“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

21, సెప్టెంబర్ 2020, సోమవారం

రాహుకేతువుల రాశి మార్పు - ఫలితాలు

 23 - 9 - 2020 న రాహుకేతువులు రాశులు మారుతున్నారు. ఇప్పటివరకూ వారున్న స్థితులు మారి, రాహువు వృషభంలోకి, కేతువు వృశ్చికం లోకి వస్తారు. ఈ స్థితిలో వీళ్ళు ఏడాదిన్నర పాటు ఉంటారు. అంటే, మార్చ్ 2022 వరకు.

దీనివల్ల అనేక రకాలైన మార్పులు మనుషుల జీవితాలలో రాబోతున్నాయి.

అవేమిటో చూద్దాం

-------------------------

మేషరాశి

మాట దూకుడు ఎక్కువౌతుంది. ఉత్సాహం పెరుగుతుంది. ఆ దూకుడులో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నది. జాగ్రత్తగా ఉండాలి. కన్నులకు సైట్ పెరుగుతుంది. రకరకాలైన తిండ్లు తినే అవకాశం కలుగుతుంది. డబ్బుకు లోటుండదు.

వృషభరాశి

అహంకారం బాగా పెరుగుతుంది. ఎదుటి మనుషులను, జీవిత భాగస్వాములను ఇబ్బంది పెడతారు. ప్రేమ వ్యవహారాలు బలం పుంజుకుంటాయి. ఆకర్షణలు ఎక్కువౌతాయి. దూర ప్రయాణాలు చేస్తారు. స్నేహాలు, విలాసాలు, రకరకాల పనులు ఎక్కువౌతాయి. సంతానం వృద్ధిలోకి వస్తారు.

మిధునరాశి

రహస్యప్రేమలు మొదలౌతాయి. సంతానం విదేశాలలో స్థిరపడతారు. బ్లాక్ మనీ కూడబెడతారు. అనవసర ఖర్చులు ఎక్కువవుతాయి. గుప్తరోగాలు, అజీర్ణరోగాలు పట్టుకుంటాయి. శత్రుబాధ బాగా పెరుగుతుంది. 

కటకరాశి

రోగాలు ఎక్కువౌతాయి. అసాంఘికశక్తులతో స్నేహాలు కలుగుతాయి. మొండితనం పెరుగుతుంది. సంతానం చెప్పిన మాట వినకుండా తయారౌతారు. అక్రమ సంబంధాలు ఏర్పడతాయి. ఇతరులను హింసిస్తారు.

సింహరాశి

ఇంటా బయటా ఎదురులేకుండా ఉంటుంది. విందులు, వినోదాలు, విలాసాలు, జల్సాలు మొదలౌతాయి. ప్రమోషన్ వస్తుంది. వ్యాపారం కలిసొస్తుంది. జీవితం ఆనందంగా ఉంటుంది.

కన్యారాశి

ధైర్యం పెరుగుతుంది. సునాయాసంగా పనులు జరుగుతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఎదురుండదు. ఆధ్యాత్మిక చింతన, దైవదర్శనం, పుణ్య క్షేత్రసందర్శనం లభిస్తాయి. విదేశాలకు వెళతారు. రకరకాల ప్రదేశాలు చూస్తారు. దొంగగురువుల వలలో పడతారు.

తులారాశి

మాట దూకుడు వల్ల చాలా నష్టపోతారు. పిత్రార్జితం వస్తుంది. ఆధ్యాత్మిక ధోరణి పెరుగుతుంది. స్త్రీల మాయలో పడి నష్టపోతారు. నయంకాని దీర్ఘరోగాలు పట్టుకుంటాయి. ఆస్పత్రుల చుట్టూ తిరుగుతారు.

వృశ్చికరాశి

జీవితభాగస్వామితో గొడవలౌతాయి. విడిపోయేవరకూ వస్తుంది. పార్ట్నర్స్ మోసం చేస్తారు. దీర్ఘరోగాలు ఏడిపిస్తాయి. యాక్సిడెంట్ అవుతుంది. హఠాత్ నిర్ణయాలు తీసుకుని జీవితాన్ని నాశనం చేసుకుంటారు.

ధనూరాశి

పాతరోగాలు తిరగబెడతాయి. నయం కాని రోగాలు పట్టుకుంటాయి. శత్రువులు దెబ్బ తీస్తారు. కాలం ఎదురుతిరుగుతుంది. ఖర్చులు విపరీతంగా ఎక్కువౌతాయి. సంపాదన అంతా రోగాలకే సరిపోతుంది.

మకరరాశి

ఉత్సాహం పెరుగుతుంది. ఆధ్యాత్మిక సాధన ఫలిస్తుంది. ప్రేమలు ఫలిస్తాయి. సోల్ మేట్ ను కలుస్తారు. ధనలాభం ఉంటుంది. సంతానం బాగా వృద్ధిలోకి వస్తారు. మంచి మిత్రులు లభిస్తారు. అయితే, వారివల్ల బాధలుంటాయి.

కుంభరాశి

గృహసౌఖ్యం బాగుంటుంది. మనస్సు ఆనందంగా ఉంటుంది. ఉద్యోగంలో స్థాయి పెరుగుతుంది. మాట చెల్లుబడి అవుతుంది. కాలం కలిసొస్తుంది. జీవితం ఆనందంగా ఉంటుంది.

మీనరాశి

ధైర్యం పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. దూరప్రయాణాలు చేస్తారు. మిత్రులను కలుస్తారు. కాలం కలిసొస్తుంది.

ఈ ఫలితాలు ఏడాదిన్నర పాటు నడుస్తూ, మధ్యలో మిగతా గ్రహాల గోచారప్రభావం వల్ల మార్పులకు లోనౌతూ ఉంటాయి. గమనించండి.