యానము కూడా మనకు లభిస్తున్నాయి. ఈ నా వ్యాఖ్యానము, వారికి భిన్నమైన రీతిలో, నాదైన యోగ-వేదాంత కోణములో చెయ్యబడింది.


భోగభూమియైన అమెరికా నుండి ఇటువంటి అత్యున్నత వేదాంతతత్త్వమును వివరించే గ్రంధమును వ్రాసి విడుదల చేయగలగడం నా అదృష్టమని భావిస్తూ నేటిరోజున ఈ గ్రంధమును విడుదల చేస్తున్నాను.


ఈ గ్రంధమును వ్రాయడంలో సహాయపడిన నా శ్రీమతి సరళాదేవి, శిష్యులు అఖిల, లలిత, కవర్ పేజీ డిజైనర్ ప్రవీణ్ మరియు చావలి శ్రీనివాస్ లకు, దీనిని విడుదల చేస్తున్న శ్రీనివాస్ నూకల దంపతులకు నా కృతజ్ఞతలు, ఆశీస్సులు.


నా ఇతర గ్రంధములవలె, ఇది కూడా పండిత, పామరలోకపు అభిమానమును చూరగొంటుందని భావిస్తున్నాను.


యధావిధిగా ఇదికూడా Google Books నుండి ఇక్కడ లభిస్తుంది.

read more " మూడవ అమెరికా యాత్ర - 52 (మా 54 వ పుస్తకం 'సనత్సుజాతీయము' విడుదల) "

8, నవంబర్ 2022, మంగళవారం

మూడవ అమెరికా యాత్ర - 51 (కోవిడ్ తాతలాంటి క్రొత్త వైరస్ రాబోతోంది)

మీకు గుర్తుందా? 2019 డిసెంబర్ లో వచ్చిన సంపూర్ణ సూర్యగ్రహణం తర్వాత కోవిడ్ వైరస్ బయటపడింది. దానివల్ల ప్రపంచవ్యాప్తంగా 66 లక్షల మంది చనిపోయారు. ఇది WHO లెక్క. అయితే దీనిలో ఆఫ్రికా, సౌత్ అమెరికా లెక్కలు లేవు. వాటిని కూడా కలుపుకుంటే తేలికగా కోటి దాటుతుంది.

ఇప్పుడు మరో శుభవార్త !

నిన్ననే చంద్రగ్రహణం వచ్చి, పోయింది. 2019 లో ధనూరాశిలో నాలుగు గ్రహాలున్నాయి. అది సూర్యగ్రహణం. ఇప్పుడు తులారాశిలో నాలుగు గ్రహాలున్నాయి. ఇది చంద్రగ్రహణం. నేడు మరో వార్త బయటపడింది.

చైనా, పాకిస్తాన్ కలసి పాకిస్తాన్ లోని రావల్పిండి దగ్గరలోని ఒక రహస్యప్రదేశంలో ఒక రహస్య ల్యాబ్ లో కోవిడ్ తాతలాంటి ఒక క్రొత్త వైరస్ ను తయారు చేస్తున్నాయి. చైనాలోని వుహాన్ ఇనిస్టిట్యూట్, పాకిస్తాన్ ఆర్మీకి చెందిన DSTO (Defence Science Technology Organisation) కలసి ఈ ల్యాబ్ ను నడుపుతున్నాయి. చైనాలోని వుహాన్ ఇనిస్టిట్యూట్ లోనే కోవిడ్ వైరస్ పుట్టింది. కనుక ఇలాంటి పనులలో వుహాన్ కు చాలా అనుభవం ఉన్నది. ఇప్పుడు పాకిస్తాన్లో జరుగుతున్న ఈ రీసెర్చి చాలావరకూ అయిపోవచ్చిందట. ఒక మంచి ముహూర్తం చూసి లోకం మీదకు వైరస్ ని వదలడమే తరువాయి.

చంద్రగ్రహణం మరుసటిరోజున, ఈ న్యూస్ బయటపడింది.

ఇండియాను టార్గెట్ చేయడానికే ఈ వైరస్ తయారౌతోందన్నది జగమెరిగిన సత్యమే. అయితే, ప్రస్తుతం అందరూ అన్ని దేశాలకూ తిరుగుతున్నారు. ఎక్కడివాళ్ళు అక్కడే ఉండి చావటం లేదు. కాబట్టి, ఒక దేశంలో ఒకడికి సోకితే వరుసగా అన్ని దేశాలకూ పాకుతుంది. అందరికీ సోకుతుంది.

ఈ సారి ప్రపంచవ్యాప్తంగా కనీసం పదికోట్ల మంది చావబోతున్నారని అంచనా !

ఇప్పటికే అమెరికాలో ఎవడూ ఉద్యోగాలు చెయ్యడం లేదు. ఎక్కడ చూచినా We are Hiring అని బోర్డులు కనిపిస్తున్నాయి. ఎప్పుడు పోతామో తెలీదు కదా, ఎందుకు కష్టపడాలి? ఉన్నన్నాళ్ళు హాయిగా బ్రతుకుదాం అనే ధోరణి, కోవిడ్ తర్వాత అమెరికాలో ఎక్కువయ్యింది. మన ఇండియన్స్ ఏమో మొగుడూ పెళ్ళాం ఇద్దరూ ఉద్యోగాలు చేసి దాచిపెట్టి ఇండియాలో రియల్ ఎస్టేట్ రేట్లు పెంచుదామని అనుకుంటారు. అమెరికన్సేమో ఇద్దరిలో ఒకళ్ళు ఉద్యోగం మానేసి ఇంట్లో హాయిగా కూచుంటున్నారు. ఒక్కళ్ళ జీతంలో ఇద్దరూ హాయిగా బ్రతుకుతున్నారు. రేపటికి దాచుకోవడం లేదు. వచ్చింది వచ్చినట్టు ఎంజాయ్ చెయ్యడమే. రేపేమౌతుందో ఎవడికి తెలుసు? ఇంకో వైరస్ వస్తే చావు తప్పదు కదా? సేవింగ్ ఎందుకు? ఉన్నన్నాళ్ళు హ్యాపీగా బ్రతికెయ్' అని యావరేజి అమెరికన్ అంటున్నాడు. అందుకే ప్రస్తుతం అమెరికాలో ఎక్కడ చూసినా ఉద్యోగాలు ఖాళీలున్నాయి. ఎక్కడికెళ్లినా పది కౌంటర్లలో నాలుగే పనిచేస్తున్నాయి.

బహుశా అమెరికావాడి ఆలోచన సరిగ్గానే ఉన్నట్టుంది. అందుకే పాకిస్తాన్ చైనాలు పుణ్యం కట్టుకుని మళ్ళీ జనాభాను తగ్గించే పనిలో పడ్డాయి  మరి క్రొత్త వైరస్ తో, చైనాలో కూడా జనాభా తగ్గుతుంది కదా? అని మీకు అనుమానం రావచ్చు. వాళ్లకు కావలసింది కూడా అదే. జనాభా తగ్గితే సహజవనరులు మెరుగు పడతాయి. క్లైమేట్ బాగుంటుంది. పొల్యూషన్ తగ్గుతుంది.  కనద్దురా బాబూ అంటే ఎవడూ వినడం లేదు. అందుకే పొమ్మనకుండా పొగబెట్టినట్లు, రెండేళ్ళకొక క్రొత్త వైరస్ ని వదిల్తే చాలు. పదేళ్లలో ప్రపంచ జనాభా సగానికి సగం తగ్గి చస్తుంది. అప్పుడు చైనావాళ్ళని మిగతా దేశాల్లో సర్దేస్తే గ్లోబంతా చైనాదే. ఎలా ఉంది ఐడియా?

ప్రస్తుతం పాకిస్తాన్ చైనాలు ఇదే పనిలో ఉన్నాయని నమ్మదగిన వార్తలే వస్తున్నాయి. అనవసరంగా న్యూక్లియర్ వెపన్స్ మీద కోటానుకోట్ల డాలర్లు ఎందుకు ఖర్చు పెట్టడం? సింపుల్ గా ఒక ల్యాబ్ పెట్టి, ఒక క్రొత్త వైరస్ ను సృష్టించి లోకం మీదకు వదిల్తే చాలు. నూరు  ఆటంబాంబులు చెయ్యలేని పని ఒక్క వైరస్ చేసిపెడుతుంది. చూడబోతే భవిష్యత్తంతా  బయో వార్ దే ననిపిస్తోంది.

ఇక క్రొత్త వైరస్ కి రెడీ అవండి బాబులూ !

read more " మూడవ అమెరికా యాత్ర - 51 (కోవిడ్ తాతలాంటి క్రొత్త వైరస్ రాబోతోంది) "

1, నవంబర్ 2022, మంగళవారం

మూడవ అమెరికా యాత్ర - 50 ( మోర్బి వేలాడే బ్రిడ్జి కూలుడు - జ్యోతిష్య విశ్లేషణ)

గుజరాత్ లోని మోర్బి టౌన్ లో వ్రేలాడే బ్రిడ్జి కూలిపోయింది. దానిమీదున్న 400 మందీ క్రిందనున్న నదిలో పడిపోయారు అందులో 140 మంది మోక్షాన్ని పొందారు. కారణమేమంటే, ఒక ఇరవై మంది కుర్రకారు, ఆ బ్రిడ్జిని ఉయ్యాలలాగా ఊపారు. దాని కేబుల్స్ తెగిపోయాయి. అందరూ 30 అడుగుల క్రిందనున్న నీళ్లలో పడిపోయారు. ఈ సంఘటన సెప్టెంబర్ 30 న సాయంత్రం 6.40 కి జరిగింది.

గుజరాత్ లో నా స్నేహితుడొకడున్నాడు. వాడిపేరు భరత్ పరేఖ్. నేనూ వాడూ ఒకేసారి రైల్వేలో సెలక్ట్ అయ్యి, సర్వీసు వెలగబెట్టి, ముందు నేను రిటైరయ్యాను, పోయిన్నెలలో వాడు రిటైరయ్యాడు. వాడి ఊరు మోర్బి దగ్గరలోనే ఉంటుంది. సైట్ సీయింగ్ కని వెళ్లి పొరపాటున ఆ  బ్రిడ్జి ఎక్కాడేమోనని వాడికి ఫోన్ చేశాను.

'ఏరా? ఆ బ్రిడ్జిమీద నువ్వు లేవు కదా?' అన్నాను.

30 ఏళ్ళు ఆంధ్రాలో ఉండటంతో వాడు తెలుగు బాగానే మాట్లాడతాడు.

'లేను. ఉంటే నీతో ఎలా మాట్లాడతానిప్పుడు?' అని జోకేశాడు.

'సర్లే. ఏం జరిగిందసలు?' అన్నా.

'ఏముంది? పండగ సెలవలు. ఎక్కడ చూసినా జనసముద్రం. హోటళ్లు, మాల్స్, సినిమా హాల్స్, బజార్లు ఎక్కడ చూసినా విపరీతమైన జనం. అందరూ రోడ్లమీదే ఉన్నారు. చాలా చిరాకుగా ఉంది. అదే విధంగా ఆ బ్రిడ్జిమీద కూడా ఎక్కారు. దానిమీద 20 మందిని కంటే ఎక్కించకూడదు. అది ఎప్పుడో బ్రిటిష్ వాడు కట్టిన బ్రిడ్జి.  దానిమీద 400 మంది ఎక్కారు. పైగా ఉయ్యాల ఊగుతున్నారు. కేబుల్స్ ఎలా తట్టుకుంటాయి? తెగింది. పడ్డారు. పోయారు' అన్నాడు.

'మెయింటెనెన్స్ ఏజన్సీ మాతో చెప్పకుండా, మా పర్మిషన్ తీసుకోకుండా, బ్రిడ్జిని రీ ఓపెన్ చేసింది. 20 మందికి ఇవ్వాల్సినచోట 400 మందికి టిక్కెట్లిచ్చి ఎక్కించింది. ఇదే ప్రమాదానికి కారణం' అని గుజరాత్ ప్రభుత్వం అంటోంది.

నిజమే కావచ్చు.

కానీ అసలు విషయం అది కాదు. ఇండియాకి పట్టిన అసలైన దరిద్రం - అతి జనాభా. దానికి తోడు 'లా' ని ఎవడూ పాటించకపోవడం. ఈ విషయాన్ని గతంలో వందలాది సార్లు వ్రాశాను. మళ్ళీ ఇప్పుడు రుజువైంది. ముందుముందు కూడా రుజువౌతూనే ఉంటుంది. జనాభా తగ్గుతూనే ఉంటుంది. పెరుగుట విరుగుట కొరకే అన్నది ప్రకృతి సూత్రం ! పిచ్చిగా పెరిగిపోతే ఉన్నట్టుండి విరిగిపోక తప్పదు. దేనికైనా సరే ఈ సూత్రం వర్తిస్తుంది.

జ్యోతిష్యపరంగా ఇది చాలా విచిత్రమైన సంఘటన. ఎలాగో వివరిస్తా వినండి.

భారతదేశానికి సూచిక అయిన మకరరాశి నుండి దశమంలో నాలుగు గ్రహాలున్నాయి. ఇవి జనసమ్మర్దాన్ని, చాలామంది మనుషులు ఒకచోట గుమికూడటాన్ని సూచిస్తున్నాయి. 

తులారాశి త్రాసును సూచిస్తుంది. గాలికి త్రాసు ఉయ్యాలలాగా ఊగుతుంది. వేలాడే బ్రిడ్జి కూడా ఒక త్రాసు లాంటిదే.  ఊపితే అదీ ఊగుతుంది. బరువెక్కువైతే తెగుతుంది. తులారాశి వాయుతత్వ రాశి, అందుకే,  గాలిలో వేలాడే బ్రిడ్జి ప్రమాదం జరిగింది.

శని దశమదృష్టి తులమీదుంది. కుజుని పంచమదృష్టి తులమీదుంది. ఇది యాక్సిడెంట్ యోగమని నా పుస్తకాలలో కూడా వ్రాశాను. కనుక, ఘోరప్రమాదం జరిగింది.

తులారాశి పశ్చిమదిక్కును సూచిస్తుంది. అందుకే, ఇండియాలో పడమరదిక్కున ఉన్న గుజరాత్ లో ఈ  ప్రమాదం జరిగింది.

తులలో నాలుగు గ్రహాలున్నాయి. వీరు రవి, బుధ, శుక్ర, కేతువులు. వీరిలో, రవి నీచస్థితిలో ఉన్నాడు,  బుధ శుక్రులు అస్తంగతులయ్యారు. కేతువు వీళ్లందరినీ మింగేశాడు. నీచరవి, లాభం కోసం 400 మందిని బ్రిడ్జి ఎక్కించిన నీచపు అధికారులకు సూచకుడు. బుధుడు చిన్నపిల్లలకు, శుక్రుడు ఆడవాళ్లకు సూచకులు. వీళ్ళే ఈ ప్రమాదంలో ఎక్కువగా చనిపోయినవాళ్లు.  మరి ఇలాంటి గ్రహస్థితిలో, ఇలాంటి ఘోర ప్రమాదం జరగక ఇంకేం జరుగుతుంది?

మిధునంలో కుజుడు, ఆకతాయి కుర్రవాళ్ళకు సూచకుడు. ఆయన దృష్టి ఈ నాలుగు గ్రహాలమీదుంది. కుర్రవాళ్ళ గుంపు ఆకతాయితనంగా బ్రిడ్జిని ఊపడమే, అది కూలడానికి కారణమైంది.

చూశారా ప్రమాదాలకు గ్రహస్థితులు ఎలా ఖచ్చితమైన కారణాలౌతాయో?

ఇప్పుడొక సందేహం మీకు రావచ్చు. అదేంటంటే, 'ముందే చెప్పి ఈ ప్రమాదాన్ని తప్పించవచ్చు కదా?' అని.

'ఎందుకు తప్పించాలి?' అని నేనంటాను.

అది సాధ్యం కాదని కూడా కొన్ని వందలసార్లు ఇప్పటికే చెప్పాను. గ్లోబల్ కర్మను తప్పించడం ఎవరికీ సాధ్యం కాదు. వాళ్ళు చేసుకున్న ఖర్మను బట్టి జనం ఆ విధంగా చస్తారు. దానిని తప్పించడానికి జ్యోతిష్కుడెవరు? అసలు ఎందుకు ప్రయత్నించాలి? ఇతరుల కర్మలో మనమెందుకు జోక్యం చేసుకోవాలి? ఎవడెలా పోతే మనకెందుకు? చూస్తూ ఉండాలంతే.

ఆ క్షణంలో ఎవరైనా అక్కడ నిలబడి, 'ఒద్దురా బాబు. ఎక్కద్దు. ప్రమాదం' అని మొత్తుకున్నా ఎవడూ వినడు. వాడినొక పిచ్చివాడుగా చూసి హేళన చేస్తారు. ఇది నేటి లోకరీతి. పోనీ, వాళ్లంతా విని, ఆ బ్రిడ్జి ఎక్కకుండా ఉంటే, అప్పటికా ప్రమాదం తప్పవచ్చు, కానీ ఇంకొకచోట మళ్ళీ ఇలాంటి పరిస్థితిలోనే ఇరుక్కుని, వాళ్ళందరూ చస్తారు. లేదా, రకరకాల ఇతర కారణాలతో చస్తారు. కనుక సామూహిక కర్మను తప్పించడం ఎవరికీ సాధ్యం కాదు, ఒక్క దైవశక్తి తోడుగా ఉంటే తప్ప ఆ పనిని ఎవ్వరూ చెయ్యలేరు. చెయ్యకూడదు కూడా. ఈ లోపల, పనీపాటా లేకుండా అలా చెప్పి ఆ ప్రమాదాలను తప్పించిన జ్యోతిష్కుడికి వేటు పడుతుంది. వాడు ఏదో ఒక యాక్సిడెంట్లో పోతాడు. ఎందుకా ఖర్మ?

జ్యోతిష్యశాస్త్రం అంటే ఆషామాషీ పిల్లలాట కాదు. ఇది కర్మతో చెలగాటం. ఇది తమాషా వ్యవహారం కానేకాదు. దైవశాస్త్రం. వ్యక్తిగతంగా మాత్రమే ఎవరి కర్మనైనా తప్పించడానికి వీలౌతుంది. అదికూడా, ఆ వ్యక్తి పధ్ధతి తప్పకుండా, నిజాయితీగా, సరిగ్గా ఉంటే మాత్రమే, ఆ విధంగా కర్మను తప్పించడం సాధ్యమౌతుంది. మంది కర్మను తప్పించడం ఎవరికీ సాధ్యం కాదు. ఎవడిష్టం వచ్చినట్టు వాడు పిచ్చిపిచ్చి పనులు చేసుకుని, కర్మను పోగేసుకుని, 'తప్పించండి' అంటే, ఎందుకు తప్పించాలి? చెప్పినా ఆ గుంపులో ఎవడు వింటాడు? 'పోగాలము వచ్చినవాడు కనడు వినడు' అని ఊరకనే అనలేదు మరి !

డబ్బుకోసం ఆశపడి జ్యోతిష్య రెమెడీలు ఎప్పుడూ ఎవరికీ చెప్పకూడదు. అలా చెప్పేవారి కుటుంబాలు నాశనమౌతాయి. అందుకే, కమర్షియల్ జ్యోతిష్కుల కుటుంబాలు ఎప్పుడూ పైకిరావు. జ్యోతిష్యశాస్త్రానికి ఈ శాపం ఉన్నది. ఇది తెలియక ప్రతివాళ్ళూ జ్యోతిష్యంతో ఆటలాడి చేతులు కాల్చుకుంటూ ఉంటారు. కొంతమంది గాయత్రీజపం చేసి ఆ దోషం పోగొట్టుకుంటామని అంటారు గాని, అది సాధ్యం కాదు. తూతూ మంత్రంగా చేసే గాయత్రీజపం, రెమెడీలు చెప్పిన దోషాన్ని, చేయించిన దోషాన్ని, ఏమాత్రమూ పోగొట్టలేదు.

అదలా ఉంచితే, ఈ ప్రమాదం గురించి ఇక్కడ అమెరికాలో రకరకాలుగా హేళనగా మాట్లాడుతున్నారు. ఇది మామూలే.  ఇండియా అంటేనే ఇక్కడ చాలా చిన్నచూపు. ఇండియాలో వ్యవస్థలు ఉండవని, లా అండ్ ఆర్డర్ ఉండదని, జనాభా అంతా పనికిరాని గుంపని, కట్టుబడిలోగాని, మెయింటెనెన్స్ లో గాని సరైన ప్రమాణాలు ఉండవని, అంతా లంచాల మయమని, అన్నీ మాఫీ అవుతాయని,  ఇక్కడ అనుకుంటూ ఉంటారు. కనుక ఎవరూ 'అయ్యోపాపం' అనడం లేదు. 'ఇండియాలాంటి దేశంలో అలా కాక ఇంకెలా జరుగుతుందిలే?' అంటున్నారు. 'ఇండియా, స్పేస్ లోకి రాకెట్లను పంపిస్తోంది. భూమ్మీద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను మాత్రం కాపాడుకోలేకపోతోంది' అంటూ ఎగతాళిగా మాట్లాడుతున్నారు.

వాళ్లనుకునేదానిలో కూడా నిజాలున్నాయి కదా? మనమేం అనగలం?

read more " మూడవ అమెరికా యాత్ర - 50 ( మోర్బి వేలాడే బ్రిడ్జి కూలుడు - జ్యోతిష్య విశ్లేషణ) "