Spiritual ignorance is harder to break than ordinary ignorance

8, డిసెంబర్ 2019, ఆదివారం

ఉన్నావా? అసలున్నావా?

ఉన్నావ్ ఘటన దారుణాతి దారుణంగా ముగిసింది. రెండేళ్ళ క్రితం గ్యాంగ్ రేప్ కు గురైన బాధితురాలు మొన్న పెట్రోల్ తో సజీవదహనం చెయ్యబడి చంపబడింది. యధావిధిగా నాయకులు అధికారులు వచ్చారు. గోల చేశారు. వరాలు గుప్పించారు. మాయమాటలు, బట్టీ పట్టిన పదాలు వల్లించారు. బాధితురాలి చివరి సంస్కారం అయిపోయింది.

ఈ మాటలు చెప్పిన నాయకులు రేపట్నించీ ఎక్కడా కనిపించరు. వాళ్ళిచ్చిన వరాలు ఎక్కడా కనిపించవు. వాటికోసం, సిగ్గూ అభిమానం చంపుకొని బాధిత కుటుంబం కాళ్ళరిగేలా అధికారుల చుట్టూ తిరగవలసి వస్తుంది. ఇది వాస్తవం !

పైగా, బాధితురాలి చెల్లెలి జీవితం ఇప్పుడు ప్రమాదంలో పడింది. ఆమె ఈ కేసులో ఒక సాక్షి. కనుక ఆమెకు కూడా ముందుముందు ప్రమాదమే. వాళ్ళుండేది పల్లెటూళ్ళో. మీడియాలూ, పోలీసులూ అక్కడకు చేరేసరికి జరగవలసినవి జరిగిపోతాయి. మళ్ళీ కాసేపు అందరూ గోల చేస్తారు. మెల్లిగా అందరూ వారిని మరచిపోతారు. ఆ పొలాలలో వాళ్ళ సమాధులు మాత్రం మానవత్వం లేని మన సమాజాన్ని వెక్కిరిస్తూ నిలబడి ఉంటాయి. వాటికి జనం పూజలు చెయ్యవచ్చు. భయంతో దానినొక క్షేత్రంగా మార్చవచ్చు. సినిమావాళ్ళు ఈ ఘటన మీద ఒక సినిమాతీసి కోట్లు సంపాదించవచ్చు. కానీ బ్రతికుండగా వారికి న్యాయం మాత్రం ఎవ్వరూ చెయ్యరు. ఇది మన సమాజపు డొల్ల బ్రతుకు !

ఈ ప్రపంచంలో ఆడదానిగా పుట్టడమే ఆమె చేసిన నేరమా? దానికి ఇంత శిక్షా? గ్యాంగ్ రేప్ చాలక, న్యాయం అడిగినందుకు, పెట్రోల్ పొయ్యబడి సజీవ దహనమా? అసలు మనం మానవ సమాజంలో బ్రతుకుతున్నామా లేక అడవిలో మృగాల మధ్యన బ్రతుకుతున్నామా? మన దేశంలో అసలు వ్యవస్థలున్నాయా?

ఉన్నావ్ ఘటన చూశాక, ఆకాశం వైపు తిరిగి 'ఉన్నావా? అసలున్నావా? ఉంటె కళ్ళు మూసుకున్నావా? ఈ లోకం కుళ్ళు చూడకున్నావా?' అని అరవాలనిపిస్తోంది.

ఇప్పుడు మనమేం చేసినా, ఎన్ని ఉద్యోగాలిచ్చినా, ఎంత డబ్బులిచ్చినా, ఈ అమ్మాయికి జరిగిన అన్యాయం న్యాయంగా మారుతుంది? సాధ్యమా అసలు? అసలు ఇవన్నీ ఇవ్వడం సమస్యకు పరిష్కారమా? ఇలా చేసేసి చేతులు దులుపుకుని, కళ్ళు మూసుకుని ఊరుకుంటే సరిపోతుందా?

మనది ప్రజాస్వామ్యమా? ఆటవిక రాజ్యమా? ఆటవిక రాజ్యమే నయమేమో? అక్కడైనా న్యాయం అనేది కాస్త కాకపోతే కాస్తైనా ఉంటుంది !!