“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

19, ఏప్రిల్ 2021, సోమవారం

భూమి బల్లపరుపుగా ఉందా? బల్లమీదుందా?

నా చిన్నప్పుడు సైన్స్ ల్యాబ్ లో సైన్స్ మేష్టారు నన్నొక  ప్రశ్న అడిగారు.

'భూమెక్కడుందిరా?'

అప్పట్లో టీవీలూ లేవు. బొడ్డూడకముందే మొబైల్ కొని చేతికివ్వడమూ లేదు. ఇప్పటి పిల్లలకున్నంత అతితెలివితేటలు కూడా అప్పట్లో మనకు లేవు.

అటూ ఇటూ చూశాను. ఎదురుగా ఆయన టేబుల్ మీదే గ్లోబుంది. అమాయకంగా లా చెప్పాను.

'మీ బల్లమీదుందండి'.

వీపుమీద ఒక్క చరుపు చరిచాడాయన.

'బల్లమీదుందా? బల్లపరుపుగా ఉందా? నీ తెలివితేటలూ నువ్వూనూ?' అంటూ భూమి ఒక బంతిలా శూన్యంలో తేలుతుందని వివరించాడాయన. క్లాసు పిల్లలమందరం నోరెళ్ళబెట్టి విన్నాం.

ఇదంతా ఇప్పుడెందుకు గుర్తొచ్చిందంటే, మొన్నొకాయన ఇచ్చిన అజ్ఞాత మెయిల్ కారణం.

'మీ బ్లాగు చదివాను. బాగుంది. అనేక విషయాలలో మీకున్న జ్ఞానం అమోఘం. కానీ చంద్రయానం  గురించి మీరు రాసినది నిరాధారం. అబద్దం. మీరన్నట్లు భూమి గోళాకారంలో లేదు. బల్లపరుపుగా ఉంది. నేనీ విషయం మీద గత ఇరవై ఏళ్లుగా ఎన్నో పుస్తకాలు చదివాను. కావాలంటే ఎవడో ఇంగిలీషు గాడు రాసిన ఈ పుస్తకాలు చదవండి. మీకూ జ్ఞానోదయం అవుతుంది. మీరూ మా సొసైటీలో చేరండి. అసలు మన పురాణాలలోని లోకాలన్నీ కరెక్ట్. వాటిల్లో ఎక్కడా భూమి గోళాకారంలో ఉందని రాయలేదు. పురాణాలు రాసిన వాళ్లకి తెలివిలేదా? ఆలోచించండి. సైన్స్ భ్రమలో పడి మోసపోకండి. మా గ్రూప్ తో కలవండి'. అనేది ఆ మెయిల్ సారాంశం.

యధావిధిగా నవ్వొచ్చింది. జాలేసింది. పిచ్చి బాగా ముదిరిన బాపతని అర్ధమైంది. 'అయ్యో పాపం' అని అనుకుని వదిలేశాను.

వారం తర్వాత మళ్ళీ ఇంకో మెయిలొచ్చింది.

'నేనిచ్చిన పాత మెయిల్ చూశారా? చూస్తే, మీ అభిప్రాయమేంటి? మాతో కలుస్తారా? లేదా? మీకిష్టమైతే ఇలా చెయ్యండి. అలా చెయ్యండి' అంటూ మళ్ళీ పాత సొల్లే.

మార్కెటింగ్ బాగా స్ట్రాంగ్ గా ఉందనిపించి, వెంటనే ఆ మెయిల్ని బ్లాక్ చేశేశాను. అంతటితో ఆ పీడా వదిలింది.

ఇలాంటి అమాయకులు, పిచ్చివాళ్ళు ఎంతమంది ఉన్నారో లెక్కలేదు. విదేశాలలో కూడా భూమి బల్లపరుపుగా ఉందని నమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు. సొసైటీలే ఉన్నాయి. ఇది ఇప్పటి పిచ్చి కాదు.

అసలూ, తిన్నదరక్కపోతే, పనీపాటా లేకపోతే ఇలాంటి ధోరణులు పుడతాయి. భూమి బల్లపరుపుగా ఉంటె నీకేంటి? గోళాకారంగా ఉంటె నీకేంటి? నీ కడుపులో చల్ల కదలకుండా సోమరిపోతులా కూచొని ఇలాంటి కబుర్లు ఎన్నైనా చెప్పవచ్చు.. ఉపయోగమేంటి?

నువ్వు పుట్టినందుకు రెండే ప్రయోజనాలు. ఒకటి - నువ్వైనా ఎదగాలి. రెండు - నీవల్ల నీవాళ్ళైనా ఎదగాలి. రెండూ లేనప్పుడు నీ జన్మ నిరర్ధకం. ఇది మరచిపోయి, 'భూమి బల్లలాగా ఉంది, లోపలంతా డొల్లగా ఉంది, పైన తెల్లగా ఉంది, కింద చల్లగా ఉంది' అంటూ సొల్లు కబుర్లు చెప్పుకుంటూ పోతుంటే నువ్వు భూమికి భారమని అర్ధం. నీ పుటకే వేస్టని అర్ధం.

వివేకానందస్వామి ఇలా అనేవారు.

'నువ్వు పుట్టినందుకు ఏదైనా ఒక గొప్పపనిని చెయ్యి. నువ్వు పోయిన తర్వాత కూడా వందలాది ఏళ్లపాటు మానవజాతి నిన్ను గుర్తుంచుకోవాలి. అలాంటి గొప్పపనులు, మంచిపనులు నువ్వు చెయ్యాలి. లేకపోతే నీ జన్మకు విలువలేదు. వానాకాలంలో పుట్టే ఉసిళ్లకూ నీకూ భేదమేముంది?'.

ఎంతసేపూ తినడం, ఎంజాయ్ చెయ్యడం ఇలాంటి నిరర్ధకజీవితాలు గడపడం వల్ల ఎలాంటి ఉపయోగమూ లేదు. మానవజన్మకు పరమప్రయోజనం ఆత్మసాక్షాత్కారం దైవసాక్షాత్కారం పొందటం. పోనీ,  వాటిని అందరూ అందుకోలేరు. కనీసం నీవల్ల నలుగురికి ఉపయోగం కలగాలి. నువ్వు పోయాక కనీసం కొందరైనా నిన్ను తలచుకొని కన్నీరు పెట్టేవిధంగా నువ్వు బ్రతకాలి. లేకపోతే నీ జన్మ వృధా. 

మనుషులలోని అజ్ఞానం ఎన్ని విధాలో? ఓరి దేవుడా ! ఎలాంటి మనుషులని సృష్టించి, వాళ్ళని బ్రతికిస్తూ, వాళ్ళ పిచ్చి వేషాలు ఎన్ని రకాలుగా భరిస్తున్నావురా? నీ ఓపికకి నా జోహార్లు సుమా !