“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

18, ఫిబ్రవరి 2011, శుక్రవారం

దేశ జాతకం- నడుస్తున్న రవి దశ

మన దేశంలో ప్రస్తుతం జరుగుతున్న అల్లకల్లోల రాజకీయపరిస్తితులకు, రోజుకోకటిగా బయట పడుతున్న కుంభకోణాలకు సూచికలు ఏమున్నాయో మనదేశజాతకాన్ని పరిశీలించి చూద్దాం.

ప్రస్తుతం మన దేశానికి 11-9-2009 నుంచి 11-9-2015 వరకూ ఆరుసంవత్సరాల రవిమహాదశ జరుగుతున్నది. దశ మొదలైనప్పటి నుంచే గందరగోళపరిస్తితులు కనిపిస్తున్నాయి అన్న సంగతి మనం గమనించవచ్చు.

భారదేశజాతకాన్ని పరిశీలిస్తే--

-- విక్రమ స్థానంలో రవి, శని, శుక్ర, చంద్ర, బుధ గ్రహాలు కలిసి ఉన్నట్లు మనకు కనిపిస్తుంది. ఇన్ని గ్రహాల కలయిక వల్ల రాజ్యపాలన అనేక పార్టీల సంకీర్ణంతోనూ, అనేకశక్తుల ప్రమేయంతోనూ నడుస్తున్నదన్న విషయం కనిపిస్తూనే ఉంది. వీరిలో శని దశమాధిపతిగా పరిపాలనూ రాజ్యకార్యాన్నీ సూచిస్తున్నాడు. తనకున్న సహజకారకత్వాల వల్ల ఆయారంగాలు నత్తనడక నడుస్తాయి అని చెప్పకనే చెబుతున్నాడు.

-- అయిదు గ్రహాలలో రవి, చంద్రులు ఒక పక్షం వారు. మిగిలిన బుధ శుక్ర, శనులు ఇంకొక పక్షం వారు. వీరందరూఒకేచోట కలిసిఉన్న పరిస్తితి వల్ల-- సిద్ధాంత పరంగా పరస్పరవ్యతిరేకపార్టీలు అధికారంకోసం కలిసి పనిచేయ్యవలసి వచ్చినపుడు ఏర్పడే గందరగోళ పరిస్తితులు కళ్ళకుకట్టినట్లు కనిపిస్తున్నాయి.

--ఇక్కడ ఇంకొక విచిత్రం ఉన్నది. రవి, శని, శుక్రులు బుదునిదైన ఆశ్లేషానక్షత్రం లోనూ, చంద్ర బుధులు శనిదైన పుష్యమీనక్షత్రం లోనూ ఉండటం ఒక విచిత్ర పరిస్తితి. అంటే వీరిలో మిత్రులు మిత్రులూ కారు, శత్రువులు శత్రువులూకారు. అందుకనే ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో మిత్రత్వాలు గాని శత్రుత్వాలు గాని లేవు. అవసరార్థం ఒకరికొకరు సహకరించుకుంటూ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు అని తెలుస్తున్నది.

-- ఇటువంటి పరిస్తితిలో వీరందరూ కలిసి ఫారెన్ పాలసీ సూచిక అయిన నవమ స్థానాన్ని చూస్తుండటం వల్ల విదేశీవ్యవహారాలు కూడా ఇలాగే గందరగోళంగా ఉంటాయని తెలుస్తున్నది.

-- వీరిలో శనిశుక్రులు అతిదగ్గరగా ఒకేనక్షత్రపాదంలో ఉండటంవల్ల నవాంశలో మకరంలో ఉన్నారు. నవాంశను నాడీవిధానంప్రకారం రాశిచక్రంపైన సూపర్ ఇంపోస్ చెయ్యగా విదేశాలను సూచించే నవమస్థానం అయింది. కనుక కాంబినేషన్ బట్టి ఏమి తెలుస్తున్నది? శుక్రుడు ( సంపద), శని ( రహస్యంగా), నవమ స్థానం ( విదేశాలకు తరలి వెళ్లిపోతుంది) అన్న విషయం కనిపించటం లేదూ ?

--ప్రస్తుతం జరుగుతున్న రవి/రాహు దశ 4-11-2010 నుంచి 29-9-2011 వరకూ ఉన్నది. ఇది గ్రహణ కాలం. కనుక సమయంలో దేశానికి గ్రహణం పట్టింది. అన్నిరకాల మోసాలూ, కుట్రలూ స్కాములూ ఇప్పుడే జరుగుతున్నాయి. బయట పడుతున్నాయి.

-- అసలే కాలసర్పయోగం లో మనకు స్వాతంత్రం వచ్చింది. ప్రస్తుత దశ కూడా అలాగే ఉంది. సెప్టెంబర్ వరకూ ఇదే పరిస్తితి కొనసాగుతుంది. ఇంకా ఎన్నెన్ని గొడవలు, స్కాములు జరుగుతాయో చూస్తూ ఉండటమే సామాన్య పౌరులుగా మన గతి.

రానున్న గురుఅంతర్దశ అన్నా బాగుంటుందా? అంటే అనుమానమే అని చెప్పాలి. ఎందుకంటే లగ్నానికి గురువు మంచివాడు కాదు. పైగా శత్రు స్థానంలో కూచుని ఉన్నాడు. కనుక గురుఅంతర్దశలో పొరుగుదేశాలతో గొడవలు ఎక్కువకావటం జరుగవచ్చు. త్వరలో మొదలు కాబోతున్న అర్దాష్తమశని కూడా దీనినే బలపరుస్తున్నది. దేశంలో ప్రజల కష్టాలు మితిమీరుతాయని సూచన ఇస్తున్నది.

హిమాలయప్రాంతాలలో యోగినీదశకు ప్రాధాన్యత ఎక్కువ. మనం విమ్శోత్తరీ దశను వాడినట్లు ఆ ప్రాంతాలవారు యోగినీదశను ఉపయోగిస్తారు. యోగినీదశావిధానంలో అయితే ప్రస్తుతం జూన్ 2008 నుంచి 2016 వరకూ సంకట (రాహు) దశ జరుగుతున్నది. పేరు సూచించినట్లే అన్నీ సంకట పరిస్తితులు ఎదురౌతున్నాయి. ముందు ముందు కూడా ఇలాగే ఉంటాయి.

ఏతావాతా రవి దశ మొత్తం ఇలాగే ఉండే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. రవి పరిపాలనకు సూచకుడు కనుక ఈ దశ మొత్తం గందరగోళమైన పరిపాలన ఉంటుంది. ఏ నిర్ణయమూ ఎవరికీ నచ్చని పరిస్తితి ఉంటుంది. దీనికి కారణం రవి పైన ఇతరనాలుగుగ్రహాల ప్రభావం బలంగా ఉండటమే. దేశ పరిపాలన మొత్తం ఒక గ్రూప్ చేత నడప బడుతూ ఉంటుంది అని ఈ కాంబినేషన్ సూచిస్తున్నది.

ప్రజల్లో,
పాలకుల్లో నీతినియమాలు పెరగనంతవరకూ, సమాజంపట్ల, సాటి మనుషులపట్ల జవాబుదారీతనం, దేశభక్తీ రానంత వరకూ మన దేశానికి ఖర్మ తప్పదనే చెప్పాలి.