“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

25, జులై 2022, సోమవారం

సుభాష్ పత్రి జాతకంలో విధ్వంస యోగం

మొన్ననే విధ్వంసయోగం గురించి వ్రాశాను. జాతకంలో ఈ యోగం ఉన్న మరొక ప్రసిద్ధవ్యక్తి నిన్న చనిపోయాడు.

పిరమిడ్ సంస్థ వ్యవస్థాపకుడు సుభాష్ పత్రి నిన్న సాయంత్రం చనిపోయాడు. ఈ న్యూస్ నిన్న సాయంత్రమే తెలిసింది. ఈరోజు ఉదయం, పిరమిడ్ ధ్యానాన్ని అనుసరించే ఒక మిత్రుడు కలిసి అదే వార్తను మళ్ళీ చెప్పాడు. ఆయన కొంతకాలంగా కిడ్నీవ్యాధితో బాధపడ్డాడని దానితోనే మూడ్రోజులు కోమాలో ఉండి చివరకు చనిపోయాడని చెప్పాడు. అదే నాకు ఆశ్చర్యమనిపించింది.

ప్రస్తుతం ఖగోళంలో నడుస్తున్న ముఖ్యమైన గ్రహయోగం మేషరాశిలో రాహు, కుజ, యురేనస్ ల డిగ్రీ యుతి. ఇది మంచినీ చెడునూ రెండింటినీ చేస్తుంది. కొందరికి మంచిని చేస్తే, కొందరికి చెడును చేస్తుంది. ఏ గ్రహయోగమైనా అంతే. కాకపోతే ఇది మరీ తీవ్రమైన యోగం.

దౌపది ముర్మును భారత రాష్ట్రపతిని చేసిందీ ఇదే యోగమే. అనేకమంది కర్కాటకరాశి వారికి స్థానచలనాన్ని, ఉద్యోగంలో మార్పులను ఇచ్చింది ఈ యోగమే. ఇదే యోగం నిన్న సుభాష్ పత్రిని తీసుకుపోయింది.

అనేక ఏళ్ల క్రితం పిరమిడ్ సంస్థలు మొదలౌతున్నపుడు ఒక మాటను వాళ్ళు చెప్పేవారు. 'పిరమిడ్ ధ్యానం చేస్తే రోగాలు పోతాయి' అని. నేనప్పట్లోనే చెప్పాను, అది అబద్దమని. అదే నిజమైతే నేడు వాళ్ళ గురువే కిడ్నీ సమస్యతో చనిపోవడమేంటి మరి? చనిపోయేటప్పుడు ఏదో ఒకటి వస్తుంది కదా? అనవచ్చు. అదే నిజమైతే 'ధ్యానం రోగాలను నయం చేస్తుంది' అని వారు గత ముప్పై ఏళ్లుగా చేసిన ప్రచారం నిజమా అబద్దమా?

సుభాష్ జననతేది 11-11- 1947. ఆయనది తులారాశి.  శనికుజులు కర్కాటకంలో ఉన్నారు. ఇది కుజునికి నీచక్షేత్రం. జాతకంలో కుజశనుల విధ్వంసయోగం మంచిది కాదు. ఈయన మీద వచ్చిన వివాదాల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఈయన భావజాలం వల్ల సమాజంలో మంచి జరిగిందా?, చెడు జరిగిందా?, జరిగితే ఏది ఎంతవరకు జరిగింది? అనేది కూడా నేను మాట్లాడను. కాకపోతే ఒకటి చెబుతాను. శాకాహారాన్ని ప్రోత్సహించడం, ఆనాపానసతిని నేర్పడం వరకూ మంచిదే. అదే సర్వస్వమని చెబుతూ, ఒక గమ్యమంటూ లేని కలగూరగంపను సృష్టించడం, ఈజిప్టు సమాధులను ప్రతి ఊరిలోనూ కట్టించడం మాత్రం హర్షణీయం కాదు.

కర్కాటకం నుంచి దశమంలో నేడున్న రాహు-కుజ-యురేనస్ యోగమే ఈయన మరణానికి దారి తీసింది. ఈ యోగం ఈయన జననకాల చంద్రుని నుండి మారకస్థానమైన సప్తమంలో ఉంది.  దాని దృష్టి, కిడ్నీలకు సూచిక అయిన తులారాశి పైన ఉంది. ఈయన పోయింది కిడ్నీ వ్యాధితోనే అన్నది గమనార్హం.

పిరమిడ్ సంస్థ పైనా, వారి ధ్యానవిధానం పైనా నాకెప్పుడూ సదభిప్రాయం లేదు. అంతేకాదు, సాయిబాబా, అయ్యప్ప, బ్రహ్మకుమారీస్ మొదలైన కల్ట్ ల మీద కూడా సదభిప్రాయం లేదు. కారణం? వారి పరిమితులు, లోపాలు, నాకు స్పష్టంగా తెలిసి ఉండటమే. హిందూ మతాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే ఇవేవీ అవసరం లేదు.

పిరమిడ్ వారు చెప్పే 'శ్వాసమీద ధ్యాన'  అనేది బుద్ధుడు చెప్పిన ఆనాపానసతి ధ్యానవిధానమే. అయితే, బుద్ధుని మార్గంలో అదొక మొదటిమెట్టు మాత్రమే.  వీరి దృష్టిలో అది తుదిమెట్టు. దానికి పిరమిడ్ ను కలిపారు. అవేమో ఈజిప్తులో సమాధులు. వాటిని తెచ్చి, ఊరూరా కట్టేశారు. దర్శనాలని, లోకాలని, ఆత్మలని రకరకాల మాటలు చెప్పే వీరి సిద్ధాంతమంతా ఒక కలగూరగంపయే గాని అసలైన సనాతనధర్మమూ, హిందూమతమూ కాదు. బౌద్ధం, క్రైస్తవం, ఇస్లాం, హిందూమతం ఇలా  అన్నింటిలో ఉన్న అక్కల్ట్ మాటలను కలగలిపి అతుకులు పెట్టి ఏవేవో చెబుతూ ఉంటారు. వీరి మార్గం చివరకు ఎక్కడకు దారితీస్తుందో వీరికే ఎరుక !

అయితే, హిందూసమాజంలోని కొన్ని కులాలతో, ఒక వర్గపు ప్రజలతో, ఒక ఫాలోయింగ్ ను తయారుచేసుకోవడంలో వీరు విజయాన్ని సాధించారనే చెప్పాలి. మన దేశంలో ముఖ్యంగా హిందువులలో ఉన్న పరిస్థితి ఏమంటే, ఎవరేది చెప్పినా దానిని అనుసరించడానికి వేలల్లో మనుషులు రెడీగా ఉంటారు.

చెప్పేవారు చెబుతున్నారు. అనుసరించేవారు అనుసరిస్తున్నారు. మతాలు మారేవారు మారుతున్నారు. ప్రతివారూ 'మేమే కరెక్టు' అంటున్నారు. ఎవరెక్కడికి పోతున్నారో, ఏది ఎక్కడికి దారి తీస్తున్నదో ఎవరికీ తెలియదు. గుడ్డెద్దు చేలో పడిన చందంగా నేడు హిందూసమాజం ఉన్నది.

ఏదేమైనా, 'ధ్యానం రోగాలను తగ్గిస్తుంది' అని జీవితమంతా ప్రచారం చేసిన ధ్యాన మాస్టర్, కిడ్నీ రోగం నయం కాక చనిపోవడం ఒక వింత అయితే, ధ్యానసిద్ధుడని ప్రచారం జరిగే వ్యక్తి మూడు రోజులపాటు కోమాలో ఉండి చనిపోవడం ఇంకొక వింత. అయితే, రేపటినుంచీ ఈయన శిష్యులు, 'అది కోమా కాదు, సాయిబాబాలాగా ఈయన కూడా మూడ్రోజులు సమాధిలో ఉండి, వివేకానందునిలాగా స్వచ్చందంగా దేహం వదిలేశాడు' అని రకరకాల కధలను ప్రచారం చేస్తారేమో మరి ! 

చూద్దాం !