“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

29, మే 2010, శనివారం

కుజునికి నూతనోత్సాహం వచ్చింది


నవగ్రహాలలో కుజగ్రహం చాలా బలీయమైనది. ఒక జాతకంలో బలం ఉండాలంటే దానికి కుజుడు చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తాడు. ఎందుకనగా మనిషిలోని పట్టుదలకు, రోషానికి, విధ్వంస ప్రవృత్తికీ కుజునికీ సంబంధం ఉన్నది.కుజుడు బలహీనంగా ఉన్న జాతకాలలో చూస్తే, జీవితంలో ఎదగడానికి అవసరమైన పట్టుదల లోపిస్తుంది. కుజదోషం ఉన్న వాళ్ళలో వివాహ జీవితంలో అనేక ఒడిదుడుకులు కలుగుతాయి. మేదినీ జ్యోతిషంలో చూస్తే, దుర్ఘటనలు, ప్రమాదాలు,రక్తం చిందించే సంఘటనలు,గొడవలు,యుద్ధాలు మొదలైనవి జరగడానికి, కుజుని గోచారానికి చాలా సూటి సంబంధం ఉంటుంది. కుజ గోచారం మానవ జీవితాలమీద గట్టి ప్రభావాన్ని చూపిస్తుంది. దీనికి అనేకానేక రుజువులున్నాయి. గత నాలుగురొజులుగా జరుగుతున్న సంఘటనలవల్ల ఈ విషయం మళ్ళీ రుజువైంది.

27-5-2010 న కుజుడు తన 8 నెలల కర్కాటక రాశి సంచారంలో ఎదుర్కొన్న అనేక ఒడిదుడుకులనూ, నీచపరిస్థితిని తొలగించుకుని తన మిత్రుడైన సూర్యుని సింహరాశిలోకి అడుగుపెట్టాడు. విధ్వంసాన్ని ప్రేమించే కుజునికి ఇన్నాళ్ళ కర్కాటకరాశిలోని జైలు జీవితం ముగిసేసరికి మహదానందం కలిగినట్లుంది. ఇక విజృంభిద్దామనుకున్నాడు. అదేరోజు ప్రజల ఖర్మకాలి పూర్ణిమ అయ్యింది. మానవులలో భావోద్వేగాలు రెచ్చగొట్టటానికి ఇంతకంటే మంచి ముహూర్తం దొరకదు. ఇంకేముంది రంగం సిద్ధం అయ్యింది. అందుకే ఒక రెండురోజుల ముందునుంచే ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. లైలా తుఫాను వచ్చి మూడు రోజులలో వందల కోట్ల రూపాయల నష్టాన్ని మిగిల్చి పోయింది.

దీనినుంచి తేరుకునే లోపు, బుధవారం శ్రీకాళహస్తి రాజగోపురం కూలిపోవడం జరిగింది. ఇది ఒక చెడుశకునం అని ఖచ్చితంగా చెప్పవచ్చు. కాని దీనికి కుజ గోచారానికి అతిదగ్గర సంబంధం ఉండటమే ఆశ్చర్యకరంగా ఉంది. ఇక అప్పటినుంచి ఎక్కడచూచినా విధ్వంసకర సంఘటనలు వరుసగా కనిపిస్తున్నాయి.గురువారం రాత్రి బెంగాల్ లో ఊహించని ఘోర రైలు ప్రమాదం జరిగింది. వందకు పైగా ప్రయాణీకులు ప్రాణాలు కోల్పోయారు. అంతకు మూడు రెట్లు గాయాల పాలయ్యారు. మావోయిష్టులు మేము కాదు అంటున్నారు. వాళ్ళకు ప్రజలను పెద్ద ఎత్తున ఇలా చంపిన చరిత్ర లేదు. వారు కాకపోతే మరి ఎవరు? పాకిస్తాన్ జిహాదీలా? అసలు దోషులు ఎప్పటికైనా బయటికి వస్తారా? న్యాయం జరుగుతుందా? ఎక్స్ గ్రేషియాలతో పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా? అన్నీ ప్రశ్నలే. ఈ లోపు, శుక్రవారం నాడు మహబూబాబాద్ స్టేషన్ లో గొడవలు, కాల్పులు జరిగాయి. ప్రజల భావోద్వేగాలు భగ్గుమని రెచ్చగొట్టబడ్డాయి. రోడ్డు ప్రమాదాలు, రహదారులు రక్తమయం కావడం మళ్ళీ ఎక్కువౌతున్నాయి. అదేరోజు తిరుపతి దగ్గర ఇంకొక రైలులో బోగీలకు ఎవరో నిప్పు పెట్టారు.

ప్రపంచ వ్యాప్తంగా చాలా విధ్వంసకర సంఘటనలు ఈ నాలుగు రోజులలో జరిగాయి. ఉదాహరణకు గుటెమలాలో అగ్నిపర్వతం 27-5-2010 తేదీన పూర్ణిమా గురువారం మరియు కుజుడు రాశిమారిన రోజే బ్రద్దలైంది. శుక్రవారం రెండో అగ్ని పర్వతం పగిలింది. మూడోరోజున, అనగా ప్రస్తుతం అక్కడ భయంకర తుఫాన్ ఒకటి ఎటాక్ చేసి తన విశ్వ రూపం చూపిస్తున్నది. పదిహేను రోజులు అత్యవసర పరిస్తితి విధించారు. నదులు పొంగి వంతెనలు బద్దలవుతున్నాయి. జనం పరిస్థితి భీతావహంగా ఉన్నది. ఇటువంటివి ప్రతిరోజూ జరగవు. ఒకవేళ జరిగినా ఈ స్థాయిలో జరగవు. వీటికి కుజుని సింహ రాశి ప్రవేశానికి ఖచ్చితమైన సంబంధం ఉన్నది. కుజుడు అసలే అగ్ని తత్వ గ్రహం, అగ్ని తత్వ రాశియగు సింహంలోకి, అందులోనూ అగ్ని గ్రహమూ తన మిత్ర్రుడూ అయిన సూర్యుని రాశిలోకి అడుగుపెట్టాడు. నీచ స్థితిని వదిలించుకున్నాడు. ఇక ఎంత బలాన్ని పుంజుకుని ఎన్ని రకాలుగా విజృంభిస్తాడో చూడవలసిందే.

ఇక జ్యోతిశ్శాస్త్ర విమర్శకుల వాదనలు మామూలే. ఇదంతా ముందే తెలిస్తే బాహాటంగా అందరికీ చెప్పి, తరుణోపాయాలు సూచించి, ప్రజలచేతా ప్రభుత్వం చేతా చేయించి, ఈ ఘోర విపత్తులను నివారించవచ్చుగా? అంటారు. ఒక చేదువాస్తవం ఏమిటంటే, ప్రస్తుత సమాజంలో ఎవరు చెప్పినా ఎవరూ వినడానికి సిద్ధంగా లేరు. మామూలు మనిషే వినడు. ఇక ప్రభుత్వాలు వింటాయా? ఒకవేళ నూటికి నూరుశాతం సరిగా చెప్పగలిగిన జ్యోతిశ్శాస్త్రవేత్తలు ఉన్నప్పటికీ వారినుంచి తమ వ్యక్తిగత జాతకం దాని రెమెడీలు మాత్రమే కోరే నాయకులు కొల్లలు. దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొనేవారు బహు తక్కువ. ఒకవేళ నాయకులలో అటువంటి వారున్నప్పటికీ వారి చేతిలో పవర్ ఉండదు. స్వార్ధం ,ధనమదాలతో కళ్ళు పొరలు కమ్మినవారికి మంచి చెబితే వినిపించుకుంటారా? కళ్ళ ఎదురుగా పదేళ్ళనుంచీ ఒక ప్రాచీన హెరిటేజ్ కట్టడం బీటలు వారి, రోజురోజుకూ కూలిపోడానికి సిద్ధమౌతుంటే నిద్ర పోతున్న ఆ శాఖలకు అధికారులకు మంచి మాటలు చెబితే తలకెక్కుతాయా? వారందరూ వారివారి వ్యక్తిగత జాతకాలు ప్రముఖ జ్యోతిష్కులకు వారానికొకసారి చక్కగా చూపించుకుని పరిహారాలు పాటిస్తూనే ఉంటారు. కాని ధార్మిక కట్టడాల బాధ్యతా, ప్రజల ఆస్తులైన రవాణా సాధనాలు వగైరాల బాధ్యతా వారికెందుకుంటుంది?

అరణ్య రోదన అని ఒక పదం ఉన్నది. అరణ్యంలో సాయం కోసం ఏడుస్తూ ఉంటే ఏం జరుగుతుంది? ఆ శబ్దం విని ఏ పులో వచ్చి చక్కగా భోంచేసి పోతుంది. దాని కంటే మౌనంగా ఉండటం మేలు. ప్రజల గోడు కూడా అలాగే ఉంది. పబ్లిక్ ప్రాపర్టీ నాశనం అయితే ఎవరికి పడుతుంది? ఒక ధార్మిక, హెరిటేజ్ కట్టడం ఇలా కుంగి కూలిపోతుంటే చూస్తూ ఊరుకున్న ప్రభుత్వ శాఖలు మన దేశంలో మాత్రమే చెల్లుబాటు అవుతుంటాయి. ముఖ్యంగా మన తెలుగుసమాజంలో ఏం జరిగినా మూడో రోజుకు చక్కగా మరిచిపోవడం మనకు అలవాటు అయింది. అదే మనపక్కనే ఉన్న తమిళనాడులో దేవాలయాలను ఎంత చక్కగా పరిరక్షిస్తారో చూస్తే మన ప్రభుత్వం సిగ్గుపడాలి. పైగా అక్కడ ముఖ్యమంత్రి నాస్తికుడు.

ఏం జరిగినా ఎవరికీ పట్టని మనస్తత్వం చాలా భయంకరమైనది. దురదృష్టవశాత్తూ ఇదే ప్రస్తుతం అన్నిచోట్లా ఎక్కువైతున్నది. ఎవరికీ ఇక్కడ ఎకౌంటబిలిటీ లేదు. కనుక ఏం జరిగినా ఎవరికీ ఏమీ కాదు. కాకపోతే పేపర్లు టీవీలు కాసేపు గోలపెడతాయి. ఎలాగూ అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసి పోతుంటాయి. పోతే పోతాయి. జనాభా ఇప్పటికే ఎక్కువగా ఉంది. కాస్త తగ్గుతుంది. అనామకులు పోతే ఎవరికి కావాలి. దేశాన్ని ఉద్ధరిస్తున్న ప్రస్తుత నాయకులుంటే చాలు. ఏం జరిగినా అసలు నేరస్తులను గాలికొదిలేసి ఎవడో ఒక సత్యంబాబును అడ్డం పెట్టుకొని కథ నడిపించవచ్చు.


పిట్టకధనొదిలి మన అసలు కధకొద్దాం. కుజుడు సింహ రాశిలో జూలై 21 వరకూ ఉంటాడు. ఈ లోపల ఇంకా ఎన్ని విధ్వంసాలు జరుగుతాయో? అనుమానం లేదు. ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలు నాందీవాచకాలు మాత్రమే. భూకంపాలు, అగ్నిప్రమాదాలు, అగ్ని పర్వతాల పేలుడు ఇత్యాదులు ముందున్నాయి. ఒక ప్రముఖ ఆలయ రాజగోపురం అలా కుప్పకూలడం వల్ల దేశానికి ఖచ్చితమైన అరిష్టం కలుగుతుంది. జూలై 21 తరువాత కుజుడు కన్యారాశిలో ప్రవేశించి, అక్కడె ఉన్న శనితో కలుస్తాడు. కన్యారాశిలో సంభవిస్తున్న గ్రహయుద్ధం అనబడే ఈ యుతితో ఇంకెన్ని దారుణాలు జరగబోతున్నాయో?

శని కుజుల యుతి విస్ఫోటనాలకు దారి తీస్తుంది. అది భూతత్వ రాశిలో జరుగబోతున్నది. కనుక భూకంపాలు రావడానికి, అగ్నిపర్వతాల పేలుడుకు ఇది అనువైన కాంబినేషన్. వారికి ఎదురుగా మీన రాశిలో గురువున్నప్పటికీ ఆయన పెద్దగా ఈ పరిణామాలను అదుపు చెయ్యలేడు.

ఏది ఏమైనా రాబోయే మూడునెలలు మేదినీ గోచారరీత్యా చాలా గడ్డురోజులని చెప్పవచ్చు. నేను ఇంతకు ముందు సూచించినటుగా అమావాస్య, పౌర్ణమి రోజులకు అటూ ఇటూగా ఈ ఘటనలు జరుగుతున్నాయి. ఇది గమనించదగ్గ విషయం.


కుజుడు ఏ జాతకాలలో చెడు చెయ్యగలడో, ఆయా జాతకాలవారంతా ఈ మూడు నెలలూ జాగ్రత్తగా రెమెడీస్ పాటిస్తే మంచిది.