“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

16, నవంబర్ 2021, మంగళవారం

జిల్లెళ్ళమూడి స్మృతులు - 43 (మా భవిష్యత్ ప్రణాళిక)

'మొదటగా, స్వాములు సర్వసంగ పరిత్యాగులై ఉండాలి. నేటి స్వాములు దేనిని పరిత్యజించారో మీరు చెప్పండి. రెండవదిగా, వారికి తపశ్శక్తీ, అనుభవ జ్ఞానమూ ఉండాలి. నేటి స్వాములలో ఎవరికీ ఇవి రెండూ సరిగ్గా ఉన్నాయో చెప్పండి. మూడవది, సరియైన మార్గనిర్దేశనం చేసేవారై వారుండాలి. నేటి స్వాములలో దీనినెవరు చేస్తున్నారో చెప్పండి. కనుకనే నేటి గురువులన్నా స్వామీజీలన్నా నాకు గౌరవం ఏమాత్రమూ లేదు. నేటి స్వామీజీలలో ఎవరూ సత్యాన్ని చెప్పడం లేదు. ఒక్కొక్కరూ ఒక్కొక్క కుంపటి పెట్టుకుని, లోకాన్ని జనాన్ని తమ పాక్షిక సత్యాలతో వంచిస్తున్నారు. సత్యమైన జ్ఞానాన్ని ఆచరణాత్మకంగా బోధించే గురువులు అరుదయ్యారు' అంటూ మొదలు పెట్టా నేను.

నన్ను మధ్యలోనే ఆపుతూ దినకరన్నయ్య, 'అవును. నువ్వు ఎలాగైనా బ్రతుకు, ఏమైనా చెయ్యి, గుడికెళ్ళు అన్నీ సర్దుకుంటాయి' అనే ధోరణి ఈ మధ్యన బాగా ఎక్కువైంది. ఇది మంచి పధ్ధతి కాదు' అన్నాడు.

'సరిగ్గా అదే నా పాయింట్ కూడా. రకరకాల కొత్తకొత్త గుళ్ళు కట్టి, వాటిమీద సోమరిపోతులలాగా బ్రతుకుతున్న దొంగగురువులే ఇలాంటి కుహనా బోధలను చేస్తున్నారు. నువ్వెలా బ్రతికినా సరే, గుడికెళ్ళి దైవదర్శనం చేసుకుంటే నీ పాపాలన్నీ పోతాయని మన హిందూమతం ఏనాడూ చెప్పలేదు. కానీ, హిందూమతం చెప్పని విషయాలను నేడు స్వామీజీలందరూ బోధిస్తున్నారు. సామాన్యజనమేమో వారికి తోచిన పిచ్చి పనులను చేసుకుంటూ, అదే అసలైన హిందూమతమని భ్రమిస్తున్నారు. వారికి సరియైన మార్గాన్ని చూపేవారు లేరు. మరికొందరు గురువులేమో, శాస్త్రాలను బట్టీ పట్టిస్తున్నారు, బౌద్ధికంగా వేదాంతాన్ని నేర్పి, అది కూడా వారికర్ధమైన సగం సగం రీతిలో నేర్పి, మెట్ట వేదాంతులను తయారు చేస్తున్నారు. ఆ  మెట్టలేమో, మరి కొందరికి వారి పుస్తకజ్ఞానాన్ని నూరిపోసి మరికొందరు మెట్టలను తయారు చేస్తున్నారు.  అందరూ కలసి అదే పెద్ద జ్ఞానమని అనుకుంటూ చీకటిలో అఘోరిస్తున్నారు. మరి కొందరు గురువులేమో, వీరిలో అమ్మ కాళ్లదగ్గర కూర్చున్నామని చెప్పుకునే  కొందరు స్వాములు కూడా ఉన్నారు, మంత్రతంత్రాలని, భూత ప్రేతాలని,  చేతబడులని, పూర్వజన్మలని నానా చెత్తనూ మాట్లాడుతూ అసలైన వేదాంత, యోగసత్యాలను మరుగున పడేస్తున్నారు. వీరెవరికీ అనుభవజ్ఞానం లేదు.

నీతిగా నిక్కచ్చిగా ఎలా బ్రతకాలో చెప్పేవారు ఎవరూ లేరు. షాపులో వస్తువులను అమ్మినట్లు, 'ఈ పూజ చెయ్యి, ఈ ఫలం దక్కుతుంది' అంటూ వ్యాపారస్తులు సరుకులను అమ్మినట్లు అమ్ముతున్నారు. మరోప్రక్కన సమాజంలో, పిచ్చి దీక్షలూ వెర్రిదీక్షలూ  వెల్లువలెత్తుతున్నాయి. ఇది అసలైన హిందూమతం కాదు. సరియైన దారిని చూపించవలసిన గురువులు లేకపోవడంతో నేటి యువత ఘోరంగా పాడై పోతున్నది. మితిమీరిన డబ్బుతో, యూ ట్యూబ్ ఎఫెక్ట్ తో, సడలిన నీతినియమాలతో సమాజం భ్రష్టు పడుతున్నది. ఏ గురువూ దీనిని తప్పు పట్టడం లేదు. వాళ్ళ వ్యాపారాలను వాళ్ళు చేసుకుంటున్నారు. అనుచరుల్ని పోగేసుకుంటున్నారు, అందరూ కలసి తోడుదొంగలై కూచున్నారు. సమాజంలో అసలైన ఆధ్యాత్మికత లేనేలేదు. నైతికజీవితమూ లేదు. ఈ లోటును నేను పూరించాలని అనుకుంటున్నాను' అన్నాను.

ఇలా మాట్లాడుతున్న నాలో ఈ క్రింది పద్యాలు ఆశువుగా తలలెత్తాయి. అయితే, వాటిని బయటకు చెప్పకుండా, మనసులోనే ఒక మూలన వాటిని నిక్షిప్తం చేసి, నా మాటల్ని కొనసాగించాను.


కం || కొందరు ప్రభువుల తొత్తుల్

కొందరు తమ కాకిగూళ్ళ గోర్వంకలురా

కొందరు మాషా బత్తుల్

కొందరు తమ కొట్లనున్న కోమటివారల్


నేటి గురువులలో కొందరేమో రాజకీయ నాయకుల తొత్తులు, మరి కొందరు తమ తమ గూళ్ళలో కూచుని, ప్రాచీనులు పెట్టిన ఆశ్రమాలను ఆక్రమించి, తమ పబ్బాలు గడుపుకుంటున్న గోరింకలు. మరికొందరు గురువులు మాయలమరాఠీలు. వెరసి అందరూ, వారి వారి కొట్లలో సరుకులను అమ్ముకుంటున్న వ్యాపారస్తులే.


ఆ || నీతిలేని జనులు; నిజమెన్న కరువాయె

సత్యవాక్కు జూడ సాగదాయె

పూటకూళ్ళ ఇళ్ళు పుణ్యాశ్రమములెల్ల

నిక్కమైన బోధ నిలువదాయె


జనంలో నీతి ఘోరంగా లోపించింది. అవినీతి జనజీవన విధానమై కూచుంది. సత్యమైన మాట ఎక్కడా కనిపించడం లేదు. ఆశ్రమాలన్నీ ఫైవ్ స్తారు హోటళ్లయి పోయాయి. నిత్యమైన, సత్యమైన, ఆచరణాత్మకమైన జ్ఞానబోధ ఎక్కడా లేదు.


కం || వ్యాపారంబుల దేలుచు

సాపాటుల చింతలందు సాగిలబడుచున్

కాపాలిక గురువులెల్ల

పాపాత్ముల పంచలందు పందలు గారే !


గురువులందరూ ఎవరి వ్యాపారాలను వారు చేసుకుంటూ, పొట్టకూటి చింతలో మునిగితేలుతూ, మాయమంత్రాలను జనాలకు నేర్పిస్తూ, పాపాత్ములైన అవినీతిపరుల నల్లధనాన్ని స్వీకరిస్తూ వారూ నల్లటి మసిబొగ్గులౌతున్నారు.


ఆ || మతపు పంచలందు మాయావులే జేరి

తమకు దోచినట్టి తర్కమెల్ల

ఇదియె ధర్మమంచు నిట్టట్టుగా జెప్పి

జనుల మాయబుచ్చి జెల్లుచుంద్రు


మతాల లోగిళ్ళలో మాయగాళ్లందరూ చేరి, తమకు తోచిన వితండవాదాలను 'ఇదే సత్యం' అంటూ నీతిలేని జనాలకు బోధిస్తూ, వారిని మాయజేసి తమ పబ్బం గడుపుకుంటున్నారు.


ఈ పద్యాలను మనసులో నిక్షిప్తం చేస్తున్న నన్ను ఆపుతూ, 'అవును. మీరు చెబుతున్నది నిజమే.  Our society is suffering from a peculiar kind of moral depravity. నేను అమెరికాలో యూరప్ లో గమనించాను. Even though they are licentious and promiscuous by and large, their social life is governed by a strong sense of justice and obedience to law. అది మనలో తీవ్రంగా లోపించింది. దానికి అనేక కారణాలున్నాయనుకోండి' అన్నాడాయన.

'అవును. దీనిని సరిదిద్దడం ఎలా? ఎవరు పూనుకోవాలి ఈ పనికి? నాయకులకు పట్టదు. తల్లిదండ్రులు నేర్పడం లేదు. చెప్పవలసిన గురువులకే సత్యాలు తెలీవు. వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటున్నారు. మరెవరు చెప్పాలి?' అడిగాను.

'నాకొకటి అనిపిస్తోంది. స్వామీజీలు బోధిస్తున్న పనికిరాని బోధలకంటే, ముందుగా Law of Karma and Law of Dharma ఈ రెంటినీ మనస్సులలో నాటుకునేలా చెప్పవలసిన అవసరం ఉన్నది. అప్పుడే మొరాలిటీ అనేది మళ్ళీ సమాజంలో వస్తుంది. అయితే, దీనిగురించి ఆలోచిస్తున్న మేధావులు కూడా చాలామంది మనమధ్యనే ఉన్నారు. ఒకాయన గౌహతి IIT లో పనిచేసి బయటకొచ్చి మన హైదరాబాద్ లోనే ఉంటున్నాడు.  ఆయన Law of Karma మీద ఒక మంచి పుస్తకం వ్రాశాడు.  దానిలో ఆయనంటాడు, The Law of Karma is not always linear in its operation  అని. చాలా బాగా వ్రాశాడు' అన్నారు దినకర్ గారు.

'అవును. కర్మనియమం అన్నిసార్లూ లీనియర్ గా పనిచేయదు. అది multi dimensional గా పనిచేస్తుంది. సాధనామార్గంలో నడిచే వారికే దాని లోతుపాతులు అర్ధమౌతాయి. Law of Karma అనేది సరిగ్గా అర్ధమైతే, నీతి అనేది దానంతట అదే మనిషి జీవితంలో ప్రవేశిస్తుంది. దీనిని చెప్పకుండా, నేటి గురువులందరూ, మంత్రాలు, సాధనలు, యోగక్రియలు అంటూ ఏదేదో చెత్తను చెబుతున్నారు. నీరసించి పడిపోతున్న వాడికి ముందుగా సెలైన్ పెట్టి, వాడిని లేపి కూచోబెట్టాలి, అంతేగాని వాడికి వెంటనే హైదరాబాద్ బిర్యానీ పెట్టకూడదు. కానీ నేటి గురువులందరూ ఇదే చేస్తున్నారు. అసలైన సాధనామార్గం ఎవరికీ తెలియదు. ఎవరికి తెలిసినదాన్ని వారు పరమసత్యం అనుకుంటున్నారు. There is a yawning chasm of spiritual paucity in today's religious world. ఈ లోటుని నేను పూడ్చబోతున్నాను. మన హిందూమతం యొక్క అసలైన స్వరూపాన్ని, సారాన్ని, తత్వాన్ని మా ఛానల్ ద్వారా బోధించడమే గాక, అర్హులైనవారికి నా సాధనామార్గాన్ని బోధించి, దానిలో ఆచరణాత్మకంగా వారిని నడిపిస్తాను' అన్నాను.

దినకర్ గారి ముఖం ఒక్కసారిగా వెలిగిపోయింది. 

'మీ ఆలోచనను నేను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను. ఇదే నేటి సమాజానికి చాలా అవసరం' అన్నాడాయన.

'మనిద్దరి ఆలోచనలూ ఒకే పంధాలో ఉన్నాయన్నయ్యా ! మా ఆశ్రమం వచ్చాక, మీలాంటి మేధావులు కూడా మా చానల్స్ లో మాట్లాడాలి. సమాజానికి సరియైన మార్గనిర్దేశం చెయ్యాలి. మీ దగ్గరకు మళ్ళీ వస్తాం మేము' అన్నాను నేను.

(ఇంకా ఉంది)