“Self service is the best service”

8, జూన్ 2020, సోమవారం

నాతో నడవాలంటే....

నాతో అడుగు కదపాలంటే
నాలా నడిచే ఓర్పు నీకుండాలి
నాతో గొంతు కలపాలంటే
నాలా పాడే నేర్పు నీకుండాలి

నా వెంట రావాలంటే
నీ మనసును వదిలెయ్యాలి
నా జంట ఉండాలంటే
నీ ఉనికినే విస్మరించాలి

నా తోడుగా అవ్వాలంటే
నీ ఆస్తులను కాల్చివెయ్యాలి
నా మేడపైకి ఎక్కాలంటే
అంతస్తులను కూల్చివెయ్యాలి

నాతో కలసి నవ్వాలంటే
నవ్వునూ ఏడుపునూ ఒకేలా చూడాలి
నాలా నీవూ అవ్వాలంటే
పువ్వునీ నిప్పునీ ఒకేలా తాకాలి

నాతో నడవాలంటే
ముళ్ళను హర్షంతో భరించాలి
నాలో తడవాలంటే
నువ్వే వర్షంగా మారాలి

నా స్నేహం కావాలంటే
నిన్ను మరచి నాలా అయిపోవాలి
నాతో ఎప్పుడూ ఉండాలంటే
నువ్వు మరిగి నాలో కరిగిపోవాలి