Love the country you live in OR Live in the country you love

15, ఫిబ్రవరి 2011, మంగళవారం

నింజుత్సు

అతిప్రమాదకరమైన జపనీస్ వీరవిద్యలలో నింజుత్సు ఒకటి. దాదాపు అయిదువందల సంవత్సరాలపాటు ఈవిద్య అతిరహస్యంగా అభ్యాసం చెయ్యబడుతూ వచ్చింది. జపనీయులు కానివారు ఈ విద్య ఎట్టి పరిస్తితుల్లోనూ నేర్చుకోటానికి వీలుండేది కాదు. అసలు ఈ స్కూల్స్ ఎక్కడున్నాయో ఎవరికీ తెలిసేది కాదు. అటువంటి రహస్య వాతావరణం లో ఈ విద్య అభ్యాసం చెయ్యబడేది.

ఎటువంటి పరిస్థితిలోనూ చలించకుండా ఉండటం నింజుత్సు వీరుల ప్రాధమికసూత్రం. వీరి సింబల్ అయిన "నిన్" అన్న అక్షరం దానినే సూచిస్తుంది. గుండెబొమ్మ, దానిపైన ఖడ్గం దానిగుర్తులు. గుండెలో ఖడ్గం దిగినాసరే చలించకుండాఉండాలని దాని అర్ధం. అటువంటి ట్రైనింగ్ నింజుత్సు విద్యలో ఉంటుంది.బాధను సహించటంలో ఏళ్లతరబడి వీరికి ట్రైనింగ్ ఉంటుంది. అద్భుతమైన సహనశక్తి ఆ ట్రైనింగ్ వల్ల వీరికి అలవడుతుంది.


మహోన్నతమైన ఫిలాసఫీ వీరి ట్రైనింగ్ లో ఉగ్గుపాలతో వంటబడుతుంది. ఎట్టి పరిస్తితిలో నైనా తొణకని ఆత్మవిశ్వాసం వీరి సొంతం. ప్రాణాన్ని ఎంతమాత్రం లెక్కచెయ్యని మనస్తత్వం వీరివిద్యలో అతి ముఖ్యమైన భాగం. ఎలా గెలిచాం అన్నది ముఖ్యంకాదు.గెలిచామా లేదా అన్నదే ముఖ్యం అన్నది వీరిసూత్రం. యుద్దంలో నీతికి,ధర్మానికి తావులేదు అని వీరు నమ్ముతారు. కాని నిత్యజీవితంలో ఉన్నత విలువలు పాటిస్తారు. అనుకున్న పనిని సాధించటంలో ప్రాణాలను లెక్క చెయ్యకుండా ప్రయత్నిస్తారు.

జెన్ ఫిలాసఫీ వీరి సూత్రాలకు దగ్గరగా ఉంటుంది. సమురాయ్ విధానాలు కూడా వీరికి దగ్గరగానే ఉంటాయి. జపాన్ సాధించిన అద్భుత ప్రగతికి కారణం జెన్, సమురాయ్, నింజుత్సు విధానాలే అని ఒక భావన ప్రపంచవ్యాప్తంగా ఉంది.

విచిత్రం ఏమిటంటే, భారతీయసిద్ధులయొక్క యోగశాస్త్రం లోని రహస్యాలకూ నింజుత్సు లోని అత్యున్నత అభ్యాసాలకూ ఏమీ భేదం లేదు. యోగముద్రలు, బంధాలు,ప్రాణాయామ క్రియలు అన్నీ రెంటిలోనూ దాదాపుగా ఒకటిగానే ఉంటాయి.మనం వదిలేసినవాటిని ఇతర ఆసియాదేశవాసులు తీసుకుని వాడుకొని అద్భుతమైన స్థాయికి వాటిని తీసుకెళ్లగలిగారు.మనమో ఎంతసేపూ మా విద్యలు గొప్పవి, మా గ్రంధాలు గొప్పవి, మా సంస్కృతి గొప్పది, అని అరవటమే గాని, వాటిలో ఏముందో తెలుసుకుందామని గాని, వాటిని ఆచరిద్దామని గాని,నేర్చుకుందామని గాని ప్రయత్నించము. బహుశా ఇటువంటి తమస్సుతో నిండిన పరిస్తితిని చూచేనేమో గురు బోధిధర్మ మన దేశాన్ని విడిచి చైనాకు వెళ్లి అక్కడ మన ధ్యానబౌద్ధాన్ని ప్రచారం చేసాడు. ఉన్న సంపదను నిర్లక్ష్యంతో చేజార్చుకునే వారినిఎవరు మాత్రం రక్షించగలరు?

నింజుత్సు విద్య యొక్క ఆత్మ అనదగ్గ పద్యం ఒకటి ఉంది. దానిని ఎవరు వ్రాశారో తెలియదు.కాని నింజుత్సు యొక్క రహస్యఆత్మను ఈపద్యం అక్షరాలా ప్రతిబింబిస్తుంది.


భూమీ ఆకాశం నా తల్లి దండ్రులు
ఈ శరీరం నా ఇల్లు
నిజాయితీ నా శక్తి, సాధనే నా మాయ
శ్వాసే నా బ్రతుకూ చావూ, నిగ్రహమే నా శరీరం
సూర్య చంద్రులే నా కళ్ళు, సున్నితత్వమే నా చెవులు
ఆత్మరక్షణే నా ధర్మం, ఒదిగిపోవడమే నా బలం
అవకాశాన్ని పూర్తిగా స్వీకరించటమే నా నేర్పు
మనసే నా మిత్రుడు, నిర్లక్ష్యమే నా శత్రువు
సరైన ఆచరణే నా రక్ష
కనిపించేవన్నీ నా ఆయుధాలే
శత్రువుకంటే ఒకడుగు ముందుండటమే నా వ్యూహం
నింజుత్సు-- నా మార్గం

ఈ విద్యలో ఉన్నతస్థాయిలకు ఎదిగేకొద్దీ ఇది మర్మవిద్యకు చాలాదగ్గరగా వస్తుంది. జనసామాన్యానికి అందుబాటులో ఉండని తాంత్రికక్రియల సాధన అప్పుడు నేర్పబడుతుంది. సామాన్యజనానికి అర్ధంకాని ఉన్నతసిద్ధాంతాల అభ్యాసం అప్పుడు మొదలౌతుంది. ఆ స్థాయికి చేరిన నింజావీరుడు దాదాపు ఒక యోగిగా మారతాడు.ధ్యానాభ్యాసం ద్వారా ప్రకృతి శక్తులను శాసించడం నేర్చుకుంటాడు. ఏకాంత ప్రకృతితో ఒకడిగా సహజీవనం సాగిస్తాడు.

ఈవిధంగా ఒక మోసపూరిత వీరవిద్యగా మొదలైన ఇతని ట్రైనింగ్ చివరికి అత్యున్నతమైన యోగంలోనూ, జెన్ లోనూ లయిస్తుంది. కానీ దానికోసం జీవితాన్ని ఈవిద్యకు ధారపోయ్యవలసి వస్తుంది. అందుకే ఆ స్థాయిలకు చేరేవారు బాగా తక్కువ అనే చెప్పాలి.

వీరవిద్యగా మొదలై యోగంగా అంతమయ్యే లక్షణం ఆసియా ఖండపు వీరవిద్యల ప్రత్యేకత. ఈ విచిత్రలక్షణం ఇతర ఏఖండాల వీరవిద్యలలోనూ కనిపించదు. అందుకే వీటిని Martial Ways of Enlightenment అంటారు.