“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

9, మే 2020, శనివారం

Birth time rectification of Sri T. Krishnamacharya, Father of modern Yoga

ఈయన 18-11-1888 నాడు కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో జన్మించారు.  జననసమయం తెలియదు గనుక మన పద్ధతులలో విశ్లేషణ చేద్దాం.

ఉదయం 11. 57 వరకూ మేషరాశిలో ఉన్న చంద్రుడు ఆ తర్వాత వృషభ రాశికి మారాడు. ఆ రోజున ఈ క్రింది నక్షత్రాలు ఉన్నాయి.


భరణి - 4 ఉదయం 7. 30 వరకూ
కృత్తిక - 1 మధ్యాన్నం 11 . 57 వరకూ
ఇంతవరకూ మేషరాశిలో చంద్రుడున్నాడు. ఇక్కడనుంచి వృషభానికి మారాడు.
కృత్తిక - 2 సాయంత్రం 5. 30 వరకూ
కృత్తిక - 3 రాత్రి 11. 30 వరకూ

ఉదయమైనా, సాయంత్రమైనా శనియే ఆత్మకారకుడవుతున్నాడు. ఉదయం తొమ్మిదిన్నర నుంచి పదకొండున్నర వరకూ చంద్రుడు అవుతున్నాడు. ఆ సమయంలో కారకాంశ ధనుస్సు అవుతున్నది. ఈయనది స్థూలశరీరం కాదు. ధనుర్లగ్నం వారు పెద్ద వయసులో బాగా ఊబకాయులు అవుతారు. ఈయన కాదు గనుక, 101 ఏళ్ల వయసులో కూడా ఈయన చాలా గట్టిగా ఉన్నాడు కనుకా ఈయనది ధనుర్నవాంశ కాదని నా ఉద్దేశ్యం. కనుక ఈయన ఆత్మకారకుడు చంద్రుడు కాడు శనియే. కనుక ఈయన జననం ఉదయం 9. 30 లోపైనా అయ్యుండాలి లేదా 11. 57 తర్వాతైనా అయ్యుండాలిగాని ఆ మధ్యలో మాత్రం కాదు. ముందైతే మేషరాశి, తర్వాత అయితే వృషభరాశి అవుతుంది.

మేషరాశిలో అయితే కర్కాటకరాశిలో ఉన్న శపితయోగం వల్ల గృహసౌఖ్యం కరువౌతుంది. వృషభమైతే విపరీతమైన పట్టుదల వస్తుంది. రెండోదే కరెక్టు గనుక, అలాంటి పట్టుదల లేకుంటే హఠయోగమును సాధించలేడు కనుకా, చంద్రుడు వృషభరాశిలోనే ఉన్నాడని ఊహిస్తున్నాను. అదీగాక, వృషభంలో చంద్రునికి ఉఛ్ఛత్వం ఉన్నది. చంద్రుడు మాతృకారకుడు గనుక తల్లివైపునుంచి అదృష్టమూ, ఆధ్యాత్మికచింతనా అబ్బుతాయి. ఆధ్యాత్మికం ఎప్పుడైనా తల్లివైపునుంచే ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఈ విధంగా చూచినా ఈయనది వృషభరాశియేనని తెలుస్తున్నది.

వృషభంలోకి వచ్చేవరకూ ఆత్మకారకుడుగా ఉన్న చంద్రుడు అక్కడికి రాగానే దారాకారకుడవుతాడు. అంటే, చంద్రుని ఉఛ్ఛత్వం వల్ల భార్యవైపునుంచి అదృష్టం కలుగుతుంది.  కానీ డిగ్రీల పరంగా బలహీనుడు గనుక వెంటనే రాదు. కాలక్రమేణా అదృష్టం పెరుగుతుంది. భార్యనుంచే గాక భార్యవైపు బంధువులనుంచి కూడా వస్తుంది. ఈయన జీవితంలో సరిగ్గా అదే జరిగింది. పెళ్లి తర్వాత నిదానంగా ఈయనకు అదృష్టం పెరుగుతూ వచ్చింది. అంతేగాక, బావమరిది అయిన బీకేఎస్ అయ్యంగార్ ద్వారా ఈయనకు ప్రపంచప్రఖ్యాతి కలిగింది. ఒక్కసారి కూడా  భారతదేశం వదలి బయటకుపోని ఈయన పేరును ఇప్పుడు కనీసం నూరుదేశాలలో యోగాభిమానులు తలచుకుంటున్నారు. 

చంద్రుడు దారాకారకునిగా సాయంత్రం 7 గంటలవరకూ ఉన్నాడు. అంటే, ఈయన జన్మించినది మధ్యాహ్నం 11.57 నుండి సాయంత్రం 7 లోపని తేలుతోంది. ఈ మధ్యలో మకరం నుంచి వృషభం వరకూ లగ్నములు గడిచాయి.

ఇప్పుడు ఈయన జీవితంలోని కొన్ని సంఘటనలను గమనిద్దాం.

1925 లో అంటే 36 ఏళ్ల వయసులో ఈయన వివాహం చేసుకున్నారు. అంటే, వివాహం ఆలస్యమైనట్లే లెక్క. కనుక వివాహభావాలతో శనికి సంబంధం ఉండాలి. అంటే, లగ్నం మకరం గాని, మేషంగానీ అయ్యుండాలి. అంటే, ఈయన పుట్టినది, 11.30 నుంచి 12.26 లోపుగాని  లేదా 15.50 నుంచి 17. 30 లోపు అయ్యుండాలి.

1926 లో మైసూరు మహారాజు శ్రీకృష్ణరాజ ఒడయార్ ఈయన పాండిత్యాన్ని, యోగశక్తిని చూచి, ఈయన అభిమాని అయ్యాడు. తన ఆస్థానంలో విద్వాన్ పదవినిచ్చి ఆదరించాడు. ఆ సంవత్సరంలో శని తులలో ఉచ్చస్థితిలో ఉన్నాడు. మకరానికైతే, దశమంలో ఉంటూ పదవీయోగాన్నిస్తాడు. మేషానికైతే సప్తమంలో ఉంటూ వివాహ, వ్యాపారాదులలో మేలు చేస్తాడు. కనుక మకరలగ్నమే సరిపోతుంది. అంటే, ఈయన జన్మించిన టైం స్లాట్ మధ్యాన్నం 11.57  నుండి 12.26 లోపన్నమాట.

1940 లో మైసూరు మహారాజు మరణించడంతో ఈయనకు మళ్ళీ కష్టాలు మొదలయ్యాయి. క్రొత్త మహారాజు చామరాజేంద్ర ఒడయార్ కు యోగామీద అంత ఇష్టం లేదు. కనుక పాత రాజుగారిలాగా యోగవిద్యావ్యాప్తికి ఈయన సహాయం చెయ్యలేదు, ప్రోత్సహించలేదు. ఆ సమయంలో శని మేషంలో నీచలో ఉన్నాడు. మకరలగ్నమైతే, శని సుఖస్థానాన్ని పాడుచేస్తూ, దశమాన్ని చూస్తూ ఉద్యోగాన్ని కూడా పాడుచేస్తాడు గనుక సరిగ్గా సరిపోతుంది. కనుక ఈ సంఘటన కూడా మకరలగ్నమునే బలపరుస్తోంది.

మన దేశానికి స్వాతంత్య్రం వచ్చాక మహారాజులు సంస్థానాలు రద్దయ్యాయి. మైసూరు యోగశాల కూడా మూతపడింది. అందుకని ఈయన 1950 నుంచి 1952 మధ్యలో బెంగుళూరుకు మారి చివరకు మద్రాసు చేరుకున్నారు. ఇది ఈయన జీవితంలో మరొక ఘట్టం. ఈ సమయంలో శని మకరానికి అష్టమంలోనూ నవమంలోనూ సంచరించాడు. 1950 లో అష్టమంలో శత్రుస్థానంలో ఉన్నపుడు మైసూరు యోగశాల మూతపడింది. 1952 లో నవమంలో మిత్రక్షేత్రమైన కన్యకు వచ్చినపుడు మద్రాసులోని వివేకానందకాలేజీలో ఉద్యోగం వచ్చి అక్కడకు మకాం మార్చారు. కనుక ఈ సంఘటనలు కూడా మకరలగ్నానికే సరిపోతున్నాయి.

ఈయనకు 96 ఏళ్ల వయసులో అంటే 1984 ప్రాంతంలో తుంటి ఎముక విరిగింది. ఆ సమయంలో వక్ర శని, వక్ర కుజుడు తులలో ఉన్నారు. అంటే నవమమైన కన్యలోకి వస్తారు. ఇది దుర్ఘటనాయోగం గనుక, నవమం తుంటి గనుక, ఆ సమయంలో ఈయనకు తుంటి ఎముక విరిగింది. ఈ సంఘటన కూడా మకరలగ్నానికే సరిపోతుంది. అంటే, జననసమయం మధ్యాన్నం 11.57  నుండి 12.26 లోపన్నమాట.

మకరలగ్నజాతకులకు జీవితం చాలా కష్టాలతో గడుస్తుంది. ఏటికి ఎదురీతలాగా ఉంటుంది వారి జీవితం. కానీ స్వయంశక్తితో ఎదిగిన సంతృప్తి వారికి ఉంటుంది. మొదట్లో ఎన్ని కష్టాలు పడినా, మొండిగా ఎదురీది, జీవితం చివరకు వాళ్ళు హిమాలయ శిఖరాల్లాగా నిలుస్తారు. ఈయన జీవితం కూడా ఇలాగే నడిచింది పైగా పంచమంలో ఉఛ్చచంద్రుని వల్ల ప్రపంచప్రఖ్యాతి గాంచిన శిష్యులూ, పుత్రులూ ఉంటారు.

కాబట్టి ఈయనది మకరలగ్నమేనని నేను నిర్ధారిస్తున్నాను.

ఇప్పుడు ఇంకా సూక్ష్మంగా పరిశీలించి ఖచ్చితమైన జనన సమయాన్ని రాబడదాం. మకరలగ్నంలోని తొమ్మిది నవాంశలలో ఈయనది కన్యానవాంశ అవుతుంది. ఎందుకంటే, 11.58 తరువాత 12. 26 లోపు మూడే నవాంశలు ఉంటాయి. అవి  కర్కాటక, సింహ, కన్యా నవాంశలు. కన్య అయితేనే ఈయన జీవితంలోని అంశములు సరిపోతున్నాయి. అదంతా ఇక నేను వివరించను. జ్యోతిష్యశాస్త్రాభిమానులు, విద్యార్థులకు హోమ్ వర్క్ లా వదిలేస్తున్నాను. ఈ నిశ్చయానికి నేనెలా వచ్చానో మీరే కనుక్కోండి.

అలా అయినప్పుడు, ఈయన జననసమయం ఇంకా కుదించబడి, మధ్యాన్నం 12.15 నుంచి 12.26 మధ్యలోకి వస్తుంది. ఈ టైం స్లాట్ లో ఈయన పుట్టినది 12. 23 నిముషములకు అని నేను చెబుతున్నాను. ఎలా అనేది చెప్పను. మీరే కనుక్కోవాలి.

ఈ సమయాన్ని బట్టి ఆయన చనిపోయిన 28-2-1989 నాడు శుక్ర - శుక్ర - గురు - శుక్ర - శుక్రదశ నడిచింది. శుక్ర గురువులిద్దరే ఈ దశానాధులు. శుక్రుడు ద్వాదశంలో బాధకస్థానాధిపతితో కలసి ఉంటూ ఆస్పత్రిని మరణాన్ని సూచిస్తున్నాడు. గురువు ద్వాదశాధిపతిగా బాధకస్థానంలో అష్టమాధిపతి అయిన సూర్యునితో కలసి ఉంటూ మళ్ళీ మరణాన్ని సూచిస్తున్నాడు. కనుక సరిగ్గా సరిపోయింది.

కనుక ఈయన జననసమయం మధ్యాహ్నం 12.23 అని జననకాల సంస్కరణ చేశాను. ఆ సమయానికి కృత్తికానక్షత్రం రెండవపాదం నడుస్తున్నది.

ఇప్పుడు దశలను సంఘటనలను గమనిద్దాం.

1925 లో వివాహం - అప్పుడు రాహు - చంద్రదశ నడిచింది. రాహువు సప్తమంలో చంద్రుని సూచిస్తున్నాడు. చంద్రుడు సప్తమాధిపతి, దారా కారకుడు. సరిగా సరిపోయింది. 

చిన్నప్పుడే తండ్రి మరణించాడు. అది చంద్రదశలో జరిగింది. దశమం నుంచి చంద్రుడు అష్టమంలో ఉచ్ఛస్థితిలో ఉంటూ తండ్రిమరణాన్ని సూచిస్తున్నాడు. కనుక సరిపోయింది.

1926-1940 ఈయన మైసూరు మహారాజు ఆదరణతో ఉన్నాడు. ఆ సమయంలో ఈయనకు దాదాపుగా గురుమహర్దశ నడిచింది. లాభస్థానంలో సూర్యునితో కలసి ఉచ్చచంద్రునిచేత చూడబడుతున్న గురువు, రాజమూలకమైన లాభాన్నిచ్చాడు.

ఆ తర్వాత గురు-కుజ, గురు- రాహు ఛిద్రదశలలో యోగశాల మూతపడింది. ఇదికూడా సరిగ్గా సరిపోయింది.

1950 - 52 మధ్యలో బెంగుళూరు, మద్రాసులకు మార్పు. అప్పుడు శని-కేతు, శని - శుక్రదశలు నడిచాయి. మొదటిదశలో, కేతువు విడదీస్తాడు గనుక ఉన్నఊరినుంచి బయటకు వెళ్ళవలసి వచ్చింది. రెండవదశలో కాళిదాసు సూత్రం నిజమై రాజుకు కూడా అడుక్కునే స్థితి పట్టింది. కానీ చివరకు మద్రాసులో ఉద్యోగం వచ్చింది.

1984 లో తుంటి ఎముక విరిగినప్పుడు ఈయనకు కేతు - రాహుదశ నడిచింది. ఇది జీవితంలో పెనుమార్పుకు శ్రీకారం చుడుతుందని ఎన్నో సార్లు నేను వ్రాశాను, చెప్పాను. అదే జరిగింది. ఆ తర్వాత ఆయన మంచానికి, కుర్చీకి అంకితం అయ్యాడనే చెప్పాలి.

ఈ విధంగా సంస్కరింపబడిన సమయంతో జీవితసంఘటనలు సరిగ్గా సరిపోతున్నందున నేను చేసిన సంస్కరణ సరియైనదేనని నమ్ముతున్నాను.