“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

1, మే 2022, ఆదివారం

SAD GURU - MAD GURU

తెలుగువాళ్ళలో ఎన్నో లక్షణాలు అవలక్షణాలు ఉండవచ్చుగాని, వాళ్లలో కామన్ గా ఉండే పెద్ద అవలక్షణం ఎగతాళి చెయ్యడం. గోదావరి జిల్లాలలో అయితే ఇది మరీ ఎక్కువ. కదిలిస్తే చాలు వెటకారం మాత్రమే వాళ్ళ మాటలలో ఉంటుంది. మళ్ళీ కడపజిల్లాలో కూడా ఈ పోకడలు చూచాను. అక్కడి నీళ్లలోనే ఆ లక్షణాలు ఉంటాయేమో మరి?

ఈరోజు పాలకొల్లు నుంచి ఒక వెటకారి ఫోన్ చేశాడు. ఒక శిష్యురాలిని మెట్రో రైల్ ఎక్కించి ఎండలో వెనక్కు వస్తున్నా. నా ఫోన్ నంబర్ పాతవాళ్లలో కొందరి దగ్గర ఉంది. వాళ్ళలో కొంతమంది వెటకారులూ ఉన్నారు, అహంకారులూ ఉన్నారు. అమావాస్యకీ పౌర్ణమికి వాళ్లకు పిచ్చి లేస్తూ ఉంటుంది. నన్ను కదిలించుకుని వాతలు పెట్టించుకోకపోతే వాళ్లకు తోచదు మరి ! ఏం చేస్తాం చెప్పండి? కొందరి సరదాలలా ఉంటాయి.

హైద్రాబాద్లో కూడా ఎండలు బాగానే ఉన్నాయి. మంచి ఎండలో నడుస్తున్నానేమో మహా చిరాగ్గా ఉంది.

ఆమాటా ఈ మాటా అయ్యాక, ఫోన్ పెట్టేస్తాడనుకుంటే పెట్టెయ్యకుండా, ఉన్నట్టుండి అమెరికా యాసలో ఇంగిలీషు మాట్లాడుతూ, ' కెనై ఆస్క్ యు సంథింగ్? ఆర్యూ ఏ శాడ్ గురు?' అన్నాడు.

సద్గురు అనే మాటని అలా కావాలని వెటకారంగా అంటున్నాడని అర్ధమైంది.

ఇలాంటి పిల్లకాకుల్ని ఎన్నింటిని చూచి ఉంటాను ఇప్పటికి?

వెంటనే తడుముకోకుండా, 'నో. అయామ్ ఏ మ్యాడ్ గురు' అన్నాను.

ఈ జవాబుని అతను ఊహించలేదు.

'అంటే?' అన్నాడు అయోమయంగా.

గోదావరి జిల్లాల జనాలు చాలామంది ఇంతే. ఎక్కడో సినిమాలలో విన్న డైలాగుల్ని వాడబోతూ ఉంటారు. ఆ సినిమా రైటర్స్ కి మనం తాతలమని వాళ్లకు తెలీదు. ఒక చిన్న రిపార్టీ ఇచ్చామంటే ఆ తరువాత వాళ్ళ దగ్గర డైలాగు ఉండదు.

'ఏం లేదు. శాడ్ గురు అంటే మీ ఉద్దేశ్యం ఏంటో నాకైతే తెలీదు. కొంతమంది గురువులు శాడ్ గా ఉంటారేమో? నాదారి అది కాదు. నేనొక మ్యాడ్ గురువుని. అసలు కొద్దోగొప్పో మ్యాడ్ లేకపోతే వాడసలు గురువే కాడని కూడా నేనంటాను' అన్నాను.

అప్పుడు తగ్గాడు. తగ్గి, 'అస్సలు అర్ధం కాలేదు గురువుగారు, కొంచం అర్ధమయ్యేలా చెబుతారా?' అడిగాడు.

వెంటనే కోపంగా గొంతు పెట్టి 'నీకర్థమయ్యేలా చెప్పాల్సిన పని నాకేంట్రా ఇడియట్? నీకర్మ నీది. పడు. పెట్టెయ్ ఫోన్ ' అన్నాను.

హర్తయ్యాడు

'సారీ అండి. సరదాగా జోకెయ్యబోయాను. ఏమనుకోకండి' అన్నాడు. బతిమిలాడుతూ.

'నిన్న అమావాస్య కదా. జోకులు వస్తాయని, మీలాంటి వాళ్ళకి పిచ్చి లేస్తుందనీ, అన్నీ తెలుసు. మరి మ్యాడ్ గురువంటే ఇలాగే ఉంటుంది, నీతో ప్లీసింగ్ గా మాట్లాడుతూ నువ్వు చెప్పిన ప్రతిదానికీ తందానతన అనాల్సిన అవసరం నాకు లేదు. నాకు మ్యాడ్ రేగితే, నిన్ను పంచింగ్ బ్యాగ్ గా వేలాడగట్టి మ్యాడ్ గా కిక్స్ ప్రాక్టీస్ చేసుకుంటా' అన్నాను.

ఇంకా హర్దయ్యాడు. 

'సార్, మీరు కొంచం అతిగా మాట్లాడుతున్నారు' అన్నాడు.

'నువ్వు తెలివితేటలు ఉపయోగించి, శాడ్ గురు అనగా లేనిది, నేను మ్యాడ్ గా మాట్లాడితే తప్పయిందా? ఫోన్ కాబట్టి ఊరకే మాట్లాడాను. ఎదురుగా ఉంటే తన్ని మాట్లాడేవాడిని. అమావాస్య నీకేకాదు, నాకు ఇంకా ఎక్కువగా ఉంటుందిబే. ఎవరితోరా నీ ఎటకారాలు? చిన్నప్పుడు త్రాగిన ఉగ్గుపాలు ఒక్క గుద్దుతో కక్కిస్తా ఎదవా' అన్నా ఇంకా కోపంగా.

షాకైనట్టున్నాడు.

'అది కాదు సార్. అంత కోపమెంటండీ మీకు? ఆమ్మో. గురువులంటే ఇలా ఉంటారా?' అన్నాడు.

సడెన్ గా టోన్ మార్చి ప్రశాంతంగా నవ్వుతూ, 'అది కాదు నాయన ! నువ్వు ఇప్పటివరకూ చూసిన కుహనాగాళ్ళని గురువులని, సద్గురువులని అనుకోవడం నీ తప్పుకాదు. నీకంతవరకే తెలుసు.  అందుకే నాతోకూడా పరాచికాలాడావు. మాకు కోపం ఉండదు నాయన ! జస్ట్ మీ లాంటి అజ్ఞానులకి బోధ చేయడంకోసం అలా నటిస్తాం అంతే. నువ్విప్పుడు ఎదురుగా ఉంటే ఏమ్  జరుగుతుందో తెలుసా నాయన?' అన్నాను.

'ఏం జరుగుతుంది సార్?'అన్నాడు.

'నీ గాయాలకు ఆయింట్ మెంట్ పూసి, కాపడం పెడుతూ, నిన్ను వాటేసుకుని భోరుమంటూ ఏడుస్తాన్నాయన' అన్నాను విషాదంగా గొంతుపెట్టి.

'ఆమ్మో ఇదేంటి సార్ ఒక్క నిమిషంలో ఇలా మారిపోయింది టోన్?' అన్నాడు భయంగా.

'తప్పు నాయన ! అమావాస్య టైంలో ఇంతే. ఒకలాగా కాదు. అరవైరకాలుగా కూడా మారుతుంది' అన్నా శాంతంగా.

'గతంలో చాలాసార్లు మీకు ఫోన్ చేసి ఎన్నో అడిగాను. ఎన్నో చెప్పారు. ఆ చనువుతో ఒక జోకేశాను. సారీ ఏమనుకోకండి. మీరంటే నాకు మంచి అభిప్రాయమే' అన్నాడు భక్తిగా.

ఇదొక బిస్కెట్ మళ్ళీ. నాకు మళ్ళీ తిక్కరేగింది.

వెంటనే రౌద్రంగా టోన్ మార్చి, 'నీ మంచి ఎవడిక్కావాల్రా బోడి? సైడ్ కిక్కిచ్చానంటే చచ్చికూచుంటావ్. అమావాస్యనాడు నాకు ఫోన్ చేసి ఏషాలేత్తన్నావా బిడ్డా? నా పూర్తి అవతారాలు నీకింకా ఎరిక లేవనుకుంటా' అంటూ అరిచా.

ఈ సారి నిజంగానే భయపడ్డాడు.

'సారీ అండి. మీ మూడ్ బాగా లేనట్టుగా ఉంది. మళ్ళీ ఫోన్ చేస్తా' అన్నాడు.

'ఇంకోసారి అమావాస్య ఘడియల్లో ఫోన్ చేసి ముచ్చట్లు పెట్టుకుకున్నావంటే  మక్కెలిరుగుతైరా మాండ్లే. విషయం మాట్లాడి పెట్టెయ్. సోది పెట్టావంటే షోటోకాన్ కరాటే చూపిస్తా' అన్నా వేటగాడు లో ఎంటీఆర్ని ఇమిటేట్ చేస్తూ.

సడెన్ గా ఫోన్ కట్ అయిపొయింది.

నవ్వుకుంటూ నేనూ ఫోన్ కట్ చేశా. ఈలోపల ఇల్లొచ్చేసింది.

'అడిగిందల్లా చెబుతుంటే అలుసైపోతారంటే ఇదేనన్నమాట ! ఈ సారి మళ్ళీ చెయ్యనీ చెబుతా, మ్యాడ్ గురువా మజాకానా?' అనుకుంటూ నా రూంలోకెళ్ళి పద్మాసనం వేసుకుని, కళ్ళుమూసుకుని, ప్రశాంతంగా ధ్యానంలోకి జారిపోవడం మొదలుపెట్టా.

International Laughing Day Greetings !