“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

23, నవంబర్ 2017, గురువారం

కలబురిగి కబుర్లు - 2

కలబుర్గి అంటే రాతిబురుజు అని అర్ధం. ఆ ఊళ్ళో బహమనీ సుల్తానుల కోట ఉంది. అందుకని ఆ పేరు వచ్చిందో ఏమో తెలీదు. ఇదంతా ఒకప్పుడు సుల్తానుల ఆధీనంలో ఉన్న ప్రాంతం. చాలాకాలం పాటు ఇది హైదరాబాద్ నిజాం అధీనంలో కూడా ఉంది. అందుకే ఇక్కడ తెలుగు వాళ్ళు ఎక్కువ. చాలామంది హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన వాళ్ళున్నారు. ఇది హైద్రాబాద్ కు బాగా దగ్గర కావడంతో చదువుకోడానికి చాలామంది తెలుగువాళ్ళు ఇక్కడికి వస్తుంటారు.

ఇక్కడకు వచ్చిన రెండో రోజే లోకల్ న్యూస్ చూద్దామని పేపర్ తీస్తే ఒక విచిత్రమైన వార్త కనిపించింది. అదేమంటే - మేం హిందువులం కాము. మాకు ప్రత్యేక హోదా ఇవ్వాలి అని లింగాయత్ కమ్యూనిటీ వాళ్ళు గొడవ చేస్తున్నారు. విషయం కోర్టు దాకా వెళ్ళింది. ఇది నాకు భలే విచిత్రం అనిపించింది. శివుడిని పూజించే లింగాయతులు హిందువులు కాకుండా ఎలా పోతారు?

అసలు లింగాయత మతం, అనేది ( అసలంటూ అదొక ప్రత్యెక మతం అయితే?) మొదలైనదే బసవేశ్వరుడినుంచి. బసవన్నది చాలా విషాద గాధ.

మనం సమాజంలో కులవ్యవస్థను లేకుండా చెయ్యాలని ప్రయత్నించిన వాళ్ళు ప్రాచీనకాలం నుంచీ కొందరున్నారు. వారిలో మొదటి వాడు బుద్ధుడు. ఆ తర్వాతివాడు బసవన్న. బుద్ధుడు క్షత్రియుడు. బసవన్న బ్రాహ్మణుడు. వీరిద్దరూ అగ్రవర్ణాలకు చెందినవారే. వీరి తర్వాత అంబేద్కర్ ప్రయత్నించాడు. బుద్ధునికీ బసవన్నకూ 1700 సంవత్సరాల కాలవ్యవధి ఉంది. బసవన్నకూ అంబేద్కర్ కూ 800 సంవత్సరాల తేడా ఉంది.

అయితే వీళ్ళలో తేడాలున్నాయి. బుద్ధుడు జ్ఞానానికి ప్రాధాన్యత ఇచ్చాడు. ఆ మార్గంలో నడిస్తే మనిషి కులానికి అతీతుడౌతాడని అన్నాడు. అది నిజమే. ఆ మార్గంలో నడిచి జ్ఞానులైనవాళ్ళు ఎందఱో ఉన్నారు. బసవన్నేమో శివభక్తికి ప్రాధాన్యతనిచ్చాడు. లింగాన్ని మెడలో ధరించి కొన్ని నియమాలు పాటిస్తూ, శివజ్ఞానాన్ని పొంది జీవితాన్ని గడిపితే కులానికి అతీతంగా పోవచ్చని ఆయనన్నాడు. ఇదీ నిజమే. ఇది భక్తిమార్గం. క్రమేణా వీరందరూ లింగాయతులు (లింగధారులు) అని ఒక ప్రత్యెకమైన జాతిగా తయారయ్యారు. కానీ వీరు మతప్రాతిపదికన కులాన్ని దాటాలని ప్రయత్నించారు. అంబేద్కరేమో, మతంతో సంబంధం లేకుండా, సమాజంలోనుంచి కులమనేది అదృశ్యం కావాలని భావించాడు.

విచిత్రమేమంటే వీరిలో ఎవరి స్వప్నమూ నిజం కాలేదు. నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం - ఎప్పటికీ కాబోదు కూడా. మనిషి ఆధ్యాత్మికంగా ఎదిగి కులానికి అతీతుడు కావచ్చు. మనిషి దైవత్వాన్ని అందుకుంటే కులమతాలకు అతను అతీతుడౌతాడు. కానీ సామాజికంగా కులం అదృశ్యం కావడం అనేది జరగదు. అది ఆచరణాత్మకం కూడా కాదు.

వ్యక్తిగతంగా మనిషి కులానికి అతీతుడు కావచ్చు. కానీ సమాజం మొత్తం ఒకేసారి అలా కావడం జరగదు. ముఖ్యంగా మన భారతీయ సమాజంలోనుంచి కులం అదృశ్యం కావడం ఎన్నటికీ జరగని పని.అసలు బర్త్ సర్టిఫికేట్ లోనే కులం అన్న కాలమ్ ఉన్నప్పుడు కులం ఎలా పోతుంది? ఎక్కడికి పోతుంది? ఒకవేళ ఆ సర్టిఫికేట్ లోనుంచి దాన్ని తీసేసినా మనుషుల మనసులలోనుంచి ఎలా పోతుంది?  పైగా, కులం వల్ల ఇప్పుడు అనేక లాభాలు ఒనగూడుతున్నప్పుడు అదెలా పోతుంది? అది జరిగే పని కాదు.

కులం లేని విదేశాలలో కూడా రంగు ఉంది. రేసిజం అనేది రంగును బట్టే ఉంటుంది. పోనీ ఒకే రంగు ఉన్న జాతులలో కూడా మళ్ళీ వారిలో వారికే అనేక విభేదాలున్నాయి. ఫిజికల్ ఫీచర్స్ లో తేడాలనేవి మనుషులలో ఎప్పటికీ ఉంటూనే ఉంటాయి. కనుక విభేదాలనేవి ఎప్పటికీ మానవజాతినుంచి అదృశ్యం కావు. కులం కాకపోతే రంగు, రంగు కాకపోతే జాతి, జాతి కాకపోతే దేశం, దేశం కాకపోతే మతం, అది కాకపోతే ఇంకోటి - ఈ రకంగా అవి ఎప్పటికీ ఉంటూనే ఉంటాయి. మానవసమాజంలో గ్రూపులనేవి ఏదో ఒక రకంగా ఉంటూనే ఉంటాయి. ఇది ప్రకృతి నియమం.

ఆ విషయాన్ని అలా ఉంచి, బసవన్న గురించి కొంత ఆలోచిద్దాం.

ఈ బసవన్న 12 శతాబ్దంలో వాడు. కన్నడ దేశంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు. ఈయన నందీశ్వరుని వరప్రసాది అని భావిస్తారు. అలాంటి సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినా కూడా, చిన్నప్పటి నుంచీ కులవ్యవస్థ అంటే ఈయనకు రుచించేది కాదు. ఉపనయన సమయంలో జంధ్యాన్ని తెంచేసి, ఇంట్లోనుంచి పారిపోయి, ఒక పాశుపతశాఖకు చెందిన శైవగురువు దగ్గర శిష్యునిగా చేరిపోయాడు.

పాశుపత మతానికి మూలాలు వేదాలలోనే ఉన్నాయి. మనుషులందరూ కామం, క్రోధం, భయం, గర్వం మొదలైన పాశాలతో బంధింపబడి ఉన్నారు గనుక వీరందరూ పశువులనీ, దేవుడు వీటికి అతీతుడు గనుక ఆయన పశుపతి అనీ ఆయనే శివుడనీ వీళ్ళు భావిస్తారు. పన్నెండేళ్ళు అదే ఆశ్రమంలో ఉండి ఆ ఫిలాసఫీ బాగా చదివి జీర్ణించుకున్నాడు. ఆ తర్వాత బిజ్జలుడనే ఆ దేశపు రాజు దగ్గర గణకుడిగా (ఎకౌంటెంట్) ఒక ఉద్యోగంలో చేరాడు. ఆ తర్వాత తన మేనమామ అయిన మంత్రి చనిపోతే, ఆ స్థానంలో మంత్రి అయ్యాడు. మంత్రిపదవి ఆయనకు రావడానికి వెనుక ఉన్న కధను ఇప్పటికీ కన్నడదేశంలో చెప్పుకుంటారు.

బిజ్జలుడు పశ్చిమ చాళుక్యరాజులకు ఒక సామంతరాజు. వీరిని కల్యాణి చాళుక్యులని కూడా అనేవారు. తన ప్రభువైన విక్రమాదిత్యుడు చనిపోయాక స్వతంత్రం ప్రకటించుకుని కొన్ని కోటలను జయించాడు. ఆ కోటల్లో ఒకచోట ఒక రాగిరేకు దొరికింది. ఆ రాగి రేకుమీద ఏదో అర్ధంకాని కోడ్ భాషలో ఏదో వ్రాసి ఉంది. దాన్ని ఎవరూ డీకోడ్ చెయ్యలేకపోగా, బసవన్న దాన్ని చదివి వివరించి చెప్పాడు. అది ఒక నిధికి మ్యాప్. దానిలో ఉన్న గుర్తుల ప్రకారం కోటలో త్రవ్వించగా కోట్లాది బంగారు నాణాలతో కూడిన పెద్దనిధి ఒకటి దొరికింది. దాన్ని డీకోడ్ చేసినందుకు కృతజ్ఞతగా బసవన్నను తన మంత్రిగా పెట్టుకున్నాడు బిజ్జలుడు. అంతేగాక తన చెల్లెల్నిచ్చి పెళ్లి కూడా చేశాడు.

అంతకు ముందే తన మేనమామ అయిన మంత్రి కూతుర్ని (తన మరదల్ని) చేసుకుని ఉన్నాడు బసవన్న. రాజు చెల్లెలూ మంత్రి కూతురూ చిన్నప్పటి నుంచీ స్నేహితులుగా పెరిగారు. ఇద్దరూ ఒకర్ని విడిచి ఒకరు ఉండలేరు. ఇద్దరూ ఒకరినే పెళ్లి చేసుకుందామని ఒప్పందం కూడా చేసుకుని ఉన్నారు. కనుక ఇద్దరినీ బసవన్నే పెళ్లి చేసుకున్నాడు.

మంత్రి అయిన తర్వాత బసవన్న తన కులరహిత సమాజ ఎజెండాను ప్రచారం చెయ్యడం మొదలుపెట్టాడు. 'అనుభవ మంటపం' అని ఒక పార్లమెంట్ లాంటిదాన్ని కట్టించి, అందులో సాధువులనూ సిద్దులనూ పోగేసి చర్చలు చెయ్యడం సాగించాడు. కులవ్యవస్థను ధిక్కరించడం మొదలుపెట్టాడు. మంత్రిగారే అలా ఉంటె ఇక సమాజం ఎలా ఉంటుంది? నిమ్నకులాల వారికి ఆయన ఒక దేవునిలా కనిపించాడు. వారందరూ ఆయన చుట్టూ చేరి ఒక ప్రవక్తగా ఆయన్ను కొలవడం ప్రారంభించారు. అతి త్వరలో ఆయన పాపులారిటీ రాజును మించిపోయింది.

ఈయన అనుచరుల్లో నిమ్న కులాలకు చెందినవారు ఎందఱో ఉన్నారు. వారందరూ లింగధారులుగా మారారు. వారికి కులం లేదు. లింగాయతమే వారి కులం, అదే వారి మతం. వారు దేవాలయాలకు వెళ్ళరు. పూజలు చెయ్యరు. ఆచారాలు పాటించరు. శివభక్తి ఒక్కటే వారి మతం. ఇష్టలింగం అనే ఒక లింగాన్ని రుద్రాక్ష దండలో వేసి మెడలో ధరిస్తారు. పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తారు. వారికి పూజారులు, పురోహితులు అవసరం లేదు. తంతులు పాటించరు. శివుడిని డైరెక్ట్ గా ధ్యానిస్తారు. ఉపాసన, ధ్యానం, జ్ఞానం, శివైక్యం - ఇదే వారి దారి.

అనుభవ మంటపంలో గురువు అల్లమప్రభు. ఈయన మహా శివభక్తుడు. ఈయన దేవాలయంలో డోలు వాయించే వృత్తికి (బహుశా మంగలి కావచ్చు) చెందినవాడు. ఒక నర్తకిని పెళ్లి చేసుకున్నాడు. ఆమె చనిపోగా ఈయన వైరాగ్యపూరితుడై కొండల్లో కోనల్లో తిరుగుతూ ఒక గుహలో ఒక సిద్ధయోగిని కలిసి ఆయన శిష్యుడై సాధన గావించి జ్ఞానాన్ని పొందాడు. అనుభవ మంటపంలోనే అక్కమహాదేవి కూడా ఉండేది. మాలకక్కయ్య, మాదిగ హరలయ్య, మడివాల మచ్చయ్య (జాలరి), హడపాద అప్పన్న (మంగలి), మాదర చెన్నయ్య (మాదిగ), నూళియ చందయ్య (పద్మసాలి), అంబిగర చౌడయ్య (పడవ నడిపే కులం)  మొదలైన శివభక్తులు కూడా అందులోనే మహామంత్రి అయిన బసవన్నతో సమానంగా ఆసీనులయ్యేవారు. బసవన్న స్వయంగా అల్లమప్రభు పాదాలవద్ద కూచునేవాడు. ఆ మంటపంలో అసలైన, నిజమైన, ఆధ్యాత్మిక చర్చలు జోరుగా సాగేవి. ఉత్త చర్చలతో కాలం గడపడం కాకుండా వారందరూ ఉన్నతమైన ఆశయాలతో కూడిన ఆధ్యాత్మిక జీవితాలను గడిపేవారు. కలసి మెలసి కులాలకు అతీతంగా ఉండేవారు.

ఈ విధంగా అనుభవ మంటపంలో కులాన్ని రూపుమాపాడు బసవన్న. ఈయన అనేక చిన్న చిన్న పద్యాలలో తన భావాలను చెప్పాడు. వాటిని 'వచనాలు' అంటారు. ఆయనే గాక అల్లమప్రభు, అక్కమహాదేవి వంటి మిగతా శివభక్తులు కూడా 'వచనాలు' చెప్పారు. అవి అర్ధగాంభీర్యంలో గాని, సత్యప్రకటనలో గాని చాలా అద్భుతంగా ఉంటాయి. అవన్నీ ఆధ్యాత్మికంగా సత్యాలే. అయితే, వాటన్నిటినీ ఒకేసారిగా సమాజం మొత్తానికీ అప్లై చేసి సమాజం మొత్తాన్నీ ఏకమూలంగా మార్చి పారేయ్యలన్న వీరి ప్రయత్నమే బెడిసికొట్టింది. 

ఇదిలా ఉండగా, శీలవంతుడనే పేరుగల మాదిగ హరలయ్య కొడుకుతో, తన శిష్యుడైన మధువరసు అనే బ్రాహ్మణుని కూతురైన కళావతికి దగ్గరుండి వివాహం చేయించాడు బసవన్న. వెయ్యి సంవత్సరాల క్రితం సమాజంలో ఇదెంత సాహసోపేతమైన చర్యో అర్ధం చేసుకోవచ్చు. ఈ సంఘటన అగ్రవర్ణాలకు చాలా కోపాన్ని తెప్పించింది. వారంతా కలసి మూకుమ్మడిగా బిజ్జలుడికి ఫిర్యాదు చేశారు. సమాజం పూర్తిగా భ్రష్టు పట్టిందనీ, కులవ్యవస్థ బీటలు వారిందనీ, దీనికంతా మంత్రిగారే కారకుడనీ, అందువల్ల రాజు వెంటనే జోక్యం చేసుకోకపోతే రాజ్యం అల్లకల్లోలం అవ్వబోతున్నదనీ, విప్లవం రాబోతున్నదనీ రాజుకు బాగా ఎక్కించారు. రాజును దించేసి బసవన్నే రాజయ్యే ప్రయత్నాలు చేస్తున్నాడని కూడా ఆయనకు బాగా నూరిపోశారు. 

అప్పటికే బసవన్న చేస్తున్న పనులను రాజు వేగులద్వారా చాలాసార్లు విని ఉన్నాడు. కానీ బసవన్న తన బావమరిది గనుక, చెల్లెలి ముఖం చూచి వెంటనే చర్య తీసుకోలేక, ఊరుకునేవాడు. కానీ బసవన్న ఆగడాలు రోజురోజుకూ ఎక్కువైపోతున్నాయి. సమాజమే కుప్పకూలే పరిస్థితి వచ్చేస్తున్నది. ఇలాంటి కుట్ర జరుగుతుంటే ఏ రాజు చూస్తూ ఊరుకుంటాడు? కోపోద్రిక్తుడైన రాజు, మంత్రి బసవన్నను పిలిచి మంత్రిపదవికి వెంటనే రాజీనామా ఇవ్వమని ఆదేశించాడు. బసవన్న అలాగే చేశాడు. తన కిరీటాన్ని తీసి రాజు పాదాల వద్ద ఉంచి ఒక సామాన్యునిగా సమాజంలోకి వెళ్ళిపోయాడు. అంతేగాని తన సిద్ధాంతాలు వదులుకోలేదు.

బిజ్జలుడు అంతటితో ఊరుకోలేదు. ఆ తర్వాత, తమ పిల్లలకు అలాంటి కులాంతర వివాహం చేసినందుకు హరలయ్యకూ, మధువరసుకూ కళ్ళు పీకించి వారిని మదపుటేనుగు కాళ్ళకు గొలుసులతో కట్టించి ఆ ఏనుగును కల్యాణి నగరపు వీధుల్లో పరిగెత్తించాడు. ఒళ్లంతా రక్తగాయాలై తలలు పగిలి వారిద్దరూ చనిపోయారు. కల్యాణి నగరపు వీధులు వారి రక్తంతో తడిశాయి. ఎదురు తిరిగిన లింగాయతులను ఎక్కడికక్కడ క్రూరంగా అణచి వెయ్యమని సైన్యాన్ని ఆదేశించాడు రాజు.

రాజ్యంలో విప్లవం రేగింది. ప్రజలు సైన్యానికీ రాజుకూ ఎదురు తిరిగారు. ఆ గొడవల్లో చాలామంది ప్రజల ప్రాణాలు పోయాయి. ఆడవాళ్ళు కూడా ఈ సివిల్ వార్ లో పాల్గొన్నారు. లింగాయతులలో కొంతమంది యుద్ధవిద్యా నిపుణులున్నారు. వారంతా కలసి సమయం కోసం వేచి చూచి, ఒకరోజున రాజు ఒంటరిగా ఉన్నప్పుడు గెరిల్లా పద్ధతిలో ఎటాక్ చేసి బిజ్జలుడిని చంపేశారు. ఆ విధంగా హరలయ్య మధువరసుల హత్యలకు వారు ప్రతీకారం తీర్చుకున్నారు. బిజ్జలుని కథ అలా విషాదంగా ముగిసింది.

ఇదంతా చూచి బసవన్నకు మహా విరక్తి కలిగింది. "తను ఆశించినదేమిటి? జరిగినదేమిటి? కులానికి అతీతంగా ఒక ఉన్నతమైన ఆధ్యాత్మిక ఆశయాలతో కూడిన సమాజాన్ని నిర్మిద్దామని తను ఊహిస్తే, అది ఒక విప్లవంగా మారి రాజ్యాన్నే అల్లకల్లోలం చేసింది. రాజు హత్యకు కారణమైంది. రాజు తన బావగారు కూడా. రాజు భార్యకూ, తన భార్యకూ తనేం సమాధానం చెప్పాలి? తన అనుచరులైన హరలయ్యకూ, మధువరసుకూ కూడా భయంకరమైన మరణం ప్రాప్తించింది. వారి కుటుంబమూ తన కుటుంబమూ మొత్తం చిన్నాభిన్నం అయిపోయాయి. ఇంకా ఎందఱో తన శిష్యులు సైన్యంతో జరిగిన గొడవల్లో చనిపోయారు. బహుశా తన ఊహ తప్పేమో? తను చాలా తొందరపడ్డాడేమో? అలాంటి ఉన్నతమైన సమాజవ్యవస్థను అప్పుడే ఊహించడం తన తప్పేమో? ఇలాంటి సమాజం రావడానికి ఇంకా కొన్నివేల ఏళ్ళు పట్టవచ్చేమో? ఏదేమైనా ఇందరి చావులకు తనే కారణం అయ్యాడు కదా?" అన్న పశ్చాత్తాపం ఆయనలో తీవ్రంగా తలెత్తింది. 

ఆ మనోవ్యధను తట్టుకోలేక, కూడలసంగమ క్షేత్రంలో ఉన్న తన గురువు ఆశ్రమానికి వెళ్లి, తిండి మాసేసి, కఠోర ఉపవాసదీక్షలో ఉంటూ ఒక ఏడాది తర్వాత అక్కడే చనిపోయాడు. అప్పటికి అతనికి 35 ఏళ్ళు మాత్రమే. అక్కడ కృష్ణానదిలోకి దూకి అతను ఆత్మహత్య చేసుకున్నాడని కొందరు అంటారు. కాదు, హత్య చెయ్యబడ్డాడని కొందరు అంటారు. నిజానిజాలు ఎవరికీ తెలీదు. ఆ తర్వాత అతని ఇద్దరు భార్యలూ కూడా విషాదకర పరిస్థితులలోనే చనిపోయారు. ఏదేమైనా బసవన్న కధ ఆ విధంగా విషాదాంతం అయింది. ఇదంతా క్రీ.శ.1100 ప్రాంతంలో జరిగింది.

కానీ, ఆయన ఆశించిన కులరహిత సమాజం మాత్రం ఇంతవరకూ మన దేశంలో రాలేదు. ఇకముందు వస్తుందని కూడా భరోసా లేదు.

ఇదిలా ఉంటే, కాలక్రమేణా, ఆయన అనుచరులైన లింగాయతులు కన్నడదేశంలో తామరతంపరలుగా వృద్ధి చెందారు. ఇప్పుడు కర్ణాటకలో వారొక బలమైన రాజకీయశక్తిగా ఉన్నారు. అక్కడి ముఖ్యమంత్రులలో చాలామంది లింగాయతులే. ఇప్పుడు వాళ్ళందరూ కలసి ఒక కొత్తపాట మొదలు పెట్టారు. అదేమంటే - మేం హిందువులం కాము. మాది హిందూమతం కాదు. కనుక మాకు ప్రత్యేక మైనారిటీ స్టేటస్ ఇవ్వాలి - అని.

పేపర్లో వీళ్ళ గోల చదువుతుంటే నాకు నవ్వాలో ఏడవాలో ఇంకేదైనా చెయ్యాలో ఏమీ అర్ధం కాలేదు. హిందూ సమాజంలో వీరిది ఒక సంస్కరణోద్యమం. అంతే. అంత మాత్రం చేత వీరు హిందువులు కాకుండా ఎలా పోతారు? గతంలో సిక్కులు కూడా ఇలాగే మాది హిందూమతం కాదన్నారు. శిక్కు అనే పదానికే శిష్యుడు అని అర్ధం. వారి ఫిలాసఫీ అంతా హిందూత్వమే. కొన్నికొన్ని ఇస్లాం నుంచి కూడా వారు స్వీకరించి ఉండవచ్చుగాక. కానీ ఆ ఇస్లాం కూడా హిందూమతంలోని ఒక శాఖ మాత్రమే. ఏకేశ్వర వాదం హిందూమతంలో కూడా ఉంది. హిందూమతంలో లేనిది ఏ మతంలోనూ ఎక్కడా లేదు. ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచంలోని అన్ని మతాలూ హిందూమతపు విభిన్న శాఖలే.

లింగాయతులు, మాది ప్రత్యేక కులం అంటున్నారు. కానీ కులవ్యవస్థకు వారి మూలపురుషుడైన బసవన్న వ్యతిరేకం అన్నమాటను వారు మర్చిపోతున్నారు. ఈ ఉద్యమంలోనే ఆయన కుటుంబం మొత్తం వెయ్యేళ్ళ క్రితమే సర్వనాశనం అయింది. ఆ విషయాన్ని వాళ్ళు మర్చిపోతున్నారు. ఇదెలా ఉందంటే - భూస్వామి వ్యవస్థకు వ్యతిరేకంగా పుట్టిన కమ్యూనిజం అధికారంలోకి వచ్చాక అదొక నయా భూస్వామి వ్యవస్థగా రూపుదిద్దుకున్నట్లుగా ఉంది. 

కులానికి వ్యతిరేకంగా పుట్టిన ఒక సామాజిక ఉద్యమ కార్యకర్తలు తామే ఒక ప్రత్యేక కులంగా మారడం చూస్తుంటే ఏమనిపిస్తోంది? మన దేశంలో కులం అనేది మాయం కావడం అసంభవం అన్న నా మాట నిజం అనిపించడం లేదూ?

బసవన్న మీద కన్నడంలో వచ్చిన రెండు సినిమాలను ఇక్కడ యూట్యూబులో చూడండి.

Jagajyothi Basaveshwara 1959 Movie

https://www.youtube.com/watch?v=B6wHMFAKe8k

Kranti Yogi Basavanna Movie

https://www.youtube.com/watch?v=nIr0RRgxvi4