“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

8, ఆగస్టు 2020, శనివారం

కోజికోడ్ విమాన ప్రమాదం - జ్యోతిష్య కారణాలు

7-8-2020 న 19.40 నిముషాలకు కేరళలోని కోజికోడ్ (కాలికట్) లోని కరిపూర్ ఎయిర్ పోర్ట్ లో దిగబోతున్న విమానం, రన్వే అవతలున్న పెద్దగుంటలో పడిపోయి చక్కగా రెండుముక్కలుగా చీలిపోయింది. 190 మంది ఉన్న ఈ విమానంలో 18 మంది చనిపోయారని, వారిలో ఇద్దరు పైలట్లు కూడా ఉన్నారనీ, చాలామందికి సీరియస్ గాయాలయ్యాయని అంటున్నారు. వీళ్లంతా కరోనా వల్ల దుబాయ్ లో ఆగిపోయిన బాధితులు. 'వందే భారత్ మిషన్' లో భాగంగా వీళ్ళను  వెనక్కు తెస్తున్నారు. ఈ లోపల ఇలా జరిగింది. కరోనా నుంచి తప్పించుకుంటే కరిపూర్ ఎయిర్ పోర్ట్ కాటేసింది. ఏ రాయైతేనేం తలకాయ పగలడానికి? 

ఆ సమయానికి వాయుతత్వ రాశి అయిన కుంభం లగ్నంగా ఉదయిస్తూ వాయుప్రమాదాన్ని సూచిస్తున్నది. లగ్నానికి ఒకవైపు శని ఇంకొక వైపు కుజుడూ ఉంటూ పాపార్గళాన్ని కలిగిస్తూ ప్రమాదాన్ని సూచిస్తున్నారు. కుజునితో ఆరవ అధిపతి అయిన చంద్రుడు కలిసి ఉంటూ, అనుభవించవలసి ఖర్మను సూచిస్తున్నాడు.

ఆ సమయానికి శని - బుధ - కుజదశ జరుగుతున్నది. ఇది యాక్సిడెంట్స్ జరిగే దశ అని శని, కుజులను చూస్తే అర్ధమౌతుంది. బుధుడు 8 వ అధిపతిగా 6 వ ఇంట్లో ఉంటూ ఘోరప్రమాదాన్ని సూచిస్తున్నాడు.

కుజుడూ, చంద్రుడూ ఉన్న మీనం జలతత్వ రాశి. అలాగే బుధుఁడున్న కర్కాటకం కూడా జలతత్వ రాశి. కనుక ఈ దుర్ఘటనకు మూలం నీరు. వర్షం పడుతుండటం వల్ల పైలట్లకు రన్ వే సరిగా కనిపించక విమానం లోతైన గుంటలో పడింది. ఈ విధంగా నీరు ఇక్కడ మృత్యుకారకమైంది. చనిపోయిన 18 మందిలో ఇద్దరు పైలట్లు కూడా ఉన్నారు.

కుంభలగ్నం  రెండుగంటల పాటు ఉదయిస్తూనే ఉంటుంది కదా, మరి ఆ రెండు గంటలూ ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయా? అన్న చొప్పదంటు ప్రశ్న మీకొస్తుంది. వినండి.

ప్రమాదం జరిగిన క్షణంలో సూక్ష్మంగా పరిశీలిస్తే గ్రహాల ప్రభావం ఘోరంగా ఉంటుంది. అయితే, దాని కళలు రాశిచక్రంలో కూడా కనిపిస్తాయి. ఆ క్షణాన్ని మాత్రమే నిశితంగా చూడాలంటే, 'నవాంశ - ద్వాదశాంశ' చక్రాన్ని గమనించాలి.  అంటే D-108 అన్నమాట. నిమిషనిమిషానికీ మారిపోయే గ్రహస్థితుల్ని చూడాలంటే D-108 మరియు D-144 ఇంకా పైనున్న అంశచక్రాలను గమనించాలి. వాటిల్లోదే నాడీఅంశ అనబడే D - 150 కూడా.

ఇప్పుడు 'నవాంశ - ద్వాదశాంశ' లేదా 'అష్టోత్తరాంశ' చక్రాన్ని చూద్దాం. లగ్నం మళ్ళీ వాయుతత్వ రాశి అయిన తుల అవుతూ వాయుప్రమాదాన్ని సూచిస్తున్నది. శుక్రుడు ద్వితీయ కర్మస్థానమైన సింహంలో ఉంటూ మళ్ళీ సామూహిక ఖర్మను సూచిస్తున్నాడు. 6 గ్రహాలు 3/9 ఇరుసులో ఉంటూ ప్రయాణీకుల బలమైన పూర్వకర్మను సూచిస్తున్నారు. వారిలో ఉన్న శని, రాహువు, గురువుల సంబంధం దృఢమైన శపితయోగాన్ని, గురుఛండాల యోగాన్ని సూచిస్తున్నది. ఇది ఖచ్చితంగా బలమైన పూర్వకర్మయోగం.

నమ్మించి మోసం చెయ్యడం,  కండకావరంతో సాటిమనుషులను దగాచేసి హింసించడం మొదలైన పాపాలవల్ల ఇలాంటి ఫలితాలు కలుగుతాయి. సాటి మనుషులు మనల్ని నమ్ముతారు. వారిని నమ్మించి మోసంచేసి అదేదో పెద్ద ఘనకార్యం అయినట్లు పొంగిపోతాం. మన స్వార్థమే గాని ఎదుటిమనిషి పడుతున్న బాధను పట్టించుకోము. మనలో చాలామందికి ఇది అలవాటే. అలాంటి పనులకు ఎలా పెనాల్టీ పడుతుందో తెలుసా? గమ్యం చేరుస్తుందని నమ్మి విమానంగాని ఇంకేదో వాహనంగాని ఎక్కుతారు. కానీ మధ్యలోనే అది కొంప ముంచుతుంది. ప్రాణాలు పోతాయి. అలాంటి కర్మలకు ఇలాంటి ఫలితాలే ఉంటాయి.

ఈ చక్రంలో అంతా వాయుతత్వ ప్రభావమే కనిపిస్తోంది. కానీ ఇక్కడ ప్రమాదానికి ముఖ్యకారణం జలం, అంటే వాన. దానిని చూడాలంటే ఇంకా సూక్ష్మంగా వెళ్ళాలి. ఇప్పుడు 'ద్వాదశాంశ - ద్వాదశాంశ' చక్రాన్ని, అంటే D-144 ను చూద్దాం.

ఇందులో, విషయం చాలా క్లియర్ గా కనిపిస్తోంది. జలతత్వరాశి అయిన వృశ్చికం లగ్నం అవుతూ, జలభూతమే ఈ ప్రమాదానికి కారణమని చెబుతోంది. అంతేగాక, రాహుకేతువుల ఉఛ్చఇరుసు లగ్నాన్ని సూటిగా కొడుతూ దృఢకర్మ యోగాన్ని, అనుభవించవలసి కర్మను సూచిస్తున్నది. రాహుశనులు సప్తమం లో ఉంటూ శపితయోగపు దృష్టితో లగ్నాన్ని చూస్తూ ఆ సమయానికి వానపడటం శపితయోగ ఫలితమేనని చెబుతున్నారు. శని నీచస్థితిలోకి పోతూ ప్రయాణీకుల నీచమైన పూర్వకర్మను సూచిస్తున్నాడు. పూర్వకర్మను ఇంకోవిధంగా సూచిస్తున్న 9 వ అధిపతి చంద్రుడు లగ్నంలో నీచస్థితిలో ఉంటూ మళ్ళీ వీరందరి నీచమైన పూర్వకర్మను సూచిస్తున్నాడు. ఇంకా చాలా సూచనలున్నాయి గాని అవన్నీ ప్రస్తుతానికి అవసరం లేదు.

అయితే, జ్యోతిష్యకారణాల వల్లనే ఇదంతా జరిగిందా? అధికారుల నిర్లక్ష్యం లేదా? అని మరొక చొప్పదంటు ప్రశ్న కూడా రావచ్చు. మళ్ళీ వినండి.

గ్రహాలవల్ల ఏదీ జరగదు. వాటికి పక్షపాతం లేదు. అవి మనల్నేమీ చెయ్యవు కూడా. మన కర్మే మన జీవితాలను నడిపిస్తుంది. మన కర్మానుసారం గ్రహాలు నడుస్తాయి. ఫలితాలనిస్తాయి. మన కర్మను మనచేత అనుభవింపజేస్తాయి. అంతే !

చనిపోయిన 18 మంది జాతకాలనూ పరిశీలిస్తే, వాటిల్లో కామన్ గా  ఉన్న పూర్వకర్మ స్పష్టంగా కన్పిస్తుంది. కానీ అవసరం లేదు. స్టాటిస్టికల్ పరిశీలన తప్ప దానివల్ల ఉపయోగమూ లేదు.  

ఇకపోతే, అధికారుల నిర్లక్ష్యం కూడా జనాల పూర్వకర్మ ఫలితమే. దేశంలో ఇంకా ఎన్నో మంచి ఎయిర్ పోర్టులుండగా, దీంట్లోనే వారంతా దిగవలసిరావడం కూడా దాని ఫలితమే. పదేళ్ళక్రితమే ఎయిర్ సేఫ్టీ నిపుణుడు మోహన్ రంగనాధన్ తన రిపోర్టులో ఈ ఎయిర్ పోర్ట్ లో ఉన్న టేబుల్ టాప్ లాండింగ్ చాలా ప్రమాదకరమని చెప్పినా కూడా ప్రభుత్వాలు దానిని పట్టించుకోకపోవడం ఆ ఖర్మ ఫలితమే. ఏడాది క్రితం ఇలాంటిదే ప్రమాదం మంగుళూరులో జరిగినా అధికారులు కళ్ళు తెరవకపోవడమూ ఆ గ్రహప్రభావమే. ఇదేకాదు, పాట్నా, జమ్మూ లలోని ఎయిర్ పోర్ట్ లు కూడా ఇలాంటివే, తరువాత జరగబోయేది అక్కడేనని నిపుణులు చెబుతున్నా అధికారులు చూసీ చూడనట్లు ఉండటం, చివరకు ఎవడో ఒక క్రిందిస్థాయి అధికారిని బలిపశువును చెయ్యడం, మళ్ళీ నిమ్మకు నీరెత్తినట్లు నిద్రపోవడం - ఇవన్నీ కూడా ఆ గ్రహప్రభావాలే.

అన్నివేళలా అన్నిచోట్లా అన్నీ సవ్యంగా ఉంటే, మనుషులు తమ ఖర్మఫలితాలను అనుభవించేదెలా మరి? అలా ఉంటే మనుషులకు పట్టపగ్గాలుంటాయా? ఎవడికెక్కడ ఎలా వాత పడాలో అలా పడాల్సిందే !