“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

12, సెప్టెంబర్ 2009, శనివారం

నిశ్శబ్దం లోని మాధుర్యం

నవీన జీవితాలు మనకు నేర్పించిన జబ్బులు చాలా ఉన్నాయి. వాటిలో ఒకటి నిశ్శబ్దాన్ని భరించలేక పోవటం. నేనుచాలా మందిని గమనిస్తూ ఉంటాను. ఎక్కడికన్నా బయటకు పోయి వచ్చి ఇల్లు తాళం తీస్తూనే కాళ్ళన్నాకడుక్కోకుండా టీవీ పెట్టటం, లేదా నెట్ ఆన్ చెయ్యటం చేస్తుంటారు. వ్యాపకం లేకుండా ప్రశాంతంగా మౌనంగాఉండగలిగే స్థితి ఉన్నవారు చాలా అరుదుగా కనిపిస్తున్నారు.

రైలు ప్రయాణాలలో కూడా ఏదో సంగీతం వినటమో, పెకాడటమో, లేక లాప్ టాప్ లో సినిమా చూడటమో లేక నెట్చూడటమో- ఇలా ఏదో ఒక వ్యాపకంలో మనిషి ఎప్పుడూ మునిగి ఉండాలి. ఏమీ తోచటం లేదు అనే మాట కూడాఎక్కువగా వినిపిస్తున్నది. నాకు తెలిసిన ఒక అమ్మాయి సెలవలలో పల్లెటూరికి పోయి అక్కడి జీవితం భరించలేక, వాళ్లబంధువులు ఎంత బతిమిలాడుతున్న వినకుండా రెండురోజుల్లో మళ్ళీ సిటీకి చేరుకుంది. ప్రశాంతతను భరించలేనిస్థితికి మనం చేరుతున్నాం అంటే వినటానికి వింతగా ఉంటుంది. కాని ఇది నిజం.

సెల్ ఫోన్ అనేది సమాచారం తెలుసుకోటానికి సాధనం. కాని దాన్ని బోరును తప్పించుకోటానికి చాలామందివాడుతున్నారు. ఏమీ తోచకపోతే సెల్ ఫోన్ తియ్యటం, ఎవరో ఒకరికి ఫోన్ చెయ్యటం " ఎంటీ సంగతులు? భోజనంచేసావా? నిద్ర లేచావా? ఇంకా నిద్ర పోతున్నావా? నేనా ప్రస్తుతం సినిమా హాలు బయట ఉన్నాను. సినిమా ఇంకామొదలు కాలేదు. కాసేపట్లో మొదలు పెడతారు. అన్నట్లు మీ ఊళ్ళో వర్షం పడిందా? ఇక్కడ ఎండలుమండిపోతున్నాయి. సరే ఉంటా. ఇలాంటి చొప్ప దంటు కబుర్లతో కాలక్షేపం చేసేవారు చాలామంది కనిపిస్తారు.

ఇదంతా చూస్తుంటే నాకు ఒకటి అనిపిస్తున్నది. మనిషి తనలో తాను ప్రశాంతంగా ఉండటం అనే చక్కని కళనుమరచిపోతున్నాడు. ఎంత సేపూ ఏదో కావాలి. ఎవరి తోనో మాట్లాడాలి. ఏదో చెయ్యాలి. ఎం చెయ్యాలో తెలియదు. ఏదోఒకటి చెయ్యాలి. ప్రశాంతంగా పది నిమిషాలు కూచోలేడు. ఏదో తెలియని ఒక రకమైన విసుగు, అసహనం, చంచలత్వంమనుషుల్లో ఎక్కువౌతున్నాయి. దానికి తగినట్లే నవీన సాధనాలు, గాడ్జేట్లూ బాగా ఉపయోగ పడుతున్నాయి. మనిషిలోని అసహనాన్ని బాగా గమనించి విదేశీ కంపెనీలు చక్కగా దీన్ని సొమ్ము చేసుకుంటున్నాయి. మనిషి మాత్రంరోజురోజుకీ తనకు తాను దూరం గా పోతూ ఏదో తెలియని సుడిగుండంలో చిక్కుకుంటూ ఉన్నాడు.

మనిషి నిశ్శబ్దాన్ని
భరించలేని స్థితికి చేరాడు. నిశ్శబ్దం గా ఉంటే ఏదో విసుగు. దాన్ని చెదించటానికి టీ వీనో ఇంకేదోకావాలి. ఏమీ లేకపోతె ఇంటికి తాళం వేసి బజారుకు పోయి జన సమ్మర్దం గా ఉండే సెంటర్లో నిలబడి టీ తాగి కనిపించినవారితో పనికి రాని కబుర్లు చెప్పి ఇంటికి చేరుతాడు. కాని ప్రశాంతంగా కూర్చుని తనను తాను గమనించే పరిస్తితిచాలామందిలో లేదు.

నవీన సాధనాలు అన్నీ అవసరమే. కావచ్చు. కాని అవి లేకపోతె భరించలేని స్థితికి మనిషి రాకూడదు. మానసికఅసహన రోగిగా మారకూడదు. తన చుట్టూ ఏమీ లేక పోయినా, ఎవరూ లేకపోయినా ప్రశాంతంగా చెక్కు చెదరని స్థితిలోమనిషి ఉండగలగాలి. నిర్ద్వన్ద్వో నిత్య సత్వస్థొ నిర్యోగ క్షేమ ఆత్మవాన్... అంటూ భగవత్ గీత ఇటువంటి స్థితినేవర్ణించింది.

ఇందులో చెప్పబడిన మొదటి నాలుగు స్థితులు మన ప్రస్తుత స్థితికి చాలా దూరం అనుకున్నా కనీసంతానంటే తనకు విసుగు లేని స్థితి కన్నా మనిషి చేరుకోవాలి. అటువంటి స్థితికి రావాలంటే నేటి నవీన జీవిత వేగాన్నికొంచం తగ్గించుకొని ధ్యానాన్ని మనిషి అభ్యాసం చెయ్యాలి. అప్పుడే పిచ్చి పరుగులు కొంత వరకన్నా తగ్గుతాయి. అప్పుడే మనిషికి ఆంతరిక శాంతి అనుభవం లోకి వస్తుంది. తద్వారా బాహ్య వస్తువుల మీద విషయాల మీదఆధారపడటం తగ్గుతుంది.

ఎప్పుడన్నా కనీసం ఒకరోజన్నా జన సముద్రానికి దూరంగా పోయి టీవీలు, సెల్ ఫోన్లు, నెట్ లు లేకుండా ఇతర ఆలోచనలు లేకుండా ఒక్కడే ప్రశాంత ప్రకృతిలో ఉండి చూడండి. నిశ్శబ్దం ఎంత మధురమో తెలుస్తుంది.