Love the country you live in OR Live in the country you love

1, ఏప్రిల్ 2024, సోమవారం

విజయవంతంగా ముగిసిన 3 వ సాధనా సమ్మేళనం




గత మూడురోజులపాటు మా చండ్రపాడు ఆశ్రమంలో జరిగిన మూడవ స్పిరిట్యువల్ రిట్రీట్ నిన్న విజయవంతంగా ముగిసింది. 

పాత క్రొత్త శిష్యులందరూ మూడు రోజులపాటు ఆశ్రమంలో ఉండి, వారి  జీవితానికి మరింత నిండుదనాన్ని అద్దుకుని, ఆనందంతో నిండిన మనసులతో వారివారి ఇండ్లకు తిరిగి వెళ్లారు.

క్రొత్తవారికి పంచవటి సాధనామార్గంలో ప్రాధమిక దీక్షనివ్వడం జరిగింది. పాత శిష్యులకు ఉన్నతస్థాయికి చెందిన యోగసాధనా మార్గాలను ఉపదేశించడం జరిగింది.  పంచవటి సాధనా మార్గంలో పాటించవలసిన నియమాలను, విధివిధానాలను, జీవితంలో తెచ్చుకోవాల్సిన మార్పులను వారికి స్పష్టంగా వివరించడం జరిగింది.

దేహాన్ని నిర్లక్ష్యం చెయ్యడం ఎంతమాత్రమూ మా విధానం కాదు. కనుక, మా యోగసాధనా మార్గాన్ని అనుసరిస్తూ, గత రెండు నెలలలో 15 కేజీలనుండి 5 కేజీల వరకూ ఆరోగ్యవంతంగా బరువును తగ్గినవారికి బహుమతులు ఇవ్వడం జరిగింది.

అదేవిధంగా, బరువు పెరగవలసిన కేటగిరీలో, 4 నుండి 9 కేజీల వరకూ బరువు పెరిగిన వారికి కూడా బహుమతులు ఇవ్వడం జరిగింది.

జ్యోతిష్యశాస్త్రపు లోతుపాతులను అందరికీ పరిచయం చేస్తూ, 1887 BCE కి చెందిన గౌతమబుద్ధుని అసలైన జాతకచక్రాన్ని వారికి వివరించడం జరిగింది. నా విశ్లేషణా విధానాన్ని బుద్ధుని జాతకచక్రం యొక్క విశ్లేషణతో వారికి అర్ధమయ్యేలా వివరించడం జరిగింది. బుద్ధుని యొక్క ఈ అసలైన జననతేదీని వెలుగులోకి తెచ్చినవారు ప్రఖ్యాత భారతీయ చరిత్ర పరిశోధకులు కోట వెంకటాచలం గారు.

త్వరలో వెలువడబోతున్న 'మహనీయుల జాతకాలు - జీవిత విశ్లేషణలు' అనే 500 పేజీల మా జ్యోతిష్యశాస్త్ర పరిశోధనా గ్రంధంలో ఈ జాతక విశ్లేషణను మీరు చూడవచ్చు.

ఇకపోతే, పదేళ్ళనుండీ నేను చెబుతూ వస్తున్న రీతిలోనే మా ఆశ్రమం నేడు ఎదుగుతున్నది. అసలైన హిందూమతాన్ని కులానికతీతంగా ఆచరణాత్మకంగా అందరికీ బోధిస్తూ, అజ్ఞానపు మురికిని వదిలిస్తూ, శిష్యుల దేహ-ప్రాణ-మానసిక స్థాయిలను సరిచేస్తూ, ఆధ్యాత్మిక మార్గదర్శనం ద్వారా నిజమైన హిందువులను, నిజమైన మనుషులను తయారు చేస్తూ,  అప్రతిహతంగా ముందుకు సాగుతున్నది.

తిరిగి, మూడు నెలల తర్వాత, జూలైలో వచ్చే నా పుట్టినరోజు సందర్భంగా గురుపూర్ణిమా రిట్రీట్ జరుగుతుంది. ఇప్పటివరకూ ఉపదేశించిన సాధనలలో మంచి పరిపక్వతను అందుకుని, అసలైన హిందువులుగా అసలైన యోగులుగా తయారై ఆ రిట్రీట్ కు రావలసిందిగా శిష్యులనందరినీ కోరుతున్నాను.

క్రొత్తగా మా వద్ద దీక్షాస్వీకారం చేసి మా సాధనామార్గంలో నడవాలనుకునేవారు ఈ క్రింది 5 పుస్తకాలను తప్పకుండా చదివిన తర్వాత మాత్రమే మమ్మల్ని సంప్రదించగలరు. లేనిచో మా మార్గంలో ప్రవేశం లభించదు. గమనించండి.

1. శ్రీవిద్యా రహస్యం

2. లలితా సహస్రనామ రహస్యార్థ ప్రదీపిక

3. తారా స్తోత్రం

4. ధర్మపథం

5. వెలుగు దారులు లేదా MUSINGS

read more " విజయవంతంగా ముగిసిన 3 వ సాధనా సమ్మేళనం "