“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

18, సెప్టెంబర్ 2009, శుక్రవారం

తిధులూ - తేదీలూ



నువ్వు రోజు పుట్టావురా అని స్నేహితున్నో ఇంకెవరినో అడిగితే ఫలానా తేదీన అని టక్కున చెప్తారు. కాని తిధిన పుట్టావు అని అడిగితే అర్థం కానట్టు చూడటమో, లేక గుర్తు లేదు అని చెప్పటమో చేస్తారు. మన సాంప్రదాయాలను మనం ఎంత గౌరవిస్తున్నామో తెలుసుకోటానికి ఇది ఒక చిన్న ఉదాహరణ.

అసలు తిథులకు, తేదీలకు(తారీఖులకు) ఏమిటి తేడా? ఇదేమన్నా అంత బుర్ర బద్దలు కొట్టుకోవలసినంత విషయమా. ఏదో ఒక రోజు పుట్టాను.అసలు పుట్టిన రోజేంటి? ఎందుకు చేసుకోవాలి? ఇదంతా నాన్సెన్స్ అనే వారికి ఒక నమస్కారం. కాని అలా విమర్శించే వారు కూడా, వారు పుట్టిన రోజున పార్టీలు ఫంక్షన్లు అంటూ తిరిగి జల్సా చేసే వారు చాలా మంది ఉన్నారు. ఇది వారి కుహనా మనస్తత్వానికి తార్కాణం. పుట్టిన రోజున ప్రత్యేకతా లేక పొతే పార్టీలు, జల్సాలు ఎందుకు? అనడిగితే దానికి సమాధానం ఉండదు.

మనం అనుసరిస్తున్న ఇంగ్లీషు తేదీలు మన సౌలభ్యం కోసం, దేశాలమధ్య వ్యాపార లావాదేవీలకు ఒక సమన్వయం కోసం మనం పరస్పర ఒప్పందాల ద్వారా కుదుర్చుకున్న ఒడంబడిక మాత్రమె. దీనికి శాస్త్రీయ ఋజువులు లేవు. ఏదో ఒక రోజునించి ఒక శకం అని అనుకోని రోజునుంచి లెక్కలు మొదలు పెట్టాము. కాని అంతకుముందే ఎన్ని యుగాలు గడిచాయో? సమయమంతా ఏమైందో? అది లెక్క లోకి రాదా? విషయాలు కూడా మనం ఆలోచించాలి.

ఒక్క భారతీయులు మాత్రమె దీనిని గురించి ఆలోచించటమే కాక మహా సంకల్పం అనే ప్రక్రియలో సృష్టి మొదలైన రోజునుంచి రోజుకు ఎన్ని రోజులు గడిచాయో స్మరించి తరువాత ఏదైనా పనిని మొదలు పెడతారు. ఎందుకంటే సృష్టి అనేది బ్రహ్మ దేవుని సంకల్పం నుంచి ఉద్భవించింది. కనుక మనం చెయ్యబోయే పని కూడా మన సంకల్ప ఫలితమే కాబట్టి ప్రక్రియను గౌరవిస్తూ సృష్టికర్తను స్మరించి సంకల్పిస్తారు. కాని నేడు పద్దతులు అన్నీ పోతున్నాయి.

భారతీయ(వైదిక) సాంప్రదాయం లో తిథులకున్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. తిథులకు తేదీలకు ఉన్న ముఖ్యమైన తేడా ఏమిటంటే తేదీలు మానవ కల్పితాలు, తిథులు ప్రకృతి సిద్ధమైనవి. ప్రకృతి లో బతికే మనం ప్రకృతి ని అనుసరించటమే శ్రేయస్కరం.

మన భూమికి జీవ ప్రదాతలు సూర్య చంద్రులు. వీటి మధ్య గల దూరాన్ని బట్టి వాటి మధ్యన గల శక్తి స్థాయిలు (energy levels) మారుతాయి. శుక్ల పక్షంలోనూ, కృష్ణ పక్షంలోనూ కూడా తేడాలు ఉంటాయి. కనుకనే కొన్ని కొన్ని తిథులు మంచివి అని కొన్ని చెడ్డవి అని చెప్పబడింది.

ఇది పుష్య మాసం అని చాంద్రమానాన్ని అనుసరించే మనం అంటే, దానికి రుజువుగా మాసం లో ఒచ్చే పౌర్ణమి రోజున చంద్రుడు ఆకాశంలో పుష్యమి నక్షత్ర మండలం లో ఉండటం మనం కళ్ళారా చూడవచ్చు. ఇదే దీనికి రుజువు. పోనీ సౌరమానాన్ని అనుసరించే వారి ప్రకారం ఇది కన్యా మాసం అంటే సూర్యుడు మాసమంతా కన్యా రాసి లో సంచారం చెయ్యటం చూడవచ్చు. కాని ఇది సెప్టెంబర్ మాసం అంటే దానికి ఏవో రోమన్ గ్రీక్ వ్యక్తిగత కారణాలు తప్ప ఖగోళ కారణాలు కనిపించవు.

అలాగే శుక్ల పక్షం కృష్ణ పక్షాలు మనకు కళ్ళకు కనిపించే నిజాలు. ఇక తిథులు సూర్యునికి చంద్రునికి మధ్యన 12 డిగ్రీల తేడాతో ఏర్పడే వివిధ విభాగాలు. ఇవీ మనకు ప్రత్యక్షంగా ఆకాశంలో కనిపించే విషయాలే.కనుక తిదులే శాస్త్రీయాలు మరియు సత్యాలు. తేదీలు కల్పితాలు. మనం కల్పిత విషయాలకు ప్రాముఖ్యత నిస్తూ సత్యమైన విషయాలను చక్కగా నిర్లక్ష్యం చేస్తున్నాం. ఇది కలిప్రభావాలలో ఒకటి అని చెప్పవచ్చు.

ఒక వ్యక్తి పలానా తేదీన పుట్టి ఉండవచ్చు. కాని ఒక ఇరవై ఏళ్ల తరువాత అదే తేదీన చూస్తె, అదే తిథి ఉండదు. కారణం? సూర్య చంద్రుల గమనంలోని తేడాలవల్ల అలా జరుగుతుంది. కనుక మనం తేదీల ప్రకారం పుట్టిన రోజు జరుపుకుంటే అది సరియైన రోజున మనం జరుపుకున్నట్లు కాదు. ప్రకృతి పరంగా అదే స్పందనలు ఉన్న రోజున మనం పుట్టిన రోజును జరుపుకున్నట్లు కాదు.

ఒక మనిషి జననం జరగాలంటే గ్రహాల మధ్య, ముఖ్యంగా సూర్యుడు చంద్రుల మధ్య ఒక పరస్పర సంబంధం ఉండాలి. సంబంధాన్ని చక్కగా చూపేదే తిథి. కనుక మళ్ళీ కాల చక్రంలో తిథి వచ్చినపుడు సూర్య చంద్రుల మధ్యన అదే సంబంధం ఉంటుంది. ప్రకృతిలో అదే స్పందన ఉంటుంది. కనుక అదే తిథి వచ్చినపుడు పుట్టిన రోజును జరుపుకోవటం తార్కికం.

రోజున ఉన్న ప్రకృతి పరమైన ప్రాణిక స్పందనలను వృద్ధి చేసేవి ఆయుష్య హోమం, నక్షత్ర హోమం, నవగ్రహ హోమం మొదలైన వైదిక క్రియలు. ఇవి చేయటం ద్వారా అప్పటి ప్రకృతి స్పందనలోని అసమతుల్యత తొలగించబడి తద్వారా జాతకునికి మంచి జరుగుతుంది. ఆయుర్ వృద్ధి కలుగుతుంది. కనీసం ఆరోజు పెద్దవారు, సదాచార సంపన్నులైన వారి ఆశీర్వచనం తీసుకుంటే మంచి జరుగుతుంది. అలాగే దేవతా సందర్శనం, పూజాదికాలు చేస్తే మంచి జరుగుతుంది.

వీటికి భిన్నంగా రోజున విచ్చల విడిగా తాగటం, తినటం, సినిమాలు చూడటం, షికార్లు చేయటం, షాపుల వెంటబడి వస్తువులు కొని, హోటళ్ళలో తిని, తాగి, ఇంటికి చేరి మళ్ళీ పార్టీలు, జల్సాలలో కాలం గడిపితే ఏమి ప్రయోజనం సిద్ధిస్తుందో వాటిని చేసేవారికి, చేయించే కలి కి మాత్రమె తెలియాలి. ఎం జరుగుతుందో మనకు తెలియక పోయినా, మంచిని కోరే మన సాంప్రదాయాలు అడుగంటటం, ఇంద్రియ వ్యామోహాలు పెరగటం, ఆయుస్సు క్షీణించటం మాత్రం జరుగుతుందని ఖచ్చితంగా చెప్పవచ్చు.

యోగ ధ్యానాభ్యాస పరులకు, ఉపాసనా పరులకు పుట్టిన రోజు ఒక అద్భుతమైన మార్పుకు నాంది పలుకుతుంది. రోజున వారికి ఒక నూతన స్ఫురణ కలుగుతుంది. ఒక కొత్త భూమికకు దారి తీసే మెట్లు కనిపిస్తాయి. ఒక అతీత శక్తితో పరిచయం కలుగుతుంది. ఇంతకు ముందు తెలియని ఒక కొత్త లోకం వారి ముందు కనిపిస్తుంది. ఇదంతా రోజును సక్రమంగా ఉపయోగించుకుంటే జరుగుతుంది.

ఎందుకంటే రోజు వారికే ప్రత్యేకమైన స్పందనలు ప్రకృతిలో ఉంటాయి. ప్రకృతి రోజున మనిషిని లోకంలోకి ప్రవేశపెట్టింది. కనుక ప్రకృతి రోజున వారికి అనుకూలంగా ఉంటుంది. అది వారి ఆంతరిక అభివృద్ధికి చాలా సులువుగా సహకరిస్తుంది. ప్రకృతి పరమ ఉద్దేశ్యం మనిషి దైవం గా మారటమే కనుక, అట్టి ప్రయత్నం చేసేవారికి ఆరోజున ప్రకృతి సహాయం బాగా ఉంటుంది. కనుకనే పైన చెప్పిన వన్నీ జరుగుతాయి. కాని రోజును ఎలా ఉపయోగించుకోవాలో తెలియాలి.

>>మనలోని జీవ పరిణామాన్ని వేగవంతం చేసి కొన్ని వేల లక్షల సంవత్సరాల పరిణామ ప్రగతిని కొన్ని నెలలలో లేక సంవత్సరాలలో కలిగించే ఆంతరిక సిద్ధ యోగ, ధ్యానాది అభ్యాసాలలో రోజంతా గడపటం ఉత్తమోత్తమం.
>>అది చెయ్యలేకపోతే, ఆయుష్య హోమం, నవగ్రహ హోమం మొదలైన హోమాలు సదాచార సంపన్నులైన బ్రాహ్మణుల చేత చేయించుకోవటం, ఆరోజు పెద్దల,గురువుల ఆశీర్వచనం తీసుకోవటం ఉత్తమం.
>> అదీ చెయ్యలేకపోతే, దేవాలయ సందర్శనం, ఇష్ట దైవాన్ని ప్రార్థించటం, ఆకలితో ఉన్నవారికి దానం చెయ్యటం, అవసరంలో ఉన్నవారికి సహాయం చెయ్యటం, కనీసం ఒక్క రోజన్నా సంకుచిత భావాలు వదిలి విశ్వ మానవునిగా ఉండటం మంచిది.
>>ఇవి గాక, పైన ముందే చెప్పినట్లు సినిమాలు షికార్లు జల్సాలు పార్టీలు చేసుకోవటం అధమాధమం.ఇటువంటి పనులు చెయ్యటం వల్ల వీడికి మానవ జన్మ ఎందుకు ఇచ్చానురా భగవంతుడా అని ప్రకృతి బాధ పడటం తప్ప వేరే ఉపయోగం లేదు.

వీటిలో రకం గా పుట్టిన రోజు జరుపుకోవాలో ఇక మన ఎంపిక మీద, విచక్షణ మీద, ఆధార పడి ఉంటుంది.