“Self service is the best service”

22, మే 2022, ఆదివారం

'ప్రాణాగ్నిహోత్ర ఉపనిషత్' - మా క్రొత్తపుస్తకం విడుదల

'పంచవటి స్పిరిట్యువల్ ఫౌండేషన్' నుండి వెలువడుతున్న 42 వ పుస్తకంగా 'ప్రాణాగ్నిహోత్ర ఉపనిషత్' ఈరోజున విడుదలౌతున్నది. ఇది అధర్వణ వేదమునకు అనుబంధమైనది.

అందరూ ప్రతిపూటా చేసే అతిమామూలు పనియైన 'భోజనం చేయడాన్ని' వైదికసాధనగా మలచుకుని, దానిద్వారా అత్యుత్తమమైన బ్రహ్మజ్ఞానాన్ని ఎలా పొందాలన్న సులభమైన సాధనామార్గం ఇందులో చెప్పబడింది.

యోగశాస్త్రంలో, తంత్రశాస్త్రంలో చెప్పబడిన సాధనలను అందరూ చేయవచ్చు, చేయలేకపోవచ్చు. కానీ, దీనిలో చెప్పబడిన సాధన చాలా సులభమైనది. ఎవరైనా దీనిని చేయవచ్చు. ఫలితాన్ని మీరే చూడవచ్చు.

విశ్వమంతా ప్రాణమయమని, ఆ ప్రాణమే బ్రహ్మమనిన దివ్యానుభవాన్ని వేదఋషులు పొందారు. సరియైన భావనతో చేస్తే, దీనిని బాహ్యయజ్ఞంతోనూ అందుకోవచ్చు. అంతకంటే సులభమైన మార్గమేమంటే, మనం ఆహారాన్ని తీసుకోవడాన్నే సాధనగా మార్చుకుని కూడా ఈ స్థితిని పొందవచ్చు. దీనికే 'ప్రాణాగ్నిహోత్ర విద్య' యని పేరున్నది. ఆ విద్య ఈ ఉపనిషత్తులో చెప్పబడింది. దీనికి నా సులభమైన వివరణను, వ్యాఖ్యానాన్ని ఈ పుస్తకంలో మీరు చూడవచ్చు.

'వేదాలలో ఏముందో తెలీకుండా బ్రాహ్మణులు దాచిపెట్టారు' అనే మాటను కొంతమంది అనడం నా చిన్నప్పటినుంచీ నేను వింటున్నాను. అది నిజమో కాదో ప్రస్తుతానికి ప్రక్కన ఉంచుదాం. ఈ నిందను దూరం చేయడానికి నావంతుగా నేను చేస్తున్న చిన్న ప్రయత్నంలో, 'వేదాలలో ఏముంది? ఏయే రహస్యసాధనలు వాటిలో ఉన్నాయి?' అనే విషయాలను నా పుస్తకాలలో తేటతెల్లంగా, స్పష్టంగా వ్రాస్తూ వస్తున్నాను. కులాలతో సంబంధం లేకుండా వీటిని నా శిష్యులకు ఉపదేశిస్తున్నాను.

నేడు, వేదోపనిషత్తుల విజ్ఞానమంతా, కులాలతో సంబంధం లేకుండా అందరికీ, ప్రింట్ లో అందుబాటులో ఉంది. చదివి, అర్ధం చేసుకుని, ఆచరించేవారు మాత్రమే కావాలి. ఇప్పుడేమీ దాపరికం లేదుకదా ! ఆచరించండి మరి.

మాది ధార్మికసంస్థయేగాని వ్యాపారసంస్థ కాదు. కనుక, మా సంస్థనుండి కొన్ని ఉచిత పుస్తకాలను కూడా క్రమం తప్పకుడా అందరికీ అందించాలని సంకల్పించాం. ఈ ప్రక్రియలో భాగమే ఈ ఉచితపుస్తకం. దీనిని మీరు google play books నుండి ఉచితంగా ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు.

దీనికి వ్యాఖ్యానాన్ని వ్రాసింది నేనే అయినా, ఈ పుస్తకం వెలుగు చూడటానికి ఎంతో శ్రమించి టైప్ సెట్టింగ్, డీటీపీ వర్క్ చేసిన నా శిష్యురాలు అఖిలకు. అద్భుతమైన ముఖచిత్రాన్ని చిత్రించి ఇచ్చిన శిష్యుడు ప్రవీణ్ కు, మాకందరికీ నిరంతరం అండగా నిలుస్తున్న నా శ్రీమతి సరళాదేవికి కృతజ్ఞతలు. ఆశీస్సులు.

నా శిష్యురాలు శ్రీలలిత చేతులమీదుగా ఈ పుస్తకం విడుదల అవుతున్నది.

మన సనాతనధర్మంలో ఉన్న విజ్ఞానసంపదను చదవండి. అర్ధం చేసుకోండి. ఆచరించండి.  ధన్యులు కండి. ఈ దేశంలో పుట్టడం ఎంతో గొప్ప అదృష్టం. మన దేశపు విజ్ఞానం అత్యద్భుతం. అమూల్యం. భారతీయులుగా, హిందువులుగా పుట్టిన అందరూ ఈ విజ్ణానానికి అర్హులే. దీనికి కులంతో సంబంధం లేదు. శ్రద్ధ ఒక్కటే అర్హత.

'శ్రద్ధావాన్ లభతే జ్ఞానమ్' 'శ్రద్ధ ఉన్నవాడికి జ్ఞానం లభిస్తుంది' అంటూ భగవద్గీత చెబుతోంది !

మా మిగతా గ్రంధాలను ఆదరించినట్లే దీనిని కూడా ఆదరిస్తారు కదూ !