“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

3, డిసెంబర్ 2019, మంగళవారం

దిశ దారుణహత్య - కొన్ని ఆలోచనలు - 2

6. ప్రజలలో విశ్వాసాన్ని పొందలేని పోలీసులు

People friendly policing అనే మాటను తరచుగా మనం పోలీసువారి నోటినుంచి వింటూ ఉంటాం. కానీ ఇది ఆచరణలో ఎక్కడా కనపడదు. నిజానికి ఇంతకంటే పెద్దజోక్ ఇంకెక్కడా ఉండదు.

మన దేశంలో, లాయర్లు, క్రిమినల్స్ మాత్రమే పోలీసులతో చక్కగా కలసిమెలసి ఉండగలుగుతారు గాని సామాన్యుడు పోలీసులంటే భయపడుతూనే ఉంటాడు. ఎందుకంటే, వాళ్ళ ప్రవర్తన చాలా దురుసుగా ఉంటుందని అందరికీ తెలిసిందే. ఒక సమస్య మీద ఒక సామాన్యుడు పోలీస్ స్టేషన్ కి వెళితే, వాళ్ళు వాడిని పెట్టె తిప్పలు ఊహాతీతంగా ఉంటాయి. ముందు వాడినే దొంగలా చూస్తారు. కేసు రిజిస్టర్ చేసుకోరు. దురుసుగా ప్రవర్తిస్తారు. అసలు పోలీస్ స్టేషన్ వాతావరణమే భయానకంగా, బెరుకు బెరుకుగా అనిపిస్తుంది.

మొన్నటికి మొన్న, దిశ కేసులో, కేసు పరిధి మాది కాదంటే మాది కాదని మూడు పోలీసు స్టేషన్లకు తిప్పారని వారలొచ్చాయి. ఇందులో అబద్ధం లేదని నేను నమ్ముతున్నాను. నేనే కాదు, మన దేశంలో ఎవరైనా సరే, నమ్ముతారు. FIR రిజిస్టర్ చేయించాలంటే పై అధికారులో, రాజకీయ నాయకులో ఎవరో ఒకరు తెలిసి ఉంటేనే అది సాధ్యమౌతుంది. అంతేగాని, ఒక సామాన్యుడు వెళ్లి తన సమస్య చెబితే FIR రాయరు. ఎందుకంటే వాళ్ళ స్టాటిస్టికల్ గ్రాఫ్ పెరిగిపోతుందని భయం ! రివ్యూ మీటింగులలో జవాబు చెప్పుకోవలసి వస్తుందని భయం ! అందుకని, ఫిర్యాదీని భయపెట్టి పంపించాలనే చూస్తారు గాని, కేసు రిజిస్టర్ చెయ్యరు. ఇది సర్వసాధారణంగా జరిగే తంతు. దిశ ఉదంతం జరిగాక - 'ఎవరొచ్చి సమస్యను చెప్పినా కేసు రిజిస్టర్ చెయ్యండి, FIR రాయండి' - అని IGP ఆర్డర్స్ ఇవ్వవలసి వచ్చిందంటే, మరి ఇన్నేళ్ళూ ఏం జరుగుతున్నట్లు? Cr.PC  ఏం చెబుతోంది? ప్రాక్టికల్ గా ఏం జరుగుతోంది? ఇది అన్యాయం కాదా? ఇది చట్టవిరుద్ధం కాదా?

ఒక ఆడపిల్ల పోలీస్ స్టేషన్ గడప తోక్కిందంటే, ఎంతో అలవిగాని సమస్య ఉంటేగాని ఆ పని చెయ్యదు. మొగాళ్ళే పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలంటే ఒకటికి వందసార్లు ఆలోచిస్తారు. అలాంటిది ఒక అమ్మాయి అందులోనూ రాత్రిపూట స్టేషన్ కి వచ్చో, పోన్ చేసో, తన సమస్యను చెప్పిందంటే, ఎలా స్పందించాలి? దాన్ని ఎంత సీరియస్ గా తీసుకోవాలి? ఇది పోలీసులకు తెలియదా? ట్రెయినింగ్ లో నేర్పరా? ఏంటి ఇదంతా? ఎలాంటి వ్యవస్థలో మనం బ్రతుకుతున్నాం అసలు? మళ్ళీ మనది పెద్ద ప్రజాస్వామ్య దేశం అని బడాయిలు ! ఎక్కడుంది ప్రజలకు స్వామ్యం??

పోలీసుల స్నేహం అంతా రాజకీయ నాయకులు వారి తొత్తుల తోనే అనేది జగమెరిగిన సత్యం. ఏ అండా లేని సామాన్యుడికి ఇక న్యాయం ఎలా జరుగుతుంది?

అమెరికాలో 911 కి ఫోన్ చేస్తే నిమిషాలలో సహాయం అందుతుంది. ఇక్కడో? '100 కి ఫోన్ చేస్తే 100 తిప్పలు' అని అందరూ అంటున్నారంటే అర్ధం చేసుకోవాలి మనం ఎక్కడున్నామో? ఊరకే, విదేశాల సిస్టమ్స్ ని కాపీ కొట్టడం కాదు, వాటిని ఎంత సమర్ధవంతంగా అమలులో పెడుతున్నాం అనేదే ముఖ్యం. అది మాత్రం ఎక్కడా కానరాదు.

7. సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్న రాజకీయ నాయకులు

న్యాయ వ్యవస్థలోనూ, నేరాలను అరికట్టే వ్యవస్థలోనూ, రాజకీయుల జోక్యం మన దేశంలో ఎలా ఉంటుందో అందరికీ తెలిసినదే. చాలామంది నేరగాళ్ళు, ఏదో ఒక పార్టీతో సంబంధాలు కలిగి ఉంటారు. ఆయా నాయకులు వారి కొమ్ము కాస్తూ ఉంటారు. ఏదైనా కేసులో ఇరుక్కుంటే, ఆయా లీడర్ల నుంచి 'మావాడే వదిలెయ్యండి' అంటూ పోలీసులకు ఫోన్లు వస్తాయి. ఇది అందరికీ తెలిసిన నిజం. అలాంటప్పుడు నేరగాళ్లకు భయం ఎలా ఉంటుంది? ఏ నేరం చేసినా, రాజకీయ అండదండలతో తేలికగా తప్పించుకోవచ్చని వారు అనుకుంటారు. పరిస్థితి ఈ విధంగా ఉంటె, సమాజంలో నేరాలు ఎలా తగ్గుతాయి?

అన్ని కాంట్రాక్టులతొ సహా, లిక్కర్ కాంట్రాక్టులు కూడా, రాజకీయుల బినామీలకే దక్కుతాయి. సారాయిని అమ్మించేది రాజకీయ నాయకుల అనుచరులే. అధికారంలో లేనప్పుడు 'లిక్కర్ బ్యాన్ చెయ్యాలి' అంటూ అరుస్తారు. అధికారం లోకి వచ్చాక మౌనం వహిస్తారు. అప్పుడు దిగిపోయినవాళ్ళు అరుస్తుంటారు. ఇదొక డ్రామా ! ఇక నేరాలు తగ్గమంటే ఎలా తగ్గుతాయి?

'చట్టాలు చేసినంత మాతాన నేరాలు తగ్గవు, లిక్కర్ బ్యాన్ చేసినంత మాత్రాన నేరాలు తగ్గవు, ప్రజలలో మార్పు రావాలి' - అని నిన్న నాయకులందరూ పార్లమెంట్ లో తెగ మాట్లాడారు. ప్రజలలో మార్పు అంటే ఏంటో? అంటే, తెల్లారేసరికి అందరూ బుద్ధ భగవానులు అయిపోవాలా? చుట్టూ తాగుడూ, తందనాలూ, జూదగృహాలూ, వ్యభిచార గృహాలూ, సమాజంలో అవినీతీ అన్నింటినీ మీరు పెంచి పోషిస్తూ - 'ప్రజలలో మార్పు రావాలి' - అంటే ఎలా వస్తుంది? ఎక్కడనుంచి వొస్తుంది? అదేమన్నా తోకచుక్కా పైనుంచి రాలి మీద పడటానికి?

నేర ప్రపంచాన్ని రాజకీయ నాయకులు ఇన్ డైరెక్ట్ గా పోషిస్తూ ఉన్నంత కాలం మన సమాజంలో నేరాలు ఆగనుగాక ఆగవు. ఇది పచ్చి నిజం !

8. కొత్త చట్టాలు అవసరమా?

నేరం జరిగిన ప్రతిసారీ ఒక కొత్త చట్టం కావాలని చట్టసభలలో ఊదరగొడుతూ ఉంటారు నాయకులు. కావలసింది కొత్తచట్టాలు కావు. ఉన్న చట్టాలను సరిగ్గా వాడితే చాలు ! ఆ ప్రక్రియలో రాజకీయులు జోక్యం చేసుకోకుండా ఉంటె చాలు. అది మాత్రం ఎవరూ చెయ్యరు.

పదేళ్ళక్రితం ఘోరమైన నేరం చేసిన వాడికి కూడా ఈనాటికీ ఉరి పడకపోతే, కొత్తగా నేరాలు చేసేవాళ్ళు ఎందుకు భయపడతారు? 'మనం ఏం చేసినా పర్లేదు లేరా, ఉరిశిక్ష వెయ్యరు. మహా అయితే జైలుశిక్ష వేస్తారు. జైల్లో మనల్ని బాగా చూసుకుంటారు. భోజనం బాగా పెడతారు. బయట కంటే లోపలే బాగుంటుంది. ప్రాణం తియ్యరు కదా! కనుక మనం ఏ నేరమైనా చెయ్యొచ్చు. తప్పించుకోవచ్చు' అనుకునే క్రిమినల్స్ చాలామంది సమాజంలో ఉన్నారు.

అరేబియా దేశాలలో ఇస్లామిక్ షరియా అమలులో ఉంది. ఇలాంటి నేరాలు చేస్తే అక్కడ భయంకరమైన శిక్షలు వెంటనే పడతాయి. జనమందరూ కలసి నేరస్తులను రాళ్ళతో కొట్టి చంపేస్తారు. లేదా కాళ్ళూ చేతులూ నరికేస్తారు. లేదా కళ్ళు పెరికేస్తారు. నాలుగురోడ్ల కూడలిలో ఉరితీస్తారు. ఈ శిక్షలు చాలా త్వరగా అమలౌతాయి. రెండోసారి అలాంటి నేరాలు చెయ్యాలంటే ప్రజలు భయపడతారు. మరి మన దేశంలో పరిస్థితి ఎలా ఉంది? ఇరవై ఏళ్ళ క్రితం నేరం చేసినవాడికి కూడా నేటికీ శిక్షలు లేవు. ఆయేషా బేగం కేసు ఏమైంది? నేటికీ తేలలేదు. అంతకు ముందు ఇంకో కేసు ఏమైంది? అంతకు ముందు ఇంకో కేసు ఏమైంది? ఏవీ తేలవు. వేటికీ శిక్షలు పడవు. నేరాలు తగ్గమంటే, ఎందుకు తగ్గుతాయి?

పొత్తిళ్ళలో పసిపిల్లను ఎత్తుకెళ్ళి రేప్ చేసిన మానవజంతువుకు కూడా నేటికీ ఉరిశిక్ష పడలేదు. ఇంకేంటి మన న్యాయవ్యవస్థ పనితీరు?? సిగ్గుండాలి మాట్లాడుకోవడానికి??

9. సినిమాల ప్రభావం

ఈ మధ్యన ఒక కొత్త ట్రెండ్ కనిపిస్తోంది. ఏదైనా నేరం జరగగానే, సినిమా వాళ్ళు వచ్చేసి టీవీలలో తెగ మొసలికన్నీరు కురిపిస్తున్నారు. సమాజానికి మెసేజీలు గుప్పిస్తున్నారు. ఇదొక విచిత్రం ! అదే సినిమా హీరోలూ హీరోయిన్లూ ఒక్కసారి వెనక్కు తిరిగి వాళ్ళు డాన్సులు చేసిన ఐటెం సాంగ్స్, ఆ పాటల్లో టూ పీస్ దుస్తుల్లో డాన్సర్లు వేసిన జుగుప్సాకరమైన నడుము ఊపే స్టెప్పులూ ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. ఆయా పాటల్లో వాడిన అసభ్యమైన భాషను గుర్తు తెచ్చుకోవాలి. ఆడదాన్ని వాడిపారేసే వస్తువుగా చూపిస్తున్న సినిమా సంస్కృతిని గుర్తు తెచ్చుకోవాలి.

వీళ్ళా మనకు నీతులు చెప్పేది? ఒకవైపు అసభ్యతనూ, అశ్లీలతనూ ప్రోత్సహిస్తున్నది వీళ్ళే. మళ్ళీ సమాజానికి నీతి సూత్రాలు చెబుతున్నదీ వీళ్ళే. ఏంటీ మాయ? వీళ్ళ వేషాలు నమ్మడానికి మనం వెర్రివాళ్ళమా?

టీనేజి కుర్రకారుమీద ఈ అసభ్య సినిమాపాటలు, డాన్సుల ప్రభావం ఎలా ఉంటుందో నేను వివరించనక్కరలేదు. అందరూ కలసి కూచుని త్రాగుతూ ఉంటె, మధ్యలో ఒక టూ పీస్ అమ్మాయి, చుట్టూ తనలాంటి ఒక ఇరవైమంది అమ్మాయిలతో ఎగురుతూ రెచ్చగొట్టే ఐటెం సాంగ్స్ ఎన్నున్నాయి మన సినిమాల్లో? ఈ పాటలన్నీ ఏం సందేశాన్ని ఇస్తున్నాయి కుర్రకారుకి? ఊరకే, తెరమీద ఒక మూలకి, smoking is injurious to health, Consumption of liquor is injurious to health అంటూ కనిపించీ కన్పించని అక్షరాలు కొద్ది సెకండ్లు కనిపిస్తే సరిపోతుందా? ఆ పాటలు, డాన్సులు చేసే మానసిక డామేజిని ఈ సందేశాలు నివారించగలవా? వీటిని అదుపులో పెట్టాల్సిన వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? నిద్రపోతున్నాయా?

నిలువెత్తు వాల్ పోస్టర్లలో, కటౌట్లలో, రకరకాల కామసూత్ర భంగిమలలో ఉన్న హీరో హీరోయిన్లు రోడ్లమీద ఎక్కడ చూసినా కనిపిస్తారు. లేకపోతే బికినీలోనో, చెడ్డీలోనో విలాసంగా నడిచిపోతూ ఒళ్ళు మొత్తం 70mm లో చూపిస్తున్న హీరోయిన్, దాన్ని నోరెళ్ళబెట్టి చూస్తున్న హీరో - ఇలాంటి దృశ్యాలు ఎక్కడబడితే అక్కడ కనిపిస్తున్నాయి. ఇవి సరియైన పోకడలేనా? ఇవన్నీ ఎలాంటి భావోద్రేకాలని రేకెత్తిస్తాయి మనుషులలో? అరికట్టాల్సిన బాధ్యత మనకు లేదా? డబ్బు సంపాదించాలంటే బ్లూ ఫిలిమ్స్ తియ్యడం ఒక్కటే మార్గమా? ఇక వేరే మార్గాలు లేవా?

10. Internet, Youtube ప్రభావం

నెట్లో ఒక పోర్న్ వీడియో చూడాలంటే ఇప్పుడు మంచినీళ్ళు త్రాగినంత సులభం. చిన్నచిన్న పిల్లలు కూడా వాటిని చూస్తున్నారు. 'ఏడేళ్ళ పిల్లవాడు, నాలుగేళ్ల పిల్లని రేప్ చెయ్యాలని ప్రయత్నం చేశాడు' అని వార్తలు చూస్తుంటే నోట మాటరాని పరిస్థితి ఉంటోంది. పైగా ఆ సీన్ ని వీడియో తీసిన అతని ఫ్రెండ్స్ అట ! మళ్ళీ వాళ్ళందరూ కూడా పదేళ్ళలోపు పిల్లలే. ఇదీ మన ప్రస్తుత సమాజపు తీరు !! ఈ పిల్లలందరూ పెద్దయ్యాక ఏమౌతారు? క్రిమినల్స్ అవుతారా లేక సాధువులు అవుతారా? మీరే చెప్పండి ! 

లారీ డ్రైవర్లూ, క్లీనర్లూ కలసి, హైవే పక్కన విచ్చలవిడిగా దొరికే మద్యం తాగుతూ, ఇలాంటి వీడియోలు చూస్తూ, అలాంటి సినిమాల ఐటెం సాంగ్స్ చూస్తూ, పోలీసులకు మామూళ్ళు ఇస్తూ, వాళ్ళు తీసుకుంటూ, న్యాయవ్యవస్థ అంటే భయం లేకుండా ఉంటూ ఉంటే, రౌడీయిజమే హీరోయిజం అవుతూ ఉంటే, రాజకీయులూ, పోలీసులూ ఈ పోకడలను ఇన్ డైరెక్ట్ గా ప్రోత్సహిస్తూ ఉంటే, ఎలాంటి సంఘటనలు జరుగుతాయి మరి?

11. స్కూళ్ళలో నేర్పే కరాటే కుంఫూలు పనికొస్తాయా?

పనికిరావని నిర్భయ ఉదంతం జరిగినప్పుడే రాశాను. ఇవి ఫాన్సీగా నేర్చుకునేవే గాని ప్రాక్టికల్ గా ఎందుకూ పనికిరావు. అసలు ఆడపిల్లకు కావలసింది కరాటే కుంఫూ కాదు. అతిమంచితనం పనికిరాదు, మెతకదనం పనికిరాదు, చుట్టూ ఏం జరుగుతోందో గమనిస్తూ ఉండాలి, ఎలాంటి పరిస్థితిలో తాను ఉన్నానో అంచనా వెయ్యగలిగే మానసికస్థితి ఉండాలి, తననెవరు ఫాలో అవుతున్నారో గమనిస్తూ ఉండాలి, ప్రమాదంలో పడుతున్నాను అనిపించినప్పుడు ఎవరికి ఫోన్ చెయ్యాలి? ఏయే నంబర్లకు SOS మెసేజి ఇవ్వాలి? ఆ ప్రమాదం నుంచి ఎలా తప్పుకొని సేఫ్ ప్లేస్ కు వెళ్ళాలి? అన్న విషయాలు తెలియాలి. ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలియాలి. ఏయే సమయాలలో ఏయే ప్రదేశాలకు వెళ్ళకూడదో తెలియాలి. ఒకవేళ తప్పక వెళ్ళవలసి వస్తే, ముందు జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి? ఏయే యాప్ లు తన ఫోన్లో ఉండాలి. వాటిని ఎలా వాడాలి, ఆయా మనుషులతో ఎలా డీల్ చెయ్యాలి మొదలైన విషయాలన్నీ తెలిసి ఉండాలి. అంతేగాని, పనికిరాని కరాటే కుంఫూలు నేర్చుకుని ఉపయోగం లేదు.

ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నైనా రాసుకోవచ్చు. కానీ సారాంశం ఒక్కటే. అశ్లీలతని, చెడుని మనమే పెంచుతున్నాం, మళ్ళీ ఏదైనా ఘోరం జరిగినప్పుడు మనమే గగ్గోలు పెడుతున్నాం. కానీ నిర్మాణాత్మక చర్యలు ఏవీ చేపట్టవలసిన స్థాయిలో చేపట్టడం లేదు. అందుకే ఈ నిర్భయలు, ప్రియాంకలు, మానసలలను మనం చూస్తున్నాం. మన విలువలు లేని తనానికి, మన నీతిరాహిత్యానికి, మన హిపోక్రసీకి బలైపోయిన సమిధలు వీళ్ళంతా !

వీరి బలికి ఎవరిదీ బాధ్యత? ఆ నేరాలు చేసిన వాళ్ళదేనా? మనకు లేదా బాధ్యత? సమాజాన్ని ఇంత దరిద్రంగా నిర్మించుకుంటూ, చెడగొట్టుకుంటూ, మళ్ళీ గోలగోలగా తప్పు మీదంటే మీదని అరుచుకుంటూ, ఒక నిర్మాణాత్మక వైఖరి లేకుండా, మళ్ళీ రేపు ఇంకొక క్రొత్త న్యూసు కోసం ఎదురుచూచే మనలాంటి అసమర్ధ నీచపు మనుషులు ఉన్న సమాజంలో ఇలాంటివి గాక ఇంకెలాంటి సంఘటనలు జరుగుతాయని ఆశించగలం?

అందరూ సుఖంగా హాయిగా ఉండే నేరరహిత సమాజంలో బ్రతికే అర్హత మనలాంటి మనుషులకు ఉందా? మీరే చెప్పండి ! మళ్ళీ కొన్నాళ్ళకు ఇంకో అమ్మాయి ఇలాగే బలి కాకుండా ఉంటుందని ఎవరైనా గ్యారంటీ ఇవ్వగలరా? నాకైతే నమ్మకం లేదు !!