“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

20, ఫిబ్రవరి 2023, సోమవారం

ఈ అమావాస్య ప్రభావం - తెలుగు రాష్ట్రాలలో స్వల్ప భూకంపం

నిన్న ఆదివారం అమావాస్య. పొద్దున్నకి లేకపోయినా సాయంత్రం ఏడు గంటలకు అమావాస్య వచ్చింది. అమావాస్య ప్రభావం మళ్ళీ రుజువైంది? తెలుగురాష్ట్రాలలో స్వల్ప భూకంపం వచ్చింది. అనేకచోట్ల ప్రజలు గమనించారు.

భూకంపకేంద్రం సూర్యాపేట జిల్లాలోని పులిచింతల ప్రాజెక్ట్ దగ్గర్లో ఉంది. రిచటర్ స్కెల్ మీద 3. 0 గా నమోదైంది. ఇది ప్రమాదం లేని భూకంపమే. భయం లేదు. కానీ ప్రాచీన జ్యోతిష్యసూత్రం మళ్ళీ నిజమైంది.

గత పదేళ్లలో స్టాట్టిస్టిక్స్ చూస్తే, భూకంపాలలో ఎక్కువశాతం అమావాస్య పరిధిలోనే జరిగాయి. మరి సూర్యచంద్రుల గమనానికి వీటికీ సంబంధం ఉందా లేదా?

జ్యోతిష్కులందరూ నిజాయితీపరులు కాకపోవచ్చు. తమ మిడిమిడి జ్ఞానంతో సమాజాన్ని మోసం చేస్తూ ఉండవచ్చు. కానీ జ్యోతిష్యశాస్త్రం అబద్దం కాదు.

ఇంకా ఎన్ని రుజువులు కావాలి?

పోతే, దీనిలో ఇంకొక కోణం ఉంది.

అధర్మం పెరిగిపోయినపుడు భూకంపాలు ఇంకా ఇతర ప్రకృతి విలయాలు వస్తాయని బైబుల్ ఖురాన్ ఎన్నో చోట్ల చెబుతున్నాయి. పాపాలు, అవినీతి, అక్రమాలు, అసహజ ప్రవర్తనలు మనుషులలో పెరిగిపోయినపుడు భూకంపాలు వస్తాయని, ఇవి దేవుని ప్రతీకారచర్యలని ఆ గ్రంధాలలో క్లియర్ గా వ్రాసి ఉంది.

త్రాగుడు, జూదం, వ్యభిచారం మొదలైన పాపాలు విపరీతంగా ఎక్కువవ్వబట్టే సోడోమ్, గొమొఱ్ఱా దేశాలను బైబుల్ దేవుడు నేలమట్టం చేశాడని, వాటిపైన గంధకవర్షమును, అగ్నిని కురిపించాడని ఓల్డ్ టెస్టమెంట్ క్లియర్ గా అంటుంది.  కావాలంటే, ఆదికాండము 19:24-25 ను చూడండి.

అల్లాకు వ్యతిరేకంగా కుట్రలు చేసినవారి భవనాల పునాదులను అల్లా కూల్చేశాడని ఖురాన్ లో అనేకచోట్ల చెప్పబడింది. అంతేగాక, త్రాగుడు, వ్యభిచారం, జూదం, మోసాలు, దుర్మార్గాలు మొదలైన పాపాలు ఎక్కువైతే అలాంటిచోట్ల అల్లా భూకంపాలను రప్పిస్తాడని ఇస్లాం అనేకచోట్ల చెప్పింది.

ఉదాహరణకు, ఖురాన్ ఏమంటున్నదో చూడండి.

'ఇంతముందున్న వారు కొంతమంది కుట్రలు చేశారు. కానీ అల్లా వారి భవనాల పునాదులను ధ్వంసం చేశాడు. వారి ఇళ్లకప్పులు వారిపైన కూలిపోయాయి. వారు ఊహించని విధంగా కష్టాలు వారిని చుట్టుముట్టాయి'

(ఖురాన్ - సూరా అన్నహుల్ :26)

'ప్రతివాడిని అతడి పాపాలను బట్టి మేము శిక్షించాము. లోత్ మొదలైన కొంతమంది పైకి రాళ్లవానను పంపించాము. తాముడ్ మొదలైన కొంతమంది పైకి భయంకరమైన ఆర్తనాదాలను పంపాము. వారిలో, కరాన్ మొదలైనవారిని భూమి మ్రింగేసింది. మరికొంతమందిని (నోవా, ఫారో మొదలైనవారిని) నీటిలో ముంచేశాము. వారికి అల్లా అన్యాయం చేయలేదు. వారికి వారే అన్యాయం చేసుకున్నారు'

(ఖురాన్ - సూరా అల్ అంకబుత్:40)

మరి తుర్కీయేలో, సిరియాలో నిన్నగాక మొన్న జరిగిందేమిటి? అక్కడంతా త్రాగుడు, జూదం, వ్యభిచారం, అన్యాయం, అధర్మం ఉన్నట్లేగా? అక్కడి మనుషులందరూ దేవునికి వ్యతిరేకులుగా మారినట్లేగా? కానీ, వాస్తవం ప్రకారం అక్కడి వాళ్ళందరూ మహాభక్తులు కదా? రోజుకు అయిదుసార్లు పద్దతిగా నమాజ్ చేస్తున్నారు కదా? మరి అక్కడ భూకంపం రావడం ఏంటి?

ఇదేంటి? లాజిక్ కుదరడం లేదే?

అదే విధంగా, ఇండియాలో ఎన్నో రాష్ట్రాలుండగా ఒక్క తెలుగు రాష్ట్రాలలోనే నిన్నటి భూకంపం రావడం ఏంటి? అంటే, తెలుగురాష్ట్రాలు దేవునికి వ్యతిరేకంగా పోతున్నట్లేగా? త్రాగుడు, జూదం, వ్యభిచారం, అధర్మం అన్యాయం ఈ రాష్ట్రాలలో పెరిగిపోయినట్లేగా? కాకపోతే, కొంచం వెసులుబాటు కనిపిస్తోంది.. ఇవన్నీ పెద్ద స్థాయిలో ఇంకా పెరగినట్లు లేదు. కొద్దిగా మాత్రమే పెరిగినట్లుగా ఉంది. అందుకే స్వల్ప భూకంపంతో దేవుడు సరిపెట్టి ఊరుకున్నాడన్నమాట.

వాస్తవాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

నేడు ఎక్కడ చూసినా త్రాగుడు ఉంది. కాలేజీ స్టూడెంట్స్ తో సహా, అమ్మాయిలతో సహా అందరూ త్రాగుతున్నారు.

జూదం ఉంది, బిజినెస్ లన్నీ జూదాలేగా. ఇన్ కంటాక్స్ ఎగ్గొట్టేవన్నీ జూదాలే. షేర్ మార్కెట్ జూదమే. రియల్ ఎస్టేట్ జూదమే. జూదం కానిదేది?

ఇక వ్యభిచారం మాట చెప్పే పనే లేదు. అసలా పదమే తప్పు. నేటి సమాజానికి ఆ పదం రిలవెంట్ కాదు. స్కూళ్లలో, కాలేజీలలో, ఆఫీసులలో, అపార్ట్ మెంట్లలో, ఇళ్లలో, హోటళ్లలో,  గెస్ట్ హౌసులలో, ఫామ్ హౌసులలో  ఎక్కడ ఏమాత్రం అవకాశమున్నా అంతా అదే నడుస్తోంది. అందుకని కొంచం మంచిమాటగా దాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. 'నేటి అవసరం' అని దానిని కొద్దిగా మార్చుకుంటే మర్యాదగా ఉంటుంది.

ప్రస్తుత సమాజంలో ఎక్కడ చూసినా ఈ మూడే కన్పిస్తున్నాయి. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది వాస్తవం. మరి ఈ స్థాయి పాపాలకు ఇలాంటి స్వల్పభూకంపం వచ్చే పనైతే, ఇక ఏ స్థాయిలో ఉంటే సిరియా తుర్కీయే లెవల్లో భూకంపాలొస్తాయో?

అంటే, ఆ దేశాలలో ఈ మూడు పాపాలూ ఏ స్థాయిలో ఉన్నాయో అర్ధం కావడం లేదూ? కళ్ళు గిర్రున తిరుగుతున్నాయా? అలాగే ఉంటుంది మరి.

బైబుల్ ఖురాన్ చెప్పినవి నిజాలైతే, ఇవి నిజాలే. 

అయితే ఆ గ్రంధాలన్నా కరెక్ట్ కావాలి. లేదా తుర్కీయే, సిరియా, ఇంకా తెలుగురాష్ట్రాల ప్రభుత్వాలన్నా కరెక్ట్ కావాలి. రెండూ కరెక్ట్ కావడానికి మాత్రం లాజిక్ ఒప్పుకోదు.

బైబిల్ ఖురాన్ కరెక్ట్ అయితే, తుర్కీయే, సిరియా, ఇంకా తెలుగురాష్ట్రాలు రెండూ దేవుడికి విరోధులే. మహాపాపులే. తుర్కీయే, సిరియా, తెలుగు రాష్ట్రాలు న్యాయంగా ఉన్నాయనుకుంటే, బైబిల్ ఖురాన్ లు చెప్పినది అబద్దాలే.

మరి ఆ గ్రంధాలేమో దైవగ్రంధాలు గనుక, అవి అబద్దాలు కావడానికి వీల్లేదు. కాబట్టి, ప్రజలందరూ పాపులే. ఇండియాలో అయితే తెలుగురాష్ట్రాల ప్రజలు మాత్రమే పాపులన్నమాట. విదేశాలలో అయితే, సిరియా, తుర్కీయే ప్రజలు మహాపాపులన్నమాట.

కానీ, ఇక్కడ కూడా లెక్క సరిపోవడం లేదు.

సిరియా, తుర్కీయేలలో మెజారిటీ ప్రజలు సాంప్రదాయ ముస్లిములు. రోజుకు అయిదుసార్లు పద్దతిగా నమాజ్ చేస్తారు. మరి అక్కడ భూకంపం రావడమేంటి?

ఇకపోతే, ఇస్లాం ధర్మరక్షకుడైన ఒవైసీ, తెలంగాణా కేంద్రంగా ఎంతో చురుకుగా పనిచేస్తున్నాడు. ఇక్కడ అధర్మం ఉండటానికి వీల్లేదు. ఆంధ్రాలో చూద్దామంటే, క్రైస్తవ ప్రభుత్వం నడుస్తోంది. అక్కడా అధర్మం ఉండటానికి వీల్లేదు. మరి తెలుగురాష్ట్రాలలోనే భూకంపం ఎందుకొచ్చింది? రాకూడదు కదా?

ఏంటో, ఏమీ అర్ధం కావడం లేదు. ఎక్కడో లెక్క తప్పింది. తలంతా దిమ్మెక్కిపోతోంది.

బైబిలూ ఖురానూ కరెక్టా? రియాలిటీ కరెక్టా?

ఎవడైనా 'పెద్ద' జ్యోతిష్కుడినిగాని, బైబుల్ పండితుడిని గాని, ముల్లాని గాని  సంప్రదిస్తే మంచిదేమో?

వెతుకుదాం !