నిజమైన అదృష్టవంతులు మాత్రమే మాతో చేయి కలుపుతారు

13, మే 2020, బుధవారం

'ధ్యానబిందూపనిషత్' తెలుగు 'ఈ పుస్తకం' నేడు విడుదలైంది.


సామవేదాన్తర్గతమైన 'ధ్యానబిందూపనిషత్' ను నా వ్యాఖ్యానంతో నేడు విడుదల చేస్తున్నాము. 2020 లో మా నుంచి వస్తున్న పదవ పుస్తకమిది. లాక్ డౌన్ సమయంలో వస్తున్న ఎనిమిదో పుస్తకం. ఈ పది పుస్తకాలనూ ఇంగ్లీషులోకి అనువదించే ప్రయత్నాలు మొదలయ్యాయి. నా శిష్యులు ఆ పనిమీద ఉన్నారు. కనుక, నేను ఇంతకుముందు చెప్పినట్లుగా 2020 లో ఇరవై పుస్తకాలను రిలీజ్ చెయ్యడం అయిపోతున్నట్లే. 

ఇదింకా 'మే' నే కాబట్టి మిగిలిన ఏడునెలల్లో ఇవిగాక ఇంకొక పదిపుస్తకాలు రిలీజ్ అవడమూ, అవన్నీ ఇంగ్లీష్ లోకి తర్జుమా కావడమూ జరుగుతుంది. వెరసి 2020 లో మొత్తం నలభై పుస్తకాలను రిలీజ్ చేస్తున్నాం.

రెండేళ్ళక్రితం శ్రీశైలంలో జరిగిన రిట్రీట్లో అనుకుంటా 'త్వరలో నేను 100 పుస్తకాలు వ్రాస్తాను' అని యధాలాపంగా అన్నాను. ఈ ఏడాది చివరకు మా సంస్థనుండి 60 పుస్తకాలు విడుదల అవుతాయి. యధాలాపంగా అన్న మాట ఈ విధంగా నిజం అవుతోంది. నిజమైన ఆధ్యాత్మికతను లోకానికి బోధించే మన మతంలోని ప్రాచీన ప్రామాణికగ్రంధముల ఆవిష్కరణను ఈవిధంగా చెయ్యగలుగుతున్నాము.

పేరుకు తగినట్లే, ఈ ఉపనిషత్తు ధ్యానమునకు ఎక్కువగా ప్రాముఖ్యతనిస్తున్నది. యధావిధిగా ఇందులో కూడా షట్చక్రములు, బంధములు, ప్రాణాయామక్రియలు,  గ్రంధిభేదనం, ఓంకారనాదోపాసన, నాడీచక్రం, హృదయపద్మంలో ఆత్మ సంచారంతో ఏయే భావములు ఎప్పుడు పుడుతూ ఉంటాయి? జాగ్రత్ స్వప్న సుషుప్తి, తురీయ, తురీయాతీత స్థితులను ఆత్మ ఎలా అందుకుంటుంది? ఆత్మసాక్షాత్కారం, బ్రహ్మానుభవం మొదలైన విషయములు వివరించబడి వాటికి దారులు సూచింపబడినాయి.

యధావిధిగా ఈ పుస్తకాన్ని వ్రాయడంలో నా శ్రీమతి సరళాదేవి, శిష్యురాళ్ళు అఖిల, శ్రీలలిత, శిష్యులు రాజు, ప్రవీణ్ లు ఎంతో సహాయం చేశారు. వారికి నా కృతజ్ఞతలు, ఆశీస్సులు.

ఈ పుస్తకం కూడా ఎప్పటిలాగే google play books నుండి లభిస్తుంది. లాక్ డౌన్ అయిపోయాక ఇంగ్లీషు, తెలుగులలో ప్రింట్ పుస్తకంగా వస్తుంది.