“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

11, జూన్ 2020, గురువారం

అసలైన శ్రీవిద్య - అమ్మకానికి !

ఈ టైటిల్ చూసి నేనుకూడా కిరాణాషాపు తెరిచానని అనుకోకండి. నేనలాంటి పనిని ఈ జన్మకే కాదు, ముందుజన్మలంటూ ఉంటే, అప్పుడు కూడా చెయ్యను.

నా బ్లాగు చదివిన అనేకమంది నాకు మెయిల్స్ ఇస్తూ ఉంటారు. చాలా రోజులనుంచీ బ్లాగులో నా ఫోన్ నంబర్ తీసేశాను. కనుక ఫోన్ కాల్స్ తగ్గాయి. కానీ నా పుస్తకాలలో అది ఉంటుంది. దానిని చూచి చాలామంది నాకు ఫోన్లు కూడా చేస్తూ ఉంటారు. నా పుస్తకాల మీద వారివారి అభిప్రాయాలను చెబుతూ ఉంటారు. నా అదృష్టం బాగుండి ఇప్పటిదాకా అందరూ మంచిగానే వారి భావాలను వెల్లడిస్తున్నారు. ఆఫ్కోర్స్ వేరేరకంగా చెప్పినా - నా దారిలో నేను పోతూ ఉంటానుగాని - ఎవరినీ పట్టించుకోననుకోండి. అది వేరే సంగతి !

మొన్నీ మధ్యన ఒకామె 'శ్రీవిద్యా రహస్యం' చదివి నాకు ఫోన్ చేసింది. పుస్తకం ఎంత బాగున్నదీ, దానిని చదివి తానెంత ముగ్దురాలైపోయిందీ, అసలైన శ్రీవిద్య అంటే ఏంటో తెలియజెప్పే పుస్తకం చివరాఖరికి తనకు దొరికినందుకు ఎంత సంబరపడిందీ వివరంగా చెప్పుకొచ్చింది. చివరగా ఆమె ఇలా అంది.

'ఈ మధ్యన ఆన్లైన్ లో ఎన్నో చూస్తున్నామండి ! ఆన్లైన్ లో అసలైన శ్రీవిద్య నేర్పిస్తారంట ! మొదట్లో గణపతి మంత్రం ఇస్తారంట ! దానికి సింపుల్ గా 6000 కట్టాలంట ! ఆ తర్వాత వరసగా ఇంకా ఏవేవో మంత్రాలిస్తారంట ! తేపతేపకీ 6000 కట్టాలంట ! డబ్బులకు సమస్య కాదు. నిజంగా అమ్మవారిని చేరుకునే దారి చూపిస్తే ఎంతైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ! కానీ, వాళ్ళు అడుక్కునే తీరు, దీక్షలకు, మంత్రాలకు 'ఇంత' అంటూ రేట్లు పెట్టడం చూస్తె 'ఛీ' అనిపించింది' అన్నది.

నవ్వొచ్చింది. జాలేసింది. పిచ్చిలోకాన్ని, పిచ్చిజనాన్ని చూస్తుంటే ఇవి రెండేగా మనకు కలిగేది !

ఒళ్ళుతో సహా అన్నీ అమ్ముకుంటోంది మానవజాతి. ఇప్పుడు దేవుడిని కూడా అమ్మడం మొదలైందన్నమాట ! ఆఫ్కోర్స్ కొత్తగా మొదలైనది ఏమీ లేదనుకోండి. ఎప్పటినుంచో ఉంది. దైవదర్శనానికి టికెట్ పెట్టినప్పటి నుంచే మతానికి దరిద్రం మొదలైంది. ఇప్పుడు ఉపదేశాలు, మంత్రాలు, దీక్షలు కూడా వ్యాపారంగా మారాయన్న మాట !

Authentic Sri Vidya Online - అనే పదాలు ఇప్పుడు నెట్లో ఎక్కడ చూచినా కనిపిస్తున్నాయి. గణపతి మంత్రం కొనుక్కుంటే బాలామంత్రం ఫ్రీ. 'షోడశీ' మంత్రం కొనుక్కుంటే 'మహాషోడశి ఫ్రీ', చివరికి నా మహాపాదుకలు నీ నెత్తిన పెట్టడం ఫ్రీ ! ఇదీ వరస !

'అన్నీ అమ్ముకుంటూ చివరకు అమ్మని కూడా అమ్ముకుంటున్నారట్రా వెధవల్లారా ! ఏది చేసుకున్నా బ్రతకచ్చు కదా? ఇంతకు దిగజారాలా?' అనిపించింది.

అసలైన శ్రీవిద్య మంత్రాలలో లేదు. తంత్రాలలో లేదు. అదేంటో నా పుస్తకంలో స్పష్టంగా వివరించాను. మంత్రాలు తంత్రాలు మొదటి మెట్లు. LKG, UKG లాంటివి. అసలైన శ్రీవిద్య చాలా సింపుల్. దానికి డబ్బుతో పనే లేదు. నీ మనసుతో నీ హృదయంతో నీ ఆత్మతోనే దానికి పని !

ఉపదేశం, దీక్ష, సాధన - వీటికీ డబ్బుకీ ఎప్పుడూ లింకు పెట్టకూడదు. అది చాలా నీచమైన పని. దానికంటే పడుపువృత్తి చేసుకోవడం చాలా బెటర్. ఈ మాటను నేను చెప్పడం లేదు. అనేక తంత్ర గ్రందాలలోనే క్లియర్ గా వ్రాసుంది. అవేంటో సంస్కృతం నుంచి అచ్చతెలుగులోకి నేను అనువాదం చేసి వ్రాస్తే చదవడానికి కూడా చాలా అసహ్యంగా ఉంటుంది. ఓపికుంటే మీరే నెట్లో వెతుక్కోండి. అన్నీ దొరుకుతాయి.

దైవాన్ని చేరాలని ఆర్తితో, ఆవేదనతో, ఒక దారికోసం వెదుకుతూ, దారిచూపగల ఒక వ్యక్తిని చేరుకుంటే, దానికి డబ్బుతో లింక్ పెట్టడం, హేయాతిహేయమైన పని. గురుశిష్యులమధ్యన డబ్బు అనేది అసలు రానే కూడదు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, శిష్యులని ఇంట్లో ఉంచుకుని, తిండి పెట్టి, ఎదురు డబ్బులు బట్టలు ఇచ్చి, సొంతమనుషుల్లాగా చూసుకుంటూ మరీ విద్య నేర్పాలి. దీనిలో కులాన్ని మతాన్ని, ఇంక దేనినీ చూడకూడదు. అదీ అసలైన గురుత్వమంటే ! అదీ అసలైన వైదికధర్మమంటే ! అసలైన శక్తికలిగిన ప్రాచీన ఋషులందరూ ఇదే చేశారు.

'మీ మార్గంలో సాధన చెయ్యాలంటే మాకుండవలసిన అర్హత ఏమిటి?' అని చాలామంది నన్ను గతంలో అడిగారు. ఇప్పుడూ అడుగుతూ ఉంటారు. వారందరికీ జిల్లెళ్లమూడి అమ్మగారి మాటను చెబుతూ ఉంటాను.

అమ్మ ఇలా అనేవారు- 'తినడానికి వేరే అర్హతలెందుకు నాన్నా? ఆకలే దానికి అర్హత'.

అదే పంధాలో నడుస్తూ నేను కూడా ఇదే చెబుతాను.

'సాధన చెయ్యడానికి తపనే అర్హత. 'సాధన చెయ్యాలి, ఎలాగైనా ఈ జన్మలోనే దైవాన్ని చేరుకోవాలి' అన్న తపన ఒక్కటే సాధన చెయ్యడానికి అర్హత. మిగతావేవీ అక్కర్లేదు. అవసరం లేదు'.

ఆధ్యాత్మికత అనేది వ్యాపారం కాదు. కాకూడదు. దానిని వ్యాపారంగా మార్చాలని ప్రయత్నించేవాళ్ళు చాలా నష్టపోతారు. వాళ్ళ సాధ్యం కాదు. ప్రపంచంలో దేనితోనైనా వ్యాపారం చెయ్యవచ్చేమోగాని, ఆధ్యాత్మికతతో మాత్రం కాదు. లాంగ్ రన్ లో ఇది చాలా దెబ్బ కొడుతుంది. వాళ్ళ కుటుంబాలు ఎక్కి రావు. 

కొంతమందికి అనుమానం రావచ్చు. మీరు కూడా పుస్తకాలు రాస్తున్నారు. వాటికి వెల పెట్టారు కదా? అని. పుస్తకాల ప్రచురణ వేరు. దానికి ఖర్చు అవుతుంది. అందుకని వాటికి వెల పెట్టాం. అదికూడా చాలా తక్కువగా నిర్ణయించాం. వాటిమీద డబ్బు సంపాదించాలని పుస్తకాలు వ్రాయడం లేదు. అతి కొద్ది మార్జిన్ తో మా పుస్తకాలకు వెల నిర్ణయిస్తున్నాం. అసలైన ఆధ్యాత్మికవిజ్ఞానాన్ని లోకానికి తెలియజెప్పాలనే ఉద్దేశ్యంతో పుస్తకాలు వ్రాస్తున్నాను గాని, పిచ్చిపిచ్చి పురాణకధలు చెప్పి జనం దగ్గర డబ్బులు గుంజడానికి కాదు.

మా పుస్తకాన్ని చదివిన ఒక అమెరికన్ మా వెబ్ సైట్ లో ఈ విధంగా కామెంట్ చేశాడు - 'పీనట్స్ లాంటి రేటుకు ఎంతో విలువైన సమాచారం మీ పుస్తకంలో ఉన్నది'. మా పుస్తకాలతో పోలిస్తే ఎందుకూ పనికిరాని పుస్తకాలు 45 డాలర్స్ కి అమ్ముతుంటే మేము మా పుస్తకాలను 2 డాలర్స్ కి అమ్ముతున్నాం. అర్ధమైందా?

కనుక పుస్తకాల ప్రచురణకూ, ఉపదేశాలకూ సంబంధం లేదు. 'పుస్తకం ప్రింట్ చెయ్యాలంటే ఖర్చు అవుతుంది. మంత్రోపదేశమో ఇంకేదో చెయ్యాలంటే ఏం ఖర్చు అవుతుంది? ఆర్థికంగా నీకు ఖర్చయ్యేదేముంది దాంట్లో?' అందుకే నా మార్గంలో నేనిచ్చే దీక్షలకు ఒక్క పైసా కూడా ఎవరిదగ్గరా తీసుకోను. నిజాయితీ, త్రికరణశుద్ధి, మంచిహృదయం, సాధనలో తపన - ఒక మనిషిలో ఇవే నేను చూచే లక్షణాలు. కోటీశ్వరుడైనా, కూలివాడైనా నా మార్గంలో ఒకటే. ఇంకా చెప్పాలంటే, పై లక్షణాలు కనిపిస్తే కూలివాడిని కూడా దగ్గరకు తీసుకుంటాను. అవి లేకపోతే కోటీశ్వరుడిని కూడా దగ్గరకు రానివ్వను.

బీచ్ లో పడి పొర్లినా మనకెంత ఇసుక అంటుకోవాలో అంతే అంటుకుంటుంది. దేవుడిని అమ్ముకుని కూడా డబ్బు సంపాదించాలా? దానికంటే చావడం మేలు. ధూ !