“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

18, డిసెంబర్ 2011, ఆదివారం

మార్గశిర పౌర్ణమి - మేదినీజ్యోతిష్యం

మార్గశిరపౌర్ణమికి కొన్ని ముఖ్యమైన గ్రహస్తితులు వచ్చాయి. వాటివల్ల చంద్రుని ప్రభావం నూటికి నూరుపాళ్ళు భూమ్మీద ఉంటుందనీ, అనేక సంఘటనలకు  ఇది కారణం అవుతుందనీ ఈ పౌర్ణమికి మళ్ళీ రుజువైంది. దీనికి సంబంధించి ఎన్నో విషయాలు నేను వ్రాస్తూ రుజువుచేస్తూ వచ్చాను. కనుక  దీన్నొక తిరుగులేని యాస్ట్రో ఎనలిటికల్ ఫేక్టర్ గా పరిగణించవచ్చు అనేది రూడిగా తేలింది. 

ఈ నేపధ్యంలో కొద్దిగా వెనక్కు వెళ్లి వరుస సంఘటనలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. మెక్సికోలో 6 .7  స్థాయిలో భూకంపం, రష్యాలో ఎలక్షన్ కుంభకోణం వల్ల లక్షలాది ప్రజల నిరసన, కలకత్తాలో AMRI ఆసుపత్రిలో ఘోర అగ్ని ప్రమాదం, తమిళనాడు - కేరళ రాష్ట్రాలమధ్య డ్యాం చిచ్చు, నటుడు దేవానంద్ మరణం, ఆంధ్రలో అవిశ్వాసతీర్మానం రూపంలో ప్రభుత్వ ఉనికికి తాత్కాలికప్రమాదం, ఆఫ్ఘనిస్తాన్లో ఉగ్రవాద దాడి, ఇలా చాలా చాలా జరిగాయి. ఈ సందర్భంగా ప్రతిరోజూ జరిగే చిన్నచిన్న విషయాలు నేను వ్రాయడంలేదు. ఎప్పుడో ఒకసారి జరిగే ముఖ్యమైన పెద్దవిషయాలు మాత్రమె పరిగణనలోకి తీసుకున్నాను.

ఈసారి పౌర్ణమికి తోడుగా సంపూర్ణ చంద్రగ్రహణం కూడా వచ్చి పడింది. కనుక రకరకాలైన ఘటనలు జరిగాయి. మామూలుగానే మార్గశిర పౌర్ణమికి ఒక ప్రత్యేకత ఉంటుంది. అదేమిటో చెప్పుకోబోయే ముందుగా, 26 -12 -2004 న దక్షిణభారతాన్ని కుదిపేసిన సునామీ సరిగ్గా ఇదే మార్గశిర పౌర్ణమి రోజున వచ్చిందని గుర్తుంచుకోవాలి. ఆ రోజున గ్రహస్తితులను తెలిపే కుండలి ఇక్కడ ఇస్తున్నాను. ఆరోజున వచ్చిన సునామీ ఇండోనేషియా, శ్రీలంక, భారత్, థాయిలాండ్ దేశాలను అతలాకుతలం చేసింది. దీని ప్రభావం వల్ల హిందూమహాసముద్ర తీరంలోని పద్నాలుగుదేశాలలో దాదాపు రెండులక్షల ఏభైవేలమంది పైగా ఒకే దెబ్బతో మరణించారు. ఇది మన దేశంలో ఉదయం 9.30 నుంచి 10.00 మధ్యలో జరిగింది. 

ఈ సారి వచ్చిన మార్గశిర పౌర్ణమికి ఉన్న ప్రత్యేకతలలో రాహుకేతువుల నీచస్తితి ఒకటి. ఇలాంటి స్తితి పద్దెనిమిది ఏళ్లకొకసారి వస్తుంది. అలాంటి నీచస్తితిలో ఉన్న కేతువుతో కూడిన చంద్ర గ్రహణం కూడా ఈసారి వచ్చింది. అందుకే ఇన్ని సంఘటనలు జరిగాయి.

పోయినసారి ఇలాంటి గ్రహస్తితి పద్దెనిమిది ఏళ్లక్రితం 10-12-1992  న వచ్చింది. దాని ప్రభావంగా అప్పుడు ఏమేం జరిగాయో ఒక్కసారి చూద్దాం.

>> 6-12-1992 న బాబ్రీ మసీదు కూల్చివేత జరిగింది. దానివల్ల ఇన్నేళ్ళలో ఎంత విధ్వంసం జరిగిందో అందరికీ తెలుసు.

>>యెమెన్ లో గోల్డ్ మొహర్ హోటల్లో బసచేసి ఉన్న అమెరికన్ సైనికులమీద మొట్టమొదటి ఆల్ ఖైదా ఎటాక్ 29-12-1992 న జరిగింది. 

>> ప్రిన్స్ చార్లెస్ డయానాల పెళ్లి పెటాకులైందనీ వాళ్ళు  విడిపోతున్నారనే ప్రకటన కూడా డిసెంబర్   లోనే  వెలువడింది. కొందరి దృష్టిలో ఇదంత ముఖ్య సంఘటన కాకపోవచ్చు. కాని వారు ప్రముఖవ్యక్తులు గనుక వ్రాస్తున్నాను.

>>అంతకు ముందు 1992  మే లో ఒరిస్సా రాష్ట్రంలోని కటక్ లో కల్తీ సారా తాగి 200 మంది మరణించారు. దాదాపు ఇంకో 600 మంది ఆస్పత్రిలో చేర్చబడ్డారు. ఈ సంఘటన రాహుకేతువులు నీచస్తితిలో ఉన్నపుడే జరిగింది. మళ్ళీ 18 ఏళ్ల తర్వాత రాహుకేతువులు అదే నీచ స్తితిలో ఉన్నపుడు మళ్ళీ 13-12-2011  న పశ్చిమ బెంగాల్లో అదే కల్తీమద్యం తాగి దాదాపు 150 మంది చనిపోయారు. 

ఎప్పుడూ ఏదో ఒకటి జరిగి మనుషులు పిట్టల్లా చావడం, మర్నాటికి దానిని అందరూ మర్చిపోవడం, మనదేశంలో సర్వసాధారణం. ఇక్కడ కల్తీసారానే నిందించడం ఎందుకు? మన దేశంలో చాలాప్రాంతాలలో ఉత్తనీళ్ళు  తాగితే చాలు పరలోకప్రయాణం సుఖంగా జరుగుతుంది. ఇక సారా సంగతి చెప్పే పనేముంది? అసలు సారాకీ  గ్రహాలకూ ఏమిటి లింకు? అని కొందరికి సందేహం రావచ్చు. ఒక్క మంచినీళ్లకూ  సారాయికే కాదు, లోకంలో చీమ చిటుక్కుమనడానికి కూడా కారణాలుంటాయి. ఆ కారణాలను గ్రహాలు వాటి భాషలో చెబుతూనే ఉంటాయి. అయితే ఆయా కారణాలను మనం అర్ధం చేసుకోవడంలోనే మన తెలివి పనిచెయ్యాలి. నాదొక్కటే ప్రశ్న. ఒకే రకమైన సంఘటనలు జరిగినప్పుడు మళ్ళీమళ్ళీ అవే రకమైన గ్రహస్తితులు ఎందుకుంటున్నాయి? వీటి వెనక ఉన్న సంబంధం ఏమిటి?  అన్న నా ప్రశ్నకు వారూ జవాబు చెప్పాలి మరి. ఇది కాకతాళీయం అంటే నేనొప్పుకోను.

>> పోయినసారి రాహుకేతువులు నీచలో ఉన్నప్పుడు 1992 లో సినీరంగానికి చెందిన ప్రముఖులు సత్యజిత్ రే, అమ్జాద్ ఖాన్, ప్రేమ్ నాథ్ మరణించారు. మళ్ళీ పద్దెనిమిదేళ్ళ తర్వాత ఇప్పుడు 2011 లో దేవానంద్, మల్లెమాల చనిపోయారు. 2012 ఏడాది మొత్తం రాహుకేతువులు ఇదే నీచపరిస్తితిలో ఉంటారు. జనవరి 2013 లో మాత్రమే వారి స్థానాలు మారుతాయి. కనుక 2012 లో మరికొందరు సినీపెద్దల మరియు దేశప్రముఖుల అస్తమయం జరుగనుంది అని ఖచ్చితంగా ఊహించవచ్చు.

గ్రహప్రభావం మనుషులమీదా భూమ్మీదా ఉంది అన్నమాట నిర్వివాదాంశం. అది ఏ విధంగా ఉంటుందో  అర్ధంచేసుకుని విజ్ఞతగా ప్రవర్తించడంలోనే మానవుల తెలివి దాగుంటుంది.